Archive for October 21, 2008

సినిమాలెవరు తీస్తారు? ఎందుకు తీస్తారు?

ఇది అడగవలసిన ప్రశ్ననా? అనిపిస్తుంది.

సరే, అడిగేశాము కదా, సమాధానం కోసం ప్రయత్నిద్దాం.

సినిమా నిర్మాత తీస్తాడు. కానీ, నిర్మాత పని సినిమా తీయాలనుకోవటం వరకే. మిహతా సినిమాను నిర్మించాల్సింది వేరేవారు.

ఇతర కళలకూ సినిమాకూ ఇది ప్రధానమయిన తేడా.

రచయిత ఎవరి ప్రమేయంలేకుండా రచనలు చేయగలుగుతాడు. చిత్రకారుడు రెండో వ్యక్తితో సంబంధం లేకుండా చిత్రాలు గీయ గలుగుతాడు. కానీ, వొంటరిగా సినిమాలు నిర్మించటం కుదరదు.

సినిమాకు కథా రచయిత అవారం. నటీ నటులు అవసరం. దర్శకుడు అవస్రం. కెమేరామాన్ అవసరం. ఎడిటర్ అవసరం. సంగీతం అవసరం. ఇదంతా అయిన తరువాత సినిమాను పంపిణీ చేసేవారు అవసరం. పంపిణీతో సరిపోదు. సినిమాను ప్రదర్శించేవారు అవసరం. అంటే, ఇతర కళలకు భిన్నంగా సినిమా ఒక్కరితో అయ్యేపనికాదు. ఇది సమిష్టి కృషి ఫలితం. దానికి తోడు ధనం చాలా అవసరం. పేదవాడు రచనలు చేయగలడు. బొమ్మలు గీయగలడు. పాట పాడగలడు. నాట్యం చేయగలడు. కానీ సినిమా తీయలేడు.

కళాకారులకు ఆరంభమ్నుంచీ పోషకుల అవసరం వుంది. కానీ ఒకప్పటి వ్యవస్థలో కళాకారులు సమాజంపైన ఆధారపడేవారు. ప్రజలే వారి పోషకులు. బుర్ర కథలు, తోలు బొమ్మలాటలు వంటి వాటిని ఒక గ్రామంలో ప్రదర్శిస్తే, ఆ ప్రదర్శనలున్నన్నినాళ్ళు ఆ గ్రామ జమీందారో, పెద్దలో వారి పోషణ చూసుకునేవారు. దాంతో కళాకారులెన్నడూ తమ సామాజిక బాధ్యతను విస్మరించాల్సిన అవసరమూ రాలేదు. ప్రతి క్షణం వారు తమ సామాజిక బాధ్యతను స్మరిస్తూండేవారు. సమాజాదరణ పొందుతూండేవారు.

అయితే, సమాజాదరణ లేనివారు కూడా తమ కళను భగవద్దతంగా భావించి, బుద్ధిగా, చిత్త శుద్ధితో కళను సృజించేవారు.

పోతన రాజాశ్రయం పొందలేదు. కేవలం తాను అనుకున్న రీతిలో రచన సాగించాడు. సమాజం అతని కళను హృదయానికి హత్తుకుంది. పోతన రచనను చిరంజీవిని చేసింది. నన్నయ, తిక్కన, ఎర్రన తదితర కవులు రాజాశ్రయంలో వున్నా తమ సామాజిక బాధ్యతను నిర్వహించారు.

సినిమా ఈ పరిస్థిని మార్చింది. ఎందుకంటే, సినిమా తీయటం అంత తేలిక కాదు. తీసిన తరువాత చూపటమూ అంత తేలిక కాదు. కాబట్టి సినిమా లో డబ్బులు ప్రాధాన్యం వహిస్తాయి.

దాదాఫాల్కే సినిమాకోసం తన ఆస్తిని ఫణంగా పెట్టాడు. అయితే, ఆ కాలం వేరు. సినిమా మనకు కొత్త. పైగా మాటలు లేవు. కాబట్టి అందరికీ అర్ధమయ్యే పౌరాణిక గాధలనే తెర కెక్కించారు. కానీ ప్రజలకు అద్భుతాలు చూపాలి. గొప్పగా తీయాలి అన్న తపన ఆనాటి కళాకారుల్లో కనిపించేది. నిర్మాత సైతం పెట్టుబడి పెట్టినా కళాకారులను గౌరవించేవాడు. గమనిస్తే దాదా ఫాల్కే చివరి దశలో ఆయన వ్యాపార కళాకారులతో పోటీ పడలేకపోయాడు.

అంటే సినిమా నిర్మించాలంటే, కళాభినేవశం అవసరంలేదన్నమాట. తపన అవసరంలేదు. ఆదర్శం అవసరంలేదు. ఊహలు కూడా అవసరంలేదు. సినిమా నిర్మించాలంటే డబ్బు వుంటే చాలు.

ఒకప్పుడు డబ్బుతో పాటూ హృదయంవుండేది. సమాజానికి ఏదో చేయాలన్న తపన వుండేది. ముఖ్యంగా కళాకారులలో కళ ను ప్రదర్శించాలని, తమ కళా ప్రదర్శనద్వారా గుర్తింపుపొందాలని వుండేది. తమ కళను సమాజంకోసం ఉపయోగించాలన్న ఆలోచనవుండేది. ఇవేవీలేకున్నా కనీసం ప్రజలకు ఆనందం కలిగించాలని, వినోదాన్నివాలని వుండేది.

కమాల్ అమ్రోహీ, గొప్ప కళాకారుడు. ఒక దశలో తన కళా ప్రదర్శన అవకాశాలు సరిగా దొరకటంలేదనిపించింది. దాంతో తానే నిర్మాత అయ్యాడు. కళాఖండాలను నిర్మించాడు. అశోక్ కుమార్ అంతే. దేవానంద్ అంతే. రాజ్ కపూర్ అంతే.

మహబూబ్ ఖాన్ కళాకారుడు కాదు. కానీ సినిమా కళ ద్వార సమాజనికి లాభం కలిగించాలన్న తపన వుంది. ఆయన సినిమాలు ఔరత్ నుంచి, సన్ ఆఫ్ ఇండియా వరకూ ఇదే తపనను చూపుతాయి. మదర్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన సినిమా అందాజ్ ఈనాటి సమాజానికీ గుణ పాఠాలు నేర్పుతుంది.

శాంతారాం నటుడు. తనకు నచ్చిన సినిమాలు తానే నిర్మించాడు. తాను నటించలేనప్పుడు వేరే వారితో నిర్మించాడు. దేవదాసు సినిమా దుష్ప్రభావం ఆనాడే గ్రహించి ఆ సినిమాను ఖండిస్తూ ఆద్మీ అనే మహత్తరమయిన సినిమాను నిర్మించాడు. ఆ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు అది మన సమాజ దురదృష్టం!

తెలుగూలో కూడా ఇది చూడవచ్చు. ఎంటీ రామారావు బయట సినిమాలతో తృప్తి కలగనప్పుడు తనే సినిమాలు నిర్మించాడు. కమల్ హాసన్ సైతం తన కళాప్రదర్శన కోసం సినిమాలు నిర్మించుకుంటాడు. భానుమతి కూడా ఇదేపద్ధతి అవలంబించింది. అనేక నటీనటులు మంచి పాత్రల కోసం సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు.

హాలీవుడ్ లో కూడా సరయిన పాత్రలు దొరక్క కిర్క్ డగ్లస్, సిల్వెస్టర్ స్టాలన్, వూడీ అలన్, టాం హాంక్స్, జూలియా రాబెర్ట్స్, సూసన్ సారండన్, గోల్డీ హాన్, టాం క్రూయిజ్, వంటివారు నిర్మాతలయ్యారు. ఒక దశలో స్పీల్ బెర్గ్ సైతం తన నిర్మాణ సంస్థ స్థాపించుకున్నాడు.

ఇలా చూస్తూ పోతే, నిర్మాత కళాకారుడయినా, కళ పట్ల అవగాహన వున్నా సినిమా కళగా అభివృద్ధి చెందుతుంది.

అలాకాక కళాకారుడు వేరు అయి, నిర్మాతకు కళపట్ల అవగాహనలేక సినిమా నిర్మాణం కేవలం ఒక వ్యాపార మాధ్యమం అయితే, వ్యాపరం జరుగుతుంది. కళగా సినిమా దెబ్బతింటుంది. తద్వార సమాజమూ నష్టపోతుంది.

కాబట్టి, సినిమాలు ఎవరు తీస్తారు అన్నదానికి వ్యాపారులు అన్న సమాధానం వస్తే, ఎందుకు తీస్తారోకూడా అర్ధమయిపోతుంది. సినిమా నిర్మించేది కళాకారులు అన్న సమాధానం వస్తే, వ్యాపారంతో పాటూ కళకూడా మిళితమయివుంటుందని తెలుస్తుంది.

ఇది సినిమాలు నిర్మించేవారికి ఏవయినా అర్హతలుండాలా, సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే రాజకీయ నాయకులకు అర్హతల అవసరం లేనట్టె, సినిమా నిర్మాతలకూ అవసరం లేదా అన్న చర్చకు దారి తీస్తుంది. 

ఇది భవిష్యత్తులో అనేక ఇతర చర్చలకు కారణం అవుతుంది.

October 21, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.