Archive for February 2, 2009

మురికివాడల మిలయనీర్ కుక్కను చూశాడు బ్రహ్మబుధ్!

చాలా రోజుల తరువాత సుఖంగా నిద్రలోకి జారుకుంటూంటే, జర్రున బుర్రలోకి జారి, నన్ను కొర కొర మిర్రి మిర్రి చూస్తూ, ఉలిక్కిపడి లేచేట్టు చేశాడు బ్రహ్మబుధ్.

ఇన్నిరోజులు ఏమై పోయావు నాయనా కాస్త ప్రశాంతంగా నిద్రపోయాను. మళ్ళీ ఏ సినిమా చూశావు నా ప్రాణం తీయటానికి, అని నేను అడిగే లోపలే బ్రహ్మ బుధ్ నోరు విప్పాడు.

నేను మిలియనీర్ కుక్కను చూశాను, అన్నాడు.

మిలియనీర్ కుక్కనా? కొంపతీసి నువ్వు సామ్యవాద భావజాల ప్రభావంలోకి వచ్చేయలేదు కదా! ధనవంతులందరినీ, దొంగలుగా, రక్తం పీల్చే జలగలుగా, నీచ్ కమీనే కుత్తేలుగా చూపించి, పేద ప్రజలకు సంతోషం కలిగించి, వారి దగ్గర డబ్బులతో లక్షలు గడించటం మా కళాకారులకలవాటు. పేదరికం చూసి మెచ్చుకుని, అవార్డులిచ్చి, తమ నేర భావనను  కడిగేసుకోవటం పెద్దలకలవాటు. అలా నువ్వు కూడా ధనవంతులమీద ద్వేషం పెంచుకున్నావా, మిలియనీర్ కుక్క అంటున్నావు, అడిగా.

నేను చూసింది మామూలు మిలియనీర్ కుక్కను కాదు. మురికివాడల కుక్క మిలియనీర్ ను చూశాను, అన్నాడు గంభీరంగా.

అదేమిటి? అడిగాను అయోమయంగా.

అదేమరి. అందరూ అద్భుతమని పొగడుతూంటే, అవార్డు పిక్చరంటూంటే పరుగు పరుగున పోయి చూశా.

అర్ధమయింది, ఒహో, ఆస్కారు ఆస్కారమున్న సినిమానా? చాలా గొప్ప సినిమాటకదా? ముంబాయి మురికివాడలను పంచరంగులలో పరమ రమణీయంగా చూపాడట కదా? ఈ సినిమాలో కనిపించినంత అందంగా ముంబాయి నిజంగా లేదని ఎవరో అన్నారు. ఇదా మీ చికాగో? అని ఇంకో ఫ్రెండడిగాడు. ముంబాయిలో మురికీఅడలు చూస్తేనే ఆర్ధిక ఇబ్బందులలో వున్న విదేశీయులకు సంతృప్తి కలుగుతుంది, తామింకా ఎంత దిగజారాలో తెలుస్తుందని ఇంకెవరో అన్నారు…..

ఇంకా ఏదో అనబోతున్న నన్ను కోపంగా చూశాడు బ్రహ్మబుధ్.

సినిమా చూసింది నేను. మాట్లాడుతున్నది నువ్వు. అన్నాడు.

నోరు మూసుకున్నా.

అదొక అధ్బుతమయిన మురికివాడ. దాన్లో అల్లరి పిల్లలు. మురికివాడల ముద్దుపిల్లలు, విమాన రోడ్డులో క్రికెట్ ఆడుతూంటే స్కూటర్ మీద పోలీసులు వెంబడిస్తారు. పరుగెత్తే పిల్లలను ఆ పోలీసులు అరగంట వెంబడిస్తారు. కానీ పట్టుకోలేరు. నిజానికి ఎంతో దగ్గర వుంటుందీ అద్భుతమయిన సన్నివేశం.

ఇద్దరు పోలీసులు ఒక్క పిల్లవాడిని కూడా పట్టుకోలేరా?

అతి సహజంగా నిజాన్ని ఉన్నదున్నట్టు చూపారీ సన్నివేశంలో.

ఏమిటీ నిజం?

మీ పోలీసులు పెద్ద పెద్ద టెర్రరిస్టులనే కాదు, చిన్న చిన్న పిల్లలను కూడా వేటాడి పట్టుకోలేరు. ఈ నిజం ప్రపంచానికంతా తెలుసు. ఇప్పుడీ సినిమాలో అది చూస్తున్నారు. అందుకే ప్రపంచానికి అంత పిచ్చి పడుతోంది.  ఆవెంటనే ఇంకో గొప్ప నిజం చూపారు. పాపం, అరగంట వేటాడిన తరువాత పిల్లలు దొరికితే పోలీసులు వదిలేస్తారు.

మరి అంత సేపు ఎందుకు వేటాడినట్టు? అడిగాను.

మరి ఆ సీను చూడగానే విమర్శకుల తల తిరిగిపోయివుంటుంది. పోలీసులెప్పుడూ పనికిరాని చేసులే చేస్తారన్న నిజాన్ని ఇంత గొప్పగా. అతి సహజంగా చూపినందుకు వారు ఉప్పొంగి పోయివుంటారు. అన్నాడు.

తరువాత? అడిగాను.

తరువాత ఈ సినిమాకే హైలటనదగిన దృశ్యం వస్తుంది. మన బాల వీరుడు, వీరోచితంగా, తడికల బహిర్భూమిలో వుంటాడు. వీరుడితో పాటు టాప్ ఆంగిల్ షాటులో వాడి క్రింద పచ్చగా పడివున్న మలాన్ని చూపుతాడు. ఎంతో సహజంగా, నిజానికి అతి దగ్గరగా వుందా సుందర మయిన సీను. తెరపైన ఆ సీను చూస్తూంటే, నాకయితే కొన్నేళ్ళు కడగని కక్కోసు వాసనతో హాలు నిండిపోయినట్టు అనిపించింది. కానీ ఒకటి మాత్రం నిజం, విదేశీ  కెమేరా కన్నులోంచి మాత్రం మలం కూడా అందమయిన మలాంలా కనిపించింది. అందుకే ఈ సినిమాకు ఉత్తమ చాయాగ్రహణం అవార్డు తప్పదు.

నాకేమనాలో తోచలేదు. నేనేమయినా అనేలోపలే బ్రహ్మబుధ్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఆతరువాత వస్తుంది పరమాద్భుతమయిన సీను. ఈ సినిమాలోకెల్లా ఉత్తమమయిన దృశ్యం. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంతవరకూ ఎవరూ తీయలేనిది, ఇకపై ఎవరు తీసినా ఇంతబాగా తీయలేనిదీ అయిన సీనది.

ఊరించక త్వరగా చెప్పు. బ్రహ్మబుధ్ కి బహిర్భూమి దృశ్యాలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు వీడి ద్వారా, మన విమర్శకులకూ ఇలాంటి దృశ్యాలు ప్రీతి పాత్రమని తెలుస్తోంది.

మన బాల వీరుడు, వీరోచితంగా పోరాడుతూ, బయటకు వెళ్ళనని మారాం చేస్తున్న మలాన్ని అతి కష్టం మీద బయటకు తోస్తూంటే, అమితాభ్ బచ్చన్ అనే మరో గొప్ప వీరుడి హెలికాప్టర్ వస్తుంది. ఇది కూడా టాప్ ఆంగిల్ లో, క్రింద పచ్చటి మలం, పైన నుంచుని పిల్లవాడు ఆకాశాన్ని చూస్తూంటాడు. ఎంత ప్రతీకాత్మకమయిన సీనది? ఎన్నెన్ని తాత్విక భావాలకాలవాలమా సీను?  అయితే, అందరూ అమిత్ ను చూడాలని పరుగెత్తుతూంటే  మన హీరో తడికల మలాలయంలో బందీ అవుతాడు. కానీ అమిత్ ను చూడాలని ఆత్రం. అప్పుడేం చేస్తాడో తెలుసా?

ఏం చేస్తాడు.

బయటకు వెళ్ళేదారిలేక మల రంధ్రంలోకి దూకుతాడు. మల సముద్రంలో పడతాడు. వొళ్ళంతా మలంతో  అలాగే అమిత్ ను కలవాలని పరుగులు పెడతాడు. నాకయితే ఎ సినిమా దర్శకుడికి దర్శకత్వం రాదనిపించింది. లేకపోతే, ఇంత గొప్ప సన్నివేశంలో బాల వీరుడు, వొళ్ళంతా మలం అతుక్కుని అతిగొప్ప ప్రాకృతిక పెయింటు పూసుకుని పచ్చబంగారులోకం, నాదె కావాలి ఎల్లప్పటికీ, ప్రపంచమంతా పచ్చ పచ్చగా, పచ్చి పచ్చిగా పచ్చదనంతో పచ్చ పచ్చ లాడాలి, పచ్చబంగారులోకం అయిపోవాలీ ప్రపంచం, అని పాట పెట్టేవాడిని నేనయితే. ఆ పాటకోసం. మలం పూసుకున్న వెయ్యి మంది మురికి వాడల స్త్రీ పురుషులు నృత్యం చేస్తూంటే, ఆ మురికి వాడలలో పందులు వాళ్ళ వొంటిపయినుంచి మలాన్ని నాకుతూంటే, పేదరికాన్ని అతిదగ్గరగా చూపినట్టుండేది, అంత పేద రికంలోనూ వాళ్ళు ఆనందిస్తున్నట్టు చూపినట్టుండేది. కాస్త సెక్షప్పీలుకూడా వుండేది. కానీ అంత గొప్ప అవకాశాన్ని వదలుకున్నాడు దర్శకుడు. ఆ జాలితో విదేశీయులు ఈ సినిమాకు అవార్డులిస్తున్నారు. ఇదే మనవారయితే పాటలు పెట్టేవారు కదా!

నాకు నోట మాట రాలేదు. ఇదేమి సీను, ఇదేమి దృశ్యం? ఇదేమి కల్పన? కడుపులో తిప్పింది. వీడు చెప్తూంటేనే ఇలావుంటే ఇక చూసినవారికి ఎలావుండివుంటుంది? మన షారుఖ్ ఖాను, ఇతర హీరో హీరోయిన్లంతా ఎన్నారై సినిమాల్లో ధనవంతులు. విదేశీయులకు దీటుగా ఆడతారు. పాడతారు. మన ఆర్ధికాభివృద్ధిని చూపుతారు. దేశంలో అంతా డబ్బులతో కళకళ లాడుతూ ప్రేమించేస్తున్నట్టు  చూపుతారు. అది చూసి కుళ్ళుకునే విదేశీయులకు ఈ మలం దృశ్యాలు సాంత్వననిచ్చి వుంటాయి. పర్లేదు, మనం ఎంత దిగజారినా ఇండియన్లు మనకన్నా కిందేవుంటారన్న భరోసానిచ్చివుంటుందీ సినిమా. అందుకేనేమో వాళ్ళు సంతోశంతో ఇంతగా ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు.

అప్పుడే ఏమి చూశావు. ఆ మలంతో వాడలాగే అమిత్ ను చేరుకుంటాడు. అమిత వాడికి ఆటోగ్రాఫిస్తాడు. ఇక్కడకూడా ఆ పిల్లవాడు అమిత్ తో పాటపాడినట్టు పెడితే బాగుండేది. అమిత్ కూడా ఆనందించేవాడు.

బ్రహ్మబుధ్ దయవుంచి ఆపు. నాకింక వినాలని లేదు. బ్రతిమిలాడుకున్నాను.

ఏమిటీ, నిజాన్ని భరించలేవా? ఉన్నదున్నట్టు చూపితే ఉలుకెక్కువా? పేదవారి మురికివాడలను చూపితే మీకు అసూయనా? నిజానికి దగ్గరగా వుండాలని ముద్దులు, పడకగది పనులు ఉన్నవి ఉన్నట్టు చూపితే లేని అభ్యంతరం ఇలాంటి పేదల మల ప్రదర్శన దృశ్యాలకు ఎందుకు వస్తుంది? మీరంతా హిపోక్రట్లు. ఈ సినిమాలో ఈ ఒక్క సీనేకాదు, మిగతా సీన్లన్ని ఎంత సహజంగా వున్నాయి తెలుసా, రైల్లోంచి క్రిందపడిన పిల్లలు తాజ్ మహల్ చేరతారు. చెప్పులెత్తుకుపోతారు. గైడ్లవుతారు. చదువురాదు కానీ, ఇంగ్లీషు మాట్లాడేస్తారు. తుపాకులు పట్టుకుని కాలుస్తారు. అబ్బో నిజానికి అతి దగ్గరగా సహజత్వమంటే ఇదే అన్నట్టున్న ఈ సినిమాలో మురికివాడ్ల మలాన్ని చూపితే అభ్యంతరపెట్టటం నీ కుళ్ళిన జాతీయ భావాల సంకుచితాన్ని సూచిస్తుంది. అందుకే, నేనిక నీకు కథ చెప్పను. గొప్పపనులెలాగో చేయలేవు. వేరే వాడు గొప్ప పని చేస్తే చూసి ఆనందించలేవు. కుళ్ళు బోతువు. అని అరిచాడు.

నాకీ సినిమా గురించి చెప్పొద్దు. గట్టిగా అరిచాను.

అయితే ఫో. పచ్చబంగారులోకం, నీకె కావాలి స్వంతం అని పాడటం మొదలుపెట్టాడు.

అది నా భ్రమనో, నిజమో తెలియదు కానీ నా మెదడంతా వెయ్యి సెప్తిక్ టాంకులు నింది పొంగి పొర్లుతున్న భావన కలుగుతోంది.

February 2, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సినెమా రివ్యూ