Archive for December 16, 2008

నేను చదివిన మంచి పుస్తకం-17

ఒకోసారి ప్రపంచంలో అఖండ ప్రతిభా పాటవాలు కల వ్యక్తులు ఒకేసారి జన్మిస్తారు. అనేక సందర్భాలలో వీరు ఒకే కుటుంబంలో జన్మిస్తారు. అయితే, వారిలో పెద్దవాడు ముందుగా జన్మించిన కారణాన ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ముందుగా పొందుతాడు. అందరి దృష్టినీ ఆకర్శిస్తాడు. ఇది, తరువాత వాడిలో identity crisis ను కలిగిస్తుంది. ఈ భావనను ఆ వ్యక్తి తట్టుకుని నిలబడగలిగి తనదయిన ప్రత్యేక అస్తిత్వాన్ని సాధించగలిగితే, పెద్దవాడిని మించి పేరు ప్రఖ్యాతులు సాధిస్తాడు. తనలోని ప్రతిభకు న్యాయం చేకూరుస్తాడు. అలాకాని పక్షంలో ఎంతో ప్రతిభ వుండికూడా, అఙ్నాతంలో వుండిపోతాడు. కొన్ని అరుదయిన సందర్భాలలో మాత్రం సోదరులిద్దరూ తమదయిన ప్రత్యేక దారులను ఎంచుకుంటారు. సరి సమానంగా ఘన కీర్తిని సాధిస్తారు. తమ కళానైపుణ్యంతో తమ చుట్టూవున్న సమాజానికి వన్నెలు దిద్ద్దుతారు.

అలాంటి సోదర కళాకారులు ఆర్ కే నారాయణ, ఆర్ కే లక్ష్మణ్ లు. అన్న ప్రభావమ్నుంచి తప్పించుకుని, అన్నయ్యకు దీటుగా తనదయిన ప్రత్యేక పద్ధతిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుడు ఆర్ కే లక్ష్మణ్. ఆయన స్వీయ జీవిత చరిత్ర the tunnel of time .

ఆర్ కే లక్ష్మణ్ పైన అయిదుగురన్నయ్యలున్నారు. ఈయన ఆరవ వాడు. చివరి వాడు. ఒకరకంగా ఇది ఆర్కేకు లాభించింది. ఎందుకంటే లక్ష్మణ్ కు ఊహ తెలిసేసరికే పెద్దన్నయ్య పేరు పొందిన రచయిత. మిగతా వారంతా స్వంత వ్యక్తిత్వాలున్నా, అతని నీడలో వొదిగినవారు. దాంతో, లక్ష్మణ్ కు తన కార్య రంగాన్ని ఎంచుకునే స్వేచ్చ, ప్రోత్సాహాలు సులభంగా లభించాయి.

ఆర్కే లక్ష్మణ్ స్వీయ జీవిత చరిత్ర చదువుతూంటే ఒక విషయం స్పష్టమవుతుంది. కళ అన్నది ప్రతివారిలో బీజ రూపంలో వుంటుంది. కానీ దాని అసలు స్వరూపాన్ని గ్రహించి, బీజ ప్రాయమయిన కళా స్వరూపాన్ని వృక్ష స్థాయికి ఎదగనివ్వటమన్నది అనేక అమ్షాలపైన ఆధారపడివుంటుంది. లక్ష్మణ్ విషయంలో అతని కన్నా ముందే నారయణ్ కు పేరు లభించటం ఎంతగానో లాభించింది. పెద్ద కుటుంబం కావటంతో ఆంక్షలూ, అడ్డూదుపులూ లేకుండా తన సృజనాత్మక ఇష్టాలను అనుసరించే వీలు లక్ష్మణ్ కు చిక్కింది. అందుకే చిన్నప్పటి నుంచీ అవకాషం దొరికితే బొమ్మలు గీయటం అతడికి అలవాటయింది. ఇంట్లో బోలెడంత మంది వుండటంతో ఆయన స్కూలుకు వెళ్ళాడో లేదో కూడా పట్టించుకోలేదెవ్వరూ. ఇదీ అతడి సృజనాత్మకత విషృంఖలంగా ఎదగటానికి తోడ్పడింది. తనని పాఠశాలలో చేర్పించే ప్రయత్నాలను లక్ష్మణ్ వర్ణించిన తీరు నారాయణ్ రచనలను గుర్తుకు తెస్తుంది. తన జీవితంలోని ఏయే సంఘటనలు నారాయణ్ కథలుగా మలచాడోకూడా లక్ష్మణ్ ఈ రచనలో పొందుపరచాడు. అంతేకాదు, ఇద్దరి నడుమ వయో తారతమ్యం అధికంగా వుండటం వలన సాధారణంగా సోదరుల నడుమ వుండే rivalry లు, అసూయలు వీరి నడుమ పెద్దగా పొడసూపలేదు. పైగా, ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగారు. నారాయణ్ కథలకు లక్ష్మణ్ బొమ్మలు వన్నె తెచ్చాయనటం అనృతం కాదు.

ఈ పుస్తకంలో తన బాల్యంలోని రెండు సంఘటనలను లక్ష్మణ్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు. స్కూల్లూఅ తాను ఆకు బొమ్మ గీసినప్పుడు అధ్యాపకుడు పొగడటం లక్ష్మణ్ లోని చిత్రకారుడికి జీవం పోస్తే, తన బొమ్మను వికృతంగా గీసి వెక్కిరిస్తున్నాడని మరో అధ్యాపకుడికి కోపం తెప్పించటం లక్ష్మణ్ లోని వ్యంగ్య చిత్రకారుడిని తట్టి లేపింది.

ఒకోసారి ఎంతోఅ చిన్నవిగా అప్రధానంగా అనిపించిన సంఘటనలు వ్యక్తి జీవిత గమన దిషను నిర్దేశిస్తాయనటానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.

ఈ పుస్తకంలో అనేక సంఘటనలు, లక్ష్మణ్ వ్యాఖ్యలు ఒక వ్యక్తి విజయం సాధించటంలో విధి పాత్రను స్పష్టం చేస్తాయి. లండన్ లో ప్రముఖుల బొమ్మలు గీయటాన్ని వివరించిన తీరు గొప్పగా అనిపిస్తే, బాల్యం సంఘటనలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఆనందకరమయిన బాల్యం ఆరోగ్యకరమయిన మనిషిగా ఎదగటానికి పునాది అనిపిస్తుంది.

హిందూలో కార్టూన్ల వల్ల ప్రేరణ పొందటం నుంచి, సగటు మనిషి సృష్టి ద్వారా చిరస్థాయినార్జించటం వరకూ, మనుమరాలి ఆటలలో సర్వం మరవటం వరకూ ఆద్యంతం, ఆహ్లాదకరంగా, హాయిని గొల్పుతూ సాగుతుందీ రచన. అలాగని తేలిక పాటి రచనకాదు. తేలికగా అనిపించే పదాల భావాలవెనుక అంతులేని వేదనలు, ఆలోచనలు తొంగిచూస్తూంటాయి. కళాకారుడి అంతరంగాన్ని మనకు చేరువ చేస్తాయి.

ఈ పుస్తకం చదువుతూంటే లక్ష్మణ్ మంచి రచయిత అయివుండేవాడనిపిస్తుంది. కానీ, రచయిత అయివుంటే, నారాయణ్ తో పోలికలు వచ్చేవి. నారాయణ్ అప్పటికే సుప్రసిద్ధుడు. లక్ష్మణ్ ఎంత బాగా రాసినా తేలిపోయేవాడు. ఆయన చిత్రకారుడు కావటం వల్ల ఇలాంటి అడ్డంకులను అధిగమించాడు. తనదయిన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇలాంటి అనేక అమ్షాల గురించి అవగాహన ఆలోచనలు కలిగిస్తుందీ లక్ష్మణ్ స్వీయ జీవిత చరిత్ర. సాహిత్యాభిమానులంతా తప్పని సరిగా చదివి, కొని, మాటి మాటికీ చదువుతూండాల్సిన పుస్తకం ఇది.

ఈ పుస్తకాన్ని పెంగ్విన్ వారు ప్రచురించారు. వెల 200/-.

December 16, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized