Archive for October 8, 2008

మన మహాత్ముడు, విమర్శ-11

మన మహాత్ముడు పుస్తకము, 353 పేజీల గ్రంథం.ఇందులో మొత్తం 50 అధ్యాయాలున్నాయి. కాబట్టి ఒకో అధ్యాయాన్ని తీసుకుని ఒకో అంశాన్ని విమర్శించాలంటే మళ్ళీ అంత గ్రంథం అవుతుంది. కాబట్టి ఎక్కడో అక్కడ రాజీ పడి విమర్శను వేగవంతం చేసి ముగించక తప్పదు. ఇంతవరకూ మనము చూసిన అంశాల ప్రకారం ఈ గ్రంథ రచయిత దృష్టి, గ్రంథ పరీతులు, తాను ఎంచుకున్న అంశాన్ని పరిమిత రంగుటద్దాలతో రచయిత చూసి విశ్లేషించటం స్పష్టమవుతాయి. దాంతో ఈ గ్రంథం ప్రామాణికం కాదని ఒక దృక్కోణాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందనీ అర్ధమవుతుంది.అదీ మహాత్మా గాంధీని ధర్మపీఠం ముందు నిలబెట్టేబదులు దుర్వ్యాఖ్యానల, వంకర దృక్కోణాల అహంకారపూరిత అధర్మ పీఠం.ఇందుకు కొన్ని ఉదాహరణలు చాలు.

పార్లమెంటు పడుపుకత్తె అన్న అధ్యాయంలో గాంధీ గారు డాక్టర్ల గురించీ, రైళ్ళ గురించీ, పార్లమెంటు గురించీ గాంధీ గారి అభిప్రాయాలు వాటిగురించిన రచయిత తీర్మానాలు ఉన్నాయి.

రైళ్ళ గురించి గాంధీ అభిప్రాయాలు చూసి మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఆకాలంలో అనేకుల అభిప్రాయాలు అవి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన సముద్రపు దిబ్బ నవల చదివితే ఎందుకని భారతీయ సమాజం రళ్ళను వ్యతిరేకించిందో అర్ధమవుతుంది. ఒకరకంగా, సామాజికవాదులు, పర్యావరణ పరిరక్షకులు కూడా ఇలాంటి భావాలతోనే రైళ్ళాను వ్యతిరేకిస్తున్నారిప్పుడు. ఆకాలంలో శౌచ్యానికి ప్రాధాన్యం వుండేది. ఒకళ్ళమీద ఒకరు కూచుని, తుమ్ముతూ, ఉమ్ముతూ ప్రయాణాలు చేయటం ప్రాణాంతకంగా వుండేది. ఇప్పుడు మనకు నుంచునీ, పడుకునీ, ప్లేట్లు వొళ్ళో పెట్టుకునీ తినటం అలవాటయింది. ఆకాలంలో హోటళ్ళలో తినటానికి కూడా ఇష్టపడేవారుకారు. శ్రీపాదవారి, అనుభవాలు-ఙ్నాపకాలు చదివితే ఈ సంధి దశలోవారి మనస్థితి అర్ధం చేసుకుఓవచ్చు. ఇప్పటికీ, పట్టాల మీద పడే అశుద్ధాన్ని తొలగించే green టాయిలెట్ల ఆలోచన నలుగుతోంది. ఆకాలంలో వారి అభ్యంతరాలను అర్ధం చేసుకోవచ్చు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా, వ్యక్తిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నించకుండా, గాంధీగారిలా అనటమేమిటి? అని ఈసడిస్తే రచయిత వంకర దృష్టి బయటపడుతుంది తప్ప గాంధీగారికేమీ నష్టం లేదు.

ఇదెలావుందంటే, ఒకసరి ఒక సాహిత్య సభలో నా కథని విమర్శిస్తూ ఒక విమర్శకుడు, ఇదేమి కథ, ఇందులో హీరో బస్సుటికెట్టు 1-50 కి కొంటాడు. ఇప్పుడు తక్కువ టికీట్టు ధరే 3 రూపాయలు అని దూశించాడు. ఆయన నన్ను తక్కువ చేయాలన్న ఆత్రంలో ఆ కథ 1991 లో రాసిందని, ఆయన 2006లో వున్నాడనీ మరచిపోయాడు. గాంధీగారి విషయంలో శాస్త్రిగారి విమర్శ అలాగేవుంది. ఏదో తిట్టాలనితప్ప ఏం తిడుతున్నామో చూడటంలేదన్నమాట.

ఇక డాక్టర్ల గురించి గాంధీగారి విమర్శను నేను ఇప్పతికీ సమర్ధిస్తాను. ఇటీవలే నేను రాసిన సగటుమనిషి స్వగతంలో డాక్టర్ల గురించి రాస్తోఅ నేను ఎవరిపాల పడినా ఫరవాలేదు, డాక్టర్ల పాల పడకూడదని రాశాను. అందుకు చూపిన కారణాలు గాంధీగారు చూపినవే!పైగా, డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలి, రోగికి జబ్బు కారణాలను వివరించి పనికి మాలిన మందులివాకుండా, రోగాలను తొలగించుకోవటం నేర్పాలనటంలో తప్పులేదు. ఇప్పటికీ ఎందోమంది, బాధాకరమయిన చికిత్స చేయించుకునేబదులు, రోగంతో బాధపడుతూ మరణించేందుకే ఇష్టపడుతున్నారు.

యంత్రాలపైన గాంధీగారి వ్యతిరేకత సమంజసమే. మోడెర్న్ టింస్ అనే సినిమాలో చాప్లిన్ యాంత్రిక జీవితం మనిషిని ఎలా యంత్రంలా మారుస్తుందో హాస్యంగా చూపాడు. ఇప్పుదు బటన్ నొక్కగానే అన్నీ అందుకుంటూ శారీరక శ్రమను మరచి రోగాలు తెచ్చుకుని వాకింగ్లంటూ డయటింగ్ లంటూ సతమతమయ్యే సమాజం గాంధీగారి సూచనలను పాతించి శారీరక శ్రమ చేతే ఆరోగ్యవంతంగా వుంటుంది. ఇదీ శాస్త్రి గారికి నచ్చలేదు.

గాంధీగారు అన్నీ స్వదేశీనే వాడాలనటం కూడా ఆయనకు నచ్చలేదు. ప్రమిదలు వడదాం, దేశం గుండు సూదులను చేయలేక పోతే గుండుసూదులేవడొద్దు అనటం వెనుక తత్వం అర్ధం చేసుకుంటే, గాంధీగారి మాటలు వినివుంటే, ఈనాడు మనకు పర్యావరణ సమస్య విద్యుత్ సమస్య నైతిక విలువల సమస్యలు వుండేవి కావు. గాంధీగారు చెప్పేది అచ్చమయిన భారతీయ జీవన విధానం. అది అర్ధం చేసుకోకుండా ఎద్దేవా చెయటమే పనిగా పెట్టుకుంటే, గులబ్ జాంలో తియ్యగా వుందన్న దోశం కనిపిస్తుంది, వర్శం నీరు చల్లగా వుందని కోపం వస్తుంది.

పార్లమెంటు విషయంలో గాంధీగారి వ్యాఖ్యలు అక్షర లక్షలు చేస్తాయి. వోల్టేరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ, వంద ఎలకల మాటలు వినేకన్నా, ఒక సిమ్హం ముందు తలవంచటం మేలు అనాడు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం పరిస్థితి చూస్తూంటే గాంధీ భవిశ్యద్దర్శన్ చేసి రాశారనిపిస్తుంది. అందుకే ఆయన వ్యక్తిత్వ నిర్మాణం, వ్యక్తిగత ప్రవర్తన, నైతిక వ్  ఇలువలు, ధార్మిక జీవితం వంటి అంశాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు.

పార్లమెంటు విషయంలో గాంధీగారి అభిప్రాయాలు మారనందుకు శాస్త్రిగారు ఆయనను వెక్కిరించారు. నిజం మారదు. మారని నిజం విషయంలో 30 ఏళ్ళు కాదు 300 ఏళ్ళయినా అభిప్రాయం మారకపోవటంలో తప్పులేదు.

మరికొన్ని అసంబద్ధ విమర్శలు, అనౌచిత్య వ్యాఖ్యలు, పక్షపాత దృక్కోణపు దృష్టాంతాలతో రేపు కలుద్దాం.

October 8, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu