Archive for October 15, 2008

మన మహాత్ముడు, విమర్శ-12

ఏదయిన విషయము అర్ధమయ్యేరీతి మనము చెప్పే విధానము పైన ఆధారపడివుంటుంది. ఈ చెప్పే విధానములో ధ్వని ప్రధాన పాత్ర వహిస్తుంది. ఒక మహానుభావుని తప్పులు ఎత్తి చూపించటంలో కూడా సమ్యమనం పాటించాల్సి వుంటుంది. ఏ వ్యక్తీ సర్వ సంపూర్ణుడు కాడు. ఎలాంటి దోషాలు లేని వ్యక్తి దేవుడవుతాడు. కొద్ది దోశాలున్నా, ఉత్తమత్వాన్ని చూపి, అనేకులకు మేలు చేసినవాడు మహాత్ముడవుతాడు. మహాత్ముడంటే, గొప్ప ఆత్మశక్తిని ప్రదర్శించినవాడు. అతడిలోనూ దోశాలుంటాయి. ఆ దోషాలను ఎత్తి చూపేందుకు చులకన, హేళన, ఎద్దేవాలవసరము లేదు. అవన్నీ మనలాంటి మామూలు మనుషుల తప్పులెంచేటప్పుడు, మనకన్నా అధిక స్థాయిలో వున్న వ్యక్తి చూపాల్సిన లక్షణాలు. గాంధీ లాంటి మహాత్ముడికన్నా మనము ఎంతో చిన్న వారము. అల్పులము. మన పరిథిలో మనము గొప్ప కావచ్చు. కానీ, గాంధీతో పోలిస్తే మనమేకాదు, గొప్ప గొప్ప ప్రపంచ నాయకులు కూడా కుచించుకుపోతారు. అలాంటి గాంధీని విమర్శించేటప్పుడు, కనీస మర్యాద, మన్ననలను పాటించాల్సి వుంటుంది. ఈ పుస్తక రచయిత వాటిని పాటించలేదని ఈ పాటికే అందరికీ అర్ధమయిపోయివుంటుంది. అయినా, ఇంకోన్ని ఉదాహరణలిస్తాను.

ఫస్ట్ షాక్ అనే అధ్యాయంలో జలియన్ వాలా బాగ్ ఉదంతానికి గాంధీ స్పందనను విమర్శించారు. ఎందుకంటే, ఆయన జలియన్ వాలా బాగ్ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అదే సమయంలో కొందరు హింస జరిపారని ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్నే నిలిపివేశారు. దీన్ని రచయిత తప్పు పట్టారు.

ఉద్యమము నిలిపివేయటానికి గాంధీ చెప్పిన కారణం, శాంతి యుతంగా పోరాడటాం ప్రజలకు నేర్పకుండా సత్యాగ్రహాన్ని ప్రారంభించటం పెద్ద తప్పు, అన్నారు. అంటే, గాంధీ గారికి ఉద్యమము తీవ్రమయి ఎంత మంది ప్రాణాలుపోగొట్టుకున్నారు, ఎంత ఆస్థి నష్టమయితే అంత గొప్ప అన్న ఆలోచనలు లేవు. ఆయన దృష్టి ఎంత సేపూ నిబద్ధత మీదవుంది. డయారూ హింస జరుపుతాడు, ఆగ్రహంలో ఉద్యమకారుడూ హింస చేస్తాడు. కానీ ఆగ్రహంలో కూడా నిగ్రహం చూపినవాడే అసలయిన మనిషి. గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యమంటే అసలయిన మనుషులను తయారుచేయటం. ఇది అర్ధంకాని సమాజం, సత్యాగ్రహాన్ని, సహాయనిరాకరణోద్యమాన్ని, స్వాతంత్ర్యం తరువాత, బందులు, ధర్నాల పేరిట అభాసుపాలు చేయటం మనము చూస్తూనేవున్నాము.

గాంధీకి మానవ మనస్తత్వం తెలుసు. ఒకసారి ఒకతి విజయవంతమయితే ప్రజలు దాన్ని అనుకరిస్తారనీ తెలుసు. అందుకే ఉద్యమానికి ప్రామాణికాలేర్పరచి, నియమాలు విధించాలని ప్రయత్నించారు. డాక్టరు చేతిలో కత్తికీ పిచ్చివాడి చేతిలో కత్తికీ చాలా తేడావుంది. ఎప్పుడయితే కత్తిని డాక్టరులానే వాడాలన్న నియమం స్థిరపడుతుందో అప్పుడు తనకు తెలియకుండా పిచ్చివాడు సైతం ఆ ప్రభావానికి గురవుతాడు. ఆ ఆలోచన సమాజానికి లేకపోతే ఎవడుబడితేవాడు కత్తి పడతాడు. అల్ల కల్లోలమవుతుంది. ఇప్పుడు జరుగుతోందీ అదే. దీన్నిబట్టి చూస్తే గాంధీ గారు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసారని అనిపించినా, ఆయన లక్ష్యం వేరు అనీ, ఆ దృష్టిలో ఆయన ప్రవర్తన సరయినదేనని అర్ధమవుతుంది. ఉద్యమము లేవదీయటం కష్టం కాదు. దాన్ని నియంత్రించి సయిన రీతిలో కొనసాగించాలంటే ఎంతో నైపుణ్యం, దక్షత కావాలి.

ఇక్కడ మనము ఆలోచించాల్సిందేమిటంటే, గాంధీ గారు స్టాప్ అన్నారు అందరూ ఎందుకని ఆగిపోయారు? ఇప్పుడు తెలంగాణా ఉద్యమం జరుగుతోంది. ఒక పార్టీ నాయకుడు కాన్సిల్ అన్నాడనుకోండి, వెంటనే అతని పార్టీ నుంచి అతడిని తరిమి మరొకడు అరుస్తాడు. మరి గాంధీకి వ్యతిరేకంగా ఒక్క స్వరం వినబడలేదేమి? అప్పుడు బోలెడంతమంది నాయకులున్నారు. ఎవ్వరూ కిమ్మనలేదేమి? అందుకే గాంధీ మహాంత్ముడయ్యాడు. మిగతావారు ఆయన మ్యందు మరుగుజ్జులయ్యారు.

ఇలా ఉద్యమాన్ని నిలిపివేయటం వల్ల మరింత ఘోరమయిన రక్తపాతం, ప్రాణ హాని నుంచి దేశాన్ని రక్షించారు. అప్పతి భావావేశంలో, అప్పతి ఉద్రిక్త పరిస్థితిలో గాంధీ గారు హింస జరిగినా ఫరవాలేదు అని వుంటే, పరిస్థితి ఎలా వుండేది? స్వాతంత్ర్యం అంత త్వరగా వచ్చేదికాదు. కానీ బ్రిటీష్ వారు జరిపే దమన కాండకు అప్పుడప్పుడే నిద్ర లేస్తున్న మనవారి ఆత్మగౌరవం, ధైర్యాలు మళ్ళీ దెబ్బతినేవి. ఇవన్నీ గమనించకుండా, పై పైన చూసేసి ఉద్యమాన్ని నీరుగార్చాడు కాబట్తి గాణ్దీ పనికిరానివాడు అనేసి గొప్ప విశ్లేషకుడిగా, గాంధీలాంటి వాడిని దోషిని చేసిన మహానుభావుడిలా  righteous indignation ప్రదర్సించటం వల్ల లాభంలేదు. ప్రజలను రెచ్చగొట్టకూడదనే గాంధీగారు జలియన్ వాలా బాగ్ విషయంలో ఎంతో సమ్యమనం పాతించారు.

స్వామీ లక్ష్మణానంద హత్య తరువాత చెలరేగిన హింస నెల తరువాత కూడా చల్లారటంలేదు. ఈ ఆవేశాగ్నిని చల్లార్చేనాయకుడే కనబడటంలేదు. అలాంటిది, విదేశీయుడు దమన కాండ జరిపిన తరువాత చెలరేగే ఆవేశాగ్నిని ఒక్క వ్యక్తి తన మౌనంతో దేశవ్యాప్తంగా చల్లార్చగలిగాడంటే, ఎంతో ఆవేశాన్ని అణచిపెట్టాడంటే, ఆయనని మమ్మూలు మనస్థాయిలో తూచి విమర్శించటం విఙ్నతనా?

మిగతా తరువాత.

October 15, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu