Archive for November, 2008

సినిమాలు చూడవద్దని బ్రహ్మబుధ్ కు ఎవరయినా చెప్పండి బాబో!

బ్రహ్మ బుధ్ కు మన తెలుగు సినిమాలు బాగా వంట పట్టినట్టున్నాయి. చక చకా సినిమాలు చూసేస్తున్నాడు. వాడు సినిమాలు చూస్తే నాకు అభ్యంతరం లేదు. సినిమాలు చూసినవెంటనే నా మెదడులోకి దూరి తలుపులు తన్ని మరీ సందేహాలతో నన్ను చంపుతున్నాడు. సినిమా కథలు వినిపించి, తన విష్లేషణలు తెలిపి చితకబాదుతున్నాడు.

మొన్న ఏదో ఆధ్యాత్మిక భక్తి సినిమా చూశాడట. అంతా వీరుడి మయం, జగమంతా వీరుడి భయం, అని పాడుతూ నన్ను నిద్రలేపాడు. బ్రహ్మ బుధ్ కలిసినప్పటినుంచీ నేను నిద్రపట్టని వ్యాధితో బాహపడుతున్నాను. ఏ సినిమా చూసి ఏ వైపునుంచి వచ్చి చంపుతాడో అన్న భయంతో నిద్ర పట్టటం లేదు. నిద్ర పట్టగానే ప్రత్యక్షమై సినిమా కథలతో నరకం చూపుతున్నాడు.

అందుకే, వాడి పాట వినగానే ఉలిక్కి పడి లేచా. పక పకా నవ్వాడు. ఇప్పుడే వీర భయంకర చిత్ర రాజాన్ని చూశావు? అడిగా భయంగా.

కథ చెపుతా కథ చెపుతా, కథ చెప్పి చెప్పి నిన్ను చంపుతా అంటూ పద్మాసనం వేసుకుని ధ్యాన ముద్రలో కూచున్నాడు.

కాస్సేపటికి గంభీరంగా కళ్ళు తెరిచాడు. కథ చెప్పటం ఆరంభించాడు.

అనగనగా ఒక బ్రహ్మాండమయిన హీరో. ఆ హీరోకొక దుబారా తండ్రి. అందరికీ అన్నాలు పెట్టి ఇల్లు గుల్ల చేస్తూంటాడు. మన వీరుడు, తల్లి బాధ పడుతూంటే లాజిక్ లటుక్కున చచ్చిపోయే ప్రశ్నలడిగి ఆమెకు బుద్ధి చెప్తూంటాడు. మన హీరోకి ఒక మరదలుంటుంది. ఆ మరదలికి ఒక తండ్రి వుంటాడు. వాడు పిచ్చివాడు. వాడికి పిచ్చి శిష్యులుంటారు.

పిచ్చి నేర్పుతారు కూడానా? బుద్ధిగడ్డితిని అడిగా.

మీ నాగరికతలో బ్రాహ్మణులను తెలివైన వారని గౌరవించేవారట కదా? అడిగాడు.

తలవూపా.

ఈ సినిమా చూస్తే అది తప్పు అని అర్ధమయిపోతుంది. గురువుకేమీ రాదు. కనీసం బంధుత్వాలూ తెలియవు. శిష్యులతడిని గౌరవించరు. హేళన చేస్తారు. వెక్కిరిస్తారు. చులకన చేస్తారు. అయినా ఆ తుచ్చ కూష్మాండ పండిత వేష ధారి తన పిచ్చినే పాండిత్యమని భ్రమపెడుతూంటాడు. మన వీరుడు గొప్పగా బుద్ధి చెప్తాడనుకో, అని నవాడు.

ఎలా బుద్ధి చెప్తాడని అడిగే ధైర్యం చేయలేక పోయా.

బ్రహ్మణులు బుద్ధిహీనులు, జోకర్లు అన్న నా సిద్ధాంతాన్ని నిరూపిస్తూ ఇంకొన్ని పాత్రలున్నాయి. ఒక వెర్రి బ్రాహ్మణుడు పెళ్ళిచూపులకని వస్తూ దారిలో అమ్మాయివెంటపడి చెంపదెబ్బ తింటాడు. పెళ్ళి చూపుల్లో ఇంకో బ్రాహ్మణుడు జ్యోతిష్యమంటూ వెకిలిగా ప్రవర్తిస్తాడు. ఒక దుష్టబ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు పిండాలుపెట్టటమే వచ్చని అంటాడు. వాడి దగ్గర వున్న శిష్య బ్రాహ్మణులూ వెకిలిగానే వుంటారు. కాబట్టి నా సిద్ధాంతం నిరూపితమయిపోయింది, అన్నాడు గంభీరంగా.

కాదని వాదిస్తే ఏమి మూదుతుందోనని మౌనంగా వుండిపోయా. మన దేశంలో కులం సున్నితమయిన సమస్య అని బుధగ్రహంవాడికి ఎలా చెప్పి చచ్చేది? ఇంతకీ కథ చెప్పు అనడిగా వాడి దృష్టిని బ్రాహ్మణ సిద్ధాంతం నుంచి మరల్చేందుకు.

ఇంక కథేముంది, వీరుడు నాయికకు ఒక చిలుకను బహుమతిగా ఇస్తాడు. అబ్బ ఎంత గొప్పగా ఇస్తాడనుకున్నావు. చిలకను తెస్తూంటే ఏమో అయిపోతుందనిపించింది. చిలకను క్లోసప్పులో చూపి గిర గిర తిప్పుతూంటే, హీరో నడకను స్లో మోషన్ లో చూపిస్తూంటే నాకు ఆ అర్ధంకాని సీనుకు ఒళ్ళు పొంగిపోయింది.

ఈ క్లొసప్పులు, స్లో మోషన్లేమిటో అర్ధం కాలేదు. చిలక బహుమతిలో గొప్పేమిటో తెలియలేదు. కానీ పండిత సభలో మౌనమే భూషణం కదా!

పక పకా నవ్వాడు బ్రహ్మ బుధ్. చిలకను నాయికకు ఇచ్చే దృష్యం చమత్కారంగా వుంటుంది. నాయిక ఏదో కథ చెప్తూంతుంది. నాయకుడు వస్తాడు. కథ చెప్తూన్న ఆమె జాకెట్ ముడి వదులయిపోతుంది. అబ్బ ఎంత గొప్ప వూహ! మీ భూగ్రహ స్త్రీలు, అంటూ నాకు అర్ధం కాని బుధవరుల పదమేదో వాడాడు.

అమ్మె ముడి వూడటం గమనించదు. కథ చెప్పటంలో తన్మయమయి చెలికత్తెలు వెళ్ళిపోవటం గమనించదు. మీ భూగ్రహ స్త్రీల ఏకాగ్రత ప్రశంశనీయం. ఎవరూ వినకున్న కథ చెప్తారు. కళ్ళు తెరచి వున్నా ఏమీ చూడరు. వీరుడు నాయిక వెనక చేరి ముడి వేస్తాడు. అబ్బ ఎంత గొప్ప చమత్కార భరిత సృంగార సృజననో! తన్మయుడయిపోయాడు బ్రహ్మబుధ్.

బుధగ్రహ వాసికి కనబడిన చమత్కారమూ, శృంగారమూ భూగ్రహ వాసినయిన నాకు కనబడలేదు.

ఆ తరువాత చూడూ నాయకుడు నాయికల పెళ్ళి అవుతుంది. అవునూ శోభనం నాలుగు గదుల నడుమ చేస్తారా, బట్టబయలున ఒక పదిమంది నృత్యం చేస్తూంటే పాట పాడుతూ చేస్తారా? ఇదే నాకు కాస్త అర్ధంకాలేదు. గంభీరంగా అడిగాడు బ్రహ్మ బుధ్.

నీళ్ళు నమిలా. మాట బయటకు రానీయలేదు.

ఇంక నాయకుడు అదే మన వీరుడు ఒక పదవి పొందుతాడు. అదేమిటో. కానీ రాజు కన్నా ఎక్కువ భోగాలు, అధికారాలు అనుభవిస్తాడు. ఇదే కాలానిదో తెల్;ఇయదు కానీ, కమ్యూనిజాలూ, సోషలిజాలూ పాఠాలు చెప్పేస్తాడు. ఇది నచ్చని రివిజనిస్టులు అతడిని చంపాలని చూస్తారు. ఒక అమ్మాయి వెనుకబడుతుంది. ఆమెని చూపిస్తూంటే ఏదో జరుగుతుందనుకుంటాం. ఎంత సస్పెన్స్ సీన్లో. అడవిలో ఆమె నాయకుడి చేయిపట్టిలాగుత్రుంది. వెనకనుంచి కర్రతో వీరుడి తలమీద బాది నీళ్ళలో పడేస్తారు. నిశ్శబ్దమయిపోయాడు బ్రహ్మబుధ్.

అది తుఫానుముందరి ప్రశాంతత ఏమోనని భయపడ్డా.

ఇదే నాకు అర్ధం కాలేదు. అంతవరకూ తెలివిగా వున్న వీరుడు తలమీద దెబ్బ తగలగానే మతి భ్రమించినట్టయిపోతాడు. నీళ్ళలో తేలి తేలి పక్కనే వున్న ఒక ముసలామెకు దొరుకుతాడు. ఇదే నాకు అర్ధం కాలేదు. అంత సేపు నీళ్ళలో తేలినా ఎంతో దూరం ఎందుకని వెళ్ళలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ముసలామె దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళెక్కడున్నారు? వీళ్ళేక్కడున్నారు? ఈ స్పేస్ నా బుర్రకందటంలేదు.

ఇంతకీ వీరుడు పిచ్చోడయి ఏమి చేస్తాడు? అడిగా.

నా వైపు గుడ్లురిమి చూశాడు. పిచ్చోడయి ఏమి చేస్తాడు. పిచ్చిగా ప్రవర్తిస్తాడు. రాయిని దేవుడంటాడు. రాయి తడుస్తోందని తానూ తడుస్తానంటాడు. పిచ్చి పిచ్చిగా పాటలుపాడతాడు. రామ జన్మ భూమి ఉద్యమంలోం వారిలా గుడి కడతానని ఊరూరా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి డబ్బులు వసూలు చేస్తాడు. అయినా సరిపోవు. పిచ్చివాడు కద్దా డబ్బులను వ్యర్ధంచేస్తాడు. కానీ కర్ర దెబ్బలకు పిచ్చివాడయ్యే వీరుడు ఎలాంటి వీరుడా అని ఆలోచిస్తున్నాను.

ఆలోచిస్తూ చాలా సేపు మౌనంగా వున్నాడు. చివరికి అన్నాడు, నా మీసాల వీరుడు అలా రాతివెంటపడి, కర్ర దెబ్బకు ఎలాంటి కారణం లేకుండా పిచ్చోడవటం నాకు నచ్చలేదు. అని లేచిపోయడు.

బ్రతుకు జీవుడా అనుకుని నిద్రకుపక్రమించా. కానీ బ్రహ్మబుధ్ ను అంతగా కలవర పరచిన ఆ చిత్ర రాజమేమిటో నాకు తెలియటంలేదు. మీకయినా తెలిస్తే చెప్పరూ. అప్పుడయినా నాకు నిద్రపడుతుందేమో. అలాగే మీరంతా కలసి సినిమాలు చూడవద్దని బ్రహ్మ బుధ్ కు చెప్పరా! ఆ సినిమా కథలు వింటూంటే నాకు పిచ్చెకుతుందనిపిస్తోంది.

November 23, 2008 · Kasturi Murali Krishna · 10 Comments
Posted in: sinemaa vishleashaNaa.

నేను చదివిన మంచి పుస్తకం-15

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు  an idealist’s view of life అని ఒక పుస్తకం రాశారు. ఆ కాలాంలో ప్రపంచంలో ప్రచలితంలో వున్న అనెక ఆదర్శవాదాలను, హైందవ ఆదర్శాలనూ పోలుస్తూ సమవయంచేస్తూ రచించిన ఆ పుస్తకం ఆ కాలంలో అనేకుల ఆలోచనలను ప్రభావితం చేసింది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. గోపీచంద్, బుచ్చిబాబు వంటి రచయితలు తమపై అమితంగా ప్రభావం చూపిన పుస్తకంగా ఆ పుస్తకాన్ని పేర్కొన్నారు. తాత్వికం కాక పోయినా, ప్రస్తుతం ప్రపంచంలో మనిషి గురించి, విశ్వంలో మనిషి స్థానం గురించి ప్రచారంలో వున్న అనేక సిద్ధాంతాలను, ఆలోచనలను, అనేక మతాలలఒ మనిషి గురించి వున్న సిద్ధాంతాలను, వైఙ్నానిక ద్రుక్పథాలను విశ్లేషించి, కలిపి చర్చించి, సమన్వయపరస్తూ జాన్ గ్రే రచించిన పుస్తకం  straw dogs.

