Archive for January 17, 2009

కిన్నెరసాని-8

కిన్నెర సాని చివరికి వచ్చేశాము.

నదిగా మారిన కిన్నెర సముద్రుడిలో మోహాన్ని కలిగించింది. అందుకు విలపించింది. కిన్నెర కష్టం చూసిన గోదావరి గుండె కరగింది. కిన్నెరను తనలో కలుపుకుంది. దాంతో కిన్నెర నీరు, గోదావరి నీరు కలగలసి పోయాయి. వేరుచెయలెక మిళితమయిపోయాయి. గోదావరి మాటున కిన్నెర నీరు సముద్రునిలో కలసినా సముద్రుడది గుర్తించలేడు.

అయితే, కిన్నెర గోదావరి సంగమాన్ని కవి వర్ణించిన తీరు  కవి భావుకతనూ, ప్రకృతి పరిశీలనా పటిమనూ మాత్రమే కాదు, మానవ మనస్తత్వ పరిశీలన శక్తిని కూడా ప్రస్ఫుటం చేస్తుంది.

ఇక్కడ, కిన్నెర మామూలు వాగు కానటే, గోదావరి మామూలు నది కాదు. గోదావరి తల్లి. తల్లి, తన పిల్లల దుఖానికే కాదు, ఏ పిల్ల బాధనయినా, తల్లి గానే అనుభవిస్తుంది.

గోరంతదీపం అనే సినిమాలో ఒక దృశ్యం వుంది. వాణీశ్రీ పై మాన భంగ ప్రయత్నం జరుగుతుంది. ఆమె తప్పించుకుంటుంది. వాళ్ళు వెంటపడతారు. అప్పుడు కొందరు పల్లె ఆడవాళ్ళు తట్టలు మోసుకుని వస్తూంటారు. వాళ్ళు వాణీశ్రీ పరిస్థితి చూసి జాలిపడతారు. జంతువులు, తమ పిల్లలను గుంపు నడుమ ఉంచి కాపాడినట్టు, ఆడవాళ్ళు, నాయికను, తమ మధ్య దాస్తారు. ఆమెకు ఒక పెద్ద తల్లి ఆశ్రయం ఇస్తుంది. అప్పుడామె ప్రవర్తన, మనస్తత్వం, మామూలు ఆడవాళ్ళ ప్రవర్తనలా వుంటుంది. కిన్నెరసాని దుస్థితి చూసి గుండె కరగిన గోదావరి ప్రవర్తన అచ్చు అలాగే వుంటుంది.

ఈ వర్ణనలోనూ, ధ్వని, లయ, రసము, పదాల కూర్పులను ప్రత్యేకంగా గమనించాలి.

గోదావరి, కిన్నెరను, కౌగిట అదుముకొని, ఏదీ నీ ముఖము చూపించు, దిగులు మానమని ఓదార్చింది.నీకెన్ని కష్టాలే చెల్లీ అని

దగ్గరతీసుకుంది.గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి
నీ దుఖమెంతదో తల్లీ    నన్ను
నాదరువుగా నమ్ము చెల్లీ  నినుచూచి
పేదలై, లోకాలు పెద్దలై యేలేటి
జోదులే మతి చెడిరి తల్లీ  నీ యేడ్పు
రోదసిని నిండినది చెల్లీ

మామూలు పల్లె తల్లులిలా గుండెలు బాదుకుంటూ, మాటలంటూ ఏడుస్తారు.

ఇలా, గోదావరి కిన్నెరను తనలో కలుపుకుంది. గంగా సరస్వతులు కలసినట్టు కలిశాయి. గోదావరీ ముత్యాల కెరటాలు, కిన్నెర తరంగాలూ చెట్టపట్టాలేసుకున్నాయి.

ఇప్పుడు, ఆరెండు నదుల తరగలను వర్ణిస్తాడు కవి.

గోధుమల వన్నె తెలి క్రొత్త మబ్బుల జంట
ఊది కలసినయట్లు.

వీధిలో పెద్దక్క పిన్నక్క నవ్వుల్ల
బోదెలొదిగినయట్లు

(గోదావరీ) మీనులాడే తరంగాలు  చిన్ని
సాదు కిన్నెర తరంగాలూ  కలసికొని
మీది ఉయ్యాలలో మిసమిసను పసిపాప
మాదిరిగ కలసికొని

ఇది చూసి కడలియేమీ చేయలేకపోయింది. అందరూ సముద్రుడికి బుద్ధి చెప్పారు. .
గోదావరి, తన లో భాగాన కిన్నెరను ప్రవహింపచేస్తూ పైన తన నీరుంచుకోని కడలిలో కలసి పోయింది.

ఇలా, గోదావరిలో కలసిన కిన్నెర దిగులు వదలి ఆనంద తరంగిత అయింది. మనిషిగా వుంటే మరణం వుండేది. నదిగా మారిన తనకూ, రాయిలా మారిన తన పతికీ చావన్నదిలేదని సంతోషించింది.

దీనితో కిన్నెర కథ పూర్తయినట్టే. కానీ, కవి ఇంతటితో వదలితే మామూలు కవి అవుతాడు. ఇప్పుడిక కవి, నిర్భయంగా ప్రవహించే కిన్నెర వైభవాన్ని, దివ్యంగా వర్ణిస్తాడు.

ఇది రేపు.

January 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము