Archive for October 6, 2008

నా కథ చదవండి!

 నా తొలి కథ 1991 లో ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురితమయింది. ఆ కథను నేను 4క్ష్5 అనే కథల సంకలనంలో ప్రచురించాను. ఇప్పుడు అదే కథను, www.aadivaaram.com అనే వెబ్ పత్రికలో పునహ్ ప్రచురించారు. ఆ కథను చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియపరచాలని మనవి. విన్నపం. అభ్యర్ధనలు!ఆ కథ పేరు, మృగతృష్ణ.

October 6, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ప్రేమ వేదనకు దివ్య ఔషధం-2

సినిమాలలో పాటలకు సాహిత్య గంధం పూశారు కొందరు గేయ రచయితలు. తమదయిన ప్రత్యేక రచనా శైలితో సినీ సందర్భంలో ఒదగాల్సిన పాటలకు సార్వజనీనతను కల్పించారు. సినీ పాత్రలు కంపించాల్సిన గీతాలలో తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారు. సాహిర్, శైలేంద్ర వంటి గేయ రచయితల పాటలు సంగీతాన్ని, గాయకులను, నటీ నటులను డామినేట్ చేస్తాయి. అలాంటి గేయ రచయిత గుల్జార్.

గుల్జార్ గీతాలు మామూలు సినిమా పాటల్లావుండవు. అందరికీ అర్ధమయ్యేట్టు మాత్రమే రాయాలి అన్న నిబంధనను ఆయన ఒప్పుకోడు. తన స్థాయికి అందరినీ ఎదిగించాలన్న పట్టుదల ఆయనది. అందుకే లయ ప్రధానమయిన  సినీ గేయాలను ఆయన ఏమాత్రం లయలేని పెద్ద పెద్ద వాక్యాలుగా రాస్తాడు. ఆర్ డీ బర్మన్ అయితే, వార్తా పత్రికల హెడ్డింగులకు బాణీ కట్టటం సులభం, గుల్జార్ పాటలకన్నా అనేవాడు. మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడాహై, ఇందుకు ఒక ఉదాహరణ. తెరె బినా జిందగీసె కోయీ షిక్వా తో నహీ, ఇంకో ఉదాహరణ. సరళంగా అందరికీ అర్ధమయ్యే వాక్యాలతో, భావంతో పాటలుండాలనే వాదానికీ గుల్జార్ వ్యతిరేకి. క్లిష్టమయిన భావ కవిత్వం, అంతే క్లిష్టమయిన పదాలతో, ఎవ్వరూ వాడని మరచిపోయిన పదాలతో రాస్తాడు. ఆ పదాలను ప్రచారంలోకి తెస్తాడు. అటువంటి గుల్జార్, శంకర్ ముందే కట్టిన బాణీలోకి తన భావాలను ఒదిగించి రాసిన పాట ఇది. పల్లవి తప్ప మిగతా అంతా నారీకేళ పాకమే.

సినిమా పేరు. సీమ. గతంలో ఒక సీమ వచ్చింది దానికీ శంకర్-జైకిషన్ లే సంగీత దర్శకులు. కహాన్ జారహాహై, తూ ప్యార్ క సాగర్ హై, మన్ మోహనా లాంటి పరమాద్భుతమయిన పాటలనా సినిమాలో సృజించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ సీమాలో వారి పాటలలో ఇప్పటికీ అరుదుగానైనా వినిపించేదీపాటే. జబ్ భి యేదిల్ ఉదాస్ హోతాహై!

నాయిక ఒంటరిగా నాయకుడి ఙ్నాపకాలలో వుంటుంది. ఇంతలో రేడియోలో పాట వస్తుంది. పాట ఆమె మాన్సిక స్థితినే ప్రతిబింబిస్తుంది. దాంతో ఎలాగయితే పాటతో మనమూ పాడతామో ఆమే అలాగే పాడుతుంది.

జబ్ భి యే దిల్ ఉదాస్ హోతాహై
జానె కౌన్ ఆస్ పాస్ హోతాహై.

పాట ఆరంభమవుతూనే బాణీ, రఫీ స్వరం, పదాలు కట్టి పడేస్తాయి. ఈ పాటలో రఫీ స్వరం భిన్నంగా వుంటుంది. వేదన, ఆశ, ఎదురుచూపులలో ఒక ఆనందం అన్నీ ఆయన స్వరం ప్లుకుతుంది. ప్రేమ ఎంత మధురం, విరహమెంత కఠినం అన్నట్టుంటుంది ఆయన స్వరం. దీన్లోనే ఆనందం అనుభవిస్తూ పాడుతున్నట్టుంటుంది.

భావం సులభం. హృదయం నిరాశతో ఉదాసీనమయినప్పుడు, సాంత్వనినిచ్చే సహచరి దగ్గరుంటే అదో ఆనందం. కానీ, మన భవిష్యత్తు మనకు తెలియదు. ఎవరికి ఎవరితో ముడిపడుతుందో తెలియదు. అర్ధం చేసుకునే తోడు బదులు అప్పార్ధం చేసుకుని అశాంతి పెంచేతోడు దొరికితే? అందుకే హృదయం నిరాశలో మునిగినప్పుడు, ఎవరు చెంత నుంటారో అంటున్నాడు హీరో.

మానవ మనస్సు లో విచిత్రం ఇదే. ఏదో కావాలనిపిస్తుంది. ఏమిటో స్పష్టం గా తెలియదు. ఆశ నిరాశల మధ్య మనసు ఊగిసలాడుతూంటుంది. మనసున మన్సై పాటలో, చెలిమియె కరువై చరణం, ఆశలు తీరని ఆవేశములో అన్న చరణాల భావం మొత్తం ఏ పల్లవిలో ఒదిగించాడు కవి.

 పల్లవిని చరణాన్ని కలిపుతూన్న సంగీతం వింటేజ్ శంకర్ సంగీతం. పాటలో ఒక విడదీయరాని భాగం.మూడును మరింత గంభీరం చేస్తుంది. రొమాంటిక్ చేస్తుంది.

హోట్ చుప్ చాప్ బోల్తేహోజబ్, సాన్స్ కుచ్ తేజ్ తేజ్ చల్తీ హై,

ఆంఖె జబ్ దేరహీ హై ఆవాజే,ఠండి ఆహోమె సాస్ జల్తీహై.

పాటలలొ వున్న పదాలకు అలాగే అర్ధం తీసుకుంటే ఈ వాక్యాలు అర్ధంలేనివవుతాయి. కవిత్వంలో పదాల ప్రతిపదార్ధం కన్న కవి హృదయాన్ని గ్రహించాల్సి వుంటుంది. పదాల భావాన్ని మనసుతో అనుభవించాల్సి వుంటుంది.

పెదిమలు నిశబ్దంగా మాట్లాడటం, కళ్ళు పిలవటం వంటివన్ని ఒక మానసిక స్థితికి ప్రతీకలు. ప్రేమలో వున్నవారి పెదవులపై అనుక్షణం ప్రేయసి నామం మెదలుతూంటుంది. ఆమె తలపులు వచ్చినప్పుడల్ల ఊపిరి వేగ వంతమవుతుంది. రుధిరం గంగా ప్రవాహమవుతుంది. కళ్ళు ఆమె రూపాన్నే చూస్తూంటాయి. కానీ భౌతికంగా ఆమె ఎదురుగా లేదు. అందుకని ఆమె రూపాన్నే చూడలన్న తపనతో ఆమెకోసం ఆక్రోషిస్తూంటాయి. ఆర్తిత్తో ఆమెనే పిలుస్తూంటాయి. దాంతో ఆమె వస్తుందన్న ఆశ జనిస్తుంది. ఆశ కలగటంతోటే, ఊపిరి వేడెక్కుతుంది ఉద్వుగ్నతతో! అప్పుడు నిట్టూర్పులు సైతం జ్వలిస్తూంటాయి. ఈ స్థితితిని కవి కళ్ళాముందు నిలుపుతున్నాడు.

ఆంఖ్ మే తైర్ తీహై తస్వీరే తేర చెహెరా తెరా ఖయాల్ లియే,
ఆయినా దేఝ్ తాహై జబ్ ముఝ్కో, ఏక్ మాసూం సా సవాల్ లియే.

అద్దం మన మనస్సాక్షికి ప్రతీక. అద్దంలో చూసుకోవటమంటే, తనలోకి తాను చూసుకోవటం. ఆమెకోసం తపన పడుతున్నాడు. అప్పుడు అతని మనసాక్షి ఒక సున్నితమయిన ప్రశన అడిగింది. ఆమెపయిన నీ భావాలేమితి? ఆమెకోసం ఈ తపన ఏమిటి? ఆమెకు నువ్వు సరిపోతావా? ఇంతకీ నీ మనసులోని ఉదాసీనతను, ఆనందంగా మార్చేవారెవరు? ఈ ప్రశనలకు సమాధానంగా అతని కళ్ళముందు ఆమె ఆలోచనలు, ఆమె చిత్తరువులూ కదలుతున్నాయి.

కోయి వాదా నహీ కియా లేకిన్, క్యూన్ తెరా ఇంతెజార్ రహెతాహై,
బెవజా జబ్ కరార్ మిల్ జాయే , దిల బడా బేకరార్ రహెతాహై.

ఆమె ఎలాంటి వాగ్దానం చేయలేదు. ఆమెకు మనసు తెలపలేదు.  ప్రేమ వ్యక్తం చేయలేదు. ఆమె వస్తాననీ అనలేదు. కానీ ఆమెకోసం  మనసు ఎదురు చూస్తుందెందుకని? దాంతో మనసు అల్లకల్లోలంగా అశాంతిగా వుంటుంది. ఎప్పుడయినా శాంతి లభించినట్టు అనిపిస్తే అది మరింత తీవ్ర అశాంతి అన్నమాట.

బస్సులో కనిపించే ఆ అమ్మాయికోసం రోజూ ఎదురుచూశేవాడిని. ఆమె రాని రోజు గొప్ప అన్యాయం జరిగినట్టుండేది. ఆమెతో నేను ఒక్క ముక్క మాట్లాడలేదు. నా లాంటివాడొకడున్నాడనీ ఆమెకు తెలియదు. కానీ ఆమెకోసం ఎదురుచూస్తూండేవాడిని. ఆమె నన్ను వెతుక్కుంటూ వస్తునదని ఆశగా ఊహించేవాడిని. ఆ ఊహ ఎంత ఆనందాన్నిచ్చేదో అంత అశాంతినిచ్చేది.  దాంతో ఊహించాలంటే భయం వేసేది. ఊహించకపోతే వుండలేకపోయేవాడిని.

ఇలా రెండేళ్ళు చూపులతో సరిపోయింది. ఆమే నా కోసం ఎదురుచూస్తున్నదనిపించేది. కానీ అది నిజమో భ్రమనో తెలియదు. పలకరిస్తే రోడ్ రోమియో అనుకుంటే? ఈ ఆనందం కూడా అడుగంటుతుంది. పైగా, ఆ కాలంలో ఆ వేదనకు అర్ధం తెలియదు. ఈ బాధ స్పష్టమయిన స్వరూపం తెలియదు. అందుకే ఈ పాట పాడుతూంటే, భావాన్ని అనుభవిస్తూంటే ఎంతో సాంత్వనగా వుండేది. రఫీ స్వరంతో స్వరంకలిపి, బాధను అనుభవిస్తూ, ఆనందాన్ని జుర్రుకుంటూ, వేదనలని మాధుర్యాన్ని అనుభవిస్తూంటే మనిషి పక్కనవుండటంకన్నా, పక్కనుండే మనిషి ఊహనే అద్భుతం అనిపించేది.

ఒక రోజు అమ్మాయి హటాత్తుగా కనబడలేదు. ఊరు మారేరు. అంతే ఆమె ఒక తీయని వేదనగా మిగిలింది. ఆ వేదనకు తీపి గురుతుగా ఈ పాట మిగిలింది. మానవ సంవేదనల స్వరూపాన్ని, భావనల మాధుర్యాన్ని తెలుపుతూ అనుక్షణం నా హృదయంలో ంధ్వనిస్తూనేవుంది. ఆవేదనలోని మధురిమను బోధితూనేవుంది.

ఈ అనుభం ఆధారంగా, గాఢమయిన ప్రేమ వున్నా ఒకరికొకరు అపరిచితులుగా మిగిలిపోయే ప్రేమికుల కథ, అఙ్నాత మూర్తులు,  రాశాను.

ఇప్పటికీ ఆమె ఎవరో తెలియదు. అందుకే జబ్ భి యే దిల్ ఉదాస్ హోతాహై, జానె కౌన్ ఆస్ పాస్ హోతా హై అనుకుంటూ, కోయి వాదా నహీ కియా లేకిన్, క్యూ తెరా ఇంతెజార్ రహెతాహై? అని ప్రశ్నించుకుంటూనే వున్నాను. జీవితం గడుస్తూనే వుంది. అనేక మజిలీలలో ఇలాంటి ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతూనేవునాయి.సమాధానాల అన్వేశన సాహిత్యంలో సాగుతూనేవుంది.

జబ్ భి యే దిల్ ఉదాస్ హోతాహై, జానె కౌన్ ఆస్ పాస్ హోతాహై, అందుకే ఈ పాట ప్రేమ వేదనకు దివ్య ఔషధం!

October 6, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.