జాన్ గ్రే యూరోపియన్ ఆలోచనల అధ్యాపకుడు. ఈయన తాత్విక అమ్షాలను, సామాజిక, మానిసిక సిద్ధాంతాల ఆధారంగా వివరిస్తూ నూతన ఆలోచనలకు నాందీ ప్రస్తావన చేయటంలో సిద్ధహస్తుడు. ఏయన రచనలలో false dawn అత్యంత ప్రాచుర్యం పొందింది. 12 భాషలలొకి అనువాదితమయింది.

స్ట్రా డాగ్స్ పుస్తక్మ్ పేరు క్రింద  thoughts on humans and other animals అని పుస్తక లక్ష్యం స్పష్టంగా వుంటుంది.

మనిషీ జంతువే అయినా జంతువుల కన్నా వున్నతుడు తాను అన్నది మనిషి నమ్మకం. భగవంతుడు తనను ప్రత్యేకంగా సృష్టించాడనీ, తన జీవితానికి అంతిమ లక్ష్యంవుందనీ మనిషి నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా మతాలు, తత్వాలు, అన్నీ ఏ నమ్మకాల ఆధారంగా ఏర్పడ్డాయి. ఏ నమ్మకాల ఆధారంగా నైతిక విలువలు వెలిసాయి. సామాజిక నియమాలు రూపు దిద్దుకున్నాయి. స్వర్గం, నరకం లాంటి భావనలు రూపొందాయి. మొత్తంగా భగవంతుని అత్యుత్తమ స్ర్ష్టి మనిషి అన్న భావన కేంద్రంగా మనిషి ఆలోచనలు ఎదిగాయి.

ఈ ఆలోచనలను పలువురు పలురకాలుగా ప్రదర్శించారు. ఆలోచిస్తున్నాను కాబట్టే నేను వున్నాను అని ఒకరంటే, ఆలోచనలు లేని నిష్చల స్థితే మహదానంద స్థితి అదే మానవుడి అంతిమ లక్ష్యం అని ఇంకొకరు నమ్మారు. ఆలోచనలను నియంత్రించటమే అత్యున్నతం అని ఒక విశ్వస్శిస్తే, విచ్చలవిది ఆలోచనలే అత్యద్భుతమని ఇంకోకరు భావించారు.

ఇలా విభిన్నమయిన ఆలోచనలు మానవ చింతనలో మనిషి గురించి వ్యక్తమవుతాయి. అయితే, ఇంతకీ మనిషి ఎవరు. ఏ అనంత విశ్వంలో మానవుది పాత్ర ఏమితి? నిజంగా భగవంతుదు, స్వర్గ నరకాలు, నీతి నియమాలు, పరమానంద స్థితిలాంతివి వున్నాయా?

ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ, విభిన్న ఆలోచనలను విశదపరుస్తూ, నిగూఢమయిన తాత్విక చింతనలను తేట తెల్లం చేస్తూ, తార్కికంగా, సహేతుకంగా తన వాదననీ పుస్తకంలో పొందుపరచాడు జాన్ గ్రే.

మనిషి సృష్టికి కేంద్రం అన్నది క్రీశ్టియన్లనీ దానివల్ల మానవ సమాజం ఎంతగా భీభత్స మయిపోయిందో నిరూపిస్తాదు. బఔద్ధ, హైందవ, టఒ, తో సహా అనేక తత్వవేతాల సిద్ధాంతాలను విశ్లేషిస్తాడు. స్పినోజా, షోపెణాయిర్, దెకార్తే, అరిస్టాటిల్, ప్లాటో ల ఆలోచనలను పరిచయం చేస్తూ వివరిస్తాడు. క్రీస్టియన్ మతం బోధించిన ఆలోచన వల్ల మానవుది rational ద్రుక్పథం ఎలా వికృతమయిందో వివ్వరిస్తాడు. అలాగే, బుద్ధుది ఆలోచనలెలా మనిషిని సంతృప్తి పరచలేవో నిరూపిస్తాడు. తత్వ వేత్తల ఆలోచనలలో లోపాలను, వారి ఆలోచనా రీతులపైన ప్రభావాలను చర్చిస్తాడు.ఈ పుస్తకం ద్వారా జాన్ గ్రే మనిషి జంతువేననీ ఏమాత్రం భిన్నం కాడనీ నిరూపిస్తాదు. మనిషికి ప్రత్యేకమయిన ఆత్మ శక్తి వుందనీ, ఇచ్చా శక్తి వుందనీ అనుకోవటం అహంకారమని చూపిస్తాడు. మనిషి తాను సృష్టించుకున్న నైతిక విలువల ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడో వివరిస్తాడు. అంతేకాదు, ఎవరో ప్రవక్తలు రక్షించటం, ముక్తి, మోక్షం లాంటి భావనలను ఖండిస్తాడు. సాంకేతిక పరిఙ్నానం ఎలా అమ్నిషిని అసంతృప్తిలోకి నెడుతూ అతది జంతు ప్రవృత్తిని ప్రకోపిస్తోందో చూపిస్తాడు.

2002 లో రచించిన ఈ పుస్తకంలో ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అనేక సమస్యలు, వాటికి కారణాలు వివరిస్తాడు. ముఖ్యంగా ఆర్ధిక సన్కోభాన్ని ఊహించి వివరిస్తాడు. అది ఇప్పుదు నిజమయింది. ఇలా అంతులేని ఆలోచనలను రేకెత్తిస్తూ, వివిధ సిద్ద్ధాంతాలను ఆలోచనా విధానాలను వివరైస్తూ సాగే ఈ పుస్తకం అత్యంత ఆసక్తికరంగా వుంటుంది. ఒక కాల్పనికేతర రచన, అదీ క్లిష్టమయిన ఆలోచనలను వివీరించేరచన చదువుతున్నామన్న భావన కలగదు. మంచి సస్పెన్స్ రచన చదువుతున్నాతూ వుంతుంది. రచయిత ఆలోచనలతో మనం ఏకీభవించకపోయినా అతని ఆలోచనల లోతు మనల్ని మెప్పిస్తుంది. వాటిని ప్రదర్శించిన తీరు అలరిస్తుంది. అందుకే  ఇది అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితాలో చేరుతుంది. మానవుడి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుందీ పుస్తకం.

ఈ పుస్తకం పేరు గురించిన వివరణ కూడా వుంది.

చైనీయులు ఒక పండుగలో గడ్డితో కుక్కలను చేస్తారు. ఆ కుక్కలను దైవంలా భావించి గఔరవిస్తారు. పూజిస్తారు. పూజలయిన తరువాత పక్కన పారేస్తారు. పట్టించుకోరు. ఈ విశ్వంలో మనిషీ అలాంటి గడ్డికుక్కలలాంటి వాడంటాడు రచయిత.

ఈ విశ్వం జీవమున్న జీవిలాంటిదని, మనిషి వల్ల ఏమాత్రం నష్టం కలిగినా మనిషిని పక్కకునెట్టి ముందుకు సాగిపోతుందన్నది రచయిత అభిప్రాయం. ప్రకృతి మనిషి కోసం వున్నదని, జంతువులు మనిషికన్న తక్కువానుకోవటం పొరపాటన్నది రచయిత నమ్మకం. తానే సృష్టి కేంద్ర అనుకోవటం మనిషి అహంకారని, ఇతర జీవుల్లంటివాడే మనిషని ఈ పుస్తకంలో తన వాదనద్వారా నిరూపిస్తాడు రచయిత.

2002లో granta books ఈ పుస్తకాన్ని ప్రచురించింది. వెల 12.99 పౌండ్లు.

November 22, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

ఉఫ్ఫ్ కిత్నీ ఠండీ హై – చలి పాటలు.

ఇంకో గంటలో నాందేడ్ వెళ్ళే రైలు ఎక్కాలి. అదేమిటో ఆఫీసులో సమయం గడవదు. ఇంట్లో సమయం నిలవదు. కన్ను మూసి తెరిచేలోగా కాలం కరగిపోతూంటుంది. శని వారం వచ్చా. ఇంకా విశ్రాంతి తీసుకున్నట్టే లేదు అప్పుడే మళ్ళీ రైలెక్కే సమయం దగ్గరపడింది.

బయలుదేరే సమయం దగ్గర పదుతున్నకొద్దీ అదేదో గుబులు గుండెలో. వెళ్ళాలనిపించదు. వెళ్ళకతప్పదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆర్డరు ఏ క్షణాంలో నయినా రావచ్చు. రాగానే పరుగెత్తుకుంటూ వచ్చేయవచ్చు. అందుకని అతి అయిష్టంగా తయారవుతున్నా.

నేను చిన్నప్పుదు బడికి వెళ్ళేఅందుకుకూడా ఇంతగా బాధ పెట్టలేదని అమ్మ ఏడిపిస్తోంది. అవును, బడికి వెళ్ళేఅందుకు ఎందుకేడుస్తాను, మా అమ్మే టీచర్ కదా. అమ్మతో వెళ్ళేఅవాడిని. అమ్మతో వచ్చేవాడిని. బడి ఇంటికి extension లా వుండేది. కానీ, నాందేడ్ నరకానికి extension.

బయట చాలా చల్లగా వుంది. ఎంత చల్లగా అంటే నాకు నా హిమాలయాల ట్రెక్కింగ్ గుర్తుకు వస్తోంది. కానీ అది ఆనందకరమయిన అనుభవాలు. ఇది కాదు.

మనసుకు నచ్చని పనులు చేసేటప్పుదు, నచ్చిన పనులను స్మరించాలంటారు. దాంతో మనసు మళ్ళుతుంది. అయిష్టమయిన పనులు ఇష్టమయిన ఆలోచనలతో చేసేస్తాము. అందుకే నా మనసును చలి పాటలవైపు మళ్ళించాను. అప్పుడో విషయం గమనించా.

మన సినిమాలు వాన కిచ్చిన ప్రాధాన్యం చలికి ఇవ్వలేదు. వానపాటలనగానే వెంటనే వెయ్యి గుర్తుకువస్తాయి. చలి అనగానే ఒక్క సారి మెదడు గడ్డకట్టినట్టయింది. బొటాబొటీగా పాటలు గుర్తుకువస్తున్నాయి.

ఠండీహవాయే అన్న సాహిర్ గీతం ఝల్లుమనిపించింది.

ఠండి హవా కాలిఘటా అన్న మజ్రూహ్ గీతం, ఠండి హవా కాలిఘటా అన్న సాహిర్ గీతాలు రెండూ గుర్తుకువచ్చాయి.

ఠండి ఠండి హవామె దిల్ లల్చాయ్, హాయే జవానీ దీవానీ అన్న శంకర్ జైకిషన్ breezee పాట గుర్తుకువచ్చింది.

ఠండి హవా యె చాంద్నీ సుహానీ అంటూ తెల్లారే కిషోర్ కుమార్ మాధుర్యాన్ని చిలికించాడు.

ఠండే ఠందే పానీసే నహానా చాహియే అంటూ మహేంద్ర కపూర్ ఉచిత సలహా పారేశాడు. ఆయనదేం పోయింది, వణుకుతూ స్నానం చేయాల్సింది నేనుకదా!

ఇంతలో ఒక అధ్బుతమయిన అసలు చలిపాట గుర్తుకువచ్చింది.తీన్ దేవియా అనే సినిమాలో సిమి, దేవానంద్ లు చలికి వణుకుతూ ఉఫ్ఫ్ కిత్నీ ఠందీ హై నరం, సుంతీ హై తణాయీ మెరీ, సంగ్ సంగ్ జల్తా హై బదన్, కాంపేహై అంగ్డాయీ మెరీ అంటూ లతా, కిషోర్ ల గొంతులో నిజంగా చలికి వణకుతున్నాట్టే పాడతారు. నిజానికి మిగతా అన్ని పాటల్లో చలి అన్న పదం ఉన్నా, నిజంగా చలి ఉన్నదీపాటలోనే. చలికి వణుకుతూ నాయికా నాయకులు హత్తుకుపోతూంటే గాయనీ గాయకులు intimate conversation లా పాట పాడుతూంటే వింటూంటేనే చలిగా, మధురంగా వుంటుంది. దుప్పటి కప్పుకుని వెచ్చగా వినాల్సిన పాట ఇది.

అయితే నిజంగా వణుకు పుట్టించేపాట చలి చలిగా వుందిరా హొయ్ రామా హొయ్ రామా అన్నది.

ఈ పాట గుర్తుకురాగానే చలి పెరిగిపోయింది. మెదడులోంచి పాటలెగిరిపోయాయి. ఎగురుతూన్న ఎంటీరామారావు గుర్తుకువచ్చాడు. ఖతం పరుగెత్తాలని గుర్తుకువచ్చింది.

కానీ, గమనిస్తే, మన సినిమాలవారు ఎంతో romantic, erotic అయిన చలిపయిన శీతకన్నేశారనిపిస్తుంది. లేకపోతే వానపైన అన్నిపాటలుంది అసలయిన చలిపాటనొకదాన్నే సృజించటం చలికి అన్యాయమేకదా!

ఈ ఆలోచనతో నాందేడ్ వెళ్తున్నాను. అక్కడ వీలు చిక్కితే మళ్ళీ కలుస్తాను. లేకపోతే….ఖుదా ఆప్సే కిసీ దిన్ మిలాయే, బహుత్ షుక్రియా బడీ మెహెర్బానీ!

November 17, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

కత్తి మీద సుత్తి- బ్లాగుల్లో ఇంత భాగోతం జరుగుతోందా!

జీ మైల్ లో ఒక మైల్ వచ్చింది. అది చూసిన తరువాతే ఈ విషయం నాకు తెలిసింది. ఏదో నా రాతలు రాసుకోవటం, ఆసక్తిగా అనిపించిన ఇతరుల రాతలు చూడటానికే పరిమితమయిన నేను బ్లాగుల్లో ఇంత భాగోతం జరుగుతోందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆతరువాత ఆనందం కలిగింది.

భవిష్యత్తులో జర్నలిజం అన్నది బ్లాగుల్లోనే వుంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. పత్రికా జర్నలిజం అనేక కారణాలవల్ల credibility కోల్పోతోంది. ఇంకా మన దేశంలో internet connetivity ఎక్కువగా లేదు. నెట్ గురించి అందరికీ అంతగా తెలియదు. ఇప్పుదిప్పుడే పత్రికలు కూదా బ్లాగులకు ప్రచారం ఇస్తున్నాయి. పాముకు పాలు పోస్తున్నారని వారికింకా తెలియటంలేదు. ఇలా అనేక కారణాలవల్ల నెట్ ప్రస్తుతం విద్యావంతులకు ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో వారికీ పరిమితమవుతోంది. కానీ ఎలా కాలం ఈ పరిస్థితి ఇలానే వుండదు. భవిష్యత్తులో దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక బ్లాగుంతుందనీ, ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలనూ, అనుభవాలనూ బ్లాగుల్లో అందరితో పంచుకుంటారనీ అనిపిస్తుంది. సమాచారంకోసం మీడియాపైన ఆధారపడటమూ తగ్గుతుందనిపిస్తుంది. అమెరికా ఎన్నికలలో బ్లాగుల ప్రధాన పాత్ర గమనించిన వారికి త్వరలో మనము ఎలా మారతామో ఊహించే వీలు కలుగుతుంది.

మన దగ్గర ఇంకా బ్లాగులు ఆరంభ దశలోనే వున్నాయి. సాగర మథనం ఇంకా పూర్తిగా ఆరంభం కాలేదు. ఈ తిలి దసలో సంభవించే అనేక పరిణామాలు భవిష్యత్తులో స్థిరపడబోయే అనేక సాంప్రదాయాలకు బీజాలవుతాయి. కాబట్టి బ్లాగులో కత్తికీ సుత్తికీ నడుమ జరుగుతున్న పారడీ యుద్ధం, దానికి ఇతర బ్లాగర్ల స్పందన ఒక శుభపరిణామం.

అందరికీ తెలిసినా మరో సారి చెప్తాను. ఎవరి బ్లాగుకు వారే సుమన్.

తన బ్లాగులో తనకు నచ్చిన సోది బ్లాగరు రాసుకుంటాడు. ఇష్
టమున్న వారు చూస్తారు. లేని వారు చూడరు. ఎవరికయినా రాతవల్ల బాధ కలిగితే వ్యాఖ్య ద్వార వ్యక్త పరుస్తాడు. లేకపోతే తన బ్లాగులో ఆ బాధను వెళ్ళగ్రక్కుకుంటాడు. కాబట్టి కత్తి రాతలు కానీ సుత్తి రాతలు కానీ కాదనే వీలు లేదు. ఎవరి బ్లాగు వారిది. ఎవరి రాతలు వారివి. ఎవరి రాసే సమయం వారిది. చదివేవారి ఇష్టం చదివేవారిది.

ఎంవీఆర్ శాస్త్రి గారు మన మహాత్ముదు పుస్తం రాశారు. అవి వారి అభిప్రాయాలు. నాకు బాధ కలిగింది. నా బాధ నేను నా బ్లాగులో రాసుకున్నాను. వ్యాసాలింకా పూర్తి కాలేదు. చదివి నచ్చినవారు మెచ్చారు. నచ్చని వారు మెచ్చలేదు. అంతేకానీ, ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాన్ని విమర్సిస్తూ రాయవద్దని ఎవరూ అనలేదు. అన్నా నేను ఒప్పుకోను.

ఇది కత్తికీ వర్తిస్తుంది. సుత్తికీ వర్తిస్తుంది.

ఇక్కడ కత్తి గర్వించాలి. మరో వ్యక్తికి ప్రేరణనిచ్చి అతడిలోని పాండిత్యాన్ని, ఆలోచనలను వ్యక్తం చేసేందుకు కారణమవుతున్నందుకు కత్తి సంతోశించాలి. అలా ఎవరికయినా నా వల్ల ప్రేరణ కలిగితే నేనెనెతో ఆనందించివుండేవాడిని. ఎందుకంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక బ్లాగే వచ్చిందంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. చాప్లిన్ the great dictator సినిమాలో హిట్లర్ ను వ్యంగ్యం చేసాడు. శ్రీశ్రీని ఎంతో మంది టార్గెట్ చేశారు. మహాత్మ గాంధీని ఏనాటికీ వ్యంగ్యం చేస్తూనే వున్నారు. ఆర్నల్డ్ శ్వార్జెనెగ్గెర్ ను వ్యంగ్యంగా అనుకరించారు. ఎంటీయార్, నాగేశ్వర్ రావు లతో సహా అనేకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. కృష్ణ రామారావుమీద సినిమా తీశాడు. అలా కత్తిని టార్గెట్ చేస్తూ బ్లాగు వెలియడం అంత గొప్ప విషయం. కత్తికి నా హృదయ పూర్వక అభినందనలు. అంత భాగ్యం నాకు కలగనందుకు ఒకింత అసూయ కూడా అభినందనలో కలిసి వుంది.మనలను ఎవరయినా విమర్సితున్నారంటే అర్ధం మనం సరయిన దారిలో వున్నామని. వారి మనసులో ఏదో సున్నితమయిన భావాన్ని మనం మూలాలలో తాకామని అర్ధం. కాబట్టి ఎవరేమన్న మనం నమ్మినదాన్ని చేస్తూ పోవాలి. రాస్తూ పోవాలి. అలల తాకిడికి కదిలేది ఇసుక. పర్వతం కాదు.

సుత్తి గారికి జోహార్లు. ఆయన వాదనాపతిమ, పాండిత్యం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు. సనాతన ధర్మం పట్ల ఆయన గౌరవం వ్యక్తిగతంగా ఆయనను నాకు ప్రీతి పాతృడిని చేస్తాయి. ఎందుకంటే, నేనూ సనాతన ధర్మాన్ని నమ్మేవాడినే. భారతీయ విలువల గొప్ప తనన్న్ని, భారతీయ జీవన విధానం, విలువల ఔన్నత్యాన్ని నా రచనల ద్వారా పదిమందికీ ప్రదర్శించటమే ధ్యేయంగా రచనలు చేస్తున్నవాడిని కాబట్టి సుత్తి రాతలు నాకు ఒట్టి సుత్తిరాతలు కావు. నా ఆలోచనలు నమ్మకాలకు అక్షర రూపాలు.

అయితే, సుత్తికి నాదొక సలహా. వ్యక్తి అశాశ్వతం. వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవటం వల్ల మన లక్ష్యాన్ని నిర్వీర్యం చేసినవారమవుతాము. ఒక వ్యక్తి కారణంగా ఒక బ్లాగును ఆరంభించిన మీరు మీ దృష్టిని ఆ వ్యక్తిపైన కాక, ఆ వ్యక్తి ప్రాతినిధ్యం వహించే భావ జాలానికి మూల కారణమయిన సామాజిక మనస్తత్వంలోని లోపాలను వెతికి పట్టుకుని, వాటిని తొలగించి, నిజానిజాలు వివరించే రీతిలో మీ సృజనాత్మకతనూ, పాండిత్యాన్ని ఉపయోగిస్తే మీకే కాదు, సనాతన ధర్మానికీ ఎంతో లాభంగా వుంటుంది.

వ్యక్తి గత దూశణ సంకుచితం. సంకుచితం వల్ల కలిగే లాభమూ సంకుచితమే. భారతీయ ధర్మ అనతమూ, శాశ్వతమూ అయిన వాటినే వాంచిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తినో, ఒక చర్యనో కాక మూలాలఓకి వెళ్ళండి. ఆలోచనలను తార్కికంగా ఖండించండి. నిజాన్ని నొరూపించండి. వ్యక్తిగతానికి ప్రతి స్పందించడంవల్ల మీరు, మీరు ప్రతిబింబించే భావాలూ నష్టపోతారని గమనించండి.

బోఉద్ధాన్ని ఖండించిన శంకారాచార్యులు బుద్ధుడిని దేవుడిని చేశారు. క్రయిస్తవులను ఖండించిన వివేకానందులవారు క్రీస్తు ఔన్నత్యాన్ని అంగీకరించారు. బహిరంగంగా ప్రకటించారు. బ్రిటీషువారి అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీ బ్రిటీషువారిని ప్రేమించారు. ఆదరించారు. ఇదీ మన ప్రాచీన సాంప్రదాయం. ఎప్పుడయితే దృష్టి సంకుచితమయి వ్యక్తిగతమవుతుందో అప్పుడే అనంతవిషాలత్వం గుప్పెటలో ఇమిడిపోతుంది. కాబట్టి కత్తికి ప్రతిస్పందన బదులు , కత్తి వాదన ఖండనల బదులు మీ వాదనను ఎవరికో ప్రతిస్పందనలా కాక స్వతంత్ర్యంగా వినిపించండి. కత్తి వాదనలోని ఉత్తమ అంశాలను స్వీకరించండి. సామాజిక మనస్తత్వాన్ని గ్రహించండి. క్షీర నీర న్యాయాన్ని పాటించండి. సూర్యుడి వెలుతురును పరావర్తనం చేసే చంద్రుడు ఎల్లప్పటికీ సూర్యుడిమీదే ఆధారపడివుంటాడు. స్వీయ ప్రతిభకల మీరు కత్తికి చంద్రుడిగా మిగిలిపోకండి. కత్తి కత్తే. మీరు మీరే.

వినదగు నెవ్వరు చెప్పిన. వినినతనె వేగ పడక వివరించదగున్.

వివరించండి. విమర్శించకండి. విమర్శవల్ల ఆవేషాలు పెరుగుతాయి. వాదన పెరుగుతుంది. విచక్షణ నషిస్తుంది. మనిషికి ప్రాణం విచక్షణ. కాబట్టి వివేచనతో విచక్షణతో  ఎంచుకున్న లక్ష్య సాధనవైపు ప్రయాణించంది.అప్పుడు ప్రపంచం మీ మాటను మన్నిస్తుంది. మిమ్మల్ని గౌరవిస్తుంది.

బ్లాగరులమంతా విద్యావంతులం. బ్లాగు బహిరంగమయినా వ్యక్తిగతమే. ఇది రాయండి , ఇది రాయకండి అని ఎవరూ ఎవరిపైన ఆమ్కలు పెట్టనవసరంలేదు. రాసేవారి విచక్షణ రాసేవారిది. చదివేవారి విచక్షణ చదివేవారిది.

ప్రజలంతా విద్యావంతులయి, విఙ్నాలవంతులయితే సమాజం ఎలా వుంటుందో బ్లాగ్లోకం చూపించాలి. ఇది ఒక పండితుల సభలాంటిది. భావితరాలకు ప్రామాణికాలేర్పరచాల్సింది మనమే. బ్లాగరులంతా తమ ఈ చారిత్రిక బాధ్యత గుర్తించాలి. అప్పుడు కత్తి సుత్తి వేర్వేరుగాకాదు, కలసి జంట రచనలు చేస్తారు.

November 15, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నా బ్లాగుకు చలికాలం వచ్చింది!

అన్ని కాలాలలోకీ చలి కాలాం అంత్యంత సుఖవంతమయినది. అందమయినది. అంతా చల్లగా వుంటుంది. వెచ్చగా దుప్పటి కప్పుకుని, ఇంకా వెచ్చగా మంచంపై ముసుగుతన్ని, వేడి వేడి వస్తువులు, సెగలు పొగలు కక్కే కాఫీలు మంచం మీదకే వచ్చి అందుతూంటే స్వర్గం చలికాలం లోనే వుందనిపిస్తుంది. ఇక రాత్రిళ్ళు బయటకు వస్తే అంతా మల్లెలు పరచినట్టు వెన్నెల, ఆకాశంలో జాబిల్లి, ఆహా, శారదరాత్రులుజ్జ్వల లసత్తర హారపంక్తులు చారుతరంబులై, మదిలో మెదలుతూ ఎదురుగా కనిపిస్తూంటే చలి కాలమంత అందమయినది ఇంకొకటి లేదనిపిస్తుంది. ఉదయం లేవగానే అంతా పొగమంచుతో నింది, కొద్దిగా కొద్దిగా కరగుతూ, అద్భుతమగా వుంటుంది. అందుకే చలికాలం వెళ్తే హిమాలయాల అసలు సౌందర్యం చూడవచ్చని కొన్నేళ్ళక్రితం హిమాలయాలను దర్శించి గుండెనొండా ఆ దృష్యాలను నింపుకువచ్చాను. ఇప్పుడు అలాంటి చలికాలం నా బ్లాగుకూ వచ్చింది.

నేను మళ్ళీ నాందేడ్ వెళ్తున్నాను. ఈ సారి పర్మెనెంటుగా సికిందెరాబాదుకు బదిలీ అయి వస్తానొక రెండు వారాలలోగా. అంతవరకూ నా బ్లాగు వెచ్చగా కలలుకంటూ ముసుగుతన్నుతుంది. ఈ మధ్యలో వీలున్నప్పుడు పోస్టుతాను. అందరూ మన్నించి ఆదరించాలని ప్రార్ధన.

నేనెంతూ దూరం పోవటంలేదు. నన్ను మరచిపోవద్దు. త్వరలో వస్తాను. మేరా నాం జోకర్ లో రాజ్ కపూర్ లాగా, జాయియేగా నహీ షో ఖతం నహీ హువా అంటూ, భారమయిన గుండెతో, ఆశలు నిందిన కళ్ళతో నాందేడ్ వెళ్తున్నాను.

మై వాపస్ ఆవుంగా, యె వాదా హై మెరా, జారహాహూ మై యహా జాన్ అప్ని చోడ్ కే!

November 13, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా-బీ ఆర్ చోప్రా కు శ్రద్ధాంజలి!

అది హీరోలను తప్ప నిర్మాతలను గమనించే వయసు కాదు. అలాంటి వయసులో కూడా బీ ఆర్ చోప్రా నా దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆయన పట్ల నాకు ఆకర్షణ కలగటానికి ప్రధాన కారణం సాహిర్ లూధియానవీ అంటే నాకున్న అభిమానం.

సాహిర్ లూధియానవీ ఎంత గొప్ప గేయ రచయితనో అంతకన్న గొప్ప కవి. ఇంకా గొప్ప అహంకారి. ఆయన అహంకారం గురించిన కథలు చదువుతూ, ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించే సగటు మనుషులను చూసి నవ్వుకుంటూండేవాడిని. నేను అభిమానించే విశ్వనాథ శత్యనారాయణను కూడా అహంకారే అని ముద్ర వేశారు.

సాహిర్ పాటలు విని, అనేక భావాల ఆకాశాలలో తేలుతున్న నేను ఒక పత్రికలో ఒక సంఘటన చదివాను. సాధన అనే సినిమాలో ఔరత్ నే జనం దియా మర్దోంకో, మర్దోనే ఉసె బాజార్ దియా, జబ్ జీ చాహా మచ్లా కుస్లా, జబ్ జీ చాహా ధుత్కార్ దియా, అనే అద్భుతమయిన పాట వుంది. దాన్ని పాడింది లతా. రాసింది సాహిర్. ఆ పాట అద్భుతంగా పాడినందుకు ఆ సినిమా నిర్మాత లతాకు పూల గుత్తులుచ్చాడట అబినందనగా. ఆరోజు అర్ధరాత్రి సాహిర్, ఆ నిర్మాతకు ఫోను చేసి, గానే వాలీకో గుల్దస్తా పేష్ కర్తేహో, వో గానేకా లవ్జ్ కిస్కిథీ? అని నిలదీసి ప్రశ్నించాడట.  పాట పాడినామేకు పూలగుత్తులిస్తావు, ఆ పాటలో ఆమె పాడిన పదాలు రాసిందెవరు? అని నిర్మాతను నిలదీసిన రచయితను మన్నించటమేకాకుండా మరుసటి రోజు సన్మానించాడట ఆ నిర్మాత. అంతేకాదు, లతా కన్న ఒక్క రూపాయి ఎక్కువిస్తేనే పాటలు రాస్తానని సాహిర్ పట్టుపడితే, రచయితకు పెద్ద పీటవేసి సత్కరినిచినవాడూ ఆ నిర్మాతే. సాహిర్ కు సంగీత దర్శకుడు నచ్చకపోతే సంగీత దర్శకుడిని మార్చేసేంతగా మన్నననిచ్చినవాడా నిర్మాత. నయా దౌర్ లాంటి సూపర్ హిట్ పాటల తరువాత ఓ పీ నయ్యర్ కూ సాహిర్ కూ మధ్య భేదాభిప్రాయం వచ్చింది. దాంతో తరువాత సినిమాలకు సంగీత దర్శకుడిని మార్చేశాడా నిరామాత. సాహిర్ కు అవితో కుదిరిందని రవిని పర్మనెంట్ సంగీత దర్శకుడిని చేసుకున్నాడు ఆ నిర్మాత. ఒక రచైతకు ఇంతగా మన్నననిచ్చి, గౌరవించి ఆదరించిన ఆ నిర్మాత నన్ను ఎంతగానో ఆకర్షించాడు. అప్పుదు అతగాడి సినిమాలను గమనించటం మొదలుపెట్టాను. అందువల్ల నాకు ఒక సత్యం బోధపడింది. ఒక సినిమా నాణ్యత అందులోని కళాకారులపైన ఆధారపడివుండదు. ఆ సినిమాను నిర్మించే నిర్మాత అభిరుచిపైన ఆధారపడి వుంటుంది. నాకీ సత్యం అర్ధమయ్యేట్టు చేసిన ఆ నిర్మాత బీ ఆర్ చోప్రా!

బీ ఆర్ చోప్రా సినిమాలలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది సమాజానికి ఉత్తమమయిన రీతిలో ఉన్నతమయిన సందేశం ఇవ్వాలన్న తపన కనిపిస్తుంది.

నయాదౌర్ సినిమా కథను ఎవ్వరూ సినిమాకు సరిపోయే కథగా భావించరు. టాంగా వాడు, మోటారుతో పోటీ పడటాన్ని ఒప్పుకోరు. కానీ ఏ కథను ఆధునికానికి, ప్రాచీనానికి నడుమ పోటీలా మార్చి, ఆధునిక యాంత్రిక అభివృద్ధి ఆహ్వానించ దగ్గదే అయినా దాని వల్ల సామాన్యుల జీవితాలకు కష్టం కలగకూడదన్న ఆలోచనను అత్యంత హృద్యంగా ప్రదర్శించటం ఈ సినిమాలో చూడవచ్చు. ముఖ్యంగా సాథీ హాథ బఢానా పాటలో సాహిర్ నిర్మాత సందేశాన్ని స్పష్టంగా ప్రకటిస్తాడు. బహుషా అందుకేనేమో చోప్రా ఎవరినయినా వదులుకున్నాడుకానీ సాహిర్ను వదలుకోలేదు. ఇదే సినిమాలో మరో పాట ఆనా హైతొ ఆ రాహమె కుచ్ ఫేర్ నహీ హై తాత్వికంగా పరమాద్భుతమయినది. సాహిర్ లోని రచయితకు రెక్కలనివ్వటం ద్వారా ఉత్తమ సినిమాకు పెద్దపీట వేయటం, తద్వారా నిర్మాతగా, పౌరుడిగా లాభ పడటం కనిపిస్తుంది.

సాధారణంగా అన్ని రంగాలలో రచయితంటే అంద్రరికీ చిన్న చూపు. రచయిత పెన్ను పేపరు మీద పెట్టందే పనిగడవదు కానీ రచయితకు ఇచ్చేందుకు డబ్బులుండవెవరిదగ్గరా. రచయితకు స్వేచ్చ నివ్వరు. ఏమీ తెలియనివారు కూడా నిర్మాతలయిపోగానే రచయితలకు సలహాలు సూచనలు ఇస్తూంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒక రచయితకింత స్వేచ్చ గౌరవం మన్ననలిచ్చిన నిర్మాత సంస్కారానికి జోహార్లర్పించక తప్పదు. ఈ ఉత్తమ సంస్కారం బీ ఆర్ చోప్రా ప్రతి సినిమాలో కనిపిస్తుంది.

ధర్తీపుత్ర లాంటి  సినిమా   తీయాలంటే ఎంతో ధైర్యం వుండాలి. యే కిస్క లహూ హై కౌన్ మరా అని ప్రస్నించాలంటే ఎంతో తెగువ వుండాలి. ఇదే సినిమాలో మై జబ్ భి అకెలీ హోతీహూ పాట అత్యుత్తమమయినది. ఇదే సూటిగా ప్రశ్నించే తత్వం ధూల్ క ఫూల్ లో కూడా కనిపిస్తుంది. తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా, ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా అన్న సాహిర్ పాట, దేశ విభజన సమయంలో లాహోర్ లో అన్నీ వదలిన బీ ఆర్ చోప్రా మనసులో మాటనే కాదు, పాకిస్తాను వెళ్ళి అక్కడ వుండలేక తిరిగివచ్చిన సాహిర్ హృదయ వేదనకు ప్రతిబింబం కూడా. తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తాహూ సాహిర్ ప్రేమ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

గూమ్రాహ సినిమాలో వైవాహిక జీవితం లోని లక్ష్మణ రేఖను సమాజానికి గుర్తు చేయాలన్న తపన కనిపిస్తుంది.అన్ని బంధనాలనూ తెంచుకోవాలని ఆత్ర పడుతున్న సమాజాన్ని ఒక్క నిమిషం ఆగి ఆలోచించమని హెచ్చరించటం కనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా సాహిర్ కలం విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇన్ ణవావోమె, యే హవా, చలో ఇక్ బార్, ఆప్ ఆయి ఒకో పాటా ఆణిముత్యం.

ఆత్మ విశ్వాసానికీ అంధ విశ్వాసానికీ మధ్య సంఘర్షణ వక్త్ సినిమా. ఏ సినిమాలో కూడా సాహిర్ కలం చిలకరించిన గేయాలు పరమాధ్భుతమయినవి, వక్త్ సే దిన్ ఔర్ రాత్, కౌన్ ఆయా, దిన్ హై బహార్ కే, ఒకటేమిటి ప్రతి పాటా ఒకఓ అద్భుతం. సాహిర్ జీవిత తత్వానికి దర్పణం ఆగే భీ జానే న తుం పాట.

ఇక్కడే చోప్రా మనస్తత్వంలో మరో కోణాన్ని మనం చూడవచ్చు. తూ హిందు బనేగా పాట రికార్డింగ్ కు రఫీ ఆలస్యంగా వాచ్చాడు. దాంతో రఫీని తొలగించి మహేంద్రకపూర్ కు అవకాశమిచ్చాడు చోప్రా. వారి అనుబంధం చివరి వరకూ కోనసాగింది.

ధుంద్ సినిమా చోప్రా సినిమాలకు భిన్నమయినది. ఇక్కడా సాహిర్, రవి, మహేంద్ర కపూర్ ల మాజిక్ కనిపిస్తుంది. అయితే ఇన్సాఫ్ కా తరాజూ సినిమాతో చోప్రా సినిమాలలో ఆత్మ లోపించింది. సాహిర్ మరణ ప్రభావం చోప్రా సినిమాలపైన వాటి నాణ్యత పైన పడింది. అందుకే చొపరా అత్యుత్తమ చిత్రాలన్నీ సాహిర్ జీవిత కాలంలోనే నిర్మించినవి. నికాహ్ హిట్ అయినా చోప్రా స్థాయిలో లేని సినిమా అది.

నిర్మాతకు ఉత్తమ అభిరుచి వుంటే, తన సామాజిక బాధ్యత పైన గ్రహింపు వుంటే అతని సినిమాలెలావుంటాయంటే చోప్రా సినిమాలలావుంటాయనవచ్చు.

మన చలన చిత్ర రంగంలో మరో బీ ఆర్ చోప్రా లాంటి నిర్మాత వస్తాడన్న ఆశ లేదు. ఎందుకంటే, మరో సాహిర్ కూడా మళ్ళీ మళ్ళీ రాడు కదా! సాహిర్ రహిత చోప్రా సినిమాలు ఆత్మ రహిత శరీరంవంటివి.

November 10, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.