Archive for October 11, 2008

నేను చదివిన మంచి పుస్తకం-14

ఇందిరా గోస్వామి పేరు సాహిత్య పిపాసులకే కాదు, రాజకీయ పరిశీలకులకు కూడా చిరపరిచితమే. ఆమె రచనలలో స్త్రీ సమస్యలను అతి దగ్గరనుంచి అనుభవించి వర్ణించిన భావన కలుగుతుంది. ప్రభుత్వానికీ, ఉల్ఫా తీవ్ర వాదులకు నడుమ శాంతి చర్చలు సాధ్యమవటంలో ఆవిడ ప్రధాన పాత్ర పోశించింది. అందుకే, ఆవిడ స్వీయ జీవిత చరిత్ర an unfinished autobiography దొరకగానే ఆత్రంగా చదవటం ఆరంభించాను.

ఒక రచయిత్రికి సాహిత్య ప్రపంచమేకాక తీవ్ర వాదులు, రాజకీయ నాయకులు ఇంత గౌరవం ఇవ్వటం ఆమె జీవితం గురించి తెలుసుకోవాలన్న నా కుతూహలాన్ని పెంచింది.

పుస్తకానికి ముందు మాట రాసింది ప్రఖ్యాత రచయిత్రి అమృతా ప్రీతం. ముందుమాటలమీద సదభిప్రాయం లేకున్నా, అమృతా ప్రీతం మీద ఉన్న అభిమానం కొద్దీ దాన్ని చదివాను. ముందుమాట ముత్యాల హారం. ఒక స్త్రీ మరో స్త్రీ సమస్యలను, అంతరంగాన్ని ఇంతకన్నా బాగా అర్ధంచేసుకోలేదనిపించింది ముందుమాట చదువుతూంటే. అమృతా ప్రీతం ఆకాలంలో ఎంతో సంచలనం సృష్టించింది. సామాజిక నియమాలను ఉల్లంఘించి తనకు నచ్చినట్టు జీవించే ధైర్యాన్ని ప్రదర్శించింది.

ఇందిరా గోస్వామి కూడా అంతే!

అయితే, ఇద్దరి జీవన గమనాల్లో చాల తేడావుంది. ఇందిరా గోస్వామి జీవితం చాలా కాలం సాంప్రదాయ పరిథిలో వొదిగింది. అంతేకాదు, ఆమె స్వేచ్చగా ప్రవర్తించినా ఆ ప్రవర్తన కూడా సాంప్రదాయ నియమాల పరిథిలోనే వొదిగింది. ఇదీ ఆమె గొప్పతనం. అంటే, ఆమె సాంప్రదాయ ఉల్లంఘనలో చులకన, ద్వేసాలు లేవు. అవగాహన, ఆలోచనలున్నాయన్నమాట. ఇది ఆమెను ఇతర రచయిత్రులనుంచి వేరు చేసే అంశం.

ఇందిరా గోస్వామి జన్మ పత్రం చూసిన జ్యోతిష్కుడు ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి బ్రహ్మపుత్రలో విసిరివేయమన్నాడట. ఎందుకంటే, అన్ని కష్టాలమయం ఆమె జీవితం!

పుట్టిన కొద్దికాలమే ఆమె సుఖాలను అనుభవించింది. బాలయంలో ఆమె అనుభవాలను, ఆమెపైన ముద్ర వేసిన సంఘటనలను, మనుషులను హృద్యంగా వర్ణిస్తుంది రచయిత్రి.

అయితే, మొదటి నుంచీ ఆమెలో అభద్రతా భావం ఎక్కువ. ఎక్కడ తండ్రి చనిపోతడో అని భయపడుతూండేది. ఇది ఆమెను డిప్రెషన్ వైపుకు నెట్టింది. ఆమె భయాలు ఒక రోజు నిజమయ్యాయి. ఆమె తండ్రి మరణించాడు. అప్పటి నుంచీ ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.

ఇందిరా గోస్వామి అందగత్తె. దాంతో అందరూ పెళ్ళి అని వెంట పడేవారు. కానీ తండ్రి మరణం తరువాత వీరు పేదవారవటంతో సంబంధాలు రావటం ఆగి పోయింది. ఆమె పెళ్ళి ఒక సమస్య అయింది. అందరూ వెంటపడేవారేకానీ ఎవ్వరూ పెళ్ళికి ముందుకు వచ్చేవారుకారు. ఈ నిరాశలో ఆమె ఒక తక్కువ కులస్తుడిని పెళ్ళి చేసుకుంది దొంగతనంగా. కానీ అతడితో కాపురం చేయలేదు. ఈ బాధలో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఊళ్ళో అంతా ఆమె అందరితో తిరిగి గర్భవతీయి ఆత్మ హత్య ప్రయత్నం చేసిందని నమ్మేరు. ఆమెని అవమానించారు.

ఈ సమయంలో దక్షిణా భారతమ్నుంచి వచ్చిన ఒక ఇంజనీయరు ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె తల్లి ఒప్పుకోదు. అయితే, పరిస్థితులు జటిలమయి, ఇక పెద్దకులం వాళ్ళెవరూ ఆమెని పెళ్ళిచేసుకోరని నిశ్చయమయిన తరువాత వాళ్ళమ్మ అతనితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.

వైవాహిక జీవితం గోస్వామి జీవితంలో అత్యంత ఆనందకరమయిన కాలం. ఈ సమయాన్ని ఎంతో సున్నితంగా అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ సందర్భంలోని అనేక అనుభవాలు మనకు ఆహ్లాదం కలిగిస్తాయి. అసూయ కలిగిస్తాయి. ముఖ్యంగా ఎడారిలో, చీకటి రాతృల్లో, తారలతో నినండిన ఆకాశంక్రింద వారిద్దరే కూచున్న రాత్రులను వర్ణిస్తూంటే, అక్కడికి పారిపోవాలనిపిస్తుంది.

అయితే ఎంతో నిక్కచ్చిగా ఆమె తనవెంట పడ్డవారినీ, తన మనసు చలించటాన్ని కూడా ప్రస్తావిస్తుంది.

చిన్ననాటినుంచీ రచనల ద్వారా ఒక గుర్తింపు, ప్రత్యేకతను సంపాదించుకున్న ఆమె భర్తతో రకరకాల ప్రదేశాలు తిరగాల్సి రావటం, అనేక అసాధారణ అనుభవాలు ఆమె రచనలకు ముడిసరకులవటం వివరిస్తుంది.

ఇంతలో ఆమె భర్త మరణిస్తాడు!

ఈ సంఘటనల వివరణ మనసుక్ను కోసేస్తుంది.అతని మరణం తరువాత ఆమె పడిన బాధను వర్ణించిన తీరు ఎదను కలచివేస్తుంది. ఆమె పలుమార్లు ఆత్మ హత్య ప్రయత్నాలు చేస్తుంది. పొట్టకూతికోసం ఉద్యోగం చేస్తుంది. అక్కడ ఆమెని చూసి జాలి పడి వెంట పడ్డవారు, ఆమె మానసిక స్థులను అద్భుతంగా వివరిస్తుంది. అవి చదువుతూంటే, నిజంగా నిజంగా మగవారు పశువులేకదా అనిపిస్తుంది. వారికి తమ అవసరం తప్ప మరొకతి అర్ధం కాదు.

అటునుంచి ఆమె బృందావనంలో అసామీ రామాయణం పైన రీసెర్చ్ చేయటం, బృందావనంలో ఆమె వెంటపడ్డ వారి చేష్టలు, సాధువులు, ఆమె అనుభవాలు వంటివి వివరిస్తుంది. ఒకో అనుభవం మనసును కలచివేస్తుంది. ముఖ్యంగా మరణించాలన్న ఆమె ఆత్రం మనల్ని కంట తడి పెట్టిస్తుంది. మనకు బయట కనిపిచే మనిషికి లోప ఉన్న అసలు మనిషికీ పోలికేలేదనిపిస్తుంది.

ఈ సమయంలో ఆమె బృందావనంలో విధవల పరిస్థితులను గమనిస్తుంది. వారి దుర్భర జీవితాలను, ఆశలను, నిరాశలను అర్ధం చేసుకుంటుంది. వారిని ఎలా అమాయకులను చేసి మోసాలు చేస్తున్నారో, వారి బలహీనతల ఆధారంగా అణచివేస్తున్నారో తెలుసుకుంటుంది. ఇవన్నీ తన రచనలలో ప్రతిబింబిస్తుంది.

ఇదీ ఇంకా పూర్తికాని ఇందిరా గోస్వామి జీవిత చరిత్ర.

ఒక మహిళగా, రచయిత్రిగా, భర్తను కోల్పోయిన స్త్రీగా, ఆమె జీవితం అద్భుతమయినది. ఎందరి కన్నీళ్ళో తుడిచి, పెదిమలపయిన విస్వాసంతో కూడిన నవ్వును నింపగల శక్తి కలది.

ఈ పుస్తకంలో మూడు అధ్యాయాలున్నాయి.

మొదటిది, life no bargain, రెండవది, down memory lane మూడవది, the life

ఈ పుస్తకాన్ని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. ఇది చదివిన తరువాత మళ్ళీ ఇందిరా గోస్వామి రచనలు చదివితే వాటిని మరింత బాగా appreciate చేయ గలుగుతాం. ఒక రచయిత తన కన్నీళ్ళను సృజనాత్మకతతో ముత్యాల హారాలుగా మార్చి, సమాజానికందించటం అర్ధమవుతుంది.

చివరగా, ఈవిడ రచించిన ఒక కథ చెప్తాను.

ఒక అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి తప్పని సరి పరిస్థితులలో వేశ్యగా మారుతుంది. అదేఊళ్ళో ఒక ధనవంటుడయిన తక్కువకులస్తుడుంటాడు. అతడికి పిల్లలుండరు. ఈమెద్వార పిల్లల్ని కనాలనుకుంటాడు. అలా ఆమెకు వేశ్య జీవితం నుంచి విముక్తి కలిగించాలనుకుంటాడు. ఆమె అతడితో గడుపుతుంది. గర్భవతి అవుతుంది. పెళ్ళికి అడగాలని ఆమె ఇంతికి వెళ్ళిన అతడికి ఆమె గర్భస్రావం చేసుకుందని తెలుస్తుంది. కాఋఅణం అల్ప కులస్తుడికి తల్లికాకూడదని, పెళ్ళి చేసుకోకూడదని. అంటే, ఆమె వేశ్యగానయినా వుంటుంది కానీ కులంతక్కువని భరించలేదన్నమాట.

మన కులవ్యవస్థలోని కుళ్ళును, నైచ్యాన్ని, అర్ధరాహిత్యాన్ని ఇంతకన్నా గొప్పగా చూపిన కథ లేదు. సన్నపురెడ్డి రాసిన చనుబాలు ఈ కథతో సరి తూలుతుంది. ఈ రెండూ సోమర్సెత్ మాం రాసిన rain సరసన సగర్వంగా నిలబడగలుగుతాయి.

ఈ పుస్తకాన్ని స్టెర్లింగ్ పాపెర్ బక్ వారు 2002 లో ప్రచురించారు. వెల 195/- .

October 11, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu