Archive for December 1, 2008

ముంబాయిలో తీవ్రవాదుల దాడి నుంచి, భద్రాచలం లో రచయితల సమావేశం వరకూ…..

నాందేడ్ నుంచి ఇంటికి చేరి టీవీ పెట్టగానే ముంబాయిలో తీవ్రవాదుల దాడి వార్త తెలిసింది. ఆ వివరాలు చూస్తూంటే మనసులో బాధా తుఫానులు చెలరేగాయి. మన దేశంపైన తీవ్రవాదులు ఇంత ధైర్యంగా, ఇంత సులభంగా, ఇంత ఘోరంగా ఒక దాన్ని మించి మరొకటిగా దాడులు చేస్తూంటే ఏమీ చేతకాక మౌనంగా అన్నీ చూస్తూ చేతులునులుపుకుంటూ కూచుంటున్న నాపైన నాకే అసహ్యం వేసింది.

అమెరికాపైన ఒక్కసారి దాడి చేశారు. మళ్ళీ ఆవైపు కన్నెత్తిచూసే సాహసంకూడా మిగలలేదు. ఈనాటికీ ప్రపంచమంతా ఆరోజును తలచుకుంటూనేవుంది.

మనపైన దాడులమీద దాడులు జరుగుతూనేవున్నాయి. మనముకూడా అమెరికాపైన దాడినే స్మరిస్తూ, మన ప్రజల ప్రాణ నష్టాన్ని విస్మరిస్తూ వస్తున్నాము. మనపైన జరుగుతున్న దాడులను కూడా అమెరికా పైన జరిగిన దాడి పేరుతోనే సూచిస్తున్నాము. కానీ, అమెరికాలాగా, కఠిన చర్యలు మాత్రం తీసుకోలేక పోతున్నాము. ప్రజలకు రక్షణ కలిగించలేక పోతున్నాము.

రాజకీయనాయకులు వాళ్ళ ఆటలు ఆడుకుంటూనేవున్నారు. ప్రజలు బాధలను దిగమ్రింగుల్కుంటూ బ్రతుకు సాగిస్తూనేవున్నారు. జరగబోయే దాడుల ఆలోచనలను అదిమిపట్టి ముందుకు సాగుతూనేవున్నారు.

ఇదంతా చూస్తూంటే ఎందుకని మనమిలా తయారయ్యామన్న ప్రశ్న జనిస్తుంది. ఎందుకని మనం మన ప్రాణాలను గౌరవించలేని స్థితికి దిగజారామన్న ఆలోచన పురుగులా తొలుస్తూంటుంది మదిని.దాడులు జరుగుతూంటే ప్రజలకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వవలసిన మీడియా, మేథావులు సెన్సేషనలిజం వైపే మొగ్గుతూ ప్రజలను మరింత నిరాషలోకి నెడుతూంటే నిస్సహాయంగా చూస్తూ వుండాల్సి రావటం మరీ దారుణమయిన పరిస్థితి. అందుకే, టీవీ బందుచేసాను. కానీ, కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం అదృష్యమయిపోదు.

జాగృతి వార పత్రిక నిర్వహించిన రాష్ట్రీయ కథా రచయితల సమావేశానికి భద్రాచలం వెళ్తూన్నా, మనసులో ఇదే బాధ మెదలుతూనేవుంది.

ప్రొద్దున్నే రైలు దిగగానే పేపరుకొన్నాను. ఇంతికి ఫోను చేసాను. ఇంకా తాజ్ లో పోరు సాగుతూనేవుందన్నారు. చల్లగాలి వీస్తున్నా మది మండిపోతూనేవుంది. ఏమిటిలా? ఎందుకిలా? ఇప్పుడేం చేయాలి? ఎంతకాలం ఇలాంటి దాడులను మౌనంగా సహిస్తూ, భరిస్తూ, అనుభవిస్తూంటాం?

ప్రశ్నలెన్నో. సమాధానాలు మాత్రం లేవు.
అరవై సంవత్సరాలుగా ప్రచుర్రితమవుతున్న ఒక వార పత్రిక కథా రచయితల సమావేశం నిర్వహిస్తే, కేవలం 30 మంది రచయితలు మాత్రమే రాష్ట్రమంతటి నుంచీ వచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ పత్రిక ఎంత ప్రాచుర్యాన్ని సాధించిందో! ఆ పత్రికకు రచయితల ఆదరణ ఎంతగావుందో!

జాగృతి పత్రికను నేను నా స్వంత పత్రికగా అభివర్ణించుకున్నాను ఒకప్పుడు. అసిధార, రాజతరంగిణి కథలు, వ్యక్తిత్వ వికాసం, కథా సాగర మథనం వంటి రచనలు నావి జాగృతిలోనే ప్రచురితమయ్యాయి. సినిమా రివ్యూలతో నేను నా రచనా శైలిని జాగృతిలోనే తీర్చి దిద్దుకున్నాను. ఇతర పత్రికలకు రాసేటప్పుదు నా దృష్టి వేరు. జాగృతికి రాసేటప్పుదు మాత్రం నేను నా కోసం రాసుకున్నట్టు రాసుకుంటాను. అందుకే, జాగృతి నిర్వహించిన ఈ సమావేశానికి కేవలం 30 మంది రచయితలు మాత్రమే రావటం నాకు బాధ కలిగించింది.

వచ్చిన రచయితలంతా బోలెడన్ని కథలు రాసినవారు. అనేక సంపుటాలు వెలువరించిన వారు. కాటూరి రవెంద్ర త్రివిక్రం, పులుసు గోపురెడ్డి, దోరవేటి, ఎంవీ సత్యనారాయణ, ఎనుగంటి వేణు గోపాల్, కోడిహళ్ళి మురళీ మోహన్, అయ్యగారి స్రీనివాస రావు  లాంటి వారు వచ్చారు. వీరందరూ తమ తమ కథల సంపుటాలతో వచ్చారు.

అయితే, సమావేశం ఆరంభమయిన కొద్ది సేపటికే కార్యక్రమ నిర్వాహకులకు సమావేశ లక్ష్యం పట్ల సరయిన అవగాహన లేదని అర్ధమయింది. ఎందుకంటే, వందల పైగా కథలు రాసిన రచయితలను సమావేశానికి పిలిచి, వారికి కథలేలా రాయాలి, ఎలాంటి కథలు రాయాలి, కథల ప్రయోజనమేమితి, లాంటి విషయాలను జీవితంలో కథలన్నవి రాయని వారితో చెప్పించారు.

కథా రచయితలను ఒక వేదిక పైకి తీసుకురావటం ఈ సమావేశ లక్ష్యమయితే, అదీ విఫలమయింది. అలా తీసుకురావటం వల్లా ఆశించిన ప్రయోజనమూ బోధపడలేదు.

ఇక, కొందరు పత్రాలను సమర్పించారు. ఆ పత్రాల సమర్పణకు ఎంచుకున్న అంశాలు ఎంత అయోమయంగా వుండాలో అంత అయోమయంగా వున్నాయి. కథలు నేపథ్యం, రచయితలు తీసుకోవలసిన జాగ్రతాలు ఒక అంశం. కథలలో కల్పనలు ఎంతవరకూ వుండాలన్నది మరో అంశం. సన్నివేశ సృష్టీకరణ మరో అంశం.

చివరికి సమావేశం ఎలా తయారయిందంటే, అవకాశం దొరికితే రచయితలు తమ గొప్పలు చెప్పుకోవటం, లేకపోతే, వ్యతిరేక భావజాలాలున్నవారిని దూషించటంగా మిగిలిపోయింది. మళ్ళీ అందరూ అదే దిద్దుబాటు, అవే కథలు, అవేకథకులను ఉదహరిస్తూ పోయారు. ఎవరికి వారు తమ పుస్తకాలను కాంపిమెంటరీలివ్వటం, ఒకరివీపు మరొకరు గోకుకోవటంతో సరిపోయింది. ఎందుకంటే, సమావేశం ఏర్పాతుచేయటమే తప్ప సరయిన ప్రణాళిక లేక, సరయిన అవగాహన లేక పోవటంతో గమ్యంలేని రైలుబండి పట్టాలమీద అవెటుపోతే అటు పరుగెత్తినట్టు సమావేశం పరుగెత్తింది.

ఇంతకీ కార్యక్రమ నిర్వాహకులు వక్తలను ఎన్నుకోవటంలో రచయితల నాణ్యత, వారి ప్రతిభలకన్నా నిర్వాహకులకు వారెంత కావలసినవారో, అడుగులకు మడుగులొత్తేవారో అన్న విషయాలపైనే ఆధారపడివుందన్నది కార్యక్రమం జరుగుతూంటే స్పష్టమయింది.

ఒక రచయిత 40ఏళ్ళ క్రితం రచనలు మానివేశాడు. ఇటీవలె ఆయన తన పాత రచనలను సేకరించి పుస్తకంగా వేశాడు. అయితే, ఆ పుస్తకంవేయటంలో ఆయన కార్యక్రమ నిర్వాహకుల్లో కొందరిపైన ఆధారపడి వారిని శరణువేడి పెద్దపీటవేశాడు. దాంతో, ఒక 30 ఏళ్ళ క్రితం ఆయన కథలగురించి చేసిన ప్రసంగ పాఠాన్ని అందరికీ పంచిపెట్టారు. రచయితలకది శిరోధార్యమన్నారు. కథా రచనలలో కొత్త పోకడలు పోతూ, అనేక ప్రయోగాలు చేస్తున్న రచయితలంతా ఆయన ముందు బలాదూరన్నారు. ఆయనను మధురాంతకం రాజారాంతో సమాన స్థాయిలో నిలిపారు. రచయితలంతా ఆయన సూచనలను పాటిస్తూ రచనలు చేయాలన్నారు.

ఈ నిజం అర్ధమయి ఆ దెబ్బ నుంచి తేరుకునేలోగా మరో వజ్రాఘాతం తగిలింది.

ఒక రచయిత కొన్ని కథలు, నవలలు రాసిన రచయిత, కేవలం నిర్వాహకులకు ప్రీతి పాత్రమవటం వల్ల, ఒక విశిష్ట ప్రాధాన్యాన్ని సాధించారు. తను రాలేకపోతున్నా తనవంతుకు, తన సందేశంగా కథారచయితలు కథలెలా రాయాలో సూచనలను ఉత్తరం రూపంలో పంపారు. సమావేశానికి వచ్చిన ఎందరినో మాట మధ్యలో సమయమయిపోయిందని పంపినా, ఆ వుత్తర రాజంలోని అతి గొప్ప సందేశాన్ని, తల పండిన కథకులు, అనుభవశాలురయిన సాహితీకారులందరికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా వినిపింపచేసి తరింపచేశారు.

ఈ సందర్భంలో నాకు మరో విషయం అర్ధమయింది.

సభకు ఆరచయిత రారని తెలిసినా కొన్నాళ్ళా ముందుగానే సభలో చర్చించే అంశాలు తెలపటమే కాక, సందేశాన్ని కూడా కోరారు నిర్వాహకులు. సభలో ఒక చర్చను నిర్వహించవలసిన నాకు, అడిగినా కార్యక్రమ ప్రణాళిక లభించలేదు. వేదికపైకి చేరిన తరువాత అంశమేమిటో తెలిసింది.

అప్పుడర్ధమయింది, మన దేశంలో నిజానిజాల కన్న వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ప్రాధాన్యం వహిస్తాయి. వ్యక్తిగత ప్రతిభ కన్న, వ్యక్తికి ఉన్న సంబంధాలే ప్రాముఖ్యం వహిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలకన్నా, తాత్కాలిక అహం తృప్తులే అగ్ర తాంబూలాన్ని అందుకుంటాయి. ఇది, సాహిత్యంలోనేకాదు, అన్ని రంగాలలోనూ మనలను దెబ్బ తీస్తోంది. అర్హతలున్నవారు, మౌనంగా ఒక మూలన మిగిలిపోతే, అవసరమయినది తప్ప మిగతా అర్హతలున్నవారంతా అందలాలెక్కుతారు. ఒకవేళ నాలాంతివాడు, గొంతు విప్పి ఇదేమని అడిగితే, అసూయాగ్రస్తుదు, అహంకారి అవుతాడు. తిరస్క్రుతుడు, పరిచ్యుతుదు అవుతాడు.

సమావేశమయి తిరిగివసూంటే తెలిసింది, ముంబాయి పూర్తిగా మన స్వాధీనమయిందని. రాజకీయ నాయకులు రాజీనామాలాటలు ఆరంభించారనీ.

సర్వేజనా సుఖినోభవంతు !

December 1, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized