Archive for October 24, 2008

సినిమా హిట్- ఫార్ములా ఫిట్!

హిట్ సినిమా కు ఫార్ములా ఏమిటి? పూర్వ కాలంలో ఇతర లోహాలను బంగారంలా మార్చాలని అనేకులు తపన పడ్డారు. పరుసవేది కోసం ప్రాణాలే ఇచ్చారు. అలాంటి పరుసవేది లాంటి మంత్రం ఇది. సినిమా తేసేది ప్రజలంతా చూసి మెచ్చటం కోసం. అప్పుడే డబ్బులొస్తాయి. ఇంకో సినిమా తీసి ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. అలాకాక కళాకారుడు తనకు నచ్చినట్టు సినిమా తీస్తే ప్రేక్షకుడు దాన్ని మెచ్చకపోతే ఇంకో సినిమా తీసేందుకు డబ్బులుండవు. అతడిని నమ్మి పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకురారు. కాబట్టి సినీ కళాకారుడికి సినిమా రంగంలో మనుగడ వుండాలంటే హిట్ ఫార్మూలా తెలిసివుండాలి. కానీ ఏ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుందో ఎవారూ కచ్చితంగా చెప్పలేరు. ఇక్కడే సినీ నిర్మాణంలో మజా తెలుస్తుంది. భరించలేని బాధ తెలుస్తుంది.

ఆరంభంలో కళాకారులకీ సమస్య లేదు. అప్పుడు సినిమాలొక వింత. తెరపైన బొమ్మ కదిలితే చాలు, అది అద్భుతం. దాంతో రైలు వచ్చి ఆగటం, పడవ నడవటం, పక్షి ఏగరటం చూపినా ప్రజలు పడీ పడీ చూసేవారు.

మనిషి రొటీన్ భరించలేడు. కొన్నాళ్ళకి కొత్త తీరిన తరువాత ప్రేక్షకులను ఆకర్శించాల్సిన అవసరం కలిగింది. దాంతో ఏదో చిన్న సంఘటనల అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని విదేశీయులు, రైలు దొంగతనాలు, హాస్యాలతో తీర్చుకుంటే మన వారు పౌరాణిక చిత్రాలతో తీర్చుకున్నారు. మాటలు లేకున్నా ఈ కథ అందరికీ అర్ధమయిపోతుంది. పైగా పవిత్ర మయిన భగవంతుని కథలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

కానీ ఇదీ ఎక్కువ కాలం సాగదు. ఆ కాలంలో ఇలాంటి ధార్మిక సినిమాలు ప్రజలలో ధర్మ భావనలను పెంపొందించి దేశభక్తిని జాగృతం చేస్తున్నాయని ప్రభుత్వం ఇలాంటి సినిమాలపైన ఆన్కలు విధించింది. నిర్మాతలను ఇబ్బందుల పాలు చేసింది. ఈలోగా పార్సీ, ఉర్దూ కళాకారులు రంగప్రవేశం చేసారు. చారిత్రికాలు, జానపదాలు మొదలయ్యాయి. ఇదేసమయానికి మరోవైపునుంచి ఆంగ్ల విద్యావంతులయినవారు వారి ప్రభావాన్ని మోసుకువచ్చారు. ఇంకోవైపునుంచి స్వతంత్రోద్యమాన్ని సాంఘిక సంస్కరణలతో ముడిపెట్టటంతో సాంఘికంగా సందేశాన్నిచ్చే సంస్కరణల సినిమాలు మొదలయ్యాయి. కొన్నాళ్ళకి కమ్యూనిజం ఆదర్శంగా సమాజంలో ప్రవేషించింది. దాంతో సాంప్రదాయ వ్యతిరేకత అభ్యుదయం అయ్యింది. ధనికులు మూకుమ్మడిగా విలన్లయ్యారు. పేదరికం హీరోయిజం అయ్యింది. సాంప్రదాయ నిరసన, సాంప్రదాయ ఉల్లంఘన హిట్ ఫార్మూలాల్లో ఒకటయింది.

ఇదే సమయానికి దేశంలో వాతావరణం మత పరమయిన ద్వేషాలతో కలుషితమయింది. ఇది కళాకారులపైన వారు నిర్మించే సినిమాలపయినా పడింది. దాంతో సినిమాలలో మతపరమయిన భావనలను ప్రదర్షించకూడదన్న నియమం ఎవరూ పెట్టకుండానే అమలులోకి వచ్చింది. ఒకవేళ చారిత్రిక సినిమాలు తీసినా అవి మహమ్మదీయుల గొప్పతనాన్ని చెప్పేవిగానే వుండాలని మతపరమయిన భావనలను రెచ్చగొట్టేవిగా వుండకూడదన్న్ నియమమూ మొదలయింది.

ఈ కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే మన సినిమాలు మూసలోకి ఎందుకు పరిమితమయ్యాయో బోధపడుతుంది. మన సినిమాలు కొన్ని ఫార్మూలలకే ఎందుకు కుచించుకుపోయాయో అర్ధమవుతుంది.

సినీ కళాకారుడికి ఫార్మూలా ఎందుకవసరమవుతుందో ముందే అనుకున్నాము. బోలెడన్ని డబ్బులు ఖర్చుపెట్టి ఒక సినిమా నిర్మిస్తాడు. ప్రేక్షకులు దాన్ని మెచ్చకపోతే దివాళా తీస్తాడు. దేన్నయినా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమంటారు. అందుకని సినిమాలో డబ్బులు పోగొట్టుకున్న వారు మళ్ళీ సినిమాల్లోనే సంపాదించాలని చూస్తారు. ఇంతకుముందు తనకు నచ్చినట్టు తీసి భంగపడ్డవాడు, ఇప్పుడు ప్రక్షకులేది మెచ్చుతున్నారో అది తీయాలనుకుంటాడు. విజయం సాధిస్తే అది కొనసాగుతుంది. లేకపోతే, చెప్పేదేమీ వుండడు.

ఇలాంటి పరిస్థితి తప్పించుకోవాలంటే, ప్రేక్షకులు దేన్ని మెచ్చుతున్నారో గమనించాలి. ఇది తెలుసుకోవాలంటే హిట్ అయిన సినిమాలను గమనించటం తప్ప వేరే మార్గంలేదు. హిట్ అయిన సినిమాలో ఏయే అమ్షాలు ప్రజలు మెచ్చారో చూసి ఆయా అమ్షాలనే అనుసరిస్తే ఢోకాలేదనుకుంటారు. అలా ఏర్పడుతుంది ఫార్మూలా. ఈ అనుసరించటానికి మన సినిమాలేకాదు, విదేషీ సినిమాలూ పనికివస్తాయి.

ప్రపంచంలో దేశాలూ, భాషలూ, సంస్కృతులూ వేరయినా మానవ సంవేదనల స్వరూపమొక్కటే. కాబట్టి ఒకచోట సినిమా ప్రజలకు నచ్చిందంటే, దాన్ని దిగుమతిచేస్తే, మిగతా ప్రజలకూ నచ్చేవీలుంటుంది. కాబట్టి, తెలియనిదాంతో ప్రయోగం చేసేకన్నా, ఒక చోట విజయం సాధించిన దాన్నే ఆధారంచేసుకుంటే, మంచిది అనుకుంటారు. ఇలా కాపీలు, అనుకరణలూ మొదలవుతాయి.

మన చలనచిత్ర రంగం ఇలా పనిచేస్తుంది. స్వయంగా ప్రయోగం చేసి దెబ్బ తినేకన్నా నిరూపణ అయిన దానితో పరాచికాలాడటం మేలు అన్నది మనవారి అభిప్రాయం. known devil is better than unknown angel లాంటిదన్నమాట ఇది.

ఇలా safe గా సినిమాలాటలాడాలన్న ఆత్రంలో మనవారు వేరేవారు ప్రయోగాలు చేసి విజయం సాధించేవరకూ ఎదురుచూస్తారు. ఏదయినా విజయం సాధించగానే వెంటనే దాన్ని అనుకరిస్తారు. నకళ్ళకు నకళ్ళు తయారుచేస్తారు. అందుకే మనవారు మన స్థాయిలో విజయం సాధించినా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడున్నారో అక్కడేవుండిపోతున్నారు.

అయితే, ఈ పరిస్థితి ఆరంభమ్నుంచీలేదు. ఆరంభంలో, అక్కడినుంచి ప్రేరణపొందినా కళాకారులు తమదంటూ ప్రత్యేక సృజనాత్మక కళాకౌశలాన్ని ప్రదర్శించేవారు. చక్కగాతీసి ప్రజలను మెప్పించాలని చూసేవారు. అయితే, అనేక అంశాలలో ఇతర దేశాలకూ మనకూ తేడాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అక్షరాస్యత రక్కువ ఇది కూడా మనసినిమాల రూపు రేఖలను అత్యంత బలంగా నిర్దేషించిన విషయాలలో ఒక ప్రధానమయిన విషయం.

మూస సినిమాలేరావటం నుంచి కళాకారుల ప్రేరణ, నిరక్షరాస్యతా ప్రభావం వరకు తదుపరి వ్యాసాలలో చర్చిద్దాం.

October 24, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.