Archive for January 26, 2009

ఇదొక అరుదైన పుస్తకం!

అందరికీ గణతంత్ర దొనోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేనొక అరుదయిన పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి పరస్పర విభిన్నమయిన అభిప్రాయాలు ప్రచారంలో వున్నాయి. ఎవరికివారు, తాము నమ్మిన దాన్నే నిజమన్నట్టు ఆధారాలు చూపిస్తారు. తాము అభిమానించిన నాయకుడే గొప్ప మిగతా అంతా చెత్త అన్నట్టు వాదిస్తారు. మహాత్మా గాంధీ పైన సైతం అనేక ఆరోపణలున్నాయి. వాద ప్రతి వాదాలున్నాయి. కానీ అందరూ ఏక గ్రీవంగా సుభాష్ చంద్ర బోసును పొగుడుతారు. మహాత్మా గాంధీ కన్నా గొప్పవాడంటారు. ఆయనకు గాంధీ అన్యాయం చేశాడంటారు. గాంధీ వ్యతిరేకంగా ఆయన పలుకులను ఉదాహరిస్తారు. అయితే, జపాన్ లో సుభాష్ కు అతి సన్నిహితంగా వుండి, శుభాష్ కన్నా ఎన్నో ఏళ్ళముందు జపాన్ లో స్థిరపడిన నాయర్ సాన్ మాత్రం ఈ నిజాలతో విభేదిస్తాడు.

ఇంతకీ ఎవరీ నాయర్ సాన్? అన్న ప్రశ్న వస్తుంది.

భారతీయ చరిత్రలో, ప్రాచీన చరిత్రలోనేకాదు, ఆధునిక చరిత్రలో కూడా ఒక పధతి ప్రకారం అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయటం జరిగింది. అసలు నిజాలను మరుగు పరచటం జరిగింది. ఇందువల్ల, అనేక దేశ భక్తులు, స్వాతంత్ర్య వీరులు మన స్మృతి పథంలోంచి తొలగిపోయారు. అలాంటి వారిలో నాయర్ సాన్ ఒకరు.

1928లో జపాన్ చేరాడు నాయర్. స్వాతంత్ర్యం తరువాత కూడా జపాన్ లోనే వుండి పోయాడు. అప్పుడప్పుడూ భారత్ వస్తూండేవాడు. అలాంటప్పుడు ఇక్కడ ప్రచారంలో వున్న నిజాలకూ, తాను అనుభవించి తెలుసుకున్న నిజాలకూ చాలా తేడాలుండటం నాయర్ ను కలవర పరచింది. ఫలితంగా స్నేహితుల ప్రోద్బలంతో ఆయన తన అనుభవాలను గ్రంతస్థం చేయాలని నిశ్చయించాడు. అలా రూపొందింది, an indian freedom fighter in japan, memoirs of a,m, nair అనే ఈ పుస్తకం. 1985లో ఈ పుస్తకాన్ని జీ.సీ.జీవి తెలుగులోకి అనువదించారు. మద్రాసులోని అశోక్ ఉమ పబికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడిది దొరుకుతుందో లేదో తెలియదు. నాకు చెదలు పట్టిన ఈ పుస్తకం, ఒక స్నేహితుడింట్లో చెత్త కాగితాలనడుమ, అటక పైన దొరికింది.

సాధారణంగా నా పరిచయస్థులు చెత్త కాగితాలు అమ్మేముందు నన్ను పిలిస్తారు. నేను వాటిలోంచి నాకు కావాల్సినవి ఏరుకున్న తరువాత అమ్మేస్తారు. అలా నాకు దొరికిన అరుదయిన పుస్తకాలలో ఇదొకటి.

20వ శతాబ్దారంభంలో జన్మించాడు నాయర్ సాన్. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాడని తల్లితందృలు అతడిని జపాన్ లోని అన్న దగ్గరకు పంపారు. జపాన్లో అతడికి రాస్ బిహారీ బోస్ పరిచయమయ్యాడు!

రాస్ బిహారీ బోస్ పేరు మన దేఅ భక్తుల జాబితాలో అరుదుగా వినిపిస్తుంది. జపాన్ పౌరసత్వం తీసుకుని కూడా భారత మాత దాస్య శృంఖలాల చ్చేదన గురించే ఆలోచిస్త్తొండేవాడాయన. బోసుతో నాయర్ కు సన్నిహిత సంబంధం ఏర్పడింది.

బోసుతో కలసి నాయర్ భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రచారాన్నిచ్చారు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగు స్థాపించారు. విదేశాలలోని భారతీయులను కూడగట్టుకున్నారు.

తన ఆరోగ్యం పాడవుతోందని గ్రహించిన బోసు అధికారాన్ని వేరేవారికి కట్టబెట్టేందుకు సిద్ధపడ్డాడు. నాయర్ సాన్ పేరును సూచించాడు. కానీ, తన కన్నా ఎక్కువగా ప్రజలకు తెలిసిన సుభాష్ నాయకుడయితే బాగుంటుందని నాయర్ సాన్ స్వచందంగా పక్కకు తప్పుకున్నాడు. అలా సుభాష్ బోస్ జపాన్ చేరుకున్నాడు.

గాంధీ, నెహ్రూ లతో పడక వేరే దేశాలు చేరుకున్న సుభాష్, జపాన్లో ఉపన్యాసాలలో వారిద్దరినీ పరుష పదాలతో దూషిస్తే వాటిని నాయర్ తొలగించేవాడు. ఇది సుభాష్ కు నచ్చలేదు. దాంతో నాయర్ ను పక్కకు నెట్టాడు సుభాష్.

వేర్వేరు పద్ధతులలో పోరాడినా అందరి లక్ష్యం ఒకటే. అలాంటప్పుడు, భేదాభిప్రాయాలు పద్ధతులకే పరిమితం కావాలి, వ్యక్తి గతాల స్థాయికి దిగజారకూడదు అంటాడు నాయర్.

ఇండియన్ నేషనల్ ఆర్మీను కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించాడనటం ఆబద్ధం అంటాడు నాయర్.కానీ రాస్ బిహారీ బోస్ దాన్ని స్థాపించి మెరుగు పరచి సమర్ధవంతమయిన సైనిక దళం గా మలచి సుభాష్ కు అప్పగించాడంటాడు నాయర్.

అందుకే పుస్తకం ముందు మాటలో, ఆగ్నేయాసియా గురించి గ్రంథాలు రాసిన వారెవరికీ ఏమాత్రం ప్రత్యక్షానుభం లేదు. చాలా సందర్భాలలో వీరు రాసిన విషయాలు అఙ్నానంతో కూడిన తప్పుల తడకలుగానో, వుద్దేశ్యపూర్వకంగా వక్రీకరింపబడినవిగానో వున్నాయి అంటాడు. అంతేకాదు, ఈ పుస్తకంలో చెప్పిన విషయాలన్నిటికీ నాదే బాధ్యత అంటాడు.

స్వాతంత్ర్య సమర యోదుడిగా రాస్ బిహారీ బోస్ కు తగిన గౌరవం లభించలేదన్న ఆవేదన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అర్హత లేనివారికి అనవసరమయిన ఖ్యాతి దక్కుతోందన్న కోపమూ కనిపిస్తుంది.

ఇలాంటి పుస్తకాలు చదువుతూంటే, మనకన్నీ తెలుసని నాలుగు దొరికిన పుస్తకాలు చదివేసి విర్రవీగటం ఎంత మూర్ఖత్వమో తెలుస్తుంది. అలా నాలుగు ముక్కలు చదివి తీర్మానాలు చేసేసి మహనీయులు, మహాత్ముల పైన బురద జల్లి తామే వున్నతులమూ, గొప్పవారమూ, ప్రజల మెదళ్ళకు పట్టిన తుప్పు వదిలించేవారమూ అనుకోవటం ఎంత నైచ్యమో అనిపిస్తుంది.

కనీసం ఇకనుంచయినా, చీకటి కోణాలలో దాగిన మన అసలు చరిత్రను మనము వెతికి తీసి విశ్లేషించాలనిపిస్తుంది.

January 26, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము