Archive for December, 2008

హాపీ న్యూ ఇయర్ టు ఆల్ !

కొత్త సంవత్సరం పరుగు పరుగున వచ్చేస్తోంది. సమయం ఎంత వేగం గా పరుగిడుతోందంటే, ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చినట్టుంది. అప్పుడే ఇది పాతదయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. సమయం, ఇలా, ఎలా గడుస్తోందో తెలియకుండానే గడచిపోతోంది. ఏదో ఓ సమయంలో ఒక్కో వ్యక్తికి అది ఆగిపోతుంది. కానీ, సమయం పరుగిడుతూనే ఉంటుంది.

కొత్త సంవత్సరం వస్తోందంటే అందరూ సంబరాలు చేసుకుంటారు. ఆడతారు.పాడతారు. తాగుతారు. అర్ధరాత్రి వరకూ మేల్కొని కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తారు. అదేదో గొప్ప అద్భుతం సాధించినట్టు ఫీలయిపోతారు. రాత్రంతా నిద్రల్లేకపోవటం వల్ల తెల్లారి నుంచే తలనొప్పులతో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు. సగటు మనిషిగా అందరితోపాటూ నేనూ కొత్త సంవత్సరాగమనానందాన్ని అనుభవించేయాలని అనుకున్నా, ఎందుకనో ఏవేవో ఆలోచనలూ, భయాలూ ముసురుకుంటాయి. నా ఆనందాన్ని హరించేస్తాయి.

కొత్త సంవత్సరం వస్తే ఆనందం ఎందుకో నాకు అర్ధం కాదు. సంవత్సరం కొత్తదయినా మనం పాతవారిమే. మన సమాజం పాతదే. మన చుట్టూవున్నవారు పాతవారే. మన సమస్యలూ పాతవే. మన ఉద్యోగాలూ, ఇబ్బందులూ పాతవే. దీనికే అంతగా ఆనందించటం, ఎగిరి గంతులు వేయటం ఎందుకో నా సగటు బుర్రకు అర్ధంకాదు.

ఒకోసారి నాకు ఆలోచనలు వస్తూంటాయి.

మనము కాలగణన కోసం ఈ సంవత్సరాలూ, లెక్కలూ ఏర్పరచుకున్నాం. మనకు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈక్షణంలో అవకాశంవునప్పుడే ఆనందం అనుభవించేయాలన్న ఆత్రంతో ఏదో కారణం ఏర్పరచుకున్నామేమో అనిపిస్తుంది. అదీకాక, రేపన్నదిలేనట్టు, ఈరోజే అన్నీ అనుభవించేయాలన్న అభద్రతాభావంతో ఇలా అరుపులూ, కేకలూ, తాగితందనాలూ అలవాటయ్యాయనిపిస్తుంది. నేను అంటే చాదస్తంగా అనిపిస్తుందేమో కానీ, ఇదంతా రేపు గురించి ఆలోచనలేక ఈరోజే జీవితం అనుకునే పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే, మన తత్వంలో మనకు గతం వుంది. వర్తమానం వుంది. భవిష్యత్తువింది. మనం గతంలో చేసిన పనుల ఫలితం వర్తమానంలో అనుభవిస్తాం. వర్తమానంలోని పనుల ప్రభావం భవిష్యత్తుపైన వుంటుంది. కాబట్టి, కాలం మనకు ఒక్క రోజులో సమాప్తమయ్యేదికాదు. ఇది అనంతకాలం ప్రవహిస్తూండే ఒక అవిచ్చిన్న ధారవంటిది. నీటిలోకి రాయి విసిరితే కేంద్రం నుంచి అలలు నీరంతా విస్తరించినట్టు మనం చేసే ప్రతిపనీ ప్రతి ఆలోచన ప్రభావం ఎంతో దూరం వరకూ వుంటుంది. అందుకే మనకు సంబరాలంటే తాగి తందనాలాడటం కాదు. రేపటితో జీవితం సమాప్తమయిపోయేట్టు వెర్రికూతలు, మొర్రి చేతలూ, వెర్రి మొర్రి గంతులూ మనకు ఆనందించటం కాదు. ఇవన్నీ క్షణకాలం ఆనందాలు. మత్తు ఆనందింపచేస్తుంది. మత్తు దిగిన తరువాత మళ్ళీ అదే ప్రపంచం ఏడుపు ముఖంతో కళ్ళముందు నిలుస్తుంది. ఇది పారిపోవటం. పాశ్చాత్యుల రేపు లేదన్న పలాయనవాదం.

అందుకే, మన కొత్త సంవత్సరం సంబరాలు అర్ధవంతంగా ఉంటాయి. గాంభీర్యంతో వుంటాయి. పొద్దున్నే లేస్తాం. శుభ్రంగా స్నానించి భక్తిగా భగవంతుడిని ధ్యానిస్తాం. తీపిచేదుల జీవితానికి ప్రతీక అయిన పచ్చడిని ఆరగిస్తాం. ఆతరువాత భవిష్య శ్రవణం వింటాం. రాబోయె సుఖాలతోపాటూ, కష్టాలనుకూడా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమవుతాం. మంచిమాటలు వింటాం. మంచి ఆలోచనలు చేస్తాం. మనతో ప్రపంచం అయిపోవటం లేదు. మన తరువాత తరాలవారికి మంచి ప్రపంచం అందించే బాధ్యత మనపై వున్నదన్న విఙ్నతను ప్రదర్శిస్తాం. ఇదీ మన సంబరాల స్వరూపం. దీన్లో ఎంత ఆలోచనవుంది. ఎంత నాగరికతవుంది. కానీ ఏం చేస్తాం, మనకు ఎంజాయ్మెంట్ అంటే శరీరం వూగాలి. తూగాలి. గాల్లో ఎగరాలి. మత్తులోపడి సర్వం మరచిపోవాలి అన్న ఆలోచనలు స్థిరపడ్డాయి. ఇదే అభివృద్ధి. నాగరీక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాము. కాదన్నవాడు చాందసుడు, పాతనుపట్టుకుని వేలాడే పిచ్చివాడవుతున్నాడు. కాదన్నవాడిని హేళన చేసి చులకన చేసి ఉద్ధరించేందుకు ప్రపంచంలో అంతా నడుం కడుతున్నారు. పంచాంగం చించేసినంత మాత్రాన తారలు అదృష్యం కానట్టు, వాళ్ళు కాదన్నంత మాత్రాన నిజం నిజంకాకుండా పోతుందా? కానీ ఈ శారీరక ఎంజాయ్మెంట్ లో పడి, మనం ఆత్మను కోల్పోతున్నాము.

అయ్యో కొత్త సంవత్సరం ఏదో సరదా కబుర్లు చెప్పకుండా ఏదో రాసేస్తున్నాను. చూశారా, సగటు మనిషికి సమయం, సందర్భం తెలియవు. వాగటమే తెలుసు. క్షమించండి.

wish u all a very happy new year

ఇది, 28.12.09 ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ప్రచురితం.

December 31, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

తెలుగు స్టాలు ఫలితం ఈ-మూడు బ్లాగులు.

పుస్తక ప్రదర్శనలో ఈతెలుగు స్టాలు గురించి ఎవరో ఒక తమాష అయిన వ్యాఖ్య రాశారు. వారి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందం కలిగింది.

అయితే, వారు ఈస్టాలు నిర్వహణను ఎంతగా వ్యంగ్యం చేసినప్పటికీ నేను గత సంవత్సరంగా సాధించలేనిది ఈ స్టాలులో మన బ్లాగర్ల వల్ల సాధ్యమయింది.

అది నా మిత్రుదు శ్రీపతి శర్మ, అతని భార్య సత్యవతి, నా భార్య పద్మ లు తమ తమ బ్లాగులను ఆరంభించటం!

నేనెప్పటినుంచో బ్లాగమని వీరి వెంటపడుతూన్నాను. నా మాటలు నవ్వుతూకొట్టేసేవారు. తరువాత చూద్దాం లే అనేవారు.ఇప్పుడొద్దులే అనేవారు. మేమేమి రాస్తాం అనేవారు.

కానీ, మన బ్లాగరులంతా కలవటం, కలసి ఆనందించటం చ్చొసినతరువాత వీరు నా ప్రమేయం లేకుండా, బ్లాగులను ఆరంభించేశారు.

శ్రీపతి శర్మ బ్లాగు www.sreekaram.wordpress.com. అతని భార్య బ్లాగు www.himakusumaalu.wordpress.com

పద్మ బ్లాగు, www.sripadmakasturi.wordpress.com.

ఈ మూడు బ్లాగులను, బ్లాగరులను మన బ్లాగ్ప్రపంచానికి ఆహ్వానించి, ఆదరించి, సలహాలతో సూచనలతో ప్రోత్సహించవలసిందిగా నా ప్రార్ధన.

హేళన ఊపుగా, వెక్కిరింత ఊతేజంగా, వ్యతిరేకత ప్రేరణగా మన బ్లాగ్ప్రపంచం మరింత విస్తృతమవ్వాలని కోర్కుంటున్నాను.

ఈ మూడు బ్లాగులను అందరూ సందర్శించి, ఆహ్వానించి, ఆదరించగలరని ఆసిస్తున్నాను.

December 30, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

కలిసింది తొలిసారే అయినా, ఎన్నో ఏళ్ళ పరిచయస్తుల్లా కలసిపోయాం.ఎందుకని?

గమనిస్తే, ఈ ప్రశ్న పరిచయమయిన ప్రతి బ్లాగరు మదిలో మెదులుతూన్న ప్రశ్ననే. పరిచయాల గురించి ఎవరి బ్లాగులో చూసినా, ఇదే మొదటి సారి కలవటం అయినా, ఆప్యాయంగా ఎంతకాలం నుంచో పరిచయం వున్న వారిలా కలసిపోయాం అని రాస్తున్నారు. ఇందుకు కారణాలు అణ్వేశిస్తున్నారు.

నా సంగతే చూడండి.

నేను సాధారణంగా ఎవరితోనూ వెంటనే కలవలేను. కలసినా అంతగా మాట్లాడలేను. నేను కలసి నోరిప్పటానికి చాలా సమయం పడుతుంది.

అంతేకాదు, నాకు నాలుగయిదు సార్లు కలిస్తేకానీ పేర్లు, రూపాలు గుర్తుండవు. ఎక్కడో చూశాను, అనుకుంటూంటాను. పేరు గుర్తుకు రాదు. ఏదో పేరు నాలికపైన వస్తుంది. కానీ, రూపం రాదు. అందుకని, ఎవరయినా పలకరిస్తే, పొడి పొదిగా, అంటీముట్టనట్టు మాట్లాడి వెళ్ళిపోతాను. వారు మళ్ళీ పలకరిస్తే గుర్తుపట్టలేను. మరచిపోతాను. కానీ, ఒక్కసారి అలవాటయినతరువాత, నా నోరు మూయించటం చాల కష్టం. నా అతివాగుడు వల్ల ఎందరో దూరం పారిపోయారుకూడా. దాంతో ఆచి తూచి మాట్లాడటం అలవాటయింది.

అందుకే, నేను దాదాపుగా స్కూలు స్థాయి నుంచి హైదెరాబాదులోనే చదువుతూన్నా, ఉద్యోగమూ ఇక్కడే అయినా, నాకు చెప్పుకోవటానికి సన్నిహితులన్నవారు లేరు. బాల్య మిత్రులన్నవారు లేరు. కాలేజీ పరిచయస్థులూ లేరు. ఉద్యోగంలోనూ, అవసరార్ధం మాటలు తప్ప, ఆంతరంగిక పరిచయాలూ లేవు. ఒకోసారి నన్ను చూస్తే నాకే, సాగరం ఒడ్డున కూచుని, ప్రవాహాన్ని చూస్తూన్నవాడిలా అనిపిస్తుంది. సాగరం నీటి తడికి దూరంగా వున్నట్టు అనిపిస్తుంది.

నా గదిలో కూచోవటం, పుస్తకాలు చదవటం, రాయటం, పాటలు వినటం, సినిమాలు చూడటం…ఇంతే! నావల్ల, అందరితో కలివిడిగా వుండే నా భార్యకూడా తన social life కోల్పోయింది. నేను ఫంక్షన్లకు వెళ్ళను. పదిమంది ఉన్నచోటినుంచి దూరంగా పారిపోతాను. ఎవరితోమాట్లాడుతున్నా, నాకు సమయం వ్యర్ధం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో చదవవచ్చు, రాయవచ్చు, ఏమీ లేకపోతే, హాయిగా కూచుని ఆకాశంలో మన కోసం ప్రకృతి సృజిస్తున్న చిత్రలేఖన ప్రదర్శనను చూసి ఆనదించవచ్చు అనుకుంటాను. అందుకే ఎవరితో ఎక్కువగా కలవను. సమయం గడపను.

అలాంటిది, పప్పు అరుణ గారు కలవగానే, అంత వరకూ పరిచయంలేకున్నా, ఎంతో కాలం పరిచయం వున్నట్టు మాట్లాడేను. మహేష్ కుమార్ ని చూస్తే, ఆప్యాయంగా అనిపించింది. చాలా చనువుగా జోకులేసాను. కొన్నేళ్ళు కలసి ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నవారితో వ్యవహరించినట్టు వ్యవహరించాను. సుజాత గారికోసమయితే ఎంత ఎదురుచూశానంటే, తన తొలి కథ అచ్చయిన పత్రిక విడుదల కోసం, రచయిత పొద్దుటినుంచీ దుకాణం ముందు పడిగాపులు కాచినట్టు ఎదురుచూశాను. వారు కలవగానే కొత్త అన్నదిలేకుండా, రోజూ మాట్లాడుతూ, నిన్నటి సంభాషణను ఇవాళ్ళ కొనసాగించినట్టు మాట్లాడాను. వరూధినిగారితో అసలు పరిచయంలేదు కానీ, మొహమాటపెట్టి పుస్తకం కొనిపించాను. శిరీష్ కుమార్ గారితో మాట్లాడుతూంటే ఎంతో సన్నిహితుడితో మాట్లాడినట్టు అనిపించింది. జ్యోతి గారి విషయం చెప్పనక్కరలేదు. వారింటికి నన్ను నేనే ఆహ్వానించుకున్నాను. నేను, మా బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళను. అలాంటిది, తలచుకుంటే, నాకే ఆశ్చర్యమనిపిస్తోంది. కనీసం నేను ఎవరితోనూ చాటింగ్ చేయలేదు. అలాంటిది, ఇంటికి ఎలా ఆహ్వానించుకున్నానా, అని ఆలొచిస్తున్నానిప్పతికీ.

దీనికి నాకు ఒకటే ప్రధాన కారణంలా అనిపిస్తోంది. మామూలు ప్రపంచంలోని పరిచయాలకు, బ్లాగు పరిచయాలకు ఉన్న ప్రధానమయిన తేడా ఇందుకు కారణం.

మామూలు ప్రపంచంలో పరిచయాలు, భౌతికమయినవి. మనిషిని చూస్తాం. సామజిక హోదా, మన అవసరాలు, మనకు మాటతీరు నచ్చటం లాంటివన్ని ఆ పరిచయాలు పెరగటంలో పాత్రలు వహిస్తాయి. కలవటానికి వీలు, మాట్లాడేఅ తీరికలు పరిచయం పెరగటానికి తోడ్పడతాయి.

కానీ, బ్లాగు పరిచయాలు, ఆలోచనల పరిచయాలు. తిన్నగా, మనిషి రూపం, సామాజిక స్థాయి, అవసరాలవంటివేవీ లేకుండా, ఇవి మనసులోని మాటల పరిచయాలు.

బ్లాగుల్లో మనం కనపడం. మన ఆలొచనలు కనిపిస్తాయి. మన మానసిక భావాల వ్యక్తీకరణ కనిపిస్తుంది. అంటే, ఎంతో సన్నిహితంగా వస్తే కానీ, మామూలు జీవితంలో సంభాషించలేని విధంగా, మనము బ్లాగుల్లో మాట్లాడుకుంటామన్నమాట. ఇలా, మన భావాలు పంచుకోవటంవల్ల, మనసులోని మాటలు ముచ్చటించుకోవటంవల్ల, మన రూపాలతో, వయసులతో, సామాజిక స్థాయిలతో, gender తో సంబంధంలేకుండా మనము భౌతిక పరిచయం లేకున్నా, మానసికంగా స్నేహితులమయ్యామన్నమాట. ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవటం అన్నది, ఈ మైత్రిని మరింతగా విస్తరించటమే తప్ప మరొకటికాదు.

అందుకే, తొలిసారి కలసినా, అందరమూ , ఎన్నోఏళ్ళా పరిచయాలున్నవారిలా పలకరించుకున్నాము. కొత్త అన్నది లేకుండా మాట్లాడుకున్నాము. ఎందుకంటే, బ్లాగుల్లో మనసువిప్పి మాట్లాడుకుంటున్న మనము ఇప్పుదు కళ్ళతో ఒకరిని ఒకరు చూస్తూ మాట్లాడుకున్నాము.

ఇలా కలవటంవల్ల మన బ్లాగు మైత్రి మరింతగా సన్నిహితమయింది. అందుకే ఈ బ్లాగు బంధం ఏనాటిదో అనుకుంటున్నాము. ఇది కలకాలం ఇలాగే ఉన్నత మయిన ఆలోచనలతో, ఉత్తమమయిన ఊసులతో కొనసాగాలని ఆశిస్తున్నాము.

December 28, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

బ్రహ్మబుధ్ హాలీవుడ్ సినిమా చూశాడు!

ఉట్టిగా వుండటం చేతగాక ఉట్టికొడదామని వెళ్తే ఊర కుక్కలు వెంటబడ్డాయట. వాటి నుంచి తప్పించుకోవాలన్ని పరుగెత్తితో పెద్ద మురికిగుంటలో పడ్డాడట. బ్రహ్మబుధ్ విషయంలో నా గతి అలాగయింది.

తెలుగు సినిమాలు చూసి, రక రకాల సందేహాలతో, ప్రశ్నలతో, సిద్ధాంతాలతో నన్ను చపుతున్నాడు. అది తప్పించుకోవాలని ఇవి అస్లు సినిమాలు కావు పోయి హాలీవుడ్ సినిమాలు చూడు. అద్భుతంగా వుంటాయి అని చెప్పా. వెంటనే బ్రహ్మబుధ్ హాలీవుడ్ సినిమా చూడాలని పరుగెత్తాడు. హమ్మయ్య అని నిట్టూర్చా. ఇవాళ్ళయినా ప్రశాంతంగా నిద్ర పోవచ్చని సంతోషించా. కళ్ళు అలా మూతలుపది, కలలకోసం ఎదురుచూపులు ఆరంభించేందుకు సిద్ధమవుతూంటే పెను తుఫానులా మెదడు తలుపులు తోసుకుని లోపలకు ప్రవేసించి, మెదడులో కుర్చీలో కూచుని తీక్షణంగా నా వైపే చూడసాగాడు.

నా నిద్ర మెలకువ వచ్చింది. ఉలిక్కిపది చూస్తే కన్నార్పకుండా కసి కసిగా చూస్తున్న బ్రహ్మబుధ్ కనిపించాదు. వీడికేమయిందిరా బాబూ అని మన్సులో భయమేసింది. ముఖం చూస్తే క్రూరంగా వుంది.

ధైర్యం చిక్కబట్టుకుని, ఏమయింది?, అనడిగా.

నామీద ఎందుకంత కోపం? అడిగాడు.

నేనేం చేశాను? అయోమయంగా అడిగా.

నీకు నామీద కోపంవుంటే చెప్పేయ్, మా గ్రహం వెళ్ళిపోతా. ఇంకా కోపం వుంటే నీ కథలు కోచెబెట్టి కట్టి చదివివినిపించు, అంటేకానీ ఇలా హాలీవుడ్ సినిమాలు చూడు, ఆ వూడ్ సినిమాలు చూడు అని నన్ను చంపకు. అన్నాడు.

ఎందుకని, ఏమయింది? మా వాళ్ళందరికీ హాలీవుద్ సినిమాలే ప్రామాణికాలు, మార్గదర్శకాలు. హాలీవుద్లో చిన్న పాత్రవేశాడని మేము ఐ ఎస్ జోహార్ అనే నటుదిగురించి ఇప్పతికీ గొప్పగా చెప్పుకుంటాము. ఓ ఇంగ్లీష్ సినిమాలో చిరిగిన గౌన్ వేసుకుందని మల్లికా షెరావత్ ను ఇప్పతికీ అంతర్జాతీయ స్టారంటాము. అమితాభ్ నుంచి, అల్లరి నరెష్ వరకూ హాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే జన్మ ధన్యమయినట్టు భావిస్తాము. మాకు సినిమాలు తీయటం నేర్పింది వాళ్ళే. మాకు ఆలోచించటం, బ్రతకటం, ప్రేమించటం, విడిపోవటం అన్నీ నేర్పుతున్నది వారే. అందుకే నిన్ను వాళ్ళ సినిమాలు చూడమన్నాను.అవి చూస్తే మీకు మా సినిమాలు, మేము ఇంకా బాగా అర్ధమవుతారని నీకా సలహా ఇచ్చాను, అన్నాను.

చాలా సేపు మౌనంగా వున్నాడు. చివరికి అన్నాదు. ఏదో నిన్నుచూస్తే మోసగాడిలా అనిపించటంలేదు కాబట్టి నీ మాటలు నమ్ముతున్నాను, అని జుట్టంతా చిందరవందర చేసుకుని ముఖం మీదకు లాక్కుని, వెంటృకల సందులోంచి నన్ను వంకర కళ్ళతో చూశాడు.

భయం వేసింది. వీడే హాలీవుడ్ సినిమా చూశాడో, పిచ్చయితే పట్టలేదుకదా, అనుకున్నా.

అంతలోనే వికటంగా నవ్వాడు. ఇద్దరు పనికిరాని వీరుల పిచ్చి సాహసాల పచ్చి మోసం సినిమా చూశాను, అన్నాడు.

ఏమిటాసినిమా? ఏమా కథ? అనడిగా.

ఆదేశంలో సైనికుల యుద్ధానికి పంపి పట్తుపడితే వాళ్ళేవరో మాకు తెలియదని వదిలేస్తారు. అందుకు కోపం వచ్చి ఒక వీరుడు కొందరు సైనికులను ఒప్పించి, ఒక ద్వీపంలో టూరిశ్తులను బంధిస్తాడు.తన కోరిక తీర్చకపోతే పచ్చటి చిన్న జెల్ల్య్ పళ్ళలాంటి విషపు వాయువును పట్టణంలోకి వదలి ప్రజలను చంపేస్తానంటాడు. వాడినుంచి బందీలను విడిపించి, విషపు వాయువులున్న ఆయుధాలను నిర్వీర్యం చేయటం సినిమా కథ, అని పక పకా, చక చకా, ఇకైక, విక విక నవ్వసాగాడు.

అందులో నవ్వేదేముందో నాకు అర్ధం కాలేదు. పైగా మనౌషులు నవ్వితే కారణం తెలియకున్నా మనకు నవ్వు వస్తుంది. కానీ బ్రహ్మబుధ్ నవ్వుతూంటే, ఏడుపు వస్తోంది. వాది నవ్వుకు, నా మెదదు లోప్ల సున్నిత మయిన భాగాలు దెబ్బ తింటాయనిపిస్తోంది. వీడిని నవ్వించటం కన్నా ఏడిపించటమే మేలనిపించింది.

నువ్వు చూసిన సినిమా పేరు రాక్. సూపర్ హిట్ సినిమా. అద్భుతమయిన యుద్ధాలూ, కార్ చేసింగులూ, రాకెట్లు అని ఇంకా ఏవేవో చెప్పబోతున్న నామాటలకు మధ్యలోనే అడ్డొచ్చాడు.

రాకా, బీకా, పీకిపాకా, కాకికూకా, కప్పకేకా,కేకుడోకా, డోకుఢాకా, అంటూంటే భరించలేకపోయాను.

నాయనా కాస్త అర్ధమయ్యే భాషలో మాట్లాడు, ముందే నిన్ను భరించాల్సి వస్తోంది, ఆపైన నీ అర్ధంకాని ఘూకం కేక, బేకం బాకాలన్ని కూడా భరించాలంటే అల్ప మానవుడిని నేనెమై పోవాలి, అని బ్రతిమిలాడుకున్నా.

మరి నన్ను చెప్పనీ. నా మాటలకు అడ్డొచ్చావో, నేనింత కాలం చూస్తూన్న తెలుగు సినిమాలలొని అర్ధంలేని పాట్ల మాటల తూటాల పేటీల కరువుకాటకాల భాషల పదాల ప్రయోగాలన్నీ చేస్తాను అని బెదిరించాడు.

నోరు కుట్టి, కట్టి, గట్టిగా పట్టుకుని బసిపట్ట వేసుకుని కూచున్నా బుద్ధిగా.

ముఖం మీద వేలాడుతున్న వెంట్రుకల సందులోంచి వంకరగా నన్ను చూస్తూ, ఒక వీరుడు ముసలివాదు. పిచ్చివాడు. అందుకే అతడిని జైల్లో పెడతారు. ఇంకో వీరుడూ పిచ్చివాడే భయస్తుడు. జెల్ల్య్ పళ్ళలాంటి దాన్ని చూసి భయపడుతూంటాడు. అది అంత విషమయితే దానితో ఎందుకాడుకోవాలి? దాన్ని అంతగనం తయారు చేసి అందరికీ దొరికేట్టు ఎందుకు పెట్టాలి? ఐనా, ఆ పనికిరాని వీరుడు ఆ జెల్లీ పళ్ళతో భలేగా నటించాడు. వాడి నటన చూస్తూంటే నాకు నవ్వాగలేదు. జెల్లీపళ్ళను చూసి భయపడే ఈ పనికిమాలిన వీరుడెవడురా బాబూ అనిపించింది. అంతే కాదు, నాయిక తో ఒక్క పాటకూడా పాడలేదు. మేటింగ్ డాన్సులు చేయలేదు. పిచ్చి కూతలు కూయలేదు. ఆమెని ఏడిపించలేదు. కానీ ఆమెని ప్రెగ్నెంట్ చేశాడు. ఇదెలా సాధ్యం? వెర్రి కూతలు. నృత్యాలు, మేటింగ్ పిలుపులు, తలపులు, వలపుల కులుకులు లేకుండా అలా చేయటం అనాగరికం కదా? ప్రేమ లేని జీవితం వ్యర్ధం కదా? ప్రేమ లేని సెక్స్ పశుత్వం కదా? ఇంతకూడా తెలియని ఆ వీౠడు వీరుడేనా? పైగా నాయిక కూడా శుభ్రంగా బట్టలు వేసుకుని గౌరవప్రదంగా వుంది. నాయికలు అలా వుంటారా ఎక్కడయినా? చిరుగుపాతల, బరువుపీలికల డ్రస్సులు వేసుకోని అమ్మాయి వైపు చూసేవాడు వీరుడేనా? ఆవేశంగా అన్నాడు బ్బ్రహ్మబుధ్.

నేను నోరిప్పలేదు.

ఇంకోవీరుడూ పిచ్చివాడే. కాదు కాదు వాడిని వీరుడనుకున్న మనమే పిచ్చివాళాం. ఒక చిన్న దారంతో ఒక మనిషిని పైనుంచి వేళాడేఅస్తాడు. ఎంతో మంది సుశిక్షితులయిన సైనికులను తుపాకీ పట్టి 30 ఏళ్ళు దాటినవాడు పిట్టల్ల కాల్చేస్తాడు. ఆ ఇంకో వీరుడు కూడా తుపాకీ కాల్చరాదుకానీ, ఆయన కాల్చిన తుపాకీ గుళ్ళా దారిలోకి వచ్చి మరీ శత్రువులు చచ్చి పోతూంటారు. జీవితాంతం శిక్షణ పొందిన సైనికులు కాల్చిన తుపాకులు మాత్రం మన వీరులకు తగలవు. ఇద్దరు వీరులు మొత్తం సైనికులందరినీ చంపి, అందరినీ రక్షించేస్తారు. దీనికి తోడు ఆ జెళ్ళీ పళ్ళుఒకటి. అదేదో కొంప మునిగిపోయిందన్నట్టు చేస్తాడు. తుస్సుమనిపిస్తాడు. ఇద్దరు వీరులే ఇంత చేసేటప్పుడు మరి వారితో వేరేవారిని పంపటం ఎందుకు? చంపటం ఎందుకు?

అయినా, స్పెషల్ ఎఫెక్ట్స్ బావున్నాయికదా? అంతా నిజమనిపించేట్టున్నాయికదా? అడిగా ఆశగా. వీడు హాలీవుడ్ సినిమాలను అలా తీసిపారేయటం నచ్చలేదు.

ఏమున్నాయి స్పెషల్ ఎఫెక్టులు? ముందే తెలుసు ఇద్దరు వీరులు గెలుస్తారని. అయినా అవి రాకెట్లా? మన వీరుడు పార్కులో నడుస్తున్నట్టు వెళ్ళి రాకెట్లను ఒక స్క్రూ డ్రైవర్తో విప్పి జెళ్ళేఎ పళ్ళతో ఆడుకుంటాడు. ఈ ఆట చూడటానికి మనం డబ్బులిచ్చి చెవిలో పూలు పెట్టుకుంటాము. ఏవో రెండు విష్పోటనలయితే నోరు తెరచుకుని చూస్తాము. దీనికన్నా నాకు తెలుగు వీరుల సినిమాలే బాగున్నాయి. తెలుగు వీరులెంతెంత సేపు యుద్ధాలు చేస్తారనుకున్నావు. కొట్టిన వాడినే కొడుతూంటారు. వారు పడుతూంటారు. లేచివస్తూంటారు. తన్నులు తింటూంటారు. నిర్మాతలు డబ్బులిచ్చినంతసేపూ పోరాడతారు. పాటలు పాడతారు. తెలుగు వీరుడొక్కడే ఒంటి చేత్తో చేసేపనికి ఈ హాలీవుడ్లో ఇద్దరు వీరులు, వారితో పది మంది సైనికులు బయలు దేరతారు.పది మందిని అనవసరంగా చంపి, ఇద్దరు వీరులు తమ గొప్పతనంతో పని సాధిస్తారు. ఇంత గోల ఎందుకు. ఒక పోకిరి వీరుడు చాలు. నీళ్ళమీద నడుచుకుంటూ వెళ్ళి ద్వీపం చేరుకుని దుష్టులందరినీ చంపి , కాలర్ నలగకుండా వచ్చి గెంతులేస్తూ చిందుల పాటల విందులు చేస్తూ వీరుడని నిరూపించుకుంటాడు. వీరులంటే తెలుగు వీరులే. ఇంకోసారి నాకు ఉచిత సలహాలివ్వకు. నాకు నచ్చిన సినిమాలు నన్ను చూడని. నీకు నచ్చినా, నచ్చకున్నా కథలు చెప్తా. ఈ రాక్ సినిమా చూసినతరువాత పోకిరి పది సార్లు చూస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు.

December 27, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-4

ఇవ్వాళ్టితో దాదాపుగా నా అమ్మకాలు అయిపోయినట్టే. ఇంకా మూడు రోజులు ప్రదర్శన వున్నా, నా రాతలు, కోతల వల్ల మళ్ళీ ఆదివారమే ప్రదర్శనకు రాగలుగుతాను. అదీ మిగిలిన పుస్తకాలను మూటకట్టుకుని పోవటానికీ, నేను నాకు నచ్చిన పుస్తకాలను కొనుక్కోవటానికే1

ఇవాళ్ళ ఈ తెలుగును మహిళా బ్లాగర్లే చూస్తారని అనుకున్న నాకు, ఇంకా నల్లమోతు శ్రీధర్ గారు ఇతరులు కనబడటం ఆశ్చర్యమనిపించింది. మహిళా బ్లాగర్లు నెట్ లో తెలుగు వాడకాన్ని వివరిస్తారని నా కొలీగులను(మహిళలే) రమ్మన్నాను. ఇదే శ్రీధర్ తో చెప్తూంటే పక్కనే వున్న కొల్లురి సోమశంకర్ అపార్ధం చేసుకున్నాడు. తనని బలవంతం చేసి తీసుకు వచ్చానీరోజు. మన బ్లాగర్లు వస్తారు. సంతకం పెట్టి పుస్తకాన్ని అమ్మే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడొచ్చింది. మళ్ళీ మన జీవిత కాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరినీ కలిసే వీలు కూడా ఇలా మళ్ళీ మళ్ళీ రాదని బిసీగా వున్న అతడిని లాక్కు వచ్చాను. అయితే, మహిళా బ్లాగర్లు వస్తారని నా మితృలందరికీ చెప్పాను, రమ్మన్నాను అని శ్రీధర్ తో అనగానే, నేను అందుకు రాలేదు యాద్ధ్రుచ్చికంగా వచ్చాను అని సోముడు ఉడుక్కున్నాడు. అతని సున్నిత మనస్తత్వం తెలుసు కాబట్టి కాస్త ఏడిపించి వదిలేశా. నాతో కాస్త పరిచయమున్న బ్లాగర్లందరూ అందరినీ కొద్ది కొద్దిగా ఏడిపించి తమాషా చూసే నా స్వభావాన్ని ఈపాటికే అర్ధం చేసుకునివుంటారు.

అయితే, మా దుకాణం దగ్గరకు వెళ్ళగానే నాకు పుస్తకాలమ్మాలన్న కోరిక నశించింది. మళ్ళీ తెలంగాణా, కమ్మ, ఆధ్యాత్మిక, ప్రాక్టికల్ సైకాలజీ లకు ఇంకో ముసలాయన అయిన్స్టీన్ మీద ఏదో రాశాడు, ఆయన తోడయ్యాడు. వాళ్ళు టేబిళ్ళను కూడా ఎలా జరిపేరంటే, వచ్చిన వారికి కేవలం తెలంగాణా, కమ్మ పుస్తకాలే కనిపిస్తాయి. మా పుస్తకాలను కూడా మీరే అమ్మంది అని తెలంగాణా అయనతో అన్నాను. దానికి ఆయన నా పుస్తకాలే ఏమవుతున్నాయో నాకు తెలియదు అన్నాడు. విస్తుపోయా. ఎందుకంటే, ఆయన్ లేని సమయంలో ఆయన్ పుస్తకాలను అమ్మి అణాపైసలతో సహా లెక్కకట్టి ఇచ్చాను నేను. అయితే ఇక్కడ మరో సంఘటన జరిగింది.

ఆయన నాదెండ్ల భాస్కర రావు జీవిత చరిత్రను ఎవరో ఇస్తే చదివేడట. అది అతని ప్రచురణకాదు. కానీ దాన్ని అమ్మకానికి పెట్టాడు. అదేమిటని అడిగా. చదివేశాను. ఇంక నాకీ పుస్తకం అవసరం లేదు. అమ్మితే, ఎన్ని డబ్బులొచ్చినా లాభమే అన్నాడు. నేను ఆస్చర్యం నుంచి తేరుకోనేలేదు, ఒక మాజీ ఎమ్మెల్లే వచ్చి ఆపుస్తకాన్ని అడిగాడు. 200/- ఆ పుస్తకం. దాన్ని 190/- నుంచి బేరమాడి, 150/- కి అమ్మాడు. ఇదే పనిగా, అంతవరకు, 20/- వున్న ఒక పుస్తకం వెల తుడిపి 35/- చేసి 10 శాతం తగ్గించి అమ్ముతున్నాదు.

యే నహీ హై యే నహీహై జిందగీ, యే నహీ
ముఝ్ కొ యే నరక్ న చాహియే, ముఝ్ కొ ఫూల్ ముఝ్ కొ చీజ్, ముఝ్కొ ప్రీత్ చాహియే ముఝ్కొ చాహియే బహార్

అనిపాడుకుంటూ పరుగున బయటకు వచ్చాను.

వార్త ఆదివారం ఇంచార్జ్ గుడిపాటి వచ్చాడు. అతడిని ఈ తెలుగు వారికి పరిచయం చేశా. అతనితో తిరిగా. ఆతరువాత మా ఆఫీసు స్నేహితులు వస్తే వారినీ ఈతెలుగుకు పరిచయం చేశా. ఏరీ ఆడవాళ్ళు? అని వాళ్ళాని మోసం చేసి పుస్తకాల ప్రదర్శనకు రప్పించినట్టు చూశారు భార్యలతో సహా వచ్చిన నా కోలీగులు.

ఇంతలో మనసులోమాట సుజాత గారు వచ్చారని సోముదు చెప్పాడు. వెంటనే పెన్ను తీసి పట్తుకున్నా. ఎక్కడా కనబడలేదు సుజాత గారు. వారు వస్తే నేను మా దుకాణంలో వున్నానై చెప్పమని శ్రీధర్ కి చెప్పి మా దుకాణంలో కూచున్నా.కానీ, మళ్ళీ అక్కడ కూచుంటే నాకు యేదున్యా, యే మహఫిల్ మెరే కాంకీ నహీ అని బిగ్గరగా పడుతూ పరుగెత్తాలనిపించింది.

యె మహెలో యె తఖ్తో యె తాజోంకి దునియా అని జుట్టు పీక్కుంతూ, యె దునియా జహా ఆద్మీ కుచ్ నహీహై, వఫా కుచ్ నహీ, ఒదోస్తీ కుచ్ నహీ హై అని అరుస్తూ జలాదో జలాదో జలాదో అని గొంతు చించుకోవాలనిపించింది.

వెంటనే నేను తెచ్చిన పుస్తకాలు తీసుకున్నా. అసిధార కొద్ది కాపీలే వున్నాయి. ఈ రోజు ఒక్క కాపీ అమ్మలేదు కానీ నేను తెచ్చిన 5 కాపీలు మాయమయ్యాయి. దాంతో మిగిలిన పుస్తకాలు తీసుకుని వచ్చేస్తూంటే, చదువరి గారు కలిశారు. వారికి ఒక నవల కథ వినిపించాను. వారి సతీమణి వరూధిని గారు అసిధార కొనాలనుకుంతున్నారని చెప్పారు. వారు ఒకతి కొనాలనుకుంటే నేను రెండు అంటగట్టా. ఇంతలో ఇవాళ్ళ నేను ఎదురుచూస్తున్న ఆక్షణం రానే వచ్చింది. మనసులో మాట సుజాత గారు కనిపించారు!

నాకు ఆనందం ఆగలేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనుకుంటూ నా జీవితంలో తొలి ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు ఉత్సాహంగా ముందుకు దూకుతూ గొప్ప చిత్రలేఖనం గీయబోతున్న మైకెలాంజిలోలా పెన్ను పట్టుకుని ఏదీ పుస్తకం? అని అదిగా.

ఇంట్లో మరచిపోయానన్నారు సుజాత గారు.

ఇంతేలే రచయితల బ్రతుకులు, అవి ఏనాడూ బాగు పడని రాతలూ అనుకుంటూంటే, నా మీద జాలిపడి కాబోలు, జీవితం-జాతకం తీసుకుంటా సంతకం పెట్టండి అన్నారు సుజాత గారు.

అప్పటికే వరూధిని గారు కొన్న అసిధార పుస్తకం పై సంతకం పెట్టిన వూపులో జీవితం-జాతకం కూడా వారి పేర రాసేసాను. దాంతో వారికి దాన్నె కొనక తప్పలేదు. ఆతరువాత సుజాత గారి పుస్తకాంపైన కూడా సంతకించాను.సోముడు మనీప్లాంట్ కూడా సంతకంతో ఇచ్చాడు. దాంతో ఒకేసారయినా మేమిద్దరమూ ఆటోగ్రాఫ్ లిచ్చే రచయితల జాబితాలో మా పేర్లు చేర్చేసుకున్నాము. మాకీ అవకాశం ఇచ్చి గౌరవించిన వరూధిని గారికీ, సుజాత గారికీ బహు కృతఙ్నతలు.

ఇంతలో మహిళా బ్లాగర్ల సందడి ప్రారంభమయింది. వెళ్ళిపోదామనుకుంటూ జ్యోతి గారేరి? అని అడిగా. నా పక్కనే ఒక కెమేరాను పట్టుకుని అర్జునుడి ఏకాగ్రతతో ఫోటో తీస్తున్న జ్యోతి గారిని చూపారు.

నమస్కారాలు అన్నాను.

ఒక నిముషం అన్నారు ఏకాగ్రత చెడకుండా

నమస్కారాలు అన్నాను. వారు ప్రతి నమస్కారం చేసేవరకూ నమస్కారాలు అంటూనే వున్నాను.

ఆతరువాత వారింతికి నన్ను నేనే ఆహ్వానించుకున్నాను. వారి వంటల రుచి చూడాలనే జీచా(జిహ్వ చాపల్యం)తో. పనిలో పనిగా పక్కనే వున్న మహేష్ కుమార్ ను కూడా ఆహ్వానించాను. జ్యోతి గారిచ్చిన స్వీట్లు తింటూ బయటపడ్డాను.

ఇదీ ఈసారి పుస్తక ప్రదర్శనలో నేను పుస్తకాలమ్మటమనే ప్రహసనము జరిగిన విధానము. జరిగినదంతా జరిగినట్టు చెప్పాను. పుస్తకాలు కొని ప్రత్సహించిన బ్లాగ్మిత్రులందరికీ మళ్ళీ మళ్ళేఎ ధన్యవాదాలు. మీరు పుస్తకాలను చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరచాలని నా సవినయ మనవి.

జనవరి ఒకటవ తేదీ నుంచి విజయవాడలో ఇంకో పుస్తక ప్రదర్శన మొదలవుతుంది. దాన్లో నావి రెండు పుఇస్తకాలు విడుదలవుతాయి. అక్శరాంజలి అని ఆంధ్రభూమి వార పత్రికలో నేను చేసిన 50 పుస్తక పరిచయాల సంకలనం, వార్తలో ఆదివారాలు నేను రాసిన రియల్ స్టోరీలు 50, స్ఫూర్తినిచ్చే వాస్తవ విజయ గాధలు, విడుదలవుతాయి. తేదీ నిర్ణయం కాగానే చెప్తాను. ఆ విడుదల సందర్భంగా విజయవాడ వస్తున్నాను.

అక్షరాంజలి 280 పేజీల పుస్తకం. రియల్ స్టోరీలు 300 పేజీల పుస్తకం. రెండు పుస్తకాల ధర చెరో 125/- వీటిని ఎమెస్కోవారు ప్రచురించారు.

December 25, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-3

వార్త ఆదివారం మాగజీన్ కు కవర్ స్టోరీ తయారు చేసాను. మిగతా పనులు చూసుకుని అతి అయిష్టంగా పుస్తక ప్రదర్శన వైపు వెళ్ళాను. ఇవాళ్ళ శ్రీపతి శర్మ తన భార్యతో వస్తానన్నాడు. ఆవిడ ఫోను చేయటం వల్ల నా అర్ధాంగి కూడా వస్తానంది. వాళ్ళ ఆఫీసు నుంచి ప్రదర్శన స్థలానికి బస్సు లేదు. ఆటో లో రావాల్సి వచ్చింది. ఈరోజు కేపీ అశోక్ కుమార్ కూడా వస్తానన్నాడు. సరయిన బస్సులేక ఆయన సెక్రెటేరియట్ నుంచి నడుస్తూ వచ్చాడు. అప్పుడు అనిపించింది, పుస్తక ప్రదర్శనకు ప్రజలు పెద్ద ఎత్తున రావటంలేదని వాపోతున్నాము, కానీ నెక్లేసు రోడ్డులో ఈవైపు రావాలంటే స్వంత వాహనం వుంటేనే సులవవుతుంది. పైగా, ఇక్కడికి వచ్చేవారంతా ప్రేమికులో, సాయంత్రం కాస్త సమయం రిలాక్సుగా గడపాలనుకునేవారో. కేవలం పుస్తకాల కోసమే అఫీసయినతరువాత, ఇంత దూరం నడక మీద వచ్చేవారెంతమంది? ప్రేమికులకు పుస్తకాలతో పనిలేదు. రిలాక్సవ్వాలనుకున్నవారికీ పుస్తకాలతో పనిలేదు. కాబట్టి, ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంలేదని అనుకునేకన్నా, వస్తున్న వారిని చూస్తే, ఇంత మంది నిజమయిన పుస్తకప్రేమికులున్నారన్న సంతృప్తి కలుగుతుంది.

ఇవాళ్ళ నేను వచ్చేసరికి ఆలస్యమయింది. వార్తలో కవర్ స్టోరీ ఇచ్చి, గుడిపాటితో, ఎడిటర్ టంకశాల అశోక్ గారితో ముచ్చటించి తీరికగా వచ్చాను.

నేను వచ్చేసరికి మా స్టాలులో యుద్ధం జరుగుతోంది.

డాక్టర్ నగేష్, అతని అనుచరులు ప్రాక్టికల్ సైకాలజీ అనే ఆయన పత్రికను పట్టుకుని వచ్చారు. మొత్తం ఒక టేబిల్ నిండా వరుసగా ఆ పత్రిక కాపీలు పరచారు. దాంతో అటు కమ్మ వారు, ఇతు తెలంగాణా వారు అతనితో యుద్ధానికి దిగారు. నేను చేరే సరికి ఇదీ పరిస్థితి.

ఇది రచయితల స్టాలు. అందరమూ స్థలాన్ని పంచుకోవాలి.ఇదొక పరస్పసహకార పుస్తకల అమ్ము వేదిక. ఒక్కరే అంతా ఆక్రమిస్తే కుదరదు. అందరి పుస్తకాలూ కనబడాలి అని చెప్పా. నగేష్ అనుచరుదు వినలేదు. వుండనీ సార్ అంటూ మా పుస్తకాల మీద పత్రికలు పరచేస్తున్నాడు.

అసలే ఒక రకమయిన వైరాగ్యంలో వున్నాను. సమయం ఇక్కడ అనవసరంగా వ్యర్ధం చేఉకుంతున్నానన్న భావనతో వున్నాను. ఇంత్లో నేను చదవాల్సిన పుస్తకాలు నన్ను పిలుస్తున్నాయి. రోహింటన్ మిస్త్రీ, శశి దేష్పాండే, జాన్ గ్రిబ్బిన్, పాలగుమ్మి పద్మరాజు, ఎనుగంటి వేణు గోపాల్, సీ నరసిమ్హారావు, మార్క్ త్వెయిన్ లు నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను ఇక్కడ ఎండాకాలంలో వస్తాయో రావో తెలియని, వచ్చినా, వర్షిస్తాయో లేవో తెలియని నల్ల మేఘాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఎదురుచూస్తూ, ఆ వొచ్చే మేఘాలు రాల్చీ రాల్చని చినుకు కోసం ఆత్ర పదుతూ, వారి దృష్తిని ఆకర్సించాలని స్థలం కోసం పోరాడాల్సి రావటం అత్యంత చిరాకుని కలిగించింది.

మరో మాటకు ఆస్కారం లేకుందా, వారి పత్రికలు జరిపి అన్నితినీ ఒకే వరుసలో ఒక దాని క్రింద ఒకటి పెట్టి మిగతా వారి పుస్తకాలన్నితికీ స్థలం కల్పించాను. ఆ అబ్బాయి ఏదో మాత్లడబోతే, నేను నీతో కాదు మీ నగేష్ తోనే మాట్లాడతాను, ఆయననే రమ్మను అన్నాను. అని తల ఎత్తి చూస్తే ఎదురుగా నగేష్ ఉన్నాదు.

ఆయన్ అనన్ను ఆప్యాయంగా పలకరించాదు. మీ రచనలు అత్యంత ఆసక్తిగా చదువుతానని అన్నాడు. ఆయనకు చెప్పాను, ఇక్కడ వున్న స్థలంలోనే అందరమూ సర్దుకోవాలని. ఆయన తన అనుచరుడికి అదే చెప్పాడు. మళ్ళీ కలుదాము, మీతో మాత్లాడాలి చాలా అన్నాడు వెళ్తూ. ఆయనకు నేను రాసిన adolescent psychology ఇతివృత్తం కల అంతర్మధనం కాపీ ఇచ్చాను. తీసుకుని వెళ్ళిపోయాదు.

ఇదంతా జరిగే సరికి మనసు పాడయిపోయింది. ఇంత్లో నా సామ్రాజ్యంలో కూచుని మంచి పాతల రస ప్రవాహంలో తేలుతూ, పుస్తకాలు చదువుతూ అవి సృష్తించో అద్భుత ప్రపంచంలో తేలుతూనో, లేకపోతే నేను వినూత్న ప్రపంచాన్ని స్ర్జిస్తూనో హాయిగా వుండేవాడిని, నాకీ స్థలాల గోల ఏమిటి, అమ్మకాల ఆత్రం ఏమిటీ అనిపించింది.

స్టాలు వదలి దూరంగా కూచున్నాను. శ్రీపతి అతని భార్య వచ్చారు. పద్మ వచ్చింది. అలా తిరుగుతూ ఒక సారి స్టాల్ వైపు చూసా. ప్రాక్టికల్ సైకాలజీ, కమ్మ పుస్తకాలు, తెలంగాణా పుస్తకాలు రాజీపది ఒప్పందానికి వచ్చాయి. అన్ని ఇతర పుస్తకాలపైన తమ ఆధిక్యాన్ని నెరపుతున్నాయి. పట్టించుకోలేదు. ఇంతలో వేరే మితృలు వస్తే వారితో మాట్లాడుతూ సమయం గదిపాను. ఒక పుస్తకావిష్కరణ ప్రహసనం చూసాను. ఆతరువాత నేను శ్రీపతి రిలాక్సుదుగా కూచున్నాము.

ఇంతలో, పప్పు అరుణ వచ్చారు. నా పుస్తకాలు కొంటానన్నారు. పుస్తకాలు కొంటానని మొదతి రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి వచ్చారు. ఇంతలో ప్రొఫెసర్ పిల్లమర్రి రాము గారు వచ్చారు. అసిధార, జీవితం జాతకం కొన్నారు. అరుణ గారు వచ్చిన వేళాఅ విషేషమేమిటో కానీ దుకాణం మూసిన తరువాత నా పుస్తకాలు కొనటానికి అందరూ రావటం ఆరంభమయింది. ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు జీవితం-జాతకం కొన్నారు.వీరికి పుస్తకాలిచ్చి చూసేసరికి అరుణగారు లేరు. నా పుస్తకాలు తీసుకుని, ఈఎ తెలుగు దగ్గరకు వెళ్ళాను. అవి చూసి ఆవిడ, అన్నీ మీ పుస్తకాలేతెచ్చారు. నాకు మనీ ప్లాంట్ కావాలి అన్నారు. నా పొరపాతు అర్ధమయింది. నేను రచయితగా ప్రవర్తించాను. ప్రచురణ కర్తగా ఆలోచించలేదు. వెంటనే స్టాలుకు రమ్మన్నాను. నల్లమోతు శ్రీధర్ కూడా మనీప్లాంట్ కావాలన్నాడు. ఇద్దరినీ స్టాలుకు తీసుకెళ్ళాను. మొహమాటపెట్టి వారు కొనాలనుకున్న వాటికన్నా ఎక్కువ పుస్తకాలే కొనిపించాను. కానీ ఏదో ఉత్సాహము, ఆనదమూ కలిగాయి. నిజంగా, ఈ బ్లాగు బంధం ఏనాతిదోకదా! బ్లాగ్మితృల నుంచి ఇంతగా ప్రోత్సాహం లభిస్తోంది అనిపించింది.బయట ప్రపంచం పట్టించుకోకున్నా, గుర్తించకున్నా బ్లాగ్లోకం నన్ను ఇంతగా ఆదరిస్తోంది! గంగి గోవు పాలు గరిటెడయినను చాలు అన్నారు. బయట లక్షల సంఖ్యలో మెప్పు పొందేకన్నా, బ్లాగులో వందల సంఖ్యలో లభించే అసలు సిసలయిన ఆదరణే అమూల్యం.

అయితే, పుస్తకాలు కొన్న బ్లాగ్మితృలందరికీ మనవి. కొన్న పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. చదివి వదిలేయకుండా అభిప్రాయం నిర్మొహమాటంగా రాయాలి. పుస్తకం నచ్చితే దాన్ని పదిమందికీ పరిచయం చేయాలి. చదివించాలి. పుస్తకం గురించి చర్చించాలి. ఈరకంగా మంచి పుస్తకానికి ప్రచారము, ఆదరణలను కలిగించాలి. ఇజాలు, సంకుచితాల రంగుటద్దాల మోజులో పడి, గిరిగీసుకుని తనపై తానే పరిమితులు విధించుకుంటూ సహిత్య ప్రపంచం ఏం కోల్పోతోందో, మన బ్లాగు ప్రపంచం చూపించాలి. అసలు సిసలు సాహిత్యాన్ని ఆదరించి పెద్దపీట వేయాలి. మరోసారి బ్లాగ్మితృలందరికీ బహు కృతఙ్నతలు.

ఈరోజు పుస్తకాల అమ్మకానికి నేను రావటంలేదు. ఎందుకంటే నేనీవారం ఇంకా పవర్ పాలిటిక్స్ రాయలేదు. ప్రతివారం ఈ రచన నాకొక యఙ్నం లాంటిది. కాబట్టి ఈరోజు స్టాలులో స్థలం వేరేవారికి వదిలి, పోటా పోటీ ప్రపంచంలో బొటాబొటీగా పుస్తకాలమ్మేందుకు రేపు వస్తాను.

December 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized