Archive for January, 2009

హిందూ, హిందూత్వ వేర్వేరా?

ఇటీవలె ఒక బ్లాగులో ఈ వివరణ చదివాను. హిందూ, అంటే హిందూ ధర్మాన్ని పాటించేవాడు, హిందూత్వ అంటే ఆరెస్సెస్ తదితర సంస్థల చర్యలు అన్న అర్ధంలో ఈ రెండు పదాల అర్ధంలోని తేడాలను వివరించారు.

నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

మానవుడు, మానవత్వం. మానవత్వం ఒక లక్షణం. అది వున్నవాడు మానవుడు. అలాగే, హిందూత్వ అన్నది కూడా హిందువులలో వుండాల్సిన ఏదో ఒక లక్షణం కావాలి. అదీ ఎలాంటి లక్షణం అంటే నిర్ణయాత్మకమయిన లక్షణం అయివుండాలి. మానవత్వం లేనివాదు, పైకి మనిషయినా నిజంగా మనిషిగా పరిగణనకు రాడు. అలాగే, హిందూత్వ లక్షణం లేని వాడు హిందువుగా పరిగణనకు రాకూడదు.

అలాంటిది, హిందూత్వ అనేదాని అర్ధాన్ని ఎవరు నిర్ణయించారు? దాని ప్రాతిపదిక ఏమిటి? హిందూ వేరు, హిందూత్వ వేరు అని నిర్ణయించటానికి ఆధారాలేమిటి?

ఇస్లాం వేరు, ఇస్లామీయత్వం వేరు అవుతుందా? తీవ్రవాదాన్ని సమర్ధించే ఇస్లామీయులది ఇస్లామీయత్వం అని అనవచ్చా? యూదులు వేరు. యూదుత్వం వేరు అనవచ్చా? యుద్ధానికి దిగే యూదులది యూదుత్వమవుతుందా? క్రైస్తవము వేరు, క్రైస్తవత్వము వేరు అవుతుందా? మత యుద్ధాలకు దిగే క్రైస్తవులను క్రైస్తవత్వం అనవచ్చా?

ఒకవేళ హింసకు దిగే హిందువులంతా హిందుత్వవాదులయితే, హింసకు దిగే ఇతర మతాలవారిని ఆ మతతవం పేరుతో ఎందుకు పిలవటం లేదు?

అసలు ఈ పదానికి ఇలాంటి అర్ధం అని ఏ లాజిక్, ఏ తర్కం ఆధారం? నిర్ధారించిన వారెవరు?

నామటుకు నాకు, హిందువు, హిందూత్వము వేరు అనిపించటంలేదు. రెండూ ఒకటే. ఒకటి ధర్మం. రెండోది లక్షణం.

అలాగే ఈ మధ్య జరుగుతున్న మరో చర్చ చూస్తూంటే కూడా నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి.

హింస అనేది ఎవరు ఎవరిపైన జరిపినా ఖండించాల్సిందే. హింసకు దిగిన వారిని శిక్షించాల్సిందే. ఈ విషయంలో హెచ్చు తగ్గులు, తీవ్రతలు, కారణాలు, ఉద్దేష్యాలు లాంటి వాటి ప్రాసక్తి తరువాత.

పాము కనిపిస్తే ముందు చంపి అది విషపు పామా, కాదా ఆలోచిస్తాము. ముందు తర్కించి, నిర్ణయం తీసుకోము. ఇదీ అలాంటిదే.

అలాంటప్పుదు, పబ్బు మీద దాడి ఎంత ఖండనీయమో, పత్రిక సంపాదకుది మీద దాడీ అంతే గర్హనీయం.

అమ్మాయిలపైన ఆసిడ్ దాడి ఎంత హేయమైనదో, మహిళ రచయిత్రి పైన దాడీ అంతే హేయమైనది.

తన అభిప్రాయాన్ని మన్నించనివాడిపైన హింస ఎంత సంకుచితమో, తీవ్రవాదులకు ఇళ్ళలో ఆశ్రయమివ్వటమూ అంతే ద్రోహము. అమ్మాయిని మాన భంగం చేసి హత్య చేయటం ఎంత ఘోరమో, పార్లమెంటు తో సహా మన దేశంలో ఏ ప్రాంతం పైనయినా దాడి చేయటమూ అంతే నేరము. ఎవరితోనూ సానుభూతిగా వ్యవహరించాల్సిన అవసరము లేదు.

కానీ, మన ప్రతిస్పందన ఈ పై హింసలకు, సంకుచితాలకు ఒకే రకంగా లేదు.

ఉంటే తస్లిమా, సెక్యులర్ భారతం నుంచి ప్రాణాలరచేత పట్టుకుని పారిపోవాల్సి వచ్చేదికాదు. ఎమ్మెఫ్ హుస్సేన్ ఈ వయసులో విదేశాల్లో ఉండాల్సి వచ్చేది కాదు. మన ప్రతి పండగా, ప్రతి పర్వ దినమూ బిక్కు బిక్కు మంటూ గడుపుకోవాల్సి వచ్చేది కాదు. ప్రతి పుణ్య క్షేత్రానికీ పోలీసుల కాపలాలు అవసరమయ్యేవి కావు.

మరి మన ప్రతి స్పందనలలో తేడాలెందుకుంటున్నాయి?

January 30, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఇదొక అద్భుతమయిన పుస్తకం!

ఇది నిజంగా అద్భుతమయిన పుస్తకం. చదువుతూంటే ఇది నిజమా, ఒక అద్భుతమయిన కాల్పినిక రచయిత అత్యద్భుతమయిన ఊహనా అన్న అనుమానం వస్తుంది.

అందుకే, పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో అందులో పుందుపరచిన ఫోటోగ్రాఫ్స్ చూసి, ఇది నిజమే, ఒక వ్యక్తి తన జీవితంలో అనుభవించిన అనుభవాలివి అని మనల్ని మనం నమ్మించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ఈ పుస్తక రచయిత అనుభవాలు అటువంటివి.

హెన్రీ చారియెర్ రాసిన పాపిలాన్ చదువుతూంటే, ఎలాంటి అపనమ్మకమూ, అద్భుతమూ కలగలసిన భావనలు కలుగుతాయో, ఈ పుస్తకం చదువుతూంటే అలాంటి భావనలే కలుగుతాయి.

అయితే, చారియెర్ అనుభవాలు సమాజం అతడి పై బలవంతంగా రుద్దినవి. ఈ అనుభవాలు రచయిత స్వచ్చందంగా ఎంచుకునా వృత్తి వల్ల కలిగినవి!

మనలో చాలా మందికి మైకెల్ బ్యూర్క్ అన్న పేరు తెలియక పోవచ్చు. కానీ, విదేశాలలో వున్నవారికీ, బీబీసీ చానెల్ తప్పని సరిగా చూసే వారికి ఇతని పేరు సుపరిచితమే.

20వ శతాబ్దం నడుమ నుంచి జరిగిన అనేక అత్యద్భుత సంఘటనలకు ఈయన ప్రత్యక్ష సాక్షి.

ఇథియోపియాలో కరవును ప్రపంచం దృష్టికి తెచ్చి, ప్రపంచ ప్రజల మనస్సక్షిని తట్టిలేపిన వ్యక్తి మైకెల్ బ్యూర్క్. ఫాల్క్ లాండ్స్ యుద్ధాన్ని అతిదగ్గరగా ప్రపంచానికి చూపిందీయనే. దక్షిణాఫ్రికాలో, వర్ణ వివక్షత అంతిమ దినాలలో జరిగిన ఘోర కృత్యాలను ప్రపంచానికి ప్రదర్శించి, నాగరికత ముసుగులో దాగిన అనాగరికతను నగ్నంగా చూపిన జర్నలిస్టీయన. అనేక ఆఫ్రికా దేశాలలో విప్లవాలను, అధికార పోరాటాలను, హింసను, అమానుష అకృత్యాలను తన కళ్ళతో దర్శించి ప్రపంచానికి ప్రదర్శించిన వ్యక్తి ఇతడు.

పాత్రికేయ ప్రపంచంలో వున్న అవార్డులన్నీ దక్కించుకున్న పాత్రికేయ ఘనాపాటీ మైకెల్ బ్యూర్క్.

ఈ పుస్తకం కూడా, ఒక చేయి తిరిగిన థ్రిల్లర్ రచయిత అత్యంత ఉత్సాహంగా చేసిన రచనలా అనిపిస్తుంది. ఒక జీవిత చరిత్రలా అనిపించదు.

పుస్తకం ఆరంభమే, అద్ది అదాబాలో వార్తలను కవర్ చేస్తూంటే కరిగిన ప్రేలుడులో దాదాపుగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన వుంటుంది.

ఒక సస్పెన్స్ సినిమాలో ముందు హత్య చూపి, తరువాత దానికి దారి తీసిన పరిస్థితులు ఒకటొకటిగా వివరిస్తూ, ప్రేక్షకుదు ఊహించిన దానికి భిన్నమయిన ముగింపు నిచ్చినట్టు, దక్షిణాఫ్రికా నుంచి, కీన్యాలో జరిగిన ప్రేలుడు వివరిస్తాడు.

ప్రాణాలకు తెగించి ప్రపంచానికి నిజం చూపాలన్న పాత్రికేయుల తెగువను, వారిలో వారికి ఉన్న పోటీలను నిర్మొహమాటంగా చూపుతాడు.

అటునుంచి తన బాల్యం గురించి వివరిస్తాడు. తండ్రి తల్లిని ఎలా మోసం చేశాడో నిస్సంకోచంగా వివరిస్తాడు. మానసికంగా అది తనను ఎలా క్రుంగ దీసిందో చెప్తాడు. ఎందుకూ పనికి రాకుండా తయారవుతూ, ఆత్మ న్యూనత లోకి దిగజారుతూ బ్రతుకు తెరువు కోసం పాత్రికేయుడవటం తెలుపుతాడు.

లండన్ లోని ప్రాంతీయ పత్రికల పనితీరు, వార్తలు సేకరించే విధానం హాస్యం కలిగిస్తుంది. ఆతరువాత బీబీసీ రేడియోలో అనుభవాలు, తొలినాళ్ళలో బీబీసీ పనితీరు, అక్కడి రాజకీయాలు, వ్యక్తుల మనస్తత్వాలు, అనేక సంఘటనలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఆలోచింప చేస్తాయి.

విదేశీ కరెస్పాండెంటయినప్పటి నుంచీ రచన మరింత వేగవంతమవుతుంది. పైపైన కనబడే దృష్యాల వెనుక జరిగే రాజకీయాలు తెలుస్తాయి. నిజాన్ని ప్రపంచానికి చూపాలన్న వీరి తపన అర్ధమవుతుంది.

ఈ పుస్తకం చదువుతూంటే, ఏమీ తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ, అదే వార్తా కథనాలనే మన తెలుగు చానెళ్ళ దుస్థితి కళ్ళ ముందు నిలుస్తుంది. మాటలకు, ఆకారానికే తప్ప ఆలోచనకు, విచక్షణకూ పెద్ద పీట వేయని మన టీవీలవల్ల జరుగుతున్న అన్యాయం అర్ధమవుతుంది. మనసు బాధతో మెలితిత్రుగుతుంది.

కవిత్వ రచన, కథా రచన, చిత్ర లేఖనం, సినిమాలలాగే జర్నలిజం కూడా ఒక తీరని దాహం అని అర్ధమవుతుంది. కనీసం ఇలాంటి పుస్తకాలు చదివి ఇప్పటి జర్నలిస్టులు ఈ తీరని దాహంలో వున్న మజాను, ఔన్నత్యాన్ని గ్రహిస్తే బాగుండు.

పుస్తకం పేరు- మైకెల్ బ్యూర్క్, ఎన్ ఆటో బయాగ్రఫీ( michael buerk, an autobiography).

2004 loa raamDam haavus vaaree pustakaanni pracurimcaaru.

445 peajeelunna ee pustakam vela daadaapugaa 450/- roopaayalu.

January 28, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

నాకు తెలిసిన ఆరెస్సెస్!

ఇటీవలె ఒక టపాలో ఆరెస్సెస్ పైన ఒక నాస్తికుడి వ్యాఖ్య చదివాను. అతడి అభిప్రాయం అతడిది. అతడి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, నా స్వీయ అనుభవాలను బ్లాగర్లతో పంచుకోవాలనిపించింది. దాని ఫలితమే ఈ పోస్టు.

ముందుగా, నేను స్వయం సేవక్ ను కాదు. స్వయం సేవక్ అంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యుడు. నాకు ఎలాంటి క్రమ శిక్షణ అయినా నచ్చదు.  ప్రొద్దున్నే లేచి శాఖకు వెళ్ళి వ్యాయామాలు చేసి, బౌద్ధిక్( ఉపన్యాసం లాంటిది) విని, పాటలు పాడి(దేశ భక్తి, స్ఫూర్తిమంతమయినవి) ప్రతిఙ్నలు చేసి( నమస్తే సదా వత్సలే మాతృ భూమే) రావటం నా స్వభావానికి పడదు. నాకు కుడి ఎడమలు త్వరగా అర్ధం కావు. కుడి వైపు తిరగమంటే, అన్నం తిన్నట్టు చూసుకుంటే కానీ, కుడి వైపు గుర్తించలేను( ఇప్పటికీ డ్రైవింగ్ లో నాకు ఇదే సమస్య). అందుకని, మా అన్నయ్య ఆరెస్సెస్ కార్యకర్త అయినా నాకు ఆరెస్సెస్ పైన ఎలాంటి అభిమానంలేదు. పైగా, అన్నయ్య ఆరెస్సెస్ వైపు ఆకర్షితుడవటంతో నాకు ఆరెస్సెస్ అంటే ఒక రకమయిన ద్వేషం కూడా ఏర్పడింది. దీనికి తోడు, ఇంటి బాధ్యతలు నిర్వహించవలసిన అన్నయ్య అన్నీ వదలి ప్రచారక్ లా వెళ్ళి పోవటం ఆరెస్సెస్ అంటే నా ద్వేషాన్ని పెంచింది. అందుకే, నా నవల అంతర్యాగం లో ఆరెస్సెస్ కార్య కలాపాలను, ప్రచారక్ వ్యవస్థనూ తీవ్రంగా విమర్శించాను. దేశ సేవ చేయాలంటే ఇల్లొదిలి పోనవసరంలేదన్నది అప్పుడూ, ఇప్పుడూ నా అభిప్రాయం.

అయితే, నేనెంత విమర్శించినా, ఇంటికి వచ్చిన ప్రచారక్ లను, కార్యకర్తలనూ దూషించినా, వారు పట్టించుకోలేదు. నేను రాస్తానని తెలిసి, ఆరెస్సెస్ పత్రిక జాగృతిలో రాసే వీలు నాకు కల్పించారు. రాసే అవకాశం దొరికిందని జాగృతిలో రాయటం ఆరంభించానే తప్ప ఆరెస్సెస్ మీద అభిమానంతో, ప్రేమతోనో కాదు.

జాగృతిలో నాకు రామమోహమరావు గారితో పరిచయమయింది. ఆయన ఆ పత్రిక సంపాదకుడు. ప్రచారక్. ఇంజినీరింగ్ చదివి, ప్రభుత్వోద్యోగాన్ని వదలి ప్రచారక్ గా వచ్చారు. ఆయన పరిచయం నా ఆలోచనా విధానాన్ని మార్చింది.

ఆరెస్సెస్ గురించి చదవటం ఆరంభించాను. తెలుసుకోవటం ఆరంభించాను. ఇప్పటికీ, ఆరెస్సెస్ పైన నా అభిప్రాయాలు మారకున్నా, నా ఆలోచనా విధానంలో తేడా వచ్చింది.

ఆరెస్సెస్ అన్నది, చరిత్రాత్మక ఆవశ్యకత. ఆరెస్సెస్ ఆవిర్భావం ఏ సమాజంలోనయిన తప్పని సరిగా జరిగే పరిణామం. గమనిస్తే, భారతీయ సమాజం, ఈనాటికీ సజీవంగా నిలవటానికి ఇలాంటి అనేక చారిత్రిక ఉద్యమాలు, సరయిన సమయానికి ఆవిర్భవించటం ప్రధాన కారణం.

ఎప్పుడెప్పుడు భారతీయ సంస్కృతి తనని తాను మరచి. రక్షించుకోలేని స్థితిలోకి దిగజారుతోందో, అప్పుడప్పుడు సంస్కృతీ పరిరక్షణ కోసం, ఏదో ఒక సంస్థ , ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూ వుంది. భారతీయతను కాపాడుతూవుంది.

వేదాలు విస్మృతిలో దిగజారుతున్నప్పుడు, వాటిని వర్గీకరించి, కాపాడిన వేద వ్యాసుడిదీ ఒక రకమయిన సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమమే. బౌద్ధం వల్ల కలిగిన వికృత పరిణామాలను సమాజం అనుభవిస్తూ తనని తాను మరుస్తూన్న సమయంలో, ఒక మహా శక్తిలా దేశాన్నంత ఏకం చేసి, స్ఫూర్తి నిచ్చిన, శంకరాచార్యులవారిదీ, ఒక రకమయిన, ధర్మ పరిరక్షణ ఉద్యమమే.

రామానుజాచర్యులు, మధ్వాచార్యులు ఇలా అనేకానేక తత్వ వేత్తలు, భక్తి వేదాంత శక్తులు, భారతీయ సమాజానికి దిశాదర్శనం చేస్తూ దాన్ని సజీవం చేస్తూ వచ్చారు.

మహమ్మదీయుల కరాళ నర్తనంతో భారతీయ సమాజం ఉక్కిరి బిక్కిరయి తన స్తిత్వాన్ని, దేవతల పయిన నమ్మకాన్ని కోల్పోతున్న తరుణంలో తుకారాం, కబీరు, ౙ్నానదేవుడు, అన్నమాచార్యులు, జయదేవుడు, చైతన్య ప్రభు, శివాజీ, విజయ నగర రాజులు, కాకతీయ రాజులు, రెడ్డి రాజులు, ఇలా, దేశం నలుమూలలా, పలు రీతులలో భారతీయ ధర్మ పరిరక్షణ ఉద్యమము, పలు తెరగుల ప్రసరించింది. ఒక నది, ప్రవహిస్తూ, వేయి పాయలయి, వేన వేల దారులలో విభిన్న రూపాలు ధరించినట్టు, భారతీయ పరిరక్షణోద్యమము వివిధ రూపాలు ధరించింది. ఏయే దారులలో, ఎన్నెన్ని విభిన్న రూపాలలో ప్రవహించినా నది గమ్యం సముద్రమే అయినట్టు, ఏ ఉద్యమమయినా, దాని లక్ష్యం, భారతీయ ధర్మ రక్షణమే!

ఈ ఉద్యమాలు ఎంత ప్రభావం చూపాయంటే, ఇంగ్లీషువారు కనక రంగ ప్రవేశం చేయకపోతే, దేశంలో ఇస్లామీయులు, ఇతరుల్లాగే తమ ప్రత్యేకతను కోల్పోయి, సామాజిక స్రవంతిలో మిళితమయిపోయారు. ఇంగ్లీషువారివల్ల మళ్ళీ మరో ఉద్యమం అవసరమయింది.

ఇస్లామీయుల ఐక్యత, హిందువుల అనైక్యత (గమనిస్తే, అంతకు ముందు అంతా భారతీయులే, ఆ తరువాతే, హిందూ అన్న పదం వచ్చింది.)  ఇలా ఇస్లామీయులు కలసి కట్టుగా వుంటూ, క్రైస్తవులు ఏకంగా వుంటూ, ఇద్దరూ చేరో వైపు నుంచి, భారతీయాన్ని కొరుక్కు తింటూంటే, హిందువులలో ఐక్యత సాధించాల్సిన సామాజిక ఆవశ్యకతను గుర్తించారు.

ఇది ముందుగా గుర్తించింది, వివేకానందులవారు. అయితే, ఆయన రాజకీయాలకు అతీతంగా భారతీయ సమాజాన్ని జాగృతం చేయాలని చూశారు. తన ప్రత్యేకతను తెలుసుకున్న సమాజం ఏకమయి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. వివేకానంద, ఉపన్యాసాలలో, ఆయన జీవితంలో, భారతీయ సమాజాన్ని జాగృతం చేయాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రామకృష్ణ మఠం స్థాపించటంలో ఉద్దేష్యం కూడా ఇదే.క్రీస్టియన్ మిషనరీల ప్రచారాన్ని ఎదుర్కొని, భారతీయులకు తమ అస్తిత్వాన్ని బోధించటం.

అరబిందో జీవితాంతం, ఈ దేశ ప్రజలకు తమ ఆత్మశక్తిని గ్రహించే విఙ్నానం ఇవ్వాలనే తపన పడ్డాడు. ఆయన ప్రతి ఒక్క రచనలో ఇదే తపన కనిపిస్తుంది.

మహాత్మా గాంధీ, వివేకానంద మాటలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు. ఈ దేశ ప్రజలను ధర్మం తప్ప మరేమీ సుషుప్తి నుంచి కదిలించలేదని గ్రహించాడు. రాజకీయాలకు, ధర్మానికీ ముడిపెట్టి విజయం సాధించాడు.

మహాత్మా గాంధీ విజయం సాధించటం కోసం, రాజకీయాలకు ధర్మానికీ ముడి పెట్టటం వల్ల కొన్ని విషయాలలో రాజీ పడాల్సి వచ్చింది. ఇది, అధికారంకోసం ఆయన హైందవులకు అన్యాయం చేస్తున్న భావన కలిగించింది.

ఫలితంగా, హైందవులలో ఐకమత్యాన్ని సాధించి, ఒక సంఘటిత శక్తిలా నిలపాలన్న ఆలోచన ఆరెస్సెస్ ఆవిర్భావానికి దారి తీసింది. అంతకు ముందు, దయానంద సరస్వతి, సావర్కర్ లాంటి వారు భారతీయ సమాజాన్ని ఏకం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చారు. ఇస్లామీయులు, క్రీస్టియన్లు మన ధర్మం పైన చేస్తున్న దాడిని తిప్పికొట్టి నిజానిజాలు వివరించాలని ప్రయత్నిస్తూనే వున్నారు.

బెంగాలులో ఈ ప్రయత్నాలు, బ్రహ్మ సమాజ ఆవిర్భావానికి దారి తీశాయి. అయితే, బ్రహ్మ సమాజం ఏర్పాటులో ఆత్మ విశ్వాసం కన్నా, ఆత్మ న్యూనతా భావమే అధికంగా వుండటంతో మేలు కన్నా కీడేఅ ఎక్కువ జరిగింది. గమనిస్తే, వివెకానంద ఒక దశలో బ్రహ్మ సమాజ అనుయాయి. వ్యక్తి గత అహంకారాలు సంస్థను చీల్చటం ఆయనకు తెలుసు. అందుకే అహాలు లేని, సన్యాస వ్యవస్థ వైపు ఆయన మొగ్గు చూపాడు.
అలాగే రాజ కీయాలకు దూరంగా ధార్మికంగా, కానీ స్వీయ రక్షణ శక్తి కల సమాజాన్ని తయారు చేయాలన్నది  ఆరెస్సెస్ లక్ష్యం. వివేకానంద కూడా, ఉక్కు నరాల యువకులు కావాలన్నాడు. అలాంటి ఉక్కు నరాల యువకుల తయారీ ఆరెస్సెస్ లక్ష్యం.

దేశ విభజన సమయంలో ప్రజలకు ఆరెస్సెస్ ఆవష్యకత అర్ధమయింది. ఆకాలంలోని వ్యక్తుల అనుభవాలు తెలుసుకున్నా, రచనలు చదివినా ఈ విషయం స్పష్టమవుతుంది. ఆకాలంలో లాహోర్ వంటి ప్రాంతాలలో సామాన్యులను రక్షిస్తూ తురకల కత్తులకు ప్రాణాలను అర్పించిన వారిలో ఆరెస్సెస్ కార్యకర్తలు ముందున్నారు. ఉదాహరణకు, వేద్ మెహ్తా జీవిత చరిత్ర చదవండి. తురకలు, అందరికన్నా ముందు ఆరెస్సెస్ కార్యకర్తలను ఎలా టార్గెట్ చేసే వారో తెలుస్తుంది. వేరేవారి కోసం ప్రాణాలర్పించే శక్తి వీరికెలా వస్తోందని ఆయన ఆశ్చర్య పోతాడు. ఇదే కాదు, ఆ కాలంలోని ఏ రచన చదివినా ఆరెస్సెస్, హిందువుల రక్షణలో నిర్వహించిన చారిత్రాత్మక పాత్ర తెలుస్తుంది. వారు లేకపోతే, దేశ విభజన సమయంలో మరింత పెద్ద సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయేవారు.
దేశ విభజనలోనే కాదు, దేశంలో ఎక్కడేక్కడ, ఇస్లాం, క్రీస్టియనిటీల ప్రాబల్యం పెరుగుతోందో, అక్కడక్కడ ఆరెస్సెస్ ప్రజాదరణ పొందుతుంది. ఇందుకు కారణం, దెబ్బ తినేవాడికి నొప్పి తెలుస్తుంది. దూరం నుంచి చూసేవాడికి అంతా తమాషాలా అనిపిస్తుంది.

అయితే, నది ప్రవాహం ఆరంభంలో స్వచ్చమయిన జలంతో వుంటుంది. రాను రాను అది తన స్వచ్చతను కోల్పోతుంది. ఇందుకు ఆరెస్సెస్ భిన్నం కాదు. ఇవన్నీ చారిత్రిక పరిణామాలు. మన దేశంలో నెలకొని వున్న అనేక అపోహలు, దురభిప్రాయాలు, దుర్వ్యాఖ్యానాలు మనలో బోలెడన్ని తప్పుడు అభిప్రాయాలు కలిగించాయి.

గమనిస్తే, ఇప్పటికీ హిందూ సమాజంలో అదే అనైక్యత కనిపిస్తుంది. ఉద్ధరించే సంథలు బోలెడన్ని ఉన్నాయి. కానీ అవే అహంకారాలు కనిపిస్తాయి. ఆరెస్సెస్ ప్రచారక్ లలో సైతం, బావిలో కప్పల్లంటి సంకుచితము, మూర్ఖత్వమూ కనిపిస్తాయి. ఆరెస్సెస్ లో సైతము గర్హించవలసిన ధోరణులెన్నో వున్నాయి. అంతెందుకు, నేనే, జాగృతిలో రాయటం మానుకున్నాను. అయినా సరే, ఆరెస్సెస్ తో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా సరే, వారితో ఎలాంటి అనుబంధం లేకున్నా సరే, నేను ఆరెస్సెస్ వాడిని కాకున్నా సరే, కేవలం భారతీయ ధర్మనికి పెద్ద పీట వేస్తానన్న కారణానికి నేనెన్ని అపోహలకు గురవుతున్నానో?

నీ అసిధార నవల బావుంది కానీ, నీ బాక్గ్రవుండ్ బాలేదని అవార్డివ్వటంలేదన్నాడో అభ్యుదయ భావాల ప్రతినిధి. అంటే, నేను ఆరెస్సే వాడినని ఆరెస్సెస్ వాళ్ళూ భావించటం లేదు, కానీ హిందూ ధర్మం గురించి రాస్తానని ఆరెస్సెస్ వాడినని ఇతరులు ముద్ర వేస్తున్నారన్నమాట. ఇదీ మన పరిస్థితి. ఎందుకని, హిందూ ధర్మమంటే మనము అంతగా ఉలిక్కి పడతాం?

అనాదికాలంగా అమలులో వుండి, ప్రపంచంలోని అత్యుత్తమ భావాలకూ, విశాలత్వానికీ మారు పేరయిన మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. దీన్ని రక్షించేందుకు ఇంకెవ్వరూ లేరు. మనమే అర్ధం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తూ, మన గోతులు మనమే తవ్వుకుంటూంటే, మనల్ని చూస్తూ కాళిదాసు ఎంతగా నవ్వుతున్నాడో? మన పూర్వీకులెంతగా బాధపడుతున్నారో?

ఇది ఆరెస్సెస్ కు సంబంధించిన ఆవేదన కాదు. భారతీయ ధర్మమనే సముద్రంలో ఆరెస్సెస్ ఒక చిన్న నీటి చుక్క మాత్రమే. అలాంటి నీటి చుక్కను చూసి మొత్తం సముద్రాన్నే విమర్శిస్తూ మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాము. ఆలోచించండి, ఆద్యంతాలు లేని భారతీయ ధర్మంపైన ఎవరికయినా కాపీ రైటుంటుందా?  లేనప్పుడు ఆరెస్సెస్ నో విశ్వహిందూ పరిషత్ నో చూపి సమస్త భారతీయ సమాజన్ని ఎందుకు దూషించటం? హిందూ ధర్మం మాట్లాడిన ప్రతివాడిపైన ముద్రలేయటం ఎందుకు?

January 27, 2009 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: Uncategorized

ఇదొక అరుదైన పుస్తకం!

అందరికీ గణతంత్ర దొనోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేనొక అరుదయిన పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి పరస్పర విభిన్నమయిన అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి. ఎవరికివారు, తాము నమ్మిన దాన్నే నిజమన్నట్టు ఆధారాలు చూపిస్తారు. తాము అభిమానించిన నాయకుడే గొప్ప మిగతా అంతా చెత్త అన్నట్టు వాదిస్తారు. మహాత్మా గాంధీ పైన సైతం అనేక ఆరోపణలున్నాయి. వాద ప్రతి వాదాలున్నాయి. కానీ అందరూ ఏక గ్రీవంగా సుభాష్ చంద్ర బోసును పొగుడుతారు. మహాత్మా గాంధీ కన్నా గొప్పవాడంటారు. ఆయనకు గాంధీ అన్యాయం చేశాడంటారు. గాంధీ వ్యతిరేకంగా ఆయన పలుకులను ఉదాహరిస్తారు. అయితే, జపాన్ లో సుభాష్ కు అతి సన్నిహితంగా వుండి, శుభాష్ కన్నా ఎన్నో ఏళ్ళముందు జపాన్ లో స్థిరపడిన నాయర్ సాన్ మాత్రం ఈ నిజాలతో విభేదిస్తాడు.

ఇంతకీ ఎవరీ నాయర్ సాన్? అన్న ప్రశ్న వస్తుంది.

భారతీయ చరిత్రలో, ప్రాచీన చరిత్రలోనేకాదు, ఆధునిక చరిత్రలో కూడా ఒక పధతి ప్రకారం అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయటం జరిగింది. అసలు నిజాలను మరుగు పరచటం జరిగింది. ఇందువల్ల, అనేక దేశ భక్తులు, స్వాతంత్ర్య వీరులు మన స్మృతి పథంలోంచి తొలగిపోయారు. అలాంటి వారిలో నాయర్ సాన్ ఒకరు.

1928లో జపాన్ చేరాడు నాయర్. స్వాతంత్ర్యం తరువాత కూడా జపాన్ లోనే వుండి పోయాడు. అప్పుడప్పుడూ భారత్ వస్తూండేవాడు. అలాంటప్పుడు ఇక్కడ ప్రచారంలో వున్న నిజాలకూ, తాను అనుభవించి తెలుసుకున్న నిజాలకూ చాలా తేడాలుండటం నాయర్ ను కలవర పరచింది. ఫలితంగా స్నేహితుల ప్రోద్బలంతో ఆయన తన అనుభవాలను గ్రంతస్థం చేయాలని నిశ్చయించాడు. అలా రూపొందింది, an indian freedom fighter in japan, memoirs of a,m, nair అనే ఈ పుస్తకం. 1985లో ఈ పుస్తకాన్ని జీ.సీ.జీవి తెలుగులోకి అనువదించారు. మద్రాసులోని అశోక్ ఉమ పబికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడిది దొరుకుతుందో లేదో తెలియదు. నాకు చెదలు పట్టిన ఈ పుస్తకం, ఒక స్నేహితుడింట్లో చెత్త కాగితాలనడుమ, అటక పైన దొరికింది.

సాధారణంగా నా పరిచయస్థులు చెత్త కాగితాలు అమ్మేముందు నన్ను పిలిస్తారు. నేను వాటిలోంచి నాకు కావాల్సినవి ఏరుకున్న తరువాత అమ్మేస్తారు. అలా నాకు దొరికిన అరుదయిన పుస్తకాలలో ఇదొకటి.

20వ శతాబ్దారంభంలో జన్మించాడు నాయర్ సాన్. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడని తల్లితందృలు అతడిని జపాన్ లోని అన్న దగ్గరకు పంపారు. జపాన్లో అతడికి రాస్ బిహారీ బోస్ పరిచయమయ్యాడు!

రాస్ బిహారీ బోస్ పేరు మన దేఅ భక్తుల జాబితాలో అరుదుగా వినిపిస్తుంది. జపాన్ పౌరసత్వం తీసుకుని కూడా భారత మాత దాస్య శృంఖలాల చ్చేదన గురించే ఆలోచిస్త్తొండేవాడాయన. బోసుతో నాయర్ కు సన్నిహిత సంబంధం ఏర్పడింది.

బోసుతో కలసి నాయర్ భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రచారాన్నిచ్చారు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగు స్థాపించారు. విదేశాలలోని భారతీయులను కూడగట్టుకున్నారు.

తన ఆరోగ్యం పాడవుతోందని గ్రహించిన బోసు అధికారాన్ని వేరేవారికి కట్టబెట్టేందుకు సిద్ధపడ్డాడు. నాయర్ సాన్ పేరును సూచించాడు. కానీ, తన కన్నా ఎక్కువగా ప్రజలకు తెలిసిన సుభాష్ నాయకుడయితే బాగుంటుందని నాయర్ సాన్ స్వచందంగా పక్కకు తప్పుకున్నాడు. అలా సుభాష్ బోస్ జపాన్ చేరుకున్నాడు.

గాంధీ, నెహ్రూ లతో పడక వేరే దేశాలు చేరుకున్న సుభాష్, జపాన్లో ఉపన్యాసాలలో వారిద్దరినీ పరుష పదాలతో దూషిస్తే వాటిని నాయర్ తొలగించేవాడు. ఇది సుభాష్ కు నచ్చలేదు. దాంతో నాయర్ ను పక్కకు నెట్టాడు సుభాష్.

వేర్వేరు పద్ధతులలో పోరాడినా అందరి లక్ష్యం ఒకటే. అలాంటప్పుడు, భేదాభిప్రాయాలు పద్ధతులకే పరిమితం కావాలి, వ్యక్తి గతాల స్థాయికి దిగజారకూడదు అంటాడు నాయర్.

ఇండియన్ నేషనల్ ఆర్మీను కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించాడనటం ఆబద్ధం అంటాడు నాయర్.కానీ రాస్ బిహారీ బోస్ దాన్ని స్థాపించి మెరుగు పరచి సమర్ధవంతమయిన సైనిక దళం గా మలచి సుభాష్ కు అప్పగించాడంటాడు నాయర్.

అందుకే పుస్తకం ముందు మాటలో, ఆగ్నేయాసియా గురించి గ్రంథాలు రాసిన వారెవరికీ ఏమాత్రం ప్రత్యక్షానుభం లేదు. చాలా సందర్భాలలో వీరు రాసిన విషయాలు అఙ్నానంతో కూడిన తప్పుల తడకలుగానో, వుద్దేశ్యపూర్వకంగా వక్రీకరింపబడినవిగానో వున్నాయి అంటాడు. అంతేకాదు, ఈ పుస్తకంలో చెప్పిన విషయాలన్నిటికీ నాదే బాధ్యత అంటాడు.

స్వాతంత్ర్య సమర యోదుడిగా రాస్ బిహారీ బోస్ కు తగిన గౌరవం లభించలేదన్న ఆవేదన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అర్హత లేనివారికి అనవసరమయిన ఖ్యాతి దక్కుతోందన్న కోపమూ కనిపిస్తుంది.

ఇలాంటి పుస్తకాలు చదువుతూంటే, మనకన్నీ తెలుసని నాలుగు దొరికిన పుస్తకాలు చదివేసి విర్రవీగటం ఎంత మూర్ఖత్వమో తెలుస్తుంది. అలా నాలుగు ముక్కలు చదివి తీర్మానాలు చేసేసి మహనీయులు, మహాత్ముల పైన బురద జల్లి తామే వున్నతులమూ, గొప్పవారమూ, ప్రజల మెదళ్ళకు పట్టిన తుప్పు వదిలించేవారమూ అనుకోవటం ఎంత నైచ్యమో అనిపిస్తుంది.

కనీసం ఇకనుంచయినా, చీకటి కోణాలలో దాగిన మన అసలు చరిత్రను మనము వెతికి తీసి విశ్లేషించాలనిపిస్తుంది.

January 26, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము

ఇవి నా కొత్త పుస్తకాలు!

నావి రెండు కొత్త పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్ లో తాజాగా విడుదలయ్యాయి. ఈ పుస్తకాలను బుక్ ఫెయిర్ లో విదుదల చేయాలనుకున్నాము. కానీ కుదరలేదు. దాంతో, పుస్తకావిష్కరణ సభ జోలికి పోకుండా, తిన్నగా పుస్తకాన్ని మార్కెట్ లోనే విడుదల చేశాము.

నేను, 2004 సంవత్సరంలో ఆంధ్రభూమి వార పత్రికలో అక్షరాంజలి అనే శీర్షికను ఆరంభించాను. అప్పటికే, ఆ పత్రికలో నేను పవర్ పాలిటిక్స్ అనే శీర్షికను నిర్వహిస్తూండటంతో న్యూస్ ఎడిటర్ శ్రీమతొ ఏ.ఎస్. లక్ష్మి గారి సూచన ప్రకారం మారు పేరుతో రచన సాగించాను. పద్మ, స్వప్న లాంటి పేర్లతో ప్రపంచ సాహిత్యంలోని ఉత్తమ పుస్తకాలను తెలుగు పాఠకులకు పరిచయం చేశాను.

నిజానికి, ఇలా పుస్తకాలను పరిచయం చేయాలన్న ఆలోచనకు ప్రేరణ నిచ్చింది, మాలతీ చందూర్ గారి పాత కెరటాలు, కొత్త కెరటాలు లాంటి పుస్తక పరిచయాలే.
అయితే, ఇప్పుడు ఎలా పుస్తకాలను పరిచయం చేసినా, ఆవిడతో పోలిక వస్తుంది. పైగా, ఒకరు చేస్తున్న పనినే ఇంకోరు చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ వుండగా, డుప్లికేట్ ల అవసరం వుండదు. ఏ.ఎస్. లక్ష్మి గారు ఇది వివరించి, భిన్నమయిన కోణంలో పుస్తకాలను పరిచయం చేయమన్నారు. వరుసగా వీటిని ప్రచురించారు. అక్షరాంజలి అని శీర్షికకు పేరు పెట్టిందీ లక్ష్మిగారే.

పుస్తక పరిచయాలను నేను విభిన్నంగా మలచాను. ముందుగా, సాహిత్య ప్రపంచంలో రచయిత స్థానం, రచయిత జీవితానుభవాలు, ఆ అనుభవాలు అతని రచనలో ప్రతిబింబించిన విధానం, అవి  ఆయన గొప్ప రచయిత కావటానికి దోహదం చేసిన విధం, రచన, ఆ రచన సమాజాన్ని ప్రభావితం చేసిన విధం, సాహిత్య ప్రపంచంలో ఆ రచన స్థానం లాంటి విషయాలను అక్షరాంజలిలో వివరించాలని నిశ్చయించాను. అది పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. అలా, దాదాపు 80 విశిష్ట పుస్తకాలను పరిచయం చేసిన తరువాత, నాందేడ్ బదిలీ వల్ల తాత్కాలికంగా శీర్షికను ఆపాల్సివచ్చింది. ఇప్పుడు త్వరలో నవ్యలో మరో పేరుతో ఈ శీర్షిక ఆరంభిస్తాను.

ఇలా, ప్రచురించిన, 80 పరిచయాలలో, మొదటి భాగంగా 50 పుస్తకాల పరిచయాలను, అక్షరాంజలి పేరుతో ఎమెస్కో ప్రచురణ సంస్థ ప్రచురించింది.

ఈ మొదటి భాగంలో నవలలను వర్గీకరించి సంకలనం చేశాము. అవి. సాంఘిక నవలలు, ఉద్యమ నవలలు, తాత్విక నవలలు, వినోదాత్మక నవలలు, సైన్స్ ఫిక్షన్ నవలలు.

80 నుంచి 50 ఎన్నుకోవటం చాలా కష్టమయిన విషయం. ముఖ్యంగా, ది ఆల్కెమిస్ట్, హైడీ, రేజర్స్ ఎడ్జ్, లైఫ్ ఇన్ ది టైంస్ ఆఫ్ కలెరా, ది స్పై హూ కేం ఇన్ ఫ్రం కొల్డ్, గాన్ విత్ ద విండ్, లాంటి మంచి పుస్తకాలున్నాయి.

ఎంచుకున్న పుస్తకాలలో రూట్స్, డేవిడ్ కాపర్ ఫీల్డ్స్, థింగ్స్ ఫాల్ అపార్ట్, నాత్ ఆఫ్ వైపెర్స్, రివోల్ట్ ఆఫ్ ది ఏంజెల్స్, మాజిక్ మౌంటైన్, ది మదర్, బ్రదర్స్ కరమజోఫ్, కేన్ ఎండ్ ఏబిల్, టు కిల్ ఎ మోకింగ్ బర్డ్, పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ మారేజ్, డాక్టర్ జివాగో, ది జంగిల్, ది గ్రాస్ ఈస్ సింగింగ్, ది కలర్ పర్పుల్, ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్, ది ఫ్రీడం రోడ్,గాడ్స్ లిటిల్ ఎకర్, ది అన్ బేరబుల్ లైట్ నెస్ ఆఫ్ బీయింగ్, ది డే ఆఫ్ ది జాకాల్, ది ఫాన్ క్లబ్, ఎక్సోడస్, రెండవూ విత్ రామా, బ్రేవ్ న్యూ వరల్డ్  తో సహా మొత్తం 50 అత్యుత్తమ రచయితలు, అత్య్త్తమ పుస్తకాల పరిచయాలూ ఈ పుస్తకంలో వున్నాయి.

వార్త ఆదివారం అనుభంధంలో రియల్ స్టోరీలు రాశాను. ఇవి నేరానికి సంబంధించినవి కావు. నిత్య జీవితంలో ఎదురయిన అనేక కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, విజయాం సాధించి, మానవత్వానికి, మానవుడి ఆత్మ శక్తికీ ప్రతీకగా ఎదిగిన సామాన్యులయిన అసామాన్యుల నిజ జీవిత గాథల ఆధారంగా కాస్థ డ్రామా, కలపనలు జోడించి వెలయించిన కథలివి. ఈ కథలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతంగా వుండటమే కాదు, ఆలోచనలు కలిగిస్తాయి, ఉన్నతమయిన ఆలోచనలనిస్తాయి, జీవితం పట్ల, సమాజంపట్ల, మానవత్వం పట్ల ఒక ఆరోగ్యకరమయిన ద్రుక్పథాన్నిస్తాయి. ఇలాంటి 50 కథల సంకలనం ఈ పుస్తకం.

ఈ రెండు పుస్తకాలను ఎమెస్కోవారు ప్రచురించారు.

అక్షరాంజలి 288 పేజీల పుస్తకం.

రియల్ స్టోరీస్, 296 పేజీల పుస్తకం.

ఈ రెండు పుస్తకాల వెల 125/-.

ఇవి అన్ని పుస్తకాల దుకాణాలలో దొరుకుతాయి.

ఈ రెండు పుస్తకాలను చదివి మీ అభిప్రాయాన్ని, సూచనలు, సలహాలను నిర్మొహమాటంగా నాకు తెలియచెప్పాలని అభ్యర్ధిస్తున్నాను.

January 24, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

బ్రహ్మబుధ్ అవార్డు సినిమాలు చూశాడు-3

హాలీవుడ్ సినిమా ప్రస్తావన తెస్తూనే బ్రహ్మ బుధ్ సీరియసయిపోయాడు. అసలు సినిమాలెందుకు తీస్తారు? అనడిగాడు.

నాకు కంగారుగా అనిపించింది. కడుక్కోని కక్కోసును చూపిన అద్భుత నటనని చూసి, అనుభవించి ఆనందించిన వీడు, హాలీవుడ్ లో ఏ సినిమా చూశాడో, దాన్లో ఏమేమి అర్ధాలు తీస్తాడో అని భయం వేసింది. పండిత సభలో, మూర్ఖుల సమక్షం లో మౌనం భూషణం అన్నారు పెద్దలు. కాస్త పెద్దలను గౌరవించే బూజు పట్టిన పాత భావాలవాడిని కాబట్టి వారి మాటను పాటించాను. మౌనంగా వుండిపోయాను.

నేనెంత సేపటికీ మాట్లాడకపోయేసరికి, బ్రహ్మబుధే అన్నాడు, సినిమాలు తీసేది అందరూ చూడటానికే కదా?

తలవూపాను.

మరి ఎవరికీ అర్ధం కాకుండా తీస్తే అర్ధం ఏమయినావుందా? అలాంటి సినిమాకు అవార్డిస్తే, అర్ధం కాకుండా తీయటమే ఉత్తమము అని ప్రోత్సహించినట్టవుతుందికదా?

ఇంతకీ నువ్వుచూసిందే సినిమా? ఏమేమి అవార్డులొచ్చాయి? అడిగాను.

నాకదంతా తెలియదు. నేను పరిషోధించి, విమర్శకులు గొప్పగా పొగిడిన జాబితాను తయారుచేసాను. దాన్లో అందరూ ఈ సినిమాను గొప్పగా పొగిడారు. అందుకని చూశాను.

ఏమిసినిమా అది? ఎలావుంది? అడగకుండా వుండలేకపోయాను.

ఆ ఆ ఆహ్ అగ్రు అక్రుప్తిదుఏక్ఫ్జ్ద్ హ్ఫ్ఫ్గిఉగ్ద్జ్ కపీసిపీతుపీలేఅకొచివ్త్రెంద్క్స్ల్

నాకు భయం వేసింది. వీడేభాషలో మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. వాడికేమయిందో అర్ధం కావటం లేదు.

భయం భయంగా వాడి వైపు చూస్తున్న నన్ను చూసి నవ్వాడు.
భయపడకు. నాకేమీ కాలేదు. ఇప్పుడు నేనన్న మాటలలోంచి అర్ధాలు వెతుకు. ఆఙ్నాపించాడు.

వొద్దు బాబూ అంత శిక్ష వేయకు. బ్రతిమిలాడాను.

అలావుంది సినిమా. దాన్లో అర్ధాలు వెతుక్కోవాలి. అందుకే అవార్డులు, ప్రశంసలూనేమో. అవార్డివ్వకపోతే సినిమా అర్ధం చేసుకునే తెలివి లేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. తెలివి లేదని ఎవరు ఒప్పుకుంటారు. నీలాంటి మూర్ఖుదు తప్ప అన్నాడు. పక పక నవ్వి, చెప్డికు పుప్డికుం దిప్డికు డప్డికు, డప్ డప్ లుప్ చుప్ కప్ సుప్ టప్ టుప్ త్ర్ర్ర్ గ్ర్ర్ర్ మీఎ లీ లూఒ వ్త్రెక్

చేతులు జోడించాను. నాయనా, నన్నెందుకిలా చంపుతావు. నువ్వసలు భూమ్మీదకు వచ్చింది రీసెర్చ్ చేయటానికా, నన్నిలా చంపటానికా? అడిగాను దీనంగా.

నేను రీసెర్చే చేస్తున్నాను. మీ మానవ మనస్తత్వాన్ని తిరిగి వెతుకుతున్నాను. ఇప్పుడు చూడూ, ఆ అర్ధం కాని సినిమాలో అర్ధాలున్నాయని ఒకడు గొప్ప సినిమా అనగానే, కాదంటే ఎక్కడ తనని మూర్ఖుడంటారో నని ప్రతివాడూ దాన్ని గొప్ప సినిమా అని తన తెలివిని నిరూపించేసుకుంటున్నాడు.

నాయనా ఆ సినిమా ఏమిటో త్వరగా చెప్పి చంపు. నీ అనాలిసిస్ లతో నన్ను ఇలా ఉప్పు పాతర వేసి, కొంచెం కొంచెం కొరుక్కు తినకు. అదేదో సినిమాలో కొరుక్కుతినమని అడిగిన హీరోయిన్ దగ్గరకు వెళ్ళి వాళ్ళని కొరుక్కు తిను అన్నాను దాదాపుగా ఏడుస్తూ.

నేను చూసిన సినిమా పేరు పిప్పి కల్పన. కనీసం పిప్పిలోనయినా కాస్త రసముంటుంది. లేని రసాన్ని కల్పించుకుని చూడమని పేరులోనే చెప్పేస్తున్నాడు. అందుకని లేని రసాన్ని ఊహించి, నోరూరి, పొగిడేస్తున్నారేమో, అన్నాడు.

పిప్పి కల్పనా? అదేమి సినిమా.

నా మాట విన్నట్టు లేడు. చెప్తూపోయాడు.

ఒక హోటల్ లో ఇద్దరు కూచుంటారు. వాళ్ళెవరో మనకు తెలియదు. హఠాత్తుగా ఆ హోటల్ లో దొంగతనం చేయాలనుకుంటారు.

ఆగి నా వైపు కోపంగా చూశాడు.

అంతే. ఆ తరువాత ఇద్దరు వీరులు నడుస్తూ, అర్ధం లేని మాటలు మాట్లాడుతూ ఒక గదిలో దూరి ఒకడిని చంపేస్తారు.

ఇంకా కోపంగా చూశాడు.

అంతే, హఠాత్తుగా ఒక బాక్సరు కథ వస్తుంది.

ఇంకింకా కోపంగా చూశాడు.

మళ్ళీ ఒక వీరుడు వీరి డాన్స్ చేస్తారు. ఆమె ఏదో చేస్తే ముక్కులోంచి రక్తం వస్తుంది. ఆమెని తీసుకెళ్ళి గుండెలో సూది గుచ్చగానే లేచి అరుస్తుంది,

ఇమికింకింకింక కోపంగా చూశాడు.

హఠాత్తుగా ఎవడో వచ్చి పిల్లవాడికి గడియారమిస్తాడు. మళ్ళీ బాక్సరు చపుతాడు. పరుగెత్తుతాడు. ఎవడో పట్టుకుంటాడు. ఏదో చేస్తాడు. వాడు, ముందు వీరులలో ఒకడిని కాల్చేస్తాడు.

ఇంకికంకికంకింకికంక కోపంగా చూశాడు.

ఆ చచ్చిన వీరుడు ముందు వీరుడితో కలిసి మళ్ళీ చంపితే ఇంకెవడో వస్తాడు.వీళ్ళిక్కెవరినో పిలుస్తారు. ఇంకేవరో వస్తారు. మళ్ళీ హోటల్ లో దొంగ తనం దగ్గరికొస్తారు, ఆగి నావైపు చూసాడు.ఇదీ సినిమా.

అది చాలా గొప్ప సినిమా. నీకర్ధం కాలేదు, అన్నాను ధైర్యం చిక్కబట్టుకుని.

నవ్వాడు. సినిమా చూసి బయటకు వస్తూంటే, నన్నొకడు అడిగాడు. ఒక వీరుడిని బాత్రూంలో కాల్చి చంపాడు కదా. వాడు మళ్ళీ వచ్చాడేమిటి, అని. అని నవ్వాడు.

ఆ సినిమా నీకు అర్ధం కాలేదు. దాని గురించి బోలెడన్ని చర్చలు జరిగాయి. బోలేడంత మంది స్ఫూర్తి పొందారు. అది చూసి జీవితమంటే ఏమిటని చర్చించారు. తాత్వికులయ్యారు, ఇంకా ఏదో చెప్ప బోతున్న నావైపు బ్రహ్మ బుధ్ కోపంగా చూస్తూంటే ఆగిపోయాను.

ద్ఫక్ష్స్గ్గ్ద్.క్జ్స్జ్గొప్యుహ్/క్లుయ్తుక్ల్న్మ్.ం ం,చ్కంగ్ఫ్స్రిళ్ బ్ద్ఫ్గ్ఘ్ల్క్  పౌక్గ్మ్  బ్ఫ్గ్స్ద్య్త్య్ల్గ్ ప్క్ఝ్బ్వ్ వ్ద్ఫ్బ్మిహ్ల్బ్త్గ్చ్క్హ్రొబ్ఫె జ్ఫ్ఘిప్[ప్ ంగ్ర్ద్ఫుఇక్మ్

వొద్దు చాలు చాలు, అరిచాను. ఏడ్చాను. జుట్టు పీక్కున్నాను.

శాంతించాడు. నేనన్న పై మాటలలో బోలెడన్ని అర్ధాలున్నాయి. అవి వెతికి, అర్ధం చేసుకుని నాకు చెప్పు. అప్పుడు నేను మళ్ళీ ఆ సినిమా చూసి అర్ధాలు వెతుకుతాను. లేకపోతే నా అక్కసు తీరే దాకా కక్కోసు వీరుడి చక్కని చిక్కని టక్కరి, టిక్కరి నటన నా అక్కసు తీరే దాకా చూడాల్సిందే. లేకపోతే, నేనన్న మాటలు నీ చెవుల్లో మారు మ్రోగుతూనేవుంటాయి, అన్నాడు. నా మెదడులో తిష్ట వేశాడు.

alien-410
alien-48alien-49

January 23, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