Archive for January 27, 2009

నాకు తెలిసిన ఆరెస్సెస్!

ఇటీవలె ఒక టపాలో ఆరెస్సెస్ పైన ఒక నాస్తికుడి వ్యాఖ్య చదివాను. అతడి అభిప్రాయం అతడిది. అతడి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, నా స్వీయ అనుభవాలను బ్లాగర్లతో పంచుకోవాలనిపించింది. దాని ఫలితమే ఈ పోస్టు.

ముందుగా, నేను స్వయం సేవక్ ను కాదు. స్వయం సేవక్ అంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యుడు. నాకు ఎలాంటి క్రమ శిక్షణ అయినా నచ్చదు.  ప్రొద్దున్నే లేచి శాఖకు వెళ్ళి వ్యాయామాలు చేసి, బౌద్ధిక్( ఉపన్యాసం లాంటిది) విని, పాటలు పాడి(దేశ భక్తి, స్ఫూర్తిమంతమయినవి) ప్రతిఙ్నలు చేసి( నమస్తే సదా వత్సలే మాతృ భూమే) రావటం నా స్వభావానికి పడదు. నాకు కుడి ఎడమలు త్వరగా అర్ధం కావు. కుడి వైపు తిరగమంటే, అన్నం తిన్నట్టు చూసుకుంటే కానీ, కుడి వైపు గుర్తించలేను( ఇప్పటికీ డ్రైవింగ్ లో నాకు ఇదే సమస్య). అందుకని, మా అన్నయ్య ఆరెస్సెస్ కార్యకర్త అయినా నాకు ఆరెస్సెస్ పైన ఎలాంటి అభిమానంలేదు. పైగా, అన్నయ్య ఆరెస్సెస్ వైపు ఆకర్షితుడవటంతో నాకు ఆరెస్సెస్ అంటే ఒక రకమయిన ద్వేషం కూడా ఏర్పడింది. దీనికి తోడు, ఇంటి బాధ్యతలు నిర్వహించవలసిన అన్నయ్య అన్నీ వదలి ప్రచారక్ లా వెళ్ళి పోవటం ఆరెస్సెస్ అంటే నా ద్వేషాన్ని పెంచింది. అందుకే, నా నవల అంతర్యాగం లో ఆరెస్సెస్ కార్య కలాపాలను, ప్రచారక్ వ్యవస్థనూ తీవ్రంగా విమర్శించాను. దేశ సేవ చేయాలంటే ఇల్లొదిలి పోనవసరంలేదన్నది అప్పుడూ, ఇప్పుడూ నా అభిప్రాయం.

అయితే, నేనెంత విమర్శించినా, ఇంటికి వచ్చిన ప్రచారక్ లను, కార్యకర్తలనూ దూషించినా, వారు పట్టించుకోలేదు. నేను రాస్తానని తెలిసి, ఆరెస్సెస్ పత్రిక జాగృతిలో రాసే వీలు నాకు కల్పించారు. రాసే అవకాశం దొరికిందని జాగృతిలో రాయటం ఆరంభించానే తప్ప ఆరెస్సెస్ మీద అభిమానంతో, ప్రేమతోనో కాదు.

జాగృతిలో నాకు రామమోహమరావు గారితో పరిచయమయింది. ఆయన ఆ పత్రిక సంపాదకుడు. ప్రచారక్. ఇంజినీరింగ్ చదివి, ప్రభుత్వోద్యోగాన్ని వదలి ప్రచారక్ గా వచ్చారు. ఆయన పరిచయం నా ఆలోచనా విధానాన్ని మార్చింది.

ఆరెస్సెస్ గురించి చదవటం ఆరంభించాను. తెలుసుకోవటం ఆరంభించాను. ఇప్పటికీ, ఆరెస్సెస్ పైన నా అభిప్రాయాలు మారకున్నా, నా ఆలోచనా విధానంలో తేడా వచ్చింది.

ఆరెస్సెస్ అన్నది, చరిత్రాత్మక ఆవశ్యకత. ఆరెస్సెస్ ఆవిర్భావం ఏ సమాజంలోనయిన తప్పని సరిగా జరిగే పరిణామం. గమనిస్తే, భారతీయ సమాజం, ఈనాటికీ సజీవంగా నిలవటానికి ఇలాంటి అనేక చారిత్రిక ఉద్యమాలు, సరయిన సమయానికి ఆవిర్భవించటం ప్రధాన కారణం.

ఎప్పుడెప్పుడు భారతీయ సంస్కృతి తనని తాను మరచి. రక్షించుకోలేని స్థితిలోకి దిగజారుతోందో, అప్పుడప్పుడు సంస్కృతీ పరిరక్షణ కోసం, ఏదో ఒక సంస్థ , ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తూ వుంది. భారతీయతను కాపాడుతూవుంది.

వేదాలు విస్మృతిలో దిగజారుతున్నప్పుడు, వాటిని వర్గీకరించి, కాపాడిన వేద వ్యాసుడిదీ ఒక రకమయిన సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమమే. బౌద్ధం వల్ల కలిగిన వికృత పరిణామాలను సమాజం అనుభవిస్తూ తనని తాను మరుస్తూన్న సమయంలో, ఒక మహా శక్తిలా దేశాన్నంత ఏకం చేసి, స్ఫూర్తి నిచ్చిన, శంకరాచార్యులవారిదీ, ఒక రకమయిన, ధర్మ పరిరక్షణ ఉద్యమమే.

రామానుజాచర్యులు, మధ్వాచార్యులు ఇలా అనేకానేక తత్వ వేత్తలు, భక్తి వేదాంత శక్తులు, భారతీయ సమాజానికి దిశాదర్శనం చేస్తూ దాన్ని సజీవం చేస్తూ వచ్చారు.

మహమ్మదీయుల కరాళ నర్తనంతో భారతీయ సమాజం ఉక్కిరి బిక్కిరయి తన స్తిత్వాన్ని, దేవతల పయిన నమ్మకాన్ని కోల్పోతున్న తరుణంలో తుకారాం, కబీరు, ౙ్నానదేవుడు, అన్నమాచార్యులు, జయదేవుడు, చైతన్య ప్రభు, శివాజీ, విజయ నగర రాజులు, కాకతీయ రాజులు, రెడ్డి రాజులు, ఇలా, దేశం నలుమూలలా, పలు రీతులలో భారతీయ ధర్మ పరిరక్షణ ఉద్యమము, పలు తెరగుల ప్రసరించింది. ఒక నది, ప్రవహిస్తూ, వేయి పాయలయి, వేన వేల దారులలో విభిన్న రూపాలు ధరించినట్టు, భారతీయ పరిరక్షణోద్యమము వివిధ రూపాలు ధరించింది. ఏయే దారులలో, ఎన్నెన్ని విభిన్న రూపాలలో ప్రవహించినా నది గమ్యం సముద్రమే అయినట్టు, ఏ ఉద్యమమయినా, దాని లక్ష్యం, భారతీయ ధర్మ రక్షణమే!

ఈ ఉద్యమాలు ఎంత ప్రభావం చూపాయంటే, ఇంగ్లీషువారు కనక రంగ ప్రవేశం చేయకపోతే, దేశంలో ఇస్లామీయులు, ఇతరుల్లాగే తమ ప్రత్యేకతను కోల్పోయి, సామాజిక స్రవంతిలో మిళితమయిపోయారు. ఇంగ్లీషువారివల్ల మళ్ళీ మరో ఉద్యమం అవసరమయింది.

ఇస్లామీయుల ఐక్యత, హిందువుల అనైక్యత (గమనిస్తే, అంతకు ముందు అంతా భారతీయులే, ఆ తరువాతే, హిందూ అన్న పదం వచ్చింది.)  ఇలా ఇస్లామీయులు కలసి కట్టుగా వుంటూ, క్రైస్తవులు ఏకంగా వుంటూ, ఇద్దరూ చేరో వైపు నుంచి, భారతీయాన్ని కొరుక్కు తింటూంటే, హిందువులలో ఐక్యత సాధించాల్సిన సామాజిక ఆవశ్యకతను గుర్తించారు.

ఇది ముందుగా గుర్తించింది, వివేకానందులవారు. అయితే, ఆయన రాజకీయాలకు అతీతంగా భారతీయ సమాజాన్ని జాగృతం చేయాలని చూశారు. తన ప్రత్యేకతను తెలుసుకున్న సమాజం ఏకమయి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. వివేకానంద, ఉపన్యాసాలలో, ఆయన జీవితంలో, భారతీయ సమాజాన్ని జాగృతం చేయాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రామకృష్ణ మఠం స్థాపించటంలో ఉద్దేష్యం కూడా ఇదే.క్రీస్టియన్ మిషనరీల ప్రచారాన్ని ఎదుర్కొని, భారతీయులకు తమ అస్తిత్వాన్ని బోధించటం.

అరబిందో జీవితాంతం, ఈ దేశ ప్రజలకు తమ ఆత్మశక్తిని గ్రహించే విఙ్నానం ఇవ్వాలనే తపన పడ్డాడు. ఆయన ప్రతి ఒక్క రచనలో ఇదే తపన కనిపిస్తుంది.

మహాత్మా గాంధీ, వివేకానంద మాటలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు. ఈ దేశ ప్రజలను ధర్మం తప్ప మరేమీ సుషుప్తి నుంచి కదిలించలేదని గ్రహించాడు. రాజకీయాలకు, ధర్మానికీ ముడిపెట్టి విజయం సాధించాడు.

మహాత్మా గాంధీ విజయం సాధించటం కోసం, రాజకీయాలకు ధర్మానికీ ముడి పెట్టటం వల్ల కొన్ని విషయాలలో రాజీ పడాల్సి వచ్చింది. ఇది, అధికారంకోసం ఆయన హైందవులకు అన్యాయం చేస్తున్న భావన కలిగించింది.

ఫలితంగా, హైందవులలో ఐకమత్యాన్ని సాధించి, ఒక సంఘటిత శక్తిలా నిలపాలన్న ఆలోచన ఆరెస్సెస్ ఆవిర్భావానికి దారి తీసింది. అంతకు ముందు, దయానంద సరస్వతి, సావర్కర్ లాంటి వారు భారతీయ సమాజాన్ని ఏకం చేయాలని ప్రయత్నిస్తూ వచ్చారు. ఇస్లామీయులు, క్రీస్టియన్లు మన ధర్మం పైన చేస్తున్న దాడిని తిప్పికొట్టి నిజానిజాలు వివరించాలని ప్రయత్నిస్తూనే వున్నారు.

బెంగాలులో ఈ ప్రయత్నాలు, బ్రహ్మ సమాజ ఆవిర్భావానికి దారి తీశాయి. అయితే, బ్రహ్మ సమాజం ఏర్పాటులో ఆత్మ విశ్వాసం కన్నా, ఆత్మ న్యూనతా భావమే అధికంగా వుండటంతో మేలు కన్నా కీడేఅ ఎక్కువ జరిగింది. గమనిస్తే, వివెకానంద ఒక దశలో బ్రహ్మ సమాజ అనుయాయి. వ్యక్తి గత అహంకారాలు సంస్థను చీల్చటం ఆయనకు తెలుసు. అందుకే అహాలు లేని, సన్యాస వ్యవస్థ వైపు ఆయన మొగ్గు చూపాడు.
అలాగే రాజ కీయాలకు దూరంగా ధార్మికంగా, కానీ స్వీయ రక్షణ శక్తి కల సమాజాన్ని తయారు చేయాలన్నది  ఆరెస్సెస్ లక్ష్యం. వివేకానంద కూడా, ఉక్కు నరాల యువకులు కావాలన్నాడు. అలాంటి ఉక్కు నరాల యువకుల తయారీ ఆరెస్సెస్ లక్ష్యం.

దేశ విభజన సమయంలో ప్రజలకు ఆరెస్సెస్ ఆవష్యకత అర్ధమయింది. ఆకాలంలోని వ్యక్తుల అనుభవాలు తెలుసుకున్నా, రచనలు చదివినా ఈ విషయం స్పష్టమవుతుంది. ఆకాలంలో లాహోర్ వంటి ప్రాంతాలలో సామాన్యులను రక్షిస్తూ తురకల కత్తులకు ప్రాణాలను అర్పించిన వారిలో ఆరెస్సెస్ కార్యకర్తలు ముందున్నారు. ఉదాహరణకు, వేద్ మెహ్తా జీవిత చరిత్ర చదవండి. తురకలు, అందరికన్నా ముందు ఆరెస్సెస్ కార్యకర్తలను ఎలా టార్గెట్ చేసే వారో తెలుస్తుంది. వేరేవారి కోసం ప్రాణాలర్పించే శక్తి వీరికెలా వస్తోందని ఆయన ఆశ్చర్య పోతాడు. ఇదే కాదు, ఆ కాలంలోని ఏ రచన చదివినా ఆరెస్సెస్, హిందువుల రక్షణలో నిర్వహించిన చారిత్రాత్మక పాత్ర తెలుస్తుంది. వారు లేకపోతే, దేశ విభజన సమయంలో మరింత పెద్ద సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయేవారు.
దేశ విభజనలోనే కాదు, దేశంలో ఎక్కడేక్కడ, ఇస్లాం, క్రీస్టియనిటీల ప్రాబల్యం పెరుగుతోందో, అక్కడక్కడ ఆరెస్సెస్ ప్రజాదరణ పొందుతుంది. ఇందుకు కారణం, దెబ్బ తినేవాడికి నొప్పి తెలుస్తుంది. దూరం నుంచి చూసేవాడికి అంతా తమాషాలా అనిపిస్తుంది.

అయితే, నది ప్రవాహం ఆరంభంలో స్వచ్చమయిన జలంతో వుంటుంది. రాను రాను అది తన స్వచ్చతను కోల్పోతుంది. ఇందుకు ఆరెస్సెస్ భిన్నం కాదు. ఇవన్నీ చారిత్రిక పరిణామాలు. మన దేశంలో నెలకొని వున్న అనేక అపోహలు, దురభిప్రాయాలు, దుర్వ్యాఖ్యానాలు మనలో బోలెడన్ని తప్పుడు అభిప్రాయాలు కలిగించాయి.

గమనిస్తే, ఇప్పటికీ హిందూ సమాజంలో అదే అనైక్యత కనిపిస్తుంది. ఉద్ధరించే సంథలు బోలెడన్ని ఉన్నాయి. కానీ అవే అహంకారాలు కనిపిస్తాయి. ఆరెస్సెస్ ప్రచారక్ లలో సైతం, బావిలో కప్పల్లంటి సంకుచితము, మూర్ఖత్వమూ కనిపిస్తాయి. ఆరెస్సెస్ లో సైతము గర్హించవలసిన ధోరణులెన్నో వున్నాయి. అంతెందుకు, నేనే, జాగృతిలో రాయటం మానుకున్నాను. అయినా సరే, ఆరెస్సెస్ తో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా సరే, వారితో ఎలాంటి అనుబంధం లేకున్నా సరే, నేను ఆరెస్సెస్ వాడిని కాకున్నా సరే, కేవలం భారతీయ ధర్మనికి పెద్ద పీట వేస్తానన్న కారణానికి నేనెన్ని అపోహలకు గురవుతున్నానో?

నీ అసిధార నవల బావుంది కానీ, నీ బాక్గ్రవుండ్ బాలేదని అవార్డివ్వటంలేదన్నాడో అభ్యుదయ భావాల ప్రతినిధి. అంటే, నేను ఆరెస్సే వాడినని ఆరెస్సెస్ వాళ్ళూ భావించటం లేదు, కానీ హిందూ ధర్మం గురించి రాస్తానని ఆరెస్సెస్ వాడినని ఇతరులు ముద్ర వేస్తున్నారన్నమాట. ఇదీ మన పరిస్థితి. ఎందుకని, హిందూ ధర్మమంటే మనము అంతగా ఉలిక్కి పడతాం?

అనాదికాలంగా అమలులో వుండి, ప్రపంచంలోని అత్యుత్తమ భావాలకూ, విశాలత్వానికీ మారు పేరయిన మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. దీన్ని రక్షించేందుకు ఇంకెవ్వరూ లేరు. మనమే అర్ధం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తూ, మన గోతులు మనమే తవ్వుకుంటూంటే, మనల్ని చూస్తూ కాళిదాసు ఎంతగా నవ్వుతున్నాడో? మన పూర్వీకులెంతగా బాధపడుతున్నారో?

ఇది ఆరెస్సెస్ కు సంబంధించిన ఆవేదన కాదు. భారతీయ ధర్మమనే సముద్రంలో ఆరెస్సెస్ ఒక చిన్న నీటి చుక్క మాత్రమే. అలాంటి నీటి చుక్కను చూసి మొత్తం సముద్రాన్నే విమర్శిస్తూ మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాము. ఆలోచించండి, ఆద్యంతాలు లేని భారతీయ ధర్మంపైన ఎవరికయినా కాపీ రైటుంటుందా?  లేనప్పుడు ఆరెస్సెస్ నో విశ్వహిందూ పరిషత్ నో చూపి సమస్త భారతీయ సమాజన్ని ఎందుకు దూషించటం? హిందూ ధర్మం మాట్లాడిన ప్రతివాడిపైన ముద్రలేయటం ఎందుకు?

January 27, 2009 · Kasturi Murali Krishna · 11 Comments
Posted in: Uncategorized