Archive for December 20, 2008

పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-1

కాదేదీ రాతలు కోతలకనర్హం!

నిన్న నేను పుస్తక ప్రదర్శనలో నా పుస్తకాలను writer’s stall లో పెట్టి అమ్మకాలు ఆరంభించాను.

నేను వెళ్ళి 100/- కట్టి స్టాలు చేరుకునే సరికి ఒక కమ్మ పుస్తకాల ప్రచురణకర్తలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉన్నారు.

నిజానికి నేను రచయితలీ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటారనుకున్నాను. స్టాలులో జాగా కోసం తన్నులాటలూ, తోపులాటలూ వుంటాయనుకున్నాను.

మమ్మొలుగా ప్రదర్శనలో ఒక స్టాలును ఏర్పాటు చేయాలంటే 13000/- కట్టాలి. అలాంటిది, నిర్వాహకులే ఒక స్టాలును రచయితలకోసం, అదీ కేవలం 100/- కే కేటాయించటం అన్నది ఎంతగానో అభినందనీయమైన విషయం. ఈ మధ్య కాలం లో రచయితలు ఎవరి పుస్తకాలను వారే ప్రచురించుకోవాల్సి వస్తోంది. పెద్ద ప్రచురణకర్తలు ప్రచురించిన పుస్తకాలకు ప్రచారంలో కానీ, అమ్మకాల విషయంలో కానీ సమస్య లేదు. పెద్ద రచయితల పుస్తకాలకూ సమస్య లేదు. చిన్న రచయితలు, ఒకతో రెందో పుస్తకాలు ప్రచురించిన వారు తమ పుస్తకాలను ప్రచారం చేఉకోలేరు. ఎవరితో కొనిపించలేరు. కనీసం అలాంటి పుస్తకాలున్నాయని కూడా పదిమందికి తెలిసేట్టు చేసుకోలేరు. అందుకే, ఇంత మంచి అవకాశం దొరికితే రచయితలు తేనె చుట్టూ ఈగల్లా ముసురుతారని భయపడుతూ వెళ్ళాను.

తీరా చూస్తే, ఇంగ్లాండు ఖైదీలకోసం ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాలా వుంది ఆ స్టాలు. వెళ్ళినవాడు ఓ జండా పాతేసుకుని ఇది నాది అంటే చాలు అన్నట్టు వుంది.

కమ్మ ప్రచురణలవారు మొత్తం స్టాలులో తమ పుస్తకాలను పరచుకున్నారు. నెమ్మదిగా వారి పుస్తకాలను పక్కకు నెట్టి నా పుస్తకాలను పరిచా. కోనే వారికోసం ఎదురుచూపులు ఆరంభించా.

భలే మంచి చౌకబేరమూ అని పాడాలనుకున్నా. కుదరలేదు. అక్కడ మైకులో ఎవరో ఎవరూ వినకున్నా ఏదేదో మాట్లాడుతూన్నాడు.

చూస్తే స్టాళ్ళే జనాలకన్నా ఎక్కువున్నాయి. అయినా ఇది మొదతి రోజే కదా అని సర్దిచెప్పుకున్నాను.

ఇంతలో నా దృష్టి మన ఈ స్టాలు పై పడింది. వెళ్ళి పరిచయం చేసుకున్నా. పప్పు అరుణ గారు నన్ను గుర్తుపట్టారు. శ్రీధర్ కలిశారు. చావా కిరణ్ గారు చిరునవ్వులు చిందించారు. నన్ను ఫోటో తీయటమేకాదు, నాతో ఫోతో దిగారు. మా ఇద్దరి ఫోతో చూస్తూంటే మేము ముందే కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుంటే లారెల్ హార్డీ జంట తలదన్నే వారమనిపించింది.

ఇంతలో నా మొదటి customar, నా పుస్తకాలను కొన్న ఏకైవ మహానుభావుదు కలిశాడు.

నిజానికి పుస్తకాలయితే పరచాను కానీ ఎవ్వరూ కొంటారని అనుకోలేదు. అందరూ దూరం నుంచి తొంగి చూసి పోతున్నారు. కొందరయితే ఈ వైపు చూడటం పాపం అన్నట్టు ముఖం తిప్పుకు పోతున్నారు. ఇంకొందరు దగ్గరకు వచ్చి, అలా అలవోకగా పైనుంచే వొంగి పుస్తకాలను ముట్టుకుంటే మైల పడతాయన్నట్టు చూసి ముక్కు తిప్పి పెదవి విరిచి పారిపోతున్నారు. మరి కొందరు సోమ శంకర్ మనీప్లాంట్ పుస్తకం చూసి మనీ ఎలా సంపాదించాలో రాసారా? అని ఆశగా అడిగితే, లేదు ఇతర భాషలలోని మంచి కథలను తెలుగులోకి అనువదించాడు అని సమాధానమిచ్చా. ఆయన వెంటనే అంటరాని అసుద్ధాన్ని చీదరించుకుని పారేసినట్టు ఆ పుస్తకాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. పోన్లే కనీసం చూశాడని సంతృప్తి పడ్డా. ఇంకొకాయన అంతర్మధనం పుస్తకం చూసి, నవలా? ఇంత పెద్దది చదవటం కష్టం, అని పారేసిపోయాడు. ఇంతలో ఒక ముసలాయన ఒక మూట పట్టుకుని వచ్చి గంటసేపు నా పుస్తకాలెవరికీ కనబడకుండా నుంచుని వచ్చిన వారందరికీ లెక్చరిచ్చి తన పుస్తకాలు అమ్మి పోయాడు. స్టాలులో పుస్తకాలు పెట్టమన్నా ఆయన అడ్డు తొలగించుకోవటానికి. ఎందుకంటే ఆయన ఎవరినీ దగ్గరకు రానెయటంలేదు. ఆయన అడ్డుండటంతో అందరూ కమ్మ పుస్తకాలు చూసి నెమ్మదిగా జారుకుంటున్నారు. చివరికి డబ్బులు కట్టమనగానే ఆ ముసలాయన వంద ఎందుకు దండగా! నేనిలాగే అమ్ముతా అంటూ మూట పట్టుకుని ప్రజల మీద పడ్డాడు.

ఆహా రచయితల బాధలూ అనుకున్నాను. పుస్తకం రాయటమొక తపస్సు అయితే, దాన్ని ముద్రించుకోవటం ఒక వేదన. అచ్చువేసిన పుస్తకాలను దగ్గరుండి అమ్మటం మరణ యాతన అనిపించింది.

ప్రతివాడూ పుస్తకాన్ని చూస్తూంటే కొంటాడేమో అన్న ఆశ కలుగుతుంది. పేజీలు తిప్పుతోంటే ఆశ పెరుగుతంది. పెదవి విరిచి పక్కన పెట్టి పోతూంటే ఎందుకునాకీ బాధలు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తిని పడుకోక, అనిపిస్తుంది.

అలా నుంచుని వచ్చి చూసి పోయే వారిని చూస్తూంటే, కూతురిని పెళ్ళి చూపుల్లో చూసి పెదవి విరిచేవారిని చూస్తూంటే తల్లి తండృల మనస్సుల్లో కలిగేవేదన అనుభవానికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పుస్తకానికి తల్లి తండ్రి నేనే కదా!

ఇలాంటి ఆశ నిరాశల ఆలోచనల మధ్య ఊగిసలాడుతూంటే నా పుస్తకాలను కొని ఆశాదీపానికి నూనె పోసి మరింత ప్రజవలించేట్టు చేసిన ఆ వ్యక్తి వచ్చాడు.

బ్లాగులోని ఫోటో ప్రాణం ఓసుకున్నట్టున్నాడు. చూడగానే సులభంగా గుర్తుపట్టవచ్చు. కత్తి మహేష్ కుమార్ చక చకావచ్చి కత్తిలా రెండు పుస్తకాలు కొన్నాడు.

నేను , పుస్తకాలు కొన్న మొదటి వ్యక్తికి ఘనంగా సన్మానం చేయాలనుకున్నా. పూల మాల వేఇ సత్కరించి పూజ చేద్దామనుకున్నా. స్త్రోత్ర పాథం రాసి గానం చేద్దామనుకున్నా. అతని పేరు సువర్ణాక్షరాలతో లిఖించి, పుస్తక మహరాజ పోషకుడన్న బిరుదివ్వాలనుకున్న.

కానీ హఠాత్తుగా కత్తి పుస్తకాలను కొనేసరికి నిరుత్తరుడనయిపోయా!

ఆతరువాత మళ్ళే చూపులు, ఎదురుచూపులుఇ, నిరాశలు, నిట్టూర్పులు…….

దుకాణాలు కట్టేఅయమని ప్రకటించటంతో మూసేస్తూంటే ఒకాయన పరుగున వచ్చాడు. ఆశగా పుస్తకాలు చూపా. నవ్వి తెలుగు నహీ ఆతా అంటూ వెళ్ళిపోయాడు.

ఈ మొదటి రోజు పుస్తక విక్రయానుభవం నాకు మజ్రూహ్ గాజల్ ను గుర్తుకు తెచ్చింది.

హం హై మతాయె కూచవో బాజార్ కీ తర్హా
ఉఠ్ తీ హై హర్ నిగాహ ఖరీదార్ కీ తర్హా.

నేను బజారులో వస్తువులా నిలుచున్నాను. ప్రతీవాడూ నన్ను కొనేవాడిలానే చూస్తాడు.

ఇది ఒక వేష్య స్థితిని వర్ణిస్తూ రాసిన పాట. ప్రస్తుత సమాజంలో రచయితకేకాదు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వర్తిస్తుందీపాట.

దుకాణం కట్టేసి కారు తీస్తూంటే పోలీసు చాయి డబ్బులడిగాడు. ఎలాగో అనిపించింది. డబ్బులిచ్చి బయటపడ్డా.

చల్లగాలి రివ్వు రివ్వున తాకింది. హాయిగా అనిపించింది.పెదవులపైకి పాట వచ్చింది.

దిల్పె ఆస్రా కియే హం తొ బస్ యుహీన్ జియే
ఎక్ కదం పె హస్ లియే ఎక్ కదం పె రోలియే
జోభి ప్యార్ సే మిలా హం ఉసీకె హోలియే
హుం హై రాహి ప్యార్ కే హం సె కుచ్ న బోలియే.

అమ్మకాల అనుభవాలను తలచుకుని నవ్వుకుంటూ ఇల్లు చేరాను. రాస్తే అచ్చువేసి అమ్ముతూ పడాల్సిన బాధలు మరచి రాత ఆరంభించాను.

దీవాన ముఝ్ కో లోగ్ కహే
మై సంఝూ జగ్ హై దీవానా!

December 20, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized