Archive for January 12, 2009

కిన్నెరసాని-6

ఇప్పుడంటే ప్రసార మాధ్యమాలు విపరీతంగా పెరిగిపోయాయి. వార్తా విస్తరణ సులభతరమయింది. ఒకప్పుడు వార్తలింత వేగంగా తెలిసేవికావు. వారూ వీరూ చూసి చెప్పిన మాటలు అలా ప్రవహించేవి.

కిన్నెరసాని నదిగా మారి ప్రవహిస్తోంది.ఆమె అందం, నడక, పాటలకు ప్రకృతి పరవశిస్తోంది. కిన్నెరసాని గురించిన వార్త కడలిని చేరింది!

కిన్నెరసాని అందంగురించి వింటూనే కడలి రాజు మదిలో కోరిక కలిగింది. జగత్తును మిరిపించగల ఆ సౌందర్యాన్ని చూడాలని ఉవ్విళ్ళూరాడు సముద్రుడు.

ఇది సహజం. ఒక చోట అందగత్తె వుందన్న వార్త తెలుస్తుంది. మగవాళ్ళంతా పనికట్టుకుని ఆ వైపుకు పోతారు. ఆ అమ్మాయిని చూడాలని తహ తహ లాడతారు.

మిస్ యూనివర్స్ గా ఓ అమ్మాయి ఎంపికయిందంటే ఆమెని చూడాలని ప్రపంచం ఆత్రపడుతుంది. ఇది సహజం. కిన్నెరసాని గురించి విన్న సముద్రుడు కూడా అలాగే ఆత్రపడ్దాడు.

అయితే, ఇతరులకూ, సముద్రుడికీ తేడా వుంది.

గంగ తన యిల్లాలు కాదటే
యమున తన ఇల్లాలు కాదటేఅ
ఎంతమందీ లేరు, ఇన్ని యేళ్ళూ వచ్చి
చిన్న వాగులు చూచి చిత్త మెరియించుకో
తనకు నిది తగదూ
కడలి రాజునకూ

ఇక్కడ కవిత గమనం చూడండి. హఠాతుగా కవిత నడకలో ఒక గాంభీర్యం ప్రవేశించింది.

తనకున్న మరియాద యెంతా
తనకున్న గౌరవం బెంతా
లోకాలు తప్పుత్రొవల పోవునాయేని
సర్ది చెప్పగలట్టి సామంతుడీ రాజు
తానుగా దిగెనా
తప్పు దారులకూ

ఇవి చదివితేనే అర్ధమవుతుంది, సముద్రుడిదెంత తప్పు కోరికనో. కానీ, ఇది ప్రతి మగవాడి మనసు. పక్కన అందాల రాశి అయిన భార్య వుంటుంది. కానీ కళ్ళు పర స్త్రీ అందం పైన నిలచివుంటాయి. ఆ పరస్త్రీ పక్కన వున్న పురుషుడి కళ్ళు ఈ స్త్రీ పై వుంటాయి.

అందుకే సముద్రాన్ని మనస్సుతో పోలుస్తారు. కోరికల అలలు నిరంతరం ఎగస్తూ వుంటాయి. తీరం దాటాలని పెళ్ళు పెళ్ళున తీరాన్ని తాకుతాయి. ఎప్పుడయితే, కోరికలు తీరాన్ని దాటుతాయో అప్పుడు ప్రళయం సంభవిస్తుంది.

అందుకే ఈ అధ్యాయం పేరు సముద్రుడి పొంగు. పరాయి పడతిని చూసి చలించి ఆమె పొందు కోసం ఉవ్విళ్ళూరే మనస్సు చలింపుకు ప్రతీక సముద్రుడి పొంగు.

ఒంటరి కిన్నెరసానిని చూశి ఆమె తనదే నని పొంగిపోయాడు సముద్రుడు.ఆమెని చూడాలని ఎగసెగసి పడ్డాడు.

కెరటాలు పొంగినా కడలీ
తరగలూగాడినా కడలీ
సొగసు కిన్నెరసాని చూపందుకొనుటకై
గగనమ్ము కొసదాక కెరటాలు ఉబికించి
దూరాలు చూచెనూ
బారలూ చాచెనూ
ఇలా ఎగసింది కానీ, చెలియలికట్ట దాటలేదు కడలి.

మనిషి మనసులో కోరిక కలుగుతుంది. అది సముద్రపు పొంగు. కానీ ప్రతి ఊహనూ మనిషి ఆచరణలో పెట్టడు. చెలియలికట్ట దాటని పొంగు అది.

కానీ, ఎదుటి వ్యక్తి కోరికను గ్రహించిన పడతి దాన్ని ఎగద్రోయవద్దు. కోరికలోని ప్రళయాన్ని గ్రహించి జాగ్రత్తపడాలి.

రావణుడి దగ్గర బందీ అయిన సీత సింగారించుకోలేదు. ఎక్కడ అది రావణుడిలో లేని ఊహలు కలిగిస్తుందోనని తన అందాన్ని ఇనుమడించేపనేమీ చేయలేదు.

కానీ ఆధునిక సమాజంలో రెచ్చగొడితే రెచ్చిపోవాలా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఫలితాలందరం చూస్తున్నాము.

సముద్రుడి కోరికను గ్రహించిన కిన్నెరసాని బెదిరింది.

కడలి మిన్నులతాకుట చూచీ
కడలి తరగల వూగు చూచీ
కడలి తనకోసమై బడలిపోవునని
కడలి తనపై వలపు కమ్ముకొనివచ్చె నని
కిన్నెరెరిగినదీ
కీడు తలచినదీ

సాధారణంగా, ఆధునికులు స్త్రీకి మాత్రం కోరికలుండవా? ఒక స్త్రీ ఒక మగవాడితో సంతృప్తి పొందదూ.. అంటూ రకరకాల సిద్ధాంతాలు ప్రకటించి అకాండతాండవం చేస్తున్నారు. సమాజాన్ని అతలా కుతలం చేస్తున్నారు. ఒక్కరితోనే వుండటం వల్ల తామేదో కోల్పోతున్నామన్న భావనను కలిగిస్తున్నారు. వారికి స్త్రీ మనసు తెలియదు.

ఒక అమ్మాయి సెక్స్ సింబల్. మరో అమ్మాయి మగవాళ్ళ సరసన వివస్త్ర అయి నృత్యం చేస్తుంది. ఇవన్నీ సినిమాలలో చూపి ప్రజల మెదళ్ళను కలుషితం చేస్తున్నారు.

కిన్నెర భర్త పైన కోపంతో వేరుపడి వచ్చింది. అంత మాత్రాన ఆమె కనబడి మోజు చూపిన ప్రతివాడికి, ప్రేమగా పలికిన ప్రతి వాడికీ తనని అర్పించుకోదు. ఆ ఆశ పడినది సముద్రుడే అయినా, తన భర్తముందు దిగదుడుపే అంటుంది. ఇలాంటి స్రీ హృదయాన్ని ఆవిష్కరించిన విశ్వనాథ అభివృద్ధి నిరోధకుడయ్యాడు. కానీ, ఆయన ప్రదర్శిస్తున్నది, ప్రాకృతికమయిన స్త్రీ హృదయం. కృత్రిమమే ప్రాకృతికమని భ్రమలో వున్న సమాజం విశ్వనాథను బూజుపట్టిన భావాల ప్రతినిధి అని హేళన చేసింది. తన కొంపకు తానే నిప్పుపెడుతున్నానని గ్రహించలేక పోయింది.

కిన్నెర హృదయాన్ని విశ్వనాథ ప్రతిబింబించిన తీరు చూడండి.

మనసులో పెద్దదిగులుట్టీ
ఎదలోన పెద్దవగ పుట్టీ
కదలిపోయెడి నీరు గడ్డకట్టించుకో
సాగిపోయెడి నీరు సాగకింకించుకో
బిట్టు కోరినదీ
బిట్టు కుందినదీ
ఓనాథ నిను వీడి వచ్చీ
ఓరాజ నిను వదలి వచ్చీ
నా మొడల్సయితమ్ము నానా జనులు కోర
యీ యేవపుంబ్రతుకేల పొందితినిరా
అంచు వగసినదీ
అంచు లురలినదీ

నాకు అందమయిన శరీరం వుంది, దాన్ని ప్రదర్శిస్తే తప్పా? అనే వారు ఆదర్శంగా వున్న సమాజానికి, నానాజనులు కోర యీ యేవంపు బ్రతుకేల పొందితినిరా, లోని వేదన అర్ధమవుతుందా?

నీటి గమ్యం సముద్రం. కానీ సముద్రుడి దగ్గరకు వెళ్ళటం కిన్నెరకిష్టం లేదు. అందుకని కదలకూడదనుకుంది. కానీ నీట్ లక్షణం ప్రవహించటం. కిన్నెర ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రంవైపు కదలుతూనే వుంది.

కిన్నెర ప్రయత్నాలను కవి వర్ణించిన తీరు చూడండి,

రాయడ్డము చేసి నిలుచూ
పొదలడ్డముగ చేసి యాగూ
ఇంత నిల్చితి నంచు నెంచి లో నుప్పొంగి
పొంత పొంతలరాళ్ళు పొదలు పైపై పొంగి
అడవి పరుగెత్తూ
అంతలో నేడ్చూ

పర పురుషుడు తనపై అధర్మ మయిన కోరిక కలిగి వుండటం పట్ల, తన నిస్సహాయత పట్ల కిన్నెర దుఖాన్ని రేపు తెలుసుకుందాం.

January 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము