Archive for February, 2009

నా కథ చదవండి!

నవ్య వార పత్రిక వారు గత సంవత్సరం దీపావళి ప్రత్యేక సంచిక సంచికలో నా కథ, కన్నీటి చుక్క, ను ప్రచురించారు. ఆ కథను కథా సెంటెనరీ బ్లాగులో పొందుపరచారు. అక్కడ ఆ కథను చదవవచ్చు. అదిచదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయాలని ప్రార్ధన.

February 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

నా బ్లాగుకు సెలవలు!

నా బ్లాగుకు సెలవలు వచ్చేశాయి. నేను, పద్మ సోమవారము నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఊళ్ళు తిరుగుతాము. అందుకని నా బ్లాగుకు తప్పని సరి పరిస్థితులలో సెలవులివ్వాల్సివస్తోంది.

సోమవారం రాత్రి బయలు దేరి మరుసటి రోజు హోస్పేట చేరతాము. తెలుగు తేజానికి, భారతీయ ధర్మ రక్షణకు ప్రతీక, వైరులకు మృత్యువు దరి అయిన హంపి ని దర్శించుకుంటాము. హంపీ నగరాన్ని పాడు చేయటానికి తురకల సేనలకు ఆరునెలలు పట్టింది. ఏక దీక్షగా, అదే పనిగా, పునాదులతో సహా సర్వం పెకిలించినా, గత  వైభవ చిహ్నాలనేకం ఇంకా మిగిలి వున్నాయంటేనే మన వారి గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం, దివ్య ధాత్రి అనే మాస పత్రిక ( ఋషి పీఠం వారిదే ఇంకో పత్రిక ఇది) లో ద్రష్ట అనే సీరియల్ రాస్తున్నాను. మధ్య యుగంలో, మాలిక్ కాఫుర్ అనే తురకల సేనా నాయకుడు దక్షిణ భారతం పైకి దండెత్తి వచ్చాడు. దక్షిణ భారతంలో అడుగిడిన తొలి మహమ్మదీయ సైన్యాధికారి ఇతడు. మధురై వరకు గెలిచాడు. అడుగిడిన చోటల్లా మారణ హోమం సృష్టించాడు. బృహదీశ్వరాలయం పై దాడి చేశాడు. మధుర మీనాక్షి ఆలయాన్ని కొల్లగొట్టాడు. శ్రీరంగంలో అకాండ తాండవం చేశాడు. చిదంబరం మందిరాన్ని పునాదులతో సహా పెకిలించివేసాడు.( ఇప్పుదు మనము చూస్తున్న మందిరం పురర్ణిర్మాణం తరువాతది). ఆ మాలిక్ కాఫుర్ దండ యాత్ర ఫలితంగా భారతీయ మనస్తత్వంలో, సాంఘిక జీవన విధానంలో చెలరేగిన అల్లకల్లోలాన్ని, దానికి మన సమాజ ప్రతిస్పందననూ వర్ణించటం నవల ప్రధానాంశం.

హంపీ లో శిథిలాలను చూస్తూ, జరిగినది ఊహిస్తే, నా రచన మరింత శక్తివంతమవుతుందని ఆశ.

హంపీ నుంచి బయలు దేరి ఉడిపి చేరతాము. ఉడిపి కేంద్రంగా, గోకర్ణం, హోర్నెడు, మురుడేశ్వర్, మూకాంబిక, సుబర్మణ్యం, నవ బృందావనం శ్రంగేరి లను దర్శించాలని పథకం.

ఉడిపి నుంచి, మంగళూరు, అటు నుంచి బెంగళోరు వచ్చి కర్ణూలు చేరాలి. ఒకటవ తారీఖు సాయంత్రం కర్నూలు లో ఒక ఉపన్యాసం ఇవ్వాలి. ఆరోజు రాత్రి కర్నూలు లో రైలెక్కి మరుసటి రోజు తెల్లారికల్లా సికందరాబాదు చేరాలి. అదే రోజు ఆఫీసుకి వెళ్ళాలి.

ఇదీ మా పర్యటన పథకం. బ్లాగరులెవరికయినా, ఇంకా ఈ స్థలాలలో చూడదగ్గ ప్రదేశాల గురించి తెలిస్తే వివరాలందిస్తే వీలుంటే వాటిని సందర్శిస్తాము. ఈసారి కుదరకపోతే మరో సారి చూస్తాము.

మేము సాధారణంగా, మూడు నెలలకోసారి ఏదయిన ఓ చూటికి వెళ్తూంటాము. నాందేడ్ మా ఆ పర్యటనలకు భంగం కలిగించింది. ఇప్పుడు మళ్ళీ మా పర్యటనలను పునః ప్రారమభిస్తున్నాము.

అయితే, ఫిబ్రవరిలో మాత్రం తప్పనిసరిగా వెళ్తాము. దీనికి మేమిద్దరమూ పెళ్ళి అప్పుడు చేసుకున్న ఒక నిర్ణయం కారణం.

ప్రతి సంవత్సరం, మా పెళ్ళి రోజును ఇలా పర్యటనలలో గడపాలన్నది, మేము, మా మొదటి హానీమూన్ లో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మేము వెళ్తున్నది మా పదహారో ప్రేమ యాత్ర. ఈ వంకన, ఒక వారంపాటు, అందరికీ, అన్నిటికీ దూరంగా గడుపుతాము. బోలెడన్ని అనుభవాలు, ఙ్నాపకాలూ మూటకట్టుకుని వస్తాము.

వారం పాటు వుండను కాబట్టి, ఈ వారమే వచ్చేవారం ఇవ్వల్సిన రాతలన్నీ రాసి ఇచ్చేయాలి. నాకు, శీర్షికలకు ఒక్కవారమయినా break ఇవ్వటం నచ్చదు. break ఇస్తే ఇక ఆ శీర్షిక ఆగిపోతుంది. మళ్ళీ రాయాలనిపించదు. అందుకని, రెండు వారాలకు సరిపడ ఇచ్చివెళ్తాను. అవన్నీ రాయాలి కాబట్టి, వెళ్ళేది సోమవారమయినా ముందే సెలవులు ప్రకటించేస్తున్నాను. ఈలోగా ఏదయినా వీలయితే, బ్లాగుతాను. లేకపోతే సెలవులే!

చివరగా, పది రోజులు బ్లాగులు చూసే వీలు లేదు కాబట్టి, పదకొండో రోజు బ్లాగులు తెరిచేసరికి అన్నీ కళకళలాడుతూండాలని, ఆలోచనలతో, అనుభవాలతో, అభిప్రాయాలతో, ఆరోగ్యకరమయిన వాదనలతో, ఆనందకరమయిన అనుభూతులతో కనిపించాలని కోరుకుంటున్నాను.

సెలవు పుచ్చుకునేముందు మరోమాట, ఇది అందరికీ తెలిసినదే,  an eye for an eye makes the world blind. కాబట్టి, దెబ్బకు దెబ్బలు, పగలు ప్రతీకారాలు వీలయినంత వరకూ వదిలేద్దాం. హాయిగా, మంచి విషయాలతో బ్లాగు ప్రపంచంలో ఆలోచనల రంగవల్లులు తీర్చి దిద్దుదాము.

exercising utmost restraint under extreme provocation is the hallmark of great men అంటారు. కాబట్టి, రెచ్చగొడితే రెచ్చిపోవటం, నన్ను అన్నారు కాబట్టి నేననంటాను అన్నట్టు కాక, విద్యావంతులమూ, విచక్షణ ఉన్నవారమూగా బ్లాగ్లోకాన్ని ఉన్నతమయిన భావనల మయం చేద్దాం. సుందరమయిన అనుభూతులను కలసి పంచుకుందాం. మనమతా ఒకటి. మనకు గ్రూపులులేవు. ముఠాలు లేవు. కలసి వుండే నాలుగు ఘడియలు, వ్యంగ్యాలు, విద్వేషాలలో గడపేబదులు, అవగాహనతో, సమన్వయం సాధిస్తూ ప్రశాంతంగా గడుపుదాము. బ్లాగుని భలే అందమయిన అనుభవంలా మిగులుద్దాము.

ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః!
let noble thoughts come from all sides.

February 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో!

నవగ్రహ పూజా మహిమ అని ఒక పాత సినిమావుంది. దానిలో ఒక చక్కటి పాటవుంది. బాణీ, హిందీలో ఓపీ నయ్యర్ సంగీత్ దర్శకత్వం వహించిన ఫిర్ వహీ దిల్ లాయాహూ అనే సినిమాలోని, నాదినీ బడ రంగీహై వాదా తెరా అనేపాట బాణీ.

తెలుగులో ఈ పాట, ఎవ్వరో, ఎందుకీరీతి సాధింతురో, ఎవ్వరో ఏల పగబూని బాధింతురో, కాదు తలవ్రాతయో, దేవతలకోపమో, కాదు ఇది మానవుని మోసమో!, అనేపాట అది.

ఈమధ్య మన తెలుగు బ్లాగులు చూస్తూంటే ఈపాట బాగా గుర్తుకువస్తోంది. ఎందుకో తెలియదు కానీ, బ్లాగుల్లో రాతలు మారిపోయాయి. రాతల ధోరణి మారిపోయింది. అలాగే, వ్యాఖ్యలు మారిపోయాయి. వ్యాఖ్యల తీరు మారింది.

ఇలాంటి సమయంలో, బ్లాగు రాయటం ఒక ఎత్తయితే, వ్యాఖ్యలను manage చేయటం ఒక ఎత్తు.

వ్యాఖ్యల విషయంలో ఎలా వ్యవహరించాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కొందరు బ్లాగుల్లో చెప్పారు. వ్యాఖ్యలను నచ్చకపోతే ఆమోదించవద్దని చెప్పారు. ఇంకొందరయితే, వ్యాఖ్యలపైనే నిషేధం విధించారు.

నామటుకు నాకు ఇలా చేయటం నచ్చటంలేదు. మనం, ఒక వ్యాఖ్యను తొలగించినా, వ్యాఖ్యలనే నిషేధించినా, ఆ వ్యాఖ్యాతల విజయాన్ని సూచిస్తుందది. ఎందుకంటే, వ్యాఖ్యలు రాసే వ్యక్తి ఉద్దేశ్యం ఆ వ్యాఖ్యలవల్ల మనకు తెలుస్తోంది. మనల్ని బాధ పెట్టాలనో, చులకన చేయాలనో అలాంటి వ్యాఖ్యలు రాస్తారు. ఆ వ్యాఖ్యలను నిషేధించటం, తొలగించటం వల్ల మనము వారి వ్యాఖ్యలకు స్పందించినట్టు అవుతుంది. వాటి ప్రభావాన్ని ఆమోదించినట్టవుతుంది.

అలాకాక, వ్యాఖ్యలకు స్పందిస్తే, ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. వాటికి లేని ప్రామాణికతను ఆపాదించినట్టవుతుంది.పైగా, అలాంటి వాటికి స్పందిస్తే మాటలు పెరుగుతాయి. వాదన పెరుగుతుంది. మనసులు బాధపడతాయి. కాబట్టి, అలాంటి వ్యాఖ్యలను ఆమోదించి వదిలేయాలి. వాటిని పట్టించుకోకూడదు.

వ్యాఖ్యను తొలగిస్తే, వ్యాఖ్య వేసినవారికి కోపం వస్తుంది. దాంతో తొలగించిన వ్యాఖ్య పదిమందికీ తెలియచేయాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాఖ్య తొలగించిన వారిని బాధపెట్టాలన్న కసి కలుగుతుంది.  కాబట్టి, వ్యాఖ్యలను స్వీకరించి వదిలేయాలి. అందువల్ల వ్యాఖ్యానించిన వారికి అహంత్రుప్తి కలుగుతుంది.

ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఎదుటి వాడు మనల్ని వెధవ అన్నాడనుకుందాం. దానికి ప్రతిగా మనం, నువ్వే వెధవ అన్నా వాదన చెలరేగుతుంది. నేను వెధవను కానూ, అన్నా వాదన పెరుగుతుంది.

మనము ఏమిటో మనకు తెలుసు. మనం తెలిసిన వారికి తెలుసు. ఒకడు వెధవ అన్నంత మాత్రాన మనము వెధవలము కామనీ మనకు తెలుసు. మనము వెధవలము కామని మనము తెలిసిన వారికి నిరూపించాల్సిన అవసరము లేదనీ తెలుసు. అయినా, మనము వ్యాఖ్యకు స్పందించి, ఏదో నిరూపించాలని ప్రయత్నిస్తున్నామంటే, ఎక్కడో , మనసు మూలలో, మనము వెధవలమేమో అన్న అనుమానం వుందన్న మాట. అందుకే, ఎదుటి వాడు వెధవ అనగానే భుజాలు తడుముకుని స్పందిస్తున్నామన్నమాట.  ఇది మనపైన మన ఆత్మ విశ్వాస రాహిత్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే, మనమెవరో మనకు తెలుసు. మనవారికి తెలుసు. కాబట్టి అలాంటి వాటికి స్పందించకపోవటమే ఉత్తమం. ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోతుంది.

అలాంటి వ్యాఖ్యలను ఆమోదించటం వల్ల పదిమందికీ వారెలాంటి వారో తెలుస్తుంది. మనము ఏమీ చెప్పకున్నా నిజానిజాలు అందరూ గ్రహిస్తారు. గ్రహించనివారికి ఎంత చెప్పినా లాభంలేదు.

ఇలాంటి వాటికి స్పందించి,  వాదించటంవల్ల మనము బాధపడటమేకాక, మన స్నేహితులనుకూడా line of fire లోకి తెచ్చినవారిమి అవుతాము. వాదనకానీ, చర్చ కానీ సమవుజ్జీలనడుమ జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలవారితో వాదనకు దిగటమంటే వారి స్థాయికి మనము దిగటమే అన్నమాట.

చప్పట్లకు రెండుచేతులు కావాలి. మనమెందుకు రెండోచేయి ఇవ్వాలి?

మరొక విషయం, ఈ మధ్య బ్లాగుల్లో, కొందరు గొడవను సమసిపోనీయక వ్యంగ్య విసుర్లూ, హేళనలూ, వెక్కిరింతల రాతలు రాస్తున్నారు. అది వారి బ్లాగు వారి ఇష్టం.

వృధా చేసే సమయం వున్నవారిని వృధా చేసుకోనీయండి. మన సమయాన్ని మనకు నచ్చిన రీతిలో గడుపుదాము.

అయినా, బాధపడకుండా వుండలేమనిపిస్తే, నవగ్రహ పూజామహిమలో పాటను పాడుకోండి. అంతేకానీ బ్లాగటం మానకండి.

ద్వేషించేకూటమిలోనా నిలచీ, ప్రేమించే మనిషే కదా మనిషీ అంటారు. మనము మనుషులము. మనుషుల్లానేవుందాము!

February 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

నా తల్లో జేజమ్మ వదిలింది!

నిన్న హాయిగా ఇంట్లో కూచుని పుస్తకాలు చదువుకుంటున్న నన్ను నా మిత్రాధముదు చలో సినిమాకి అని లాక్కుపోయాడు. అరుంధతి అనే సినిమా హాలులో కూచోబెట్టాడు.

ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా వినివుండటంవల్ల, చదివి వుండటం వల్ల, సినిమా సూపెర్ హిట్ అయివుండటం వల్ల నేనుకూడా సరే పద అన్నాను.

సినిమా చూశాను.

మొదటి దృశ్యం చూస్తూంటేనే, ఇలాంటి సినిమాలు బోలెడన్ని చూశామన్న భావన కలిగింది. సినిమా కొనసాగుతూంటే అది బలపడింది.

విశ్రాంతి సమయంలో వెళ్ళిపోదాం, అన్నాడు నా మితృడు. కానీ, డబ్బులు పెట్టినందుకు పూర్తిగా చూడాలి, అని వాడికో అయిస్ క్రీం కొనిచ్చి, ఇద్దరమూ, తెరపై రక్తపాతాలూ, పగలూ, ప్రతీకారాలూ, మాయలూ, మంత్రాలూ, నవ్వుతూ, జోకులేసుకుంటూ చూశాము.

సినిమా అయిన తరువాత, జేజమ్మా, జేజమ్మా, అనిపాడుకుంతూ బయటకు వచ్చాము. దెబ్బకు తలలో జేజమ్మ వదిలింది.

ఎక్సోర్సిస్ట్, ఓమెన్, పోల్టెర్గీస్ట్, నైట్ మేర్ ఆన్ ది ఎల్మ్ స్ట్రీట్, డ్రాకులా, మమ్మీ, ఇంకా, ఇలాంటి, అనకొండాలు, భయంకరమయిన జీవుల వాతపడే సినిమాలూ, ఈవిల్ డేడ్డులూ, వంటి సినిమాలు చూసీ, చూసీ విసిగి హారర్ సినిమాలు చూస్తూ నవ్వుకునే స్థితికి చేరుకున్నవారికి అరుంధతి, సీ గేడు సినిమా.

ఇలాంటి సినిమాలతో పెద్దగా పరిచయం లేని వారికి ఇదొక అధ్బుతమయిన సినిమా. మన తెలుగు తెరపైన, ఇలాంటి, సాంకేతిక అద్భుతాలు చూడటం ఆనందం కలిగించే విషయమే అయినా, కథ పరంగా, స్క్రిప్తు పరంగా, ఎడిటింగ్ పరంగా, ఇంకా అనేక ఇతర సాంకేతిక అంశాల పరంగా చూస్తే, అరుంధతి బిలో ఆవెరేజ్ సినిమాగా మిగులుతుంది.

సినిమాలోని అనేక సన్నివేశాలు మనకు గతంలో చూసిన, అలవాటయిన సన్నివేశాలను ఙ్నప్తికి తెస్తాయి.

ఆడ్రే రోస్ తో సహా గతంలోని వాంపయిర్,  హారర్, దయ్యాల సినిమాలన్నీ గుర్తుకు వస్తాయి.

నాణెం నుదుటిన వొత్తగానే సెగలూ, పొగలొచ్చి దయ్యం పారిపోవటంలాంటివి, శిలువ చూపగానే, నుదుటిన వొత్తగానే సైతాను పారిపోయే సన్నివేశాలను గుర్తుకు తెస్తుంది.

సజీవ సమాధిచేసి, వాడు చచ్చిపోతే, ఉలిక్కిపడి ఆశ్చర్యపడటం నవ్వుతెస్తుంది.

దేవుడి గదిలో వున్నా, దయ్యం తనపనులు చేసేసుకు పోవటం, ముగ్గును తొలగించేందుకు నీళ్ళను ఉపయోగించటం మంచి హాస్య సన్నివేశం. ఒక దశలో ఆ గదిలో టైటానిక్ ను ముంచేన్ని నీళ్ళున్నాయేమో ననిపించింది.

కార్లోంచి లోయలో పడ్డ ఫకీరు, చెట్టు ఈవిల్ డేడ్ లో లాగా ఇనుప సమాధిలో బంధిస్తే దాన్ని చేదించుకుని వచ్చి, నాయికకు ఆయుధాన్నివ్వటం లాంటి సన్నివేశాలు, గద్వాల్ దాటనివ్వనన్న దయ్యం, వికారాబాదు వరకూ నాయికను పోనివ్వటం, కొబ్బరికాయలు తలపైన మోదుతూంటే రక్తం ధారలా కారటం,  ఇలా ఒకటేమిటి, ప్రతి సన్నివేశం ఈ సినిమాను ఒక హాస్య చిత్రంగా తీర్చి దిద్దటంలో ఇతోధికంగా సహాయపడ్డాయి.

నిశ్చితార్ధం అయిన తరువాత, కాబోయే మొగుడు ఊరొస్తే, ఇంటికి రమ్మనే బదులు అర్ధరాత్రి పాడుపడిన కోటలోకి రమ్మనగానే వెళ్ళటం, ఫకీరు చెప్పేదాకా సెల్ ఫోను చేయాలని గుర్తుకు రాకపోవటం, ఎవరయినా కోటలోకి వెళ్తూంటే, ఉట్టిగా అడ్డుపడే ఓ దయ్యం (సస్పెన్స్ పెంచుతున్నమనుకుని, అపహాస్యం పాలు చేస్తుంది), ఇలాంటి అర్ధంపర్ధం లేని పాత్రలూ, సన్నివేశాలూ, ఈ సినిమా లోని హాస్యాన్ని మరింత పెంచుతాయి.

అఘోరీలవద్దనుంచి శక్తులు సంపాదించిన విలన్, కోటలోకి వచ్చి, చేయి విసిరి అందరినీ చంపేయటం చూస్తూంటే, రిటర్న్ ఆఫ్  ది డ్రాగన్ లో బ్రూస్లీ, చెక్కిన సన్నని ముక్కలను విసరటం గుర్తొచ్చి, నవ్విస్తుంది. వాడొచ్చి నానా హంగామా చేస్తూంటే, కత్తి పట్టుకున్న నాయిక కత్తిని పడేసి, వాడిముందుకు వెళ్ళి నిలబడటం అర్ధంలేనిది. నాయిక పైటను తీయించి నాట్యమాడించే వీలు కళాకారులకు కలిగింది.

విలన్ మాటి మాటికీ, నాయిక వాసన చూడటం కుక్కను గుర్తుకు తెస్తుంది. వాడి కేకలు, అరుపులు, ప్రతిగా నాయిక, రేయ్ అని అరుపులు, అబ్బబ్బ, చెవులు చిల్లుపడేశాయి. బహుషా, అప్పుడేనేమో నా తల్లో జేజమ్మ, కదలటం మొదలయివుంటుంది.

సినిమా మొదట్లో, నాయిక రేషనల్ వాదన చేసి, ఒక బంధువు దయ్యం వదలటం నుంచి కాపాడుతుంది. తరువాత వాడికి చికిత్స మాట తలపెట్టదు. ఇంటిలో సరిగా వుంచదు. మళ్ళీ చెట్టుకి కట్టేస్తుంది ఇంటి బయట. అలాగే, కొడుకు సమాధిలోంచి లేవటానికి ఎదురుచూసిన వాడి తల్లి ఆతరువాత ఏమయిందో మనకు తెలియదు. ఇలాంటి స్క్రిప్టు లోపాలు అనేకానేకాలు.

నాయిక కొన్ని సందర్భాలలో అందంగా కనబడుతుంది. ఆమెకు శాస్త్ర్ర్య నృత్యం రాదని తెలుస్తుంది సులభంగా. మిగతా వారంతా, అరుపులు, కేకలు, ఓవరాక్షన్లతో తల హోరెత్తిస్తారు.

సినిమాలో క్రౌర్యం, హింస హద్దులు దాటింది. ఒక అమ్మాయిని, కత్తితో వొళ్ళంతా గాయాలు చేసి, ఆమె ప్రాణాలు పోతూంటే, ఆమెను అనుభవించి, నీప్రాణాలు సుఖంగా పోతున్నాయని అనిపించటం, ఈ దృష్యాన్ని విపులంగా చూపటం అనవసరం. విలన్ క్రూరుడని చూపాలంటే, ఇలాంటివేవీ లెకుండా కూడా చూపవచ్చు. కానీ, ప్రజలు పెద్ద ఎత్తున సినిమాను ఆదరించటంతో లోపాలన్నీ హుష్ కాకీ అవుతాయి. లోపాలు వెతికేవాడు రంధ్రాన్వేషి అవుతాడు.

అయితే, ప్రజలు ఈ సినిమాను ఇంతగా ఆదరించటం, ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మన ప్రేక్షకులు, కాస్తయినా నాణ్యమయిన సినిమాకోసం మొహం వాచి వున్నారు. ఏమాత్రం కొత్తదనం కనబడినా, భిన్నంగా వున్నా, ఆదరించి, మూస సినిమాలపట్ల వ్యతిరేకతను తెలుపుతున్నారు. ఇది గమనించి కళాకారులు ప్రేక్షకులివే చూస్తారని కాక, తమ మనసుకు నచ్చిన సినిమాలు నాణ్యంగా తీస్తూ ఉన్నత ప్రామాణికాలేర్పరచాలి.

ఇక్కడే మరో విషయాన్ని గమనించాలి. మన స్థాయిలో సీ గ్రడు సినిమా స్థాయిలో వున్న స్లం డాగ్ మిలియనీర్ వాళ్ళకు అద్భుతంగా అనిపిస్తోంది. అవార్డుల వర్షాలు కురుస్తున్నాయి.

వారి స్థాయితో పోలిస్తే, సీ గ్రేడు స్థాయి సినిమా అయిన అరుంధతి, మన దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఇతర కళాకారులకు ఆదర్శమవుతోంది.

సినిమాలో అరుపులు కేకలతో నా తలలో జేజమ్మ పూర్తిగా వదలిపోయింది. ఇప్పుడర్ధమయివుంటుంది మీకు, బ్రహ్మబుధ్ ని ఈ సినిమావైపుకు కూడా నేనెందుకు పోనీయటంలేదో!

February 15, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ

ఈ వారం నేను కాస్త బిజీ!

ఈ వారం నేను కాస్త బిజీగావున్నాను. ఆఫీసులోనూ, ఇంటిలోనూ కాస్త పనుల వొత్తిడి ఎక్కువగా వుంది. దీనికి తోడుగా, నా రాతలు, కోతల పనులు ఎలాగో వున్నాయి. అందువల్ల, బ్లాగు దగ్గరకు రాలేక పోతున్నాను. కంప్యూటరు దగ్గరకు వచ్చినా, పోస్టు పెట్టేంత సేపు వుండలేకపోతున్నాను.

వీలయితే, ఈ ఆదివారం వార్త అనుబంధంలో, నేను వారం వారం చేస్తున్న ప్రముఖుల బ్లాగు పరిచయాన్ని చదవండి.

వార్తలోనే, రచన పేజీలో, స్లం డాగ్ మిలియనీర్ నవలను, సినిమానూ పోలుస్తూ రాసిన వ్యాసాన్ని చూడండి.

ఆదివారం, ఆంధ్రప్రభ, అనుబంధంలో సగటు మనిషి స్వగతం చూడండి. ఈసారి, రాముడి సేనల గురించి సగటు మనిషి ఆలోచనను రాశాను.

సోమవారము విడుదలయ్యే ఆంధ్ర భూమి వార పత్రికలో, పవర్ పాలిటిక్స్ శీర్షికన, ఈ వారం, మన దేశంలో పెరుగుతున్న అసహనానికి రాజకీయాలకు ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం వస్తుంది. చదవండి.

ఈవారానికి ఇంతే. సెలవు. చదివి మీ అభిప్రాయాలను వ్యక్త పరచటం మరవకండి.

February 13, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

ప్రొఫెసర్ వీరభద్రప్ప భగవద్గీత- సమీక్ష!

లోపభూయిష్టమయిన దృష్టితో ప్రపంచాన్ని చూస్తూ, తన దృష్టి లోపాలను ప్రపంచానికి ఆపాదిస్తాడు మనిషి. అలాంటి లోపభూయిష్టమయిన దృష్టితో భగవద్గీతను చూస్తూ, తమ మెదళ్ళలోని లోపాలను హైందవ ధర్మానికి ఆపాదించిన కువిమర్శక పరిశీలన గ్రంథం కన్నడంలో ప్రొఫెసర్ వీర భద్రప్ప రచించిన భగవధీత. దాన్ని తెలుగులోకి అనువదించి అందించారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య, వివినమూర్తి.

ఆరంభంలోనే రచయిత భారతీయ తాత్విక సాంప్రదాయాన్ని తనదైన దృష్టితో పరిచయం చేస్తాడు. భారతీయ ధర్మం సర్వం ప్రతీకల మయం. పదాలు పైకి ఒక అర్ధాన్నిస్తాయి. తమలో వేరే అర్ధాన్ని దాచుకుంటాయి. చూసేవారు తమ దృష్టినిబట్టి అర్ధాన్నివ్వగలుగుతారు. అందుకే పైపై అర్ధాలను చూసి విశ్లేషిస్తే వికృతమయిన అపార్ధాలు జనిస్తాయి. అందుకే రంధ్రాణ్వేషణ దృష్టితో చూసేవారికి అనంత నిధులు భారతీయ తాత్విక గ్రంథాలు. మొదటి వాక్యం నుంచీ రచయిత భారతీయ ధర్మాన్ని తక్కువ చేయటమనే లక్ష్యంతోనే రచన ఆరంభించారని స్పష్టమవుతుంది.

ఇలాంటి దృష్టితో మొత్తం భారతీయ చరిత్రను కులం దృష్టితో( అర్జునుడు, కృష్ణుడూ క్షత్రియులు, బ్రాహ్మణులు బౌద్ధాన్ని దెబ్బతీయటానికి పన్నిన కుట్ర లాంటివి), సంకుచిత మనస్సుతో చూసి దానికి సవిమర్శక పరిశీలన అని పేరు పెట్టటంలోనే రచయిత ఉద్దేశ్యం అర్ధమవుతుంది. ఆయన భగవద్గీతను ఎలా పరిశీలిస్తాడో తెలిసిపోతుంది. పుస్తకం మొత్తం శ్రీకృష్ణుడిని, వైదిక ధర్మాన్ని, వైదిక సిద్ధాంతాలనూ దూషించటం, అపహాస్యం చేయటం, బ్రాహ్మణులను క్రూరులుగా, కర్కోటకులుగా చూపటం కనిపిస్తుంది. ఏదో గొప్ప విశాల భావాలను ప్రదర్శిస్తున్నట్టు ప్రకటించుకుంటూ కళ్ళకు సంకుచిత రంగుటద్దాలను బిగించుకుని, మనస్సులలో కులాల సంకుచితాలను నింపుకుని, సమస్త భారత జాతి గర్వించదగ్గ ఉన్నత భావాలపై బురదజల్లి, తమ ఉద్దేశాలను వాటికి ఆపాదించి సమాజం సిగ్గిలి, న్యూనతా భావంతో మగ్గేట్టు చేయాలన్న ఆశ ఈ పుస్తకం ప్రతి అక్షరంలో ఉట్టిపడుతూంటుంది. అయితే ఇలాంటి దూషణలెన్ని చేసినా, బురద ఎంతగా చల్లినా, భారతీయ ధర్మం మరింతగా అభివృద్ధి చెందుతుంది. హిమాలయాలపై మట్టిబెడ్డ విసరటం వల్ల హిమాలయాలకు నష్టం లేదు. అందుకే హిందూ ధర్మాన్ని ఎంతగా విమర్శిస్తూంటే ప్రజలలో అంతగా భక్తి పెరుగుతోంది.

భగవద్గీత, మూలం; ప్రొ వీరభద్రప్ప. వెల; 50/- విశాలాంధ్ర ప్రచురణ.

ఇది, 12.2 2009, ఆంధ్రభూమి వార పత్రికలో నేను రాసిన సమీక్షలోని కొన్ని ప్రధాన అంశాలు.

February 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu