Archive for October 9, 2008

పొమ్మనలేక పొగబెట్టటం అంటే ఇదే!

అందరూ ఎదురుచూస్తున్న గంగూలీ రిటయిర్మెంటు ఖరారయిపోయింది. ఆస్ట్రేలియాతో ఆడినతరువాత క్రికెట్టును వదిలేస్తానని గంగూలీ ప్రకటించటంతో ఒక వివాదాస్పద అధ్యాయంపైన తెర పడింది. గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, సచిన్ లు కొద్దిపాటి తేడాతో సమవయస్కులుగా పరిగణించవచ్చు. గంగూలీ, ద్రావిడ్ లయితే ఒకేసారి తెస్టులాడటం ఆరంభించినట్టే! మరి అలాంటప్పుడు అందరి దృష్టీ గంగూలీ మీదే ఎందుకున్నది అని ఆలోచిస్తే, ఆట ప్రావీణ్యం కన్నా అనేక ఇతర విషయాలు ఒక ఆటగాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయని అర్ధమవుతుంది.

ముందుగా, మనము గ్రహించవలసిందేమిటంటే, మనకు మన వీరులను, దేశభక్తులను, మేథావులనేకాదు, ఆటగాళ్ళను కూడా గౌరవించటం రాదని మరోసారి ఋజువయింది.  డిల్లీ తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన పోలీసాఫీసరు బలిదానం బూటకమని రాజకీయ నాయకులు తేల్చేస్తున్నారు. గాంధీ మోసమని మేథావులు తేలుస్తున్నారు. ఇలా అందరూ పనికిరానివారవుతున్న తరుణంలో సినిమావాళ్ళు క్రికెటర్లే దేవుళ్ళవటంలో ఆశ్చర్యంలేదు. ఆ దేవుళ్ళ వలువలుకూడా మనవారు వలిచేస్తున్నారు.

గంగూలీ మంచి ఆటగాడు. లేకపోతే ఇన్ని పరుగులు చేయలేడు. అయితే, గంగూలీ ఎవరిమాట వినడు. ఆయనదంతా రాజులాంటి వ్యవహారం. అందుకే అతనంటే అందరికీ అసూయ, కినుకలు. ఆయన వికయాలు సాధిస్తున్నంత కాలం ఎవరూ ఏమీ అనలేక పోయారు. కాస్త వెనుకపడగానే అందరూ ముందుకొచ్చారు. గంగూలీ హటావో అభియాన్ ను ఆరంభించారు. అయితే, గంగూలీకి దాల్మియా అండవున్నతకాలం, బెంగాలీ ప్రజల ఆదరణ వున్నంత కాలం సమస్య లేకుండా పోయింది. కానీ ఏదీ ఎల్లకాలం సాగదు. దాంతో గంగూలీ కాలం చెల్లిపోయింది.

ఎవరేమన్నా గంగూలీ గొప్ప ఆటగాడు. మన క్రికెట్ జట్టు మనస్తత్వం గంగూలీ హయాంలోనే మారింది. చెప్పినదానికి తలలూపే సౌమ్య బానిస మనస్తత్వం వదలి ఎవరినీ లెక్క చేయని దూకుడు మన జట్టులో కనబడటం గంగూలీ చలవే. చొక్క విప్పి బూతులు తిడుతూ సమబరాలు చేయటం, ఎదుటి కెప్టాన్ ఎదురుచూస్తున్నా పట్టించుకోక పోవటం లాంటి వన్నీ గెలిచినంతకాలం అలంకారాలయ్యాయి. ఓటమి ఎదురవగానే గుదిబండలయ్యాయి. అందుకే అందరూ గంగూలీ వెంట పడ్డారు. ప్రపంచం, భిన్నంగా వుండేవారిని భరించలేదు. వారి శక్తివంతులుగా వున్నంత కాలం తలవంచుతుంది. బలహీనులవగానే చీల్చి చెండాడుతుంది. కనీసం, ఒక మంచి ఆటగాడికి ఇవ్వాల్సిన మర్యాదను కూడా దక్కనివ్వదు. అందుకే గంగూలీ ఇంత కాలం పట్టుకుని వ్రేలాడటం ఆయన స్థాయిని దించింది. పొమ్మనలేక పొగబెడుతున్నా, ఇంకా చూరు పట్టుకుని వేలాడుతున్నాడెందుకన్న భావనను కలిగించింది. నిజానికి గంగూలీ ఎప్పుడో క్రికెట్ వదిలేసి వుంటే సెలెక్టర్ల చెంప మీద కొట్టినట్టుండేది. కానీ మళ్ళీ జట్టులోకి రావటం, తనని తాను నిరూపించుకోవటం, అయినా అతడిని జట్టులోకి తీసుకోకపోవటం లాంటి అంశాలు, సెలెక్టర్ల నైచ్యాన్ని ఎలాగో చూపుతాయి, కానీ గంగూలీ స్థాయిని కూడా దిగజారుస్తాయి.

గంగూలీ పని అయిపోయింది. ఇక మిగిలి వున్నది, ద్రావిడ్! నన్నడిగితే ద్రావిడ్ కూడా ఎప్పుడో సన్యాసం స్వీకరించాల్సింది. కెప్టెన్సీతో పాతు ఆడటం వదిలేస్తే గొప్పగా వుండేది. ఎందుకంటే ధోనీలాంటి వారు ఇప్పుడు ద్రావిడ్ గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అతని ఆట తీరును విమర్శిస్తున్నారు. కొత్త కొత్త ఆటగాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో తనలాంటి వారి కాలం చెల్లిపోయిందని ద్రావిడ్ గ్రహించి పరువుగా తప్పుకుంటే మంచిది. ఇప్పటికే ద్రావిడ్ ను మనవారు ఎంతగా అవమానించాలో అంతగా అవమానిస్తున్నారు. అయినా గంగూలీలా ఆవేశపరుడు కాదు కాబట్టి గుట్టుగా అన్నీ భరిస్తున్నాడు. కానీ ఇలా ఇంకా చెల్లదని అర్ధంచేసుకుంటే మంచిది.

నిజానికి ద్రావిడ్, గంగూలీల కన్నా ముందు తెండుల్కర్ పక్కకు తప్పుకోవాలి. దెబ్బలతో బాధ పడుతున్నాడు. ఇంతకు ముందులా ఆడలేకపోతున్నాడు. అయినా అతనిపైన ఉన్న అభిమానం వల్ల ఎవరూ ఏమీ అనటంలేదు. కానీ సీనియర్లందరినీ వన్ డే జట్టునుంచి తొలగించి ఆయనను మాత్రం ఆడనివ్వటంలో వున్న సూచనను సచిన్ అర్ధంచేసుకుని గౌరవంగా తప్పుకుంటే అతని పరువుకూడా నిలుస్తుంది. లేకపోతే ఏదో ఒకరోజు ఎవరో అతడినీ తొలగిస్తారు. అప్పుడు మన కొత్త దేవుళ్ళంతా మసిబారతారు. మరీ కొత్తదేవుళ్ళు పుట్టుకోస్తారు. పాతబడేలోగా వరికీ పోగబెడతారు. కాబట్తి ద్రావిడ్, సచిన్లు కూడా పొమ్మనలేక పోగబెట్టేలోపల కిమ్మనకుండా పక్కకు తప్పుకుంటే గౌరవం నిలుస్తుంది. కొత్తవారు ముసలివారయ్యేలోగా కాస్తయినా ఆటలాడతారు. మనకూ హీరోలను గౌరవించటంలేదన్న బాధ తప్పుతుంది.

October 9, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: క్రికెట్-క్రికెట్