Archive for December 23, 2008

పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-3

వార్త ఆదివారం మాగజీన్ కు కవర్ స్టోరీ తయారు చేసాను. మిగతా పనులు చూసుకుని అతి అయిష్టంగా పుస్తక ప్రదర్శన వైపు వెళ్ళాను. ఇవాళ్ళ శ్రీపతి శర్మ తన భార్యతో వస్తానన్నాడు. ఆవిడ ఫోను చేయటం వల్ల నా అర్ధాంగి కూడా వస్తానంది. వాళ్ళ ఆఫీసు నుంచి ప్రదర్శన స్థలానికి బస్సు లేదు. ఆటో లో రావాల్సి వచ్చింది. ఈరోజు కేపీ అశోక్ కుమార్ కూడా వస్తానన్నాడు. సరయిన బస్సులేక ఆయన సెక్రెటేరియట్ నుంచి నడుస్తూ వచ్చాడు. అప్పుడు అనిపించింది, పుస్తక ప్రదర్శనకు ప్రజలు పెద్ద ఎత్తున రావటంలేదని వాపోతున్నాము, కానీ నెక్లేసు రోడ్డులో ఈవైపు రావాలంటే స్వంత వాహనం వుంటేనే సులవవుతుంది. పైగా, ఇక్కడికి వచ్చేవారంతా ప్రేమికులో, సాయంత్రం కాస్త సమయం రిలాక్సుగా గడపాలనుకునేవారో. కేవలం పుస్తకాల కోసమే అఫీసయినతరువాత, ఇంత దూరం నడక మీద వచ్చేవారెంతమంది? ప్రేమికులకు పుస్తకాలతో పనిలేదు. రిలాక్సవ్వాలనుకున్నవారికీ పుస్తకాలతో పనిలేదు. కాబట్టి, ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంలేదని అనుకునేకన్నా, వస్తున్న వారిని చూస్తే, ఇంత మంది నిజమయిన పుస్తకప్రేమికులున్నారన్న సంతృప్తి కలుగుతుంది.

ఇవాళ్ళ నేను వచ్చేసరికి ఆలస్యమయింది. వార్తలో కవర్ స్టోరీ ఇచ్చి, గుడిపాటితో, ఎడిటర్ టంకశాల అశోక్ గారితో ముచ్చటించి తీరికగా వచ్చాను.

నేను వచ్చేసరికి మా స్టాలులో యుద్ధం జరుగుతోంది.

డాక్టర్ నగేష్, అతని అనుచరులు ప్రాక్టికల్ సైకాలజీ అనే ఆయన పత్రికను పట్టుకుని వచ్చారు. మొత్తం ఒక టేబిల్ నిండా వరుసగా ఆ పత్రిక కాపీలు పరచారు. దాంతో అటు కమ్మ వారు, ఇతు తెలంగాణా వారు అతనితో యుద్ధానికి దిగారు. నేను చేరే సరికి ఇదీ పరిస్థితి.

ఇది రచయితల స్టాలు. అందరమూ స్థలాన్ని పంచుకోవాలి.ఇదొక పరస్పసహకార పుస్తకల అమ్ము వేదిక. ఒక్కరే అంతా ఆక్రమిస్తే కుదరదు. అందరి పుస్తకాలూ కనబడాలి అని చెప్పా. నగేష్ అనుచరుదు వినలేదు. వుండనీ సార్ అంటూ మా పుస్తకాల మీద పత్రికలు పరచేస్తున్నాడు.

అసలే ఒక రకమయిన వైరాగ్యంలో వున్నాను. సమయం ఇక్కడ అనవసరంగా వ్యర్ధం చేఉకుంతున్నానన్న భావనతో వున్నాను. ఇంత్లో నేను చదవాల్సిన పుస్తకాలు నన్ను పిలుస్తున్నాయి. రోహింటన్ మిస్త్రీ, శశి దేష్పాండే, జాన్ గ్రిబ్బిన్, పాలగుమ్మి పద్మరాజు, ఎనుగంటి వేణు గోపాల్, సీ నరసిమ్హారావు, మార్క్ త్వెయిన్ లు నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను ఇక్కడ ఎండాకాలంలో వస్తాయో రావో తెలియని, వచ్చినా, వర్షిస్తాయో లేవో తెలియని నల్ల మేఘాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఎదురుచూస్తూ, ఆ వొచ్చే మేఘాలు రాల్చీ రాల్చని చినుకు కోసం ఆత్ర పదుతూ, వారి దృష్తిని ఆకర్సించాలని స్థలం కోసం పోరాడాల్సి రావటం అత్యంత చిరాకుని కలిగించింది.

మరో మాటకు ఆస్కారం లేకుందా, వారి పత్రికలు జరిపి అన్నితినీ ఒకే వరుసలో ఒక దాని క్రింద ఒకటి పెట్టి మిగతా వారి పుస్తకాలన్నితికీ స్థలం కల్పించాను. ఆ అబ్బాయి ఏదో మాత్లడబోతే, నేను నీతో కాదు మీ నగేష్ తోనే మాట్లాడతాను, ఆయననే రమ్మను అన్నాను. అని తల ఎత్తి చూస్తే ఎదురుగా నగేష్ ఉన్నాదు.

ఆయన్ అనన్ను ఆప్యాయంగా పలకరించాదు. మీ రచనలు అత్యంత ఆసక్తిగా చదువుతానని అన్నాడు. ఆయనకు చెప్పాను, ఇక్కడ వున్న స్థలంలోనే అందరమూ సర్దుకోవాలని. ఆయన తన అనుచరుడికి అదే చెప్పాడు. మళ్ళీ కలుదాము, మీతో మాత్లాడాలి చాలా అన్నాడు వెళ్తూ. ఆయనకు నేను రాసిన adolescent psychology ఇతివృత్తం కల అంతర్మధనం కాపీ ఇచ్చాను. తీసుకుని వెళ్ళిపోయాదు.

ఇదంతా జరిగే సరికి మనసు పాడయిపోయింది. ఇంత్లో నా సామ్రాజ్యంలో కూచుని మంచి పాతల రస ప్రవాహంలో తేలుతూ, పుస్తకాలు చదువుతూ అవి సృష్తించో అద్భుత ప్రపంచంలో తేలుతూనో, లేకపోతే నేను వినూత్న ప్రపంచాన్ని స్ర్జిస్తూనో హాయిగా వుండేవాడిని, నాకీ స్థలాల గోల ఏమిటి, అమ్మకాల ఆత్రం ఏమిటీ అనిపించింది.

స్టాలు వదలి దూరంగా కూచున్నాను. శ్రీపతి అతని భార్య వచ్చారు. పద్మ వచ్చింది. అలా తిరుగుతూ ఒక సారి స్టాల్ వైపు చూసా. ప్రాక్టికల్ సైకాలజీ, కమ్మ పుస్తకాలు, తెలంగాణా పుస్తకాలు రాజీపది ఒప్పందానికి వచ్చాయి. అన్ని ఇతర పుస్తకాలపైన తమ ఆధిక్యాన్ని నెరపుతున్నాయి. పట్టించుకోలేదు. ఇంతలో వేరే మితృలు వస్తే వారితో మాట్లాడుతూ సమయం గదిపాను. ఒక పుస్తకావిష్కరణ ప్రహసనం చూసాను. ఆతరువాత నేను శ్రీపతి రిలాక్సుదుగా కూచున్నాము.

ఇంతలో, పప్పు అరుణ వచ్చారు. నా పుస్తకాలు కొంటానన్నారు. పుస్తకాలు కొంటానని మొదతి రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి వచ్చారు. ఇంతలో ప్రొఫెసర్ పిల్లమర్రి రాము గారు వచ్చారు. అసిధార, జీవితం జాతకం కొన్నారు. అరుణ గారు వచ్చిన వేళాఅ విషేషమేమిటో కానీ దుకాణం మూసిన తరువాత నా పుస్తకాలు కొనటానికి అందరూ రావటం ఆరంభమయింది. ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు జీవితం-జాతకం కొన్నారు.వీరికి పుస్తకాలిచ్చి చూసేసరికి అరుణగారు లేరు. నా పుస్తకాలు తీసుకుని, ఈఎ తెలుగు దగ్గరకు వెళ్ళాను. అవి చూసి ఆవిడ, అన్నీ మీ పుస్తకాలేతెచ్చారు. నాకు మనీ ప్లాంట్ కావాలి అన్నారు. నా పొరపాతు అర్ధమయింది. నేను రచయితగా ప్రవర్తించాను. ప్రచురణ కర్తగా ఆలోచించలేదు. వెంటనే స్టాలుకు రమ్మన్నాను. నల్లమోతు శ్రీధర్ కూడా మనీప్లాంట్ కావాలన్నాడు. ఇద్దరినీ స్టాలుకు తీసుకెళ్ళాను. మొహమాటపెట్టి వారు కొనాలనుకున్న వాటికన్నా ఎక్కువ పుస్తకాలే కొనిపించాను. కానీ ఏదో ఉత్సాహము, ఆనదమూ కలిగాయి. నిజంగా, ఈ బ్లాగు బంధం ఏనాతిదోకదా! బ్లాగ్మితృల నుంచి ఇంతగా ప్రోత్సాహం లభిస్తోంది అనిపించింది.బయట ప్రపంచం పట్టించుకోకున్నా, గుర్తించకున్నా బ్లాగ్లోకం నన్ను ఇంతగా ఆదరిస్తోంది! గంగి గోవు పాలు గరిటెడయినను చాలు అన్నారు. బయట లక్షల సంఖ్యలో మెప్పు పొందేకన్నా, బ్లాగులో వందల సంఖ్యలో లభించే అసలు సిసలయిన ఆదరణే అమూల్యం.

అయితే, పుస్తకాలు కొన్న బ్లాగ్మితృలందరికీ మనవి. కొన్న పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. చదివి వదిలేయకుండా అభిప్రాయం నిర్మొహమాటంగా రాయాలి. పుస్తకం నచ్చితే దాన్ని పదిమందికీ పరిచయం చేయాలి. చదివించాలి. పుస్తకం గురించి చర్చించాలి. ఈరకంగా మంచి పుస్తకానికి ప్రచారము, ఆదరణలను కలిగించాలి. ఇజాలు, సంకుచితాల రంగుటద్దాల మోజులో పడి, గిరిగీసుకుని తనపై తానే పరిమితులు విధించుకుంటూ సహిత్య ప్రపంచం ఏం కోల్పోతోందో, మన బ్లాగు ప్రపంచం చూపించాలి. అసలు సిసలు సాహిత్యాన్ని ఆదరించి పెద్దపీట వేయాలి. మరోసారి బ్లాగ్మితృలందరికీ బహు కృతఙ్నతలు.

ఈరోజు పుస్తకాల అమ్మకానికి నేను రావటంలేదు. ఎందుకంటే నేనీవారం ఇంకా పవర్ పాలిటిక్స్ రాయలేదు. ప్రతివారం ఈ రచన నాకొక యఙ్నం లాంటిది. కాబట్టి ఈరోజు స్టాలులో స్థలం వేరేవారికి వదిలి, పోటా పోటీ ప్రపంచంలో బొటాబొటీగా పుస్తకాలమ్మేందుకు రేపు వస్తాను.

December 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

పుస్తకాక అమ్మకంలో నా అనుభవాలు-2

నిజానికి నా పుష్కర స్నానానుభవాలు రాదామనుకున్నాను. కానీ, ప్రొద్దున్నే సగటుమనిషి స్వగతం, వార్తకు బ్లాగుస్పాట్ లు అర్జెంటుగా రాయాల్సి రావటంతో సమయం చిక్కలేదు. ఆతరువాత ఆఫీసు, అటునుంచి పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు అమ్మటానికి వెళ్ళటంతో వీలు చిక్కలేదు. రాత్రి రాగానే కవర్ స్టోరీ రాత కోసం తగిన సమాచారం సేకరించటంతో ఆలస్యమయిపోయింది. అందుకే ప్రొద్దున్నె లేవగానే కంప్యూటర్ ముందు కూచున్నా.

మనిషి జీవితంలో కొన్ని అనుభవాలు కలుగుతాయి. అనుభవం కలిగిన వెంటనే దాని తీవ్రత అధికంగా వుంటుంది. కానీ, కొద్ది కాలానికి ఎంత తీవ్ర మయిన భావన అయినా పలుచనయిపోతుంది. ఒక అల వచ్చి అంతకు ముందరి అలను మింగేసినట్టు కొత్త అనుభవం పాత అనుభూతిని వెనక్కు నెడుతుంది.

అందుకే పుష్కర స్నానానుభవం వెనుకబడింది. పుస్తకాల అమ్మకాల అనుభవం దాన్ని మించింది. దాంతో నా టపా పుస్తకాల అమ్మకాల అనుభవంగా మారిపోయింది.

ముందుగా సుజాత గారికి ధన్యవాదాలు. కానీ ఈ రకంగా అయినా మిమ్మల్ని కలవగలననుకున్నాను. సోమ శంకర్, అంత sensitive గా వుంటే ఎలా? మన sensitivity మనల్ని రచనలకు ప్రేరేపించేదిగా వుండాలికానీ బాధకు దారి తీయవద్దు. ఆయన పుస్తకాన్ని విస్రేసిన దాన్ని వర్ణించాను తప్ప అది నీ పుస్తకంపైన వ్యాఖ్య కాదు. నా వ్యాఖ్య లోని శ్లేషను అర్ధంచేసుకోవాలి. ఒక అనువాద పుస్తకం కన్నా డబ్బు సంపాదన నేర్పే పుస్తకానికే ప్రాధాన్యం అన్న ధ్వని ని గమనిస్తే నా వర్ణన పుస్తకానికా, ఆ పుస్తకాన్ని అర్ధంచేసుకోలేని మనస్తత్వానికా అన్నది అర్ధమవుతుంది.

పుష్కర స్నానానికి వెళ్ళాను కానీ నా మనసంతా పుస్తక ప్రదర్శనలోనే వుంది. మన ఈ తెలుగు కార్యక్రమంలో మరి కొందరు బ్లాగర్లను కలసే అవకాశం పోయిందన్నది ఒక బాధ. జనం అధికంగా వచ్చేరోజు నేను లేకుండా పోతున్నానే అన్నది మరో బాధ. అయితే, పుష్కర స్నానం తరువాత అమ్మ ఆనందం చూసిన తరువాత మిగతావన్నీ చిన్నవి అయిపోయాయి. మంచిపని చేసానన్న సంతృప్తి కలిగింది. బ్లాగర్లము మళ్ళీ ఎప్పుదో కలవవచ్చు. కానీ పుషకరాలు మళ్ళేఎ మళ్ళే రావుగా. అదీగాక అమ్మ top priority కదా!

దారిలో వున్నప్పుదు, స్టాలులో వున్న శ్రీపతి శర్మ ఫోను చేశాడు. కమ్మ ప్రచురణలను సర్ది మన పుస్తకాలకు స్థలం ఏర్పాటు చేశాను. కానీ, తెలంగాణా పుస్తకాల ప్రచురణల వాళ్ళు వచ్చి హడావిడి చేస్తున్నారు. బానర్లు కట్టేసారు. మన పుస్తకాలను పక్కకు నెట్టి వారి పుస్తకాలను పరిచేసారు. కమ్మ, తెలంగాణాల మధ్య మనం కనబడకుండా నలిగి పోతున్నాం, అన్నాడు. అది రచయితల స్టాలు. అందరిదీ. బోర్దులు పెట్టి ఎవరూ స్వంతం చేసుకునేవీలు లేదు. మన స్థలం కోసం పోరాడు. ఏదో చేయి అన్నాను. కానీ, మనసంతా ఆయన వీళ్ళిద్దరి మధ్యా ఎలా నలుగుతున్నాడో అని భయంగానే వుంది.

అందుకే, సోమవారం రెండుకల్లా హాజరయిపోయా. ఎండగా వుంది. మాకు స్టాలులో రెందు టేబుళ్ళిచారు. ఒక దాని నిండా, కమ్మ చరిత్ర, కమ్మ నామ గోత్రాలు, ఇంతి పేర్లు, విదేశాల్లో కమ్మవారు లాంటి పుస్తకాలు, కమ్మ పత్రికలు నిండిపోయాయి. మరో టేబిల్ పయిన తెలంగాణా కథలు, తెలంగాణం, లాంటి పుస్తకాలు నిందిపోయాయి. కేసీయార్ నవ్వుతో పడివున్నాడు. ఈ గుట్టల మధ్య అసిధార పయిన సరస్వతి బిక్కు బిక్కు మంటోంది. జీవితం జాతకం పుస్తకం పైని గ్రహాలు వికటంగా నవ్వుతూన్నాయి. అంతర్మధనం పైని కల్లోల సాగరం ఓ మూల అణగి వుంది.

అయితే తెలంగాణా బానర్ దెబ్బకు శ్రీపతి, పెద్ద తెల్ల కాగితాల మీద మా పుస్తకాల వివరాలు రాసి స్టాలంతా అతికించాడు. తెలంగాణా పుస్తకాల ప్రచురణకు నిధులు కేసేఆర్ నుంది లభించాయి. అందుకని వారు రంగు రంగుల పెద్ద బానర్ కట్టారు. మాకు ఉన్న నిధి మా రచనా ప్రతిభనే. అందుకనే తెల్ల కాగితం పైన స్కెచ్ పెంతో రాసి పెట్టాడు. కానీ, రచయితల స్టాలు కాస్తా కులం ప్రాంతీయం అయిపోయింది. వచ్చిన వారు తెలంగాణా స్టాలనుకుంటున్నారు. అటు ఆ పుస్తకాలు చూస్తున్నారు. ఇటు కమ్మ పుస్తకాలు చూస్తున్నారు. మధ్యలో వున్న ఆధ్యాత్మిక పుస్తకాలు చూస్తున్నారు.

అంటే, ఒక వైపు ప్రాంతీయ సంకుచితం, మరో వైపు కుల సంకుచితం, ఇవి కాకపోతే ఆధ్యాత్మిక సాహిత్యం-వీటి నడుమ అసలు సాహిత్యం మరుగున పడుతోంది.

ఇలావుంటే లాభంలేదని proactive aggressive marketing ఆరంభించాను. వచ్చిన వారందరికీ జీవితం జాతకం చూపించి దాన్లో నేను చేసిన ప్రయోగాలు, చమత్కారాలు చెప్పటం ఆరంభించాను. దాంతో పుస్తకాన్ని తిప్పి చూసారు కొందరు. తొంగి చూఒసారు కొందరు. కానీ తెలంగాణా, కమ్మ పుస్తకాలే కొన్నారు. అవీ అమ్మింది నేనే. ప్రతివారూ కమ్మ పుస్తకాలలో తమ ఇంటి పేర్లు చూసుకుని ఆనందిస్తున్నారు. కొందరు తెలంగాణా లో రజాకారు ఉద్యమం గురించి పుస్తకాలు అడిగారు. ఈ మధ్యలో ఒకాయన జీవితం జాతకం కొనటానికి సిద్ధపడ్డాడు.

ధర చెప్పాను. 50 రూపాయలు. 10 శాతం తగ్గిస్తే 45/- అన్నాను. 35/- కి ఇవ్వరాదా అన్నడు. నవ్వాను. మేము రచయితలము. మాకు వ్యాపారం రాదు. రాయటమే వచ్చు అన్నాను. ఆయన నవ్వి 20/- చేతిలో పెట్టి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు నోట మాట రాలేదు. తేరుకుని, వెనకే వెళ్ళి 20/- ఇచ్చేసి పుస్తకం ఫ్రీగా తీసుకోంది అన్నాను. ఆయన వెంటనే వెనక్కి వచ్చి ఇంకో పుస్తకం తీసుకుని థాంక్స్ అని వెళ్ళిపోయాడు. అదేమితి ? అని అడిగా.

ఒక పుస్తకాన్ని నేను కొన్నాను. ఇంకోటి మీరు ఫ్రీగా ఇచ్చారు అన్నాడు వెళ్ళిపోయాడు, 20/- రూపాయలు జేబులో సర్దుకుంటూ.

ఆతరువాత proactive approach వదలి passive marketing చేసాను. ముగ్గురు జీవితం జాతకం కొన్నారు. మిగతా అంతా తెలంగాణ, కమ్మ పుస్తకాలు, శ్రీచక్రానికి సంబంధించిన పుస్తకాలు.

నేను ఫోను చేయటంతో రిషి పీఠం వారు సామవేదం శణ్ముఖ శర్మ పుస్తకాలు తెచ్చిపెట్టారు. వారికి కూడా టేబిల్ పైన స్థానం కల్పించాను. ఆ పుస్తకాలు కొన్నరు.

ఇంతలో శ్రీపతి వచ్చాడు. ఆ తెలంగాణా ఆయన వచ్చాడు. ఆయన వస్తూనే మళ్ళేఎ పుస్తకాలను పరిచాడు. మా పుస్తకాల పైన ఆయన పుస్తకాల్ను పెట్టాడు. నేను తీయబోతే వుంచండి అన్నాడు. అయినా ఆయనవి ఒక పక్కన సర్దాను. కానీ ఏ పక్కన వున్నా కులం, ప్రాంతీయాన్ని గెలవలేమని అర్ధమయింది. స్టాలు ఆయనకు అప్పగించి ఎక్సిబిషనంతా తిరిగాను. అది చూస్తూంటే ఒక ఆలోచన బలంగా తాకింది.

ఇక్కడ నేనేమి చేస్తున్నాను? నేను రచయితను. రాయటం నా పని. పుస్తకాలమ్మటం నా పనికాదు. ఇక్కడ ఇలా వుండటం వల్ల నా సమయం వృధా అవుతోంది. ఈ సమయంలో నేను ఎంతో చదివేవాడిని. రాసేవాడిని. ఇదంతా వదలి ఇక్కడ ఏం చేస్తున్నాను? అనిపించింది.

రాయటం నా పని. నేను రాస్తాను. దాన్ని స్వీకరించటమో తిరస్కరించటమో సమాజం పని. వాళ్ళాకే అవసరం లేనప్పుదు నేను తాపత్రయ పడి లాభం ఏమిటనిపించింది.

దాంతో రెపటి నుంచీ వీలయినంత తక్కువ సమయం గడపాలని నిశ్చయించాను. ఎందుకంటే ఇంత సేపు అక్కడ గడిపి నేను అమ్మింది 3 పుస్తకాలు. దీని కోసం నా విలువయిన సమయాన్ని వ్యర్ధం చేయటం సమంజసమా?

తిరిగి వస్తూంటే అయాన్ రాండ్ వ్యాఖ్య గుర్తుకువచ్చిని.

ఒక సమాజంలో ప్రజలు పెద్ద ఎత్తున నీచతాపరిపూర్ణమయిన విషయాలను ఆదరిస్తున్నారంటే కళాకారుడు బాధపడకూడదు. వాళ్ళా స్థాయి అంతే అనుకోవాలి, తన పని తాను చేసుకుంటూ పోవాలి.

నేనూ అదే చేయాలనుకుంటున్నాను.

December 23, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized