Archive for January 19, 2009

కిన్నెరసాని-9

కథ సుఖాంతమయింది. సముద్రుడి అక్రమ కోర్కెనుంచి కిన్నెరను తల్లి గోదావరి కాపాడింది.

సినిమా కథ అయిపోయింది. అంతా అయిపోయిన తరువాత నాయికా నాయకులు చెట్టాపట్టాలు వేసొని పాడుకుంటూ పోవటం చూపుతారు. అలాంటిది, కిన్నెర పాటలు చివరి అధ్యాయం కిన్నెర వైభవం.

కిన్నెరకిప్పుడు పతిని వదలిన బాధలేదు. ఎందుకంటే, నది జీవితం తనది అని అర్ధం చేసుకుంది. మానవ స్వభావమింతే. ఏదో జరుగుతుందని భయపడతాడు. ఏదో కావాలని ఆరాటపడతాడు. కొరుకున్నదొకటయితే, ఇంకేదో దొరుకుతుంది. కాస్త బాధపడతాడు. ఉన్నదానితోనే రాజీ పడాలని ప్రయత్నిస్తాడు. కిన్నెర అదె చేస్తోంది.

భర్తను వదలలేక ముందుకు పారింది. సముద్రుడికి భయపడింది. గోదావరి అక్కున చేరింది. ఇప్పుడిక బాధలేదు. చీకూ చింతా లేదు. ప్రవహించటం తన జీవితం. ఆనందంగా, అందంగా ప్రహిస్తోంది. సినిమా చివరలో స్వేచ్చగా ఆడీ పాడే నాయికలా కులుకులు చిలుకుతోంది కిన్నెర.

తూర్పులో తెల్లనై తోచిన దుషః కాంత
తొలిమావిలేబూత దూసెను పికీకాంత
తలలపై రతనాలు తళతళా మెరిసేటి
నల్లత్రాచులు దూకి నాట్యమాడేట్లు
మెరిసింది కిన్నెర  ఒడ్డుల్లు
ఒరిసింది కిన్నెరా

మళ్ళీ పాట లయ చూడంది. కథా గమనాన్న్ని లయ ప్రతిబింబించటం చూడండి.

నది నీటిలో కదిలే అలలపైన సూర్య కిరణాలు ధగ ధగలాడతాయి. కవి దృష్టిలో అది, తలతల్పై తళ తళ మెరిసే నల్లత్రాచుల్ల కనిపించాయి. కిన్నెర నడకను పడగలో పగడాలు ధరించిన నల్లత్రాచు నడకతో పోలుస్తున్నాడు కవి. నల్ల త్రాచు గతిని చూసిన వారికి, నది కదలికలో త్రాచు నడకలోని సామ్యం తెలుస్తుంది. కవి వూహలో ఔచిత్యమూ, అద్భుతమూ బోధపడతాయి.

ఇంకోసారి కవికి కిన్నెర,

పసుపు బట్టలు ఆరపట్టగా నేలపై
గాలి లేబొరలలో కదులుయాడినయట్లు

కనిపించింది కిన్నెర కదలిక. ఆ ఊహ చూడండి, గాలికి కదలాడే ఆరేసిన పసుపుబట్ట కదలికట. ఆరేసిన బట్టను చివళ్ళ ఎగరకుండా కడతారు. దాంతో గాలికి దాని కదలిక అలల కదలికలా వుంటుంది. నృత్యంలో, నదికదలికను నేపధ్యంలో చూపేందుకు బట్టను రెండుకొసలా పట్టుకుని లయ బద్ధ్యంగా వూపుతారు. దానిపై రంగు వెలుగులను మార్చి మార్చి ప్రసరింపచేయటంవల్ల అలల కడలి భ్రాంతి కలిగిస్తారు. విశ్వనాథవారు ఆ భావనను అక్షరాలద్వారా కలిగిస్తున్నారు.

ఇంకో సందర్భంలో,

తరగ విరిగిన చోట తరణి కాంతు ప్రబ్బి
గాజుముక్కలు సూర్యకాంతి మండినయట్లు

అంటాడు.

మరకతమ్ములు నేల పరచగా పడ్దట్లు
పారుటాకుల మీద పసిమి యూదినట్లు
నడిచింది కిన్నెరా   సోగసుల్లు
ముడిచింది కిన్నెరా

కళ్ళమ్ము తుడిచి పండిన గోధుమల కుప్ప
తూర్పుగాలులకు తూర్పార పట్టిన యట్లు
జారింది కిన్నెరా

కవి వాడే ఉపమానాలన్ని నిత్యజీవితంలో అనుభవానికి వచ్చేవే. పల్లెలలో ప్రతివారూ అనుభవించేవే. గోధుమలను పరచి తూర్పార్బట్టటాన్ని ఊహిస్తే కిన్నెర కదలిక గోచరిస్తుంది.

నీటి ప్రవాహాన్ని శ్రద్ధగా గమనించండి. నీరు, అణువుల కదలికా తోస్తుంది. నీరు చిన్న చిన్న గింజలయి ఒక దానిపై మరొకటి దొర్లుతూ జారుతూన్నాట్టు తోస్తుంది. కవి వర్ణిస్తున్నది ఆ కదలికనే. ప్రకృతిని ఎంతో సూక్ష్మంగా, దగ్గరగా అనుభవిస్తేకానీ ఇలాంటి ఊహ కలగదు. కలిగిన ఊహను సందర్భొచితంగా పదాలలో పొదిగి ప్రదర్శించటం కవి ప్రతిభకు నిదర్శనం.

వలపు తిరిగిన పరు నాట్యమాడినయట్లు
తరలింది కిన్నెరా,

గమనిస్తే, తాను చేస్తున్న వర్ణనకు తగ్గ కదలికను సూచించే పదాలనే వాడుతున్నాడు కవి.

నల్ల త్రాచుతో పోల్చినప్పుడు, ఒడ్డుల్ల ఒరసిందన్నాడు. ఆరవేసిన బట్ట అన్నప్పుడు, కదలిందన్నాడు. రేలచెట్టునుండి రాలిన క్రొత్తచివిళ్ళన్నప్పుడు, పొలిచిందన్నాడు. గాజుముక్కలపై పడే సూర్యకాంతన్నప్పుడు, పొదిలిందన్నాడు. పారే ఆకులన్నప్పుడు నడచిందన్నాడు. గోధుమలకుప్ప గాలికెగసినట్టన్నప్పుడు జారిందంటున్నాడు.

ఇదీ కవిత్వమంటే!

కొట్టంది, తన్నండి, చంపండి అని లయ బద్ధంగా అరిచేసి అదే అభ్యుదయకవిత్వం పొమ్మంటే, శక్తి వున్నంత కాలం నడుస్తుంది. కానీ కాలానికి ఎవరి నమ్మకాలతో, అపోహలతో, అభిప్రాయాలతో సంబంధంలేదు. అది నిక్కచ్చిగా విలువను చెప్తుంది.

ఆవేశం తగ్గిన తరువాత, కవులంతా ప్రేమ మీద పడ్డారు. దాంతో కవిత్వం అసలు లక్షణాన్ని మరచి, ప్రేమకో, ఆవేశానికో(ఉద్యమాలు) పరిమితమయింది. ప్రజల ఆదరణ కోల్పోయింది.

కవిత పాఠకులలోని సున్నిత భావనలను జాగృతం చేయాలి. అతనిలోని భావుకతకు రెక్కలివ్వాలి. అతని భావనా బలాన్ని పెంచాలి. సృష్టిలోని అణువణువులో ఆనందాని పిండుకుని, అందాన్ని దర్శించి అనుభవించగల శక్తి నివ్వాలి. అలాంటి కవిత్వమే కాలం పరీక్షలో నెగ్గుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. మిగతావి వడగాలుల్లా వీస్తాయి. ఉక్కిరి బిక్కిరి చేసి కళ్ళలో దుమ్ముకొట్టి పోతాయి.

నదీ ప్రవాహం, ఏ సమయంలో ఎలా కనబడుతుంది. ఏ కాలంలో ఎలా పారుతుందో అన్ని రకాలుగా అన్ని విభన్న రీతులలో వర్ణిస్తాడు కవి.

అయితే, ఎంతటి ప్రవాహమయిన ఏదో సందర్భంలో ఎండిపోయి చిక్కిపోతుంది. దాన్ని కవి,

మగని పేరెడబాటు పొగల సగమయిపోయి
బహు సన్నగిలిపోయి పాలిపోయిన మేన,

అని ఊహిస్తాడు.

వర్శంలో తడిసిన కిన్నెర వర్ణన చూడండి

వడగళ్ళతో వచ్చిపడె వానాకాలమ్ము
పుడమి పచ్చికలతో పొంగెను రసాలమ్ము
పతిగుట్ట మొగిలితోడున క్రుమ్మరించిన
అతిప్రేమవారి దేహమ్మెల్ల నిండగా
సుడిసింది కిన్నెరా   అందాలు
తడిసింది కిన్నెరా.

పడే వర్శం పతి, మేఘమై కురిపిస్తున్న ప్రేమాభిషేక జలమట!

ఇలా ఒక్కో ఋతువులో కిన్నెర కదలికను కళ్ళకు కట్టినట్టు చూపుతాడు కవి.

చలికాలంలో మంచుతో నిండి, రాణి వాసంలో మేలిముసుగులోని వెండి తీగలాగ వెలిగిందట కిన్నెర. అద్భుతము. రమణీయము.

శిశిరంలో రాలిన యెడుటాకులు పడి,యెర్రని క్రొత్త మధువు కాల్వలు కట్టినట్టు తోచిందట కిన్నెర. అద్భుతం!

ౠతువు ౠతువున మారు రుచులలో కిన్నెరా
కారు కారువ మారు కాంతిలో కిన్నెరా
తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని
చవులూరి చవులూరి జలముల్ల ప్రోవులై
కదిలేను కిన్నెరా
సాగేను కిన్నెరా

తనని తాను తెలుగు సత్కవిరాజు అనుకోవటంలో ఆతమ విశ్వాసమే తప్ప అహంకారం లేదు. ఎవరు రాయగలరిలాంటి కావ్యం, కవి సామ్రాట్ తప్ప?

ఇలా ప్రవహిస్తూ కిన్నెర భద్రాద్రి రామయ్య దర్శనం చేసే త్రోవ కాచి, తెలుగు యాత్రికులకు చల్లని నీడ, నీరు ఇస్తోంది కిన్నెర అంటూ ముగిస్తాడు కావ్యాన్ని విశ్వనాథ.

ఇలాంటి కావ్యానికి తెలుగు ప్రజలను దూరంచేయటం ఎంత ఘోరం! ఇందువల్ల భావి తరాలకెంత అన్యాయం చేస్తున్నట్టవుతోంది.

కవిత్వమంటే, ఆవేశం, ఉద్యమం అని ప్రచారం చేయటం వల్ల మనిషిలోని స్పందనలను గురించిన చైతన్యానికి అతడిని దూరం చేసినట్టవుతోంది.

అందుకే కవిత్వం ఇంత చులకనయింది. ఎందుకంటే, పాఠకుడు కోరేది, ఉద్యమాలు, రక్తపాతాలూ, నరకటాలు, ద్వేషాలూ, పిచ్చి పనికిరాని ప్రేమ కబుర్లూ, అర్ధంకాని పిచ్చి ఊహలూ కాదు. బండబారిన రాతిలాంటి హృదయంలో కూడా రస వాహినిని జల జలా ప్రవహింపచేయగలిగేదే అసలు కవ్ ఇత్వం. అలాంటి అసలు కవిత్వానికి సామ్రాట్ విశ్వనాథ. తన తరువాత ఎవ్వరికీ ఇలా రచనలు చేసే శక్తి లేదని విశ్వనాథకు తెలుసు. ఎందుకంటే, ఒక పద్ధతి ప్రకారం సమాజాన్ని తన ఆత్మకు దూరం చేస్తున్నారు. అందుకే, తాను మరణిస్తే తనతో ప్రాచీన కవులంతా మరణిస్తారన్నాడు విశ్వనాథ.  కొందరు తమని తాము గొప్ప వారిగా భావించుకునేవారు విశ్వనాథను దూషిస్తారు. కానీ, ఇప్పుడు మనకు తెలుసు. విశ్వనాథ వారితో కవిత తన వైభవం కోల్పోయింది. కావ్య పుష్పమాలలతో అర్చించే కవులు మృగ్యమయారు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్నలు నిజంగానే విశ్వనాథతో మరణించారు. తెలుగు కవిత దిక్కులేనిదయింది. ఇంకా ఇది అర్ధం చేసుకోలేనివారు, ఇప్పుడొస్తున్న కవితల సంకలనాలను చూడొచ్చు. పత్రికలలో వస్తున్న కవితలను చదవి అర్ధం చేసుకోవచ్చు.

కొద్ది విరామం తరువాత విశ్వనాథ మరో రచనను పరిచయం చేసుకుందాం!

January 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము