Archive for October 16, 2008

మనము సినిమాలెందుకు చూస్తాము?

ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము?

టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, పరోక్షంగా సంతృప్తి పొనదటానికి అన్నది మానసిక శాస్త్రి సమాధానం.ఇలా సినిమాలెందుకు చూస్తాము అన్నదానికి రకరకాల సమాధానాలొస్తాయి. అసలు సినిమాలెందుకు చూడాలి? అని మనల్స్ని మనము ప్రశ్నించుకుని లోతుగా విశ్లేషించుకుంటే, సినిమాలెందుకు చూడాలో మాత్రమే కాదు, సినిమాల ప్రాధాన్యం, మనపైన అవి చూపే ప్రభావం, సినీ కళాకారుల బాధ్యత వంటి విషయాలు కూడా మనకు అర్ధమవుతాయి.

మనిషికి జంతువుకీ ప్రధానంగా తేడా సమయ పరిఙ్నానం. జంతువుకు సమయం గురించిన చైతన్యం లేదు. దానికి సమయం గడవటంలేదన్న బాధ లేదు. బోరొస్తుందన్న భావన లేదు. ఎంత కాలమయినా అలా కూచుండి పోతాయి. వేట కోసం సర్వ శక్తులూ కేంద్రీకరించి అవసరమయితే రోజులతరబడి ఎదురుచూస్తాయి. మనిషి అల్లా కాదు.

మనిషికి సమయ చైతన్యం వుంది. ఏదయినా పని కొద్దికాలం చేయగానే అతనికి విసుగు వస్తుంది. దృష్టి మళ్ళుతుంది. ఏ పనీ లేకపోతే చిరాకు వస్తుంది. సమయం గడవటంలేదని బాధ కలుగుతుంది.ఉట్టిగా కూచోలేడు. ఏదో పని వుండాలి. ఆపని కూడా ఆసక్తి కరమయినదయివుండాలి. లేకపోతే బోరొస్తుంది. కాబట్టి మనిషి కి టైం పాస్ లూ, వినోదాలు అవసరమవుతాయి.

ఈ వినోదావసరంలోంచే కథ, తోలు బొమ్మలాటలు, యక్ష గానాలు, బుర్ర కథలు, సాహిత్యం, గానం నాట్యం వంతివి ఉద్భవించాయి. ఒకొక్కటీ, ఒకో రకంగా మనిషి దృష్టిని కట్తి పడేస్తాయి. సమయ చైతన్యాన్ని మరపుకు తెస్తాయి. చూస్తున్నంత సేపు, వింటున్నంత సేపూ, మనిషిని మరో లోకం లోకి తీసుకు వెళ్తాయి. అవి అయిపోయిన తరువాత కూడా చాలా కాలం ఆ అనుభూతి వ్యక్తిలో గిలిగింతలు కలిగిస్తుంది. అతడిని ఇతర కార్యాలకు ప్రోత్సహిస్తుంది. అతని జీవితంలో ఉత్తేజం, ఉత్సాహం నిలుపుతుంది.అతని మనసుపైన దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది.

సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం అనే కళలు వ్యక్తిపైన దీర్ఘ కాలిక ప్రభావం చూపుతాయని మన పూర్వీకులు గుర్తించారు. ఉత్తమ కళ వ్యక్తిలో ఉత్తమ ఆలోచనలకు దారితీస్తుందని గ్రహించారు. నీచతా పరిపూర్ణమయిన కళ తాత్కాలికంగా ఉద్రేకం కలిగించి ఉర్రూతలూగించినా, శాశ్వతంగా దుష్పరిణామాలకు దారితీస్తుందని అర్ధం చేసుకున్నారు. అందుకే కళకు కొన్ని నియమాలు విధించారు. కళను ఒక శాస్త్రం చేశారు. కళాకారుడికి సామాజిక బాధ్యతను నిర్ణయించారు.

అన్ని కళలోకీ, సాహిత్యం ఎక్కువగా ప్రభావం చూపుతుంది. నృత్యం ప్రేక్షకులను ఆనంద పరచినా, హావ భావాలు, ముద్రలు వంటి సాంకేతిక పరిఙ్నానం లేకపోతే నృత్యాన్ని చూసి ఆనందించినా సంపూర్ణంగా అనుభవించటం కుదరదు. సంగీతానికీ ఇది వర్తిస్తుంది. సంగీతం ఒక అస్పష్టమయిన భావనను కలిగిస్తుంది. దానికి సాహిత్యం తోడయితే సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. సాహిత్య రహిత సంగీతాన్ని అందరూ అనుభవించలేరు.

సాహిత్యం పరిస్థితి వేరు. ఒకోసారి పదాలన్నీ అర్ధం కాక పోయినా పదల శబ్దాలు పాఠకుది మనసులో అస్పష్ట భావనలు కలిగిస్తాయి. ఉదాహరణకు, కమ్మని లతాంతముల కుమ్మొనసి/ వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెగసెం జూ/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి/ ముకుళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా/ లమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము/ మధురమ్మగుచు విచ్చె ననిశమ్ము సుమనో భా/ రమ్ముల నశోక నికరమ్ములును జంపక/ చయమ్ములును గింశుక వనమ్ములును నొప్పెన్  అనే నన్నయ పద్యాన్ని తీసుకుంటే ఇందులో పదాల అర్ధాలు తెలియకున్నా ద్విత్వ మకారము తిరిగి తిరిగి వస్తూ చెవులకింపు కలిగిస్తుంది. అంటే సాహిత్యంలో సంగీతం అంతర్లీనంగా నిబిడీకృతమయి వున్నదన్నమాట.

అలాగే దుశ్శాసనున్ లోకభీ/ కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని/ ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్ అనగానే కళ్ళ ముందు ఒక భీకర దృష్యం కదలుతుంది.

అలాగే ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి/ దొలుతగా బోరిలో దుస్ససేను/ తను వింతలింతలు తునియలై చెదరి అన్న పద్యం వినగానే క్రొధంతో రోస కషాయిత నేత్ర అయిన వనిత కనుల ముందు నిలుస్తుంది ఈ వెండ్రుకలు ఆ చేయి, తనువింతలింతలు తునియలై లాంటి పదాలు ఒక మహిళ చెదరి ఉన్న తన కురులను చూపుతో కోపంతో వాటిని ఏడ్చిన వాడి శరీరం ముక్కముకాలు అవాలని కోరే దృష్యం కళ్ళ ముందు నిలుస్తుంది. అంటే, సాహిత్యం సంగీతాన్నే కాదు, చిత్రలేఖనాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నదన్నమాట. పదాలతో రాగాలు సృజించటమేకాదు దృష్యాలూ కళ్ళముందు నిలప వచ్చన్నమాట.

కళలోని ఈ గొప్పతనం గుర్తించిన మన పూర్వీకులు కళను నిర్మాణాత్మకంగా వాడేందుకు ఎంతో సృజనాత్మకమయిన పద్ధతిని ఏర్పాతు చేశారు.

చిన్న పిల్లలకు కథలు చెప్తాం. వాతిలో అద్భుతాలుంటాయి. అవి వారిని ఆశ్చర్య పరచటమే కాదు, వారిలో అనేక ఆలోచనలకు రెక్కలనిచ్చి వారి సృజన పరిథిని పెంచుతాయి. ఎదిగిన కొద్దీ సాహిత్య పరిథి విస్తృతమవుతుంది. రక రకాల విషయాలు తెలుస్తాయి. అయితే కళను ఉన్నత స్థాయిలో ఉత్తమంగా వుంచేందుకు వారు, కళను సరస్వతీదేవికి ప్రతీక చేశారు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, పాడే పాట, గీసే గీత అన్నీ సరావతీ మయమన్నమాట. దాంతో కళాకారుడు కళను ఎంతో జాగ్రతాగా సృజించేవాడు. భక్తి భావంతో వర్తించేవాడు. అలాగే చిత్రకారుడు సృంగార చిత్రాలను కూడా భగవదంకితం చేస్తూ లిఖించేవాడు. గమనిస్తే కాళిదాసు వర్ణించిన పార్వతీ పరమేశ్వరుల సృంగారం భక్తి భావాన్ని కలిగిస్తుంది తప్ప రెచ్చగొట్టదు. ఇది అన్ని కళలకు వర్తిస్తుంది. అందుకే మన వ్యక్తిత్వ వికాసంలో చిన్నప్పుడు తల్లి చెప్పే పురాణ కథలు ప్రధాన పాత్ర వహిస్తాయి.

జోసెఫ్ కాంప్ బెల్ అనే మానసిక శాస్త్ర వేత్త ఏ విషయమై విస్తృతమయిన పరిశోధనలు చేసి అనంత తవాన్నికి కిటికీలవంటివి ఈ పురాణ కథలు అని తేల్చాడు. ఈ విషయాన్ని hero with a thousand faces అనే పుస్తకంలో ప్రకటించాడు.

దీన్ని బట్టి చూస్తే మన నిత్య జీవితంలో కళల ప్రాధాన్యం అర్ధమవుతుంది. మనకు వినోదాన్ని అందిస్తూ,  విఙ్నానాన్ని అందిస్తూ,మనలను భవిష్యత్తును ఎదుర్కొనేందుకు తయారుచేస్తూ, టైం పాస్ కలిగిస్తూ ఇలా కళ అన్నది ఒక అనేక ఉపయోగాలున్న అద్వితీయ మాధ్యమం అన్నమాట.

అయితే ఆధునిక సమాజంలో అనేకాలు రూపాంతరం చెందినట్టే కళ కూడా మారింది. అన్ని కళలనూ తనలో కలుపుకుని సినిమా ఒక సమిష్టి కళగా ఎదిగింది. సినిమాలో సంగీతం వుంది. నృత్యం వుంది. నాట్యం ( నటన) వుంది, సాహిత్యం వుంది. అంటే ఒక కళాకారుడి తపన ఇప్పుడు సమిష్టి కళాకారుల సమ్యుక్త సృజనాత్మక భావ వ్యక్తీకరణగా మారిందన్నమాట.

ఒక అణు కేంద్రంలో బోలెడంత శక్తి వుంది. అలాంటి కొన్ని వేల అణువులు కలిస్తే ఎంత శక్తి వుంటుందో సినిమా అన్ని కళలనూ కలగలుపుకుని అంత శక్తివంతమయిన కళ అయిందన్నమాట. ఇప్పుడు సినిమా సమాజంపైన , వ్యక్తి పైన ఎంత దీర్ఘమయిన, లోతయిన ప్రభావం చూప గలుగుతుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

కానీ కళపైన, కళాకారుడి పయిన గతంలో వున్న దైవ భావన నీడ తొలగిపోయింది. దాంతో కళ విశృంఖలమయింది. మానవుడికి కళ అవసరం అనాదిగా ఒకటే. దాని స్వరూపంలో మార్పురాలేదు. కానీ కళ స్వరూప స్వభావాలలో మార్పు వచ్చింది.

ఇంతకుముందు తల్లి వొడిలో ధ్రువుడు, రాముడు కథలు వినే పిల్లవాడు ఇప్పుడు సూపర్ మాన్లు, సూపెర్ హీరోలూ, మెగా స్టార్లను చూస్తున్నాడు. కళ ప్రభావ తీవ్రత మారలేదు. కళ స్వరూపం మారింది. యవ్వనంలో వీర గాథలు, సున్నితమయిన ప్రేమ కథలు వినే యువకులకు వెకిలి హాస్యాలు, పిచ్చి పచ్చి సృంగారాలు పరమార్ధమవుతున్నాయి. కలలు కల్పించే కళ లక్షణం మారలేదు. అవి కల్పించే కలల స్వరూపం మారింది.  కళలనుండి స్ఫూర్తి పొందే మానవ తత్వం మారలేదు. కళలిచ్చే స్ఫూర్తి తత్వం మారింది. ఇన్ని తెలిసి కూడా, వొస్తున్న సినిమ్మాలను తిట్టుకుంటూకూడా మనం సినిమాలను చూస్తూనే వున్నాం. ఎందుకంటే మౌలికంగా మనకు కళ అవసరం వుంది. ప్రస్తుతం అత్యంత ప్రచారం పొందిన కళ సినిమానే!ఎలాగయితే క్రికెట్ ఇతర ఆటలను వెనక్కు నెడుతుందో, అలాగే సినిమా ఇతర కళలను నీడలోకి నెడుతుంది. అందుకే మనం సినిమాలు చూస్తున్నాం. సినిమాలు చూడటంలో మన ఉద్దేశ్యం మారలేదు. సినిమాల లక్ష్యం మారింది. కళాకారుల కళాకౌశలం మారలేదు. వారి దృష్టి మారింది.

October 16, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.