Archive for December 31, 2008

హాపీ న్యూ ఇయర్ టు ఆల్ !

కొత్త సంవత్సరం పరుగు పరుగున వచ్చేస్తోంది. సమయం ఎంత వేగం గా పరుగిడుతోందంటే, ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చినట్టుంది. అప్పుడే ఇది పాతదయిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. సమయం, ఇలా, ఎలా గడుస్తోందో తెలియకుండానే గడచిపోతోంది. ఏదో ఓ సమయంలో ఒక్కో వ్యక్తికి అది ఆగిపోతుంది. కానీ, సమయం పరుగిడుతూనే ఉంటుంది.

కొత్త సంవత్సరం వస్తోందంటే అందరూ సంబరాలు చేసుకుంటారు. ఆడతారు.పాడతారు. తాగుతారు. అర్ధరాత్రి వరకూ మేల్కొని కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తారు. అదేదో గొప్ప అద్భుతం సాధించినట్టు ఫీలయిపోతారు. రాత్రంతా నిద్రల్లేకపోవటం వల్ల తెల్లారి నుంచే తలనొప్పులతో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు. సగటు మనిషిగా అందరితోపాటూ నేనూ కొత్త సంవత్సరాగమనానందాన్ని అనుభవించేయాలని అనుకున్నా, ఎందుకనో ఏవేవో ఆలోచనలూ, భయాలూ ముసురుకుంటాయి. నా ఆనందాన్ని హరించేస్తాయి.

కొత్త సంవత్సరం వస్తే ఆనందం ఎందుకో నాకు అర్ధం కాదు. సంవత్సరం కొత్తదయినా మనం పాతవారిమే. మన సమాజం పాతదే. మన చుట్టూవున్నవారు పాతవారే. మన సమస్యలూ పాతవే. మన ఉద్యోగాలూ, ఇబ్బందులూ పాతవే. దీనికే అంతగా ఆనందించటం, ఎగిరి గంతులు వేయటం ఎందుకో నా సగటు బుర్రకు అర్ధంకాదు.

ఒకోసారి నాకు ఆలోచనలు వస్తూంటాయి.

మనము కాలగణన కోసం ఈ సంవత్సరాలూ, లెక్కలూ ఏర్పరచుకున్నాం. మనకు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈక్షణంలో అవకాశంవునప్పుడే ఆనందం అనుభవించేయాలన్న ఆత్రంతో ఏదో కారణం ఏర్పరచుకున్నామేమో అనిపిస్తుంది. అదీకాక, రేపన్నదిలేనట్టు, ఈరోజే అన్నీ అనుభవించేయాలన్న అభద్రతాభావంతో ఇలా అరుపులూ, కేకలూ, తాగితందనాలూ అలవాటయ్యాయనిపిస్తుంది. నేను అంటే చాదస్తంగా అనిపిస్తుందేమో కానీ, ఇదంతా రేపు గురించి ఆలోచనలేక ఈరోజే జీవితం అనుకునే పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం తప్ప మరేమీ కాదు. ఎందుకంటే, మన తత్వంలో మనకు గతం వుంది. వర్తమానం వుంది. భవిష్యత్తువింది. మనం గతంలో చేసిన పనుల ఫలితం వర్తమానంలో అనుభవిస్తాం. వర్తమానంలోని పనుల ప్రభావం భవిష్యత్తుపైన వుంటుంది. కాబట్టి, కాలం మనకు ఒక్క రోజులో సమాప్తమయ్యేదికాదు. ఇది అనంతకాలం ప్రవహిస్తూండే ఒక అవిచ్చిన్న ధారవంటిది. నీటిలోకి రాయి విసిరితే కేంద్రం నుంచి అలలు నీరంతా విస్తరించినట్టు మనం చేసే ప్రతిపనీ ప్రతి ఆలోచన ప్రభావం ఎంతో దూరం వరకూ వుంటుంది. అందుకే మనకు సంబరాలంటే తాగి తందనాలాడటం కాదు. రేపటితో జీవితం సమాప్తమయిపోయేట్టు వెర్రికూతలు, మొర్రి చేతలూ, వెర్రి మొర్రి గంతులూ మనకు ఆనందించటం కాదు. ఇవన్నీ క్షణకాలం ఆనందాలు. మత్తు ఆనందింపచేస్తుంది. మత్తు దిగిన తరువాత మళ్ళీ అదే ప్రపంచం ఏడుపు ముఖంతో కళ్ళముందు నిలుస్తుంది. ఇది పారిపోవటం. పాశ్చాత్యుల రేపు లేదన్న పలాయనవాదం.

అందుకే, మన కొత్త సంవత్సరం సంబరాలు అర్ధవంతంగా ఉంటాయి. గాంభీర్యంతో వుంటాయి. పొద్దున్నే లేస్తాం. శుభ్రంగా స్నానించి భక్తిగా భగవంతుడిని ధ్యానిస్తాం. తీపిచేదుల జీవితానికి ప్రతీక అయిన పచ్చడిని ఆరగిస్తాం. ఆతరువాత భవిష్య శ్రవణం వింటాం. రాబోయె సుఖాలతోపాటూ, కష్టాలనుకూడా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమవుతాం. మంచిమాటలు వింటాం. మంచి ఆలోచనలు చేస్తాం. మనతో ప్రపంచం అయిపోవటం లేదు. మన తరువాత తరాలవారికి మంచి ప్రపంచం అందించే బాధ్యత మనపై వున్నదన్న విఙ్నతను ప్రదర్శిస్తాం. ఇదీ మన సంబరాల స్వరూపం. దీన్లో ఎంత ఆలోచనవుంది. ఎంత నాగరికతవుంది. కానీ ఏం చేస్తాం, మనకు ఎంజాయ్మెంట్ అంటే శరీరం వూగాలి. తూగాలి. గాల్లో ఎగరాలి. మత్తులోపడి సర్వం మరచిపోవాలి అన్న ఆలోచనలు స్థిరపడ్డాయి. ఇదే అభివృద్ధి. నాగరీక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాము. కాదన్నవాడు చాందసుడు, పాతనుపట్టుకుని వేలాడే పిచ్చివాడవుతున్నాడు. కాదన్నవాడిని హేళన చేసి చులకన చేసి ఉద్ధరించేందుకు ప్రపంచంలో అంతా నడుం కడుతున్నారు. పంచాంగం చించేసినంత మాత్రాన తారలు అదృష్యం కానట్టు, వాళ్ళు కాదన్నంత మాత్రాన నిజం నిజంకాకుండా పోతుందా? కానీ ఈ శారీరక ఎంజాయ్మెంట్ లో పడి, మనం ఆత్మను కోల్పోతున్నాము.

అయ్యో కొత్త సంవత్సరం ఏదో సరదా కబుర్లు చెప్పకుండా ఏదో రాసేస్తున్నాను. చూశారా, సగటు మనిషికి సమయం, సందర్భం తెలియవు. వాగటమే తెలుసు. క్షమించండి.

wish u all a very happy new year

ఇది, 28.12.09 ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ప్రచురితం.

December 31, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.