Archive for October 18, 2008

మన సినిమాలెందుకు మూస దాటవు?

తెలుగు సినిమాలేకాదు, భారతీయ సినిమాలు చూసేవారెవరినయినా వేధిస్తూన్న ప్రశ్న ఇది?

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే మన దేశం సినిమాలు నాణ్యత విషయంలోకానీ, సాంకేతికామ్షాలలో కానీ, కథామ్షాలలో కానీ ఇతర చిన్న చిన్న దేశాల సినిమాలతో పోలిస్తే తేలి పోతాయి.

మన దగ్గర మెగా స్టార్లున్నారు. సూపెర్ స్టార్లున్నారు. పవర్ స్టార్లున్నారు. కానీ చెప్పుకోటానికి ఒక్క మంచి అంతర్జాతీయ స్థాయి సినిమా లేదు. ఎంత సేపూ, మల్లీశ్వరి, మాయా బజార్, మూగ మనసులు లాంటి కొన్ని సినిమాల పేర్లు తప్పించి వెంట వెంటనే ఒక పది సినిమాల పేర్లు గుర్తుకు రావు.

హాంగ్ కాంగ్ లో నిర్మించిన ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచ సినిమాల్లో పోరాట స్వరూపాలను మార్చేసింది. గాడ్ ఫాదర్ ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్రెంచ్ సినిమాలు, ఇటలీ దేశ సినిమాలు, ఇరాన్ సినిమాలు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ మనము మాత్రం అత్యధిక సినిమాలు చూస్తూ, అత్యధిక కాలం సినిమాలు చూస్తూ గడుపుతూ, ఇతరులకు జేజేలు పలుకుతున్నాం తప్ప మనమేమి చేస్తున్నాం, ఎందుకని అంతర్జాతీయ ప్రామాణికాలకు మనం తూగటంలేదు అని ఆలోచించటం లేదు.

ఇంతకు ముందు, మన సినిమాల మార్కెట్ తక్కువ అన్న కారణం చూపేవారు. కానీ ఇప్పుడు ప్రపంచీకరణ ప్రభావంతో ప్రపంచమే ఒక పెద్ద విపణి అయింది. భాష వ్యాపారానికి ప్రతిబంధకమే కాదిప్పుడు. అవసరమయితే సబ్ టైటిల్స్ తో సినిమాను చూసి ఆనందిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో మనము ఎందుకని మంచి సినిమాలు తీయలేక పోతున్నామని ఆలోచించాల్సిన అవసరం ఎంతో వుంది.

మన దగ్గర నైపుణ్యం వుంది. నటులున్నారు. చూసేందుకు ప్రేక్షకులున్నారు. అంగట్లో అనీ వున్నా అల్లుడినోట్లో శని వుందన్నాట్టు మన సినిమాల గొంగళి మాత్రం కదలటం లేదు.

ఇప్పుడు మన సినిమాలు మారుతున్నాయని కొన్ని సినిమాల ఉదాహరణలు చూపుతారు. గమనిస్తే, ఈ సినిమాలన్నీ ఇతర సినిమాలకు నకళ్ళుకానీ, అనుకరణలు కానీ అవుతాయి. మన భారతీయ జీవన విధానానికి ఎంతో దూరంగా వుంటాయి. ఒకోసారి ఇవి మన సినిమాలనేకన్నా వేరేవారి సినిమాలనిపిస్తాయి. ఈ మార్పు మన స్వాభావిక మార్పు కాక వేరే వారి అనుకరణ ద్వారా వారిలాంటి మార్పు తప్ప స్వతంత్ర్య మార్పు కాదు.

ఇటువంటి పరిస్థితిలో మన సినిమాలు ఎందుకు మారటంలేదో కూలంకషంగా విశ్లేషిస్తే, మార్పు రావాలంటే ఏం చేయాలో ఆలోచించేవీలుంటుంది.

వీలయినంత వరకూ నిష్పాక్షికంగా, కళాకారుల పేరుతో సంబంధం లేకుండా నిర్మొహమాటంగా మన సినిమాలని విశ్లేశిస్తూ సమాధానాలను రాబట్టేఅ ప్రయత్నమే ఈ వ్యాస పరంపర. నా ఆలోచనలే సరైనవి అన్న ద్ర్క్పథంతో రాస్తున్న వ్యాసాలు కావివి. ఇవి నా అభిప్రాయాలు. మనమంతా కలసి చేసే మథనానికి ఇవి నాందీ ప్రస్తావన కావాలని నా ఆశ. కాబట్టి అందరూ నిర్మొహమాటం గా ఈ చర్చలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వెలిబుచ్చాలి. నేను ఏ అభిప్రాయాన్ని కూడా సెన్సార్ చేయను. ఎందుకంటే వినదగునెవ్వరు చెప్పిన. కాబట్టి మనమంతా సాగించే ఏ మేథోమథనం నుంచి వచ్చే హాలాహలాన్ని గళంలో దాచుకుని అమృతంకోసం మథనం కొనసాగిద్దాం. అమృతం సాధిద్దాం.

October 18, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.