Archive for February 6, 2009

బ్లాగరులందరికీ ఒక బహిరంగ లేఖ!

ఎంతో ఆలోచించిన తరువాత నేనీ టపా రాస్తున్నాను.

ఇది తటస్థంగా వుండ వీలు లేని పరిస్థితి. అలాగని, you are either with us or against us  అని అనలేని పరిస్థితి. ఎందుకంటే, మన మధ్య ఎన్ని విభేదాలున్నా, మనలో ఎన్ని విభిన్నమయిన అభిప్రాయాలున్నా, మనము పరస్పర వ్యతిరేక ద్రుక్కోణాలతో వున్నా, మనమంతా ఒకటి. ఇది కాదనలేని సత్యం. మనలో మనము పరస్పర దూషణలు చేసుకుంటూ, మనవారినే మనము హేళన చేసి తరిమేస్తూ, వెక్కిరించుకుంటూ, ఎత్తిపొడుస్తూ సాధించేదేదీలేదు. ఇందువల్ల మనం సాధించేదేదయినా వుంటే ఇద్దరు తెలుగువారు కలసి మనలేరు అని మరోసారి అందరికీ నిరూపించటమే.

మనమంతా విద్యవంతులం. విచక్షణ వున్నవారం. మనం ఎంచుకున్న రంగాలలో ప్రతిభను కనబరుస్తున్న వారము. మనమిప్పుడు ఎవరికీ ఏదీ నిరూపించాల్సిన అవసరం లేదు. మనలో మనకు హెచ్చు తగ్గులు లేవు. బ్లాగు ప్రపంచంలో, వ్యక్తిగతంగా మనమెవరన్నదానితో సంబంధం లేదు. బ్లాగులో మనం ఏమి రాస్తున్నామన్నదే ప్రాముఖ్యం.దాన్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది మెచ్చుకుంటున్నారు, ఎంతమంది విమర్సిస్తున్నారు అన్నదానితో సంబంధంలేదు.

ఇక్కడే మనము సమ్యమనం పాటించాల్సి వుంటుంది.

సాధారణంగా, బయట పత్రికలలో సంపాదకులుంటారు. మనము రాసే దానిలో మంచి చెడ్డలు చూస్తారు. బాగోలేని దాన్ని తొలగిస్తారు. బాగున్న దానికి మెరుగులు దిద్దుతారు.
బ్లాగుల్లో మనమే సంపాదకులం. అంటేనే మనమెంత బాధ్యతాయుతంగా రాయాలో ఆలోచించండి.

బ్లాగులు వ్యక్తిగతమే అయినా అవి బహిరంగ డయిరీలవంటివి. ఒక్క సారి ప్రచురించాక దాని గురించి ఏమయినా అనుకునేవీలు చదివినవారికి వుంటుంది. దీన్ని కాదనేవీలు లేదు. అలాగని, చదివిన వారెలాంటి వ్యాఖ్యలయినా చేసేవీలు లేదు.

ఎందుకంటే, బ్లాగు ప్రపంచంలో అందరమూ సంస్కారమున్న వారము కాబట్టి, మన వ్యాఖ్యలలో, మన ప్రవర్తనలో ఒక ఔన్నత్యం ఉంటుంది. అనుచితమయిన వ్యాఖ్యలు, అసభ్యమయిన భాషలను మనము వాడము.

కానీ, అందరూ ఒకే రకంగా వుంటే ఇది మానవ ప్రపంచమేకాదు.

ఒక నది జన్మస్థలంలో చిన్న నీటి పాయలా వుంటుంది. ప్రవహిస్తున్నకొద్దీ నీటి పరిమాణం పెరుగుతుంది. ప్రవాహ ఉద్ద్రుతి పెరుగుతంది. అయితే, జన్మ స్థలం నుంచి ఎంతగా దూరం ప్రవహిస్తే, దానిలోకి అంతగా కొత్త నీరు వచ్చి చేరితుంది. అలా వచ్చే కొత్త నీరు తాను ప్రవహించిన ప్రదేశాలననుసరించి రకరకాల పదార్ధాలను మోసుకువస్తుంది. ఇలా పలు ప్రాంతాలలో, పలు విభిన్న మయిన నిక్షిప్తాలతో వచ్చి చేరుతున్న నీటితో, నది నీటి రంగు మారుతుంది. రూపు మారుతుంది. ప్రవాహ గతి మారుతుంది. కానీ, ప్రవహించటం ఆగదు.

మన బ్లాగులూ ఇంతే!

ఆరంభంలో చిన్న నీటి ధారలా వున్న బ్లాగులు సంఖ్యలో పెరుగుతున్నాయి. రక రకాల వ్యక్తులు, తమతో పాటూ తమ అభిప్రాయాలనూ, భిన్న మయిన ఆలోచనలనూ మోసుకుని వస్తున్నారు. వారి రాకతో మన బ్లాగు ప్రవాహం మరింత పరిపుష్టం కావాలి. సైద్ధాంతిక మథనాలకూ, ఆలోచనల వెల్లువలకూ మన బ్లాగులు వేదికలు కావాలి.

అయితే,  ఆరంభంలో, సంఘర్షణలు అనివార్యం. ఈ సంఘర్షణలను మనము ఎలా సాధిస్తామో అన్నదానిమీద బ్లాగు ప్రవాహ గతి ఆధారపడుతుంది.

ముందుగా, మనమంతా ఒక విషయంలో ఖచ్చితంగా వుండాలి. అది, ఎట్టి పరిస్థితులలో మహిళా బ్లాగర్లతో అనుచితంగా ప్రవర్తించకూడదు. వారిని వ్యక్తిగతంగా కానీ, బ్లాగు పరంగా కానీ, వ్యాఖ్యల రూపేణాకానీ ఎలాంటి అవమానాలకూ, అసభ్య దూషణలకు గురిచేయకూడదు.

ఎంతో సన్నిహితంగా వస్తే కానీ, స్త్రీ మనసు విప్పి మాత్లాడదు. ఏమాత్రం, ఎదురుదెబ్బ తగిలినా ముదుచుకు పోతుంది. ఇక జీవితాంతం, ఆమె మనసు విప్పదు.

అలాంటిది, బ్లాగుల్లోని ఆరోగ్యకరమయిన వాతావరణం, పరిణతి చెందిన బ్లాగర్ల స్నేహ పూరిత ప్రోత్సాహంతో, మహిళా బ్లాగర్లు తమ బ్లాగులలో మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇది, సామాజిక స్థాయితో, వయసుతో, లింగభేదంతో సంబంధం లేని స్నేహం. మనము ఒకరినొకరు చూసుకోకపోయినా, బ్లాగులో రాతలద్వారా, అమ్న అంతరంగాలొకరివొకరికి తెలుసు. ఇలాంటి పరిస్థితిలో, మహిళా బ్లాగర్ల మనసు నిప్పించి, వారు ముడుచుకుపోయి, పారిపోయేట్టుచేయటం, విద్యావంతులు, సంస్కారవంతులయిన బ్లాగర్లు చేయాల్సిన పని కాదు. బయట ప్రపంచంలోలేని ఆరోగ్యకరమయిన వాతావరణాన్ని బ్లాగు ప్రపంచంలో కల్పిద్దాం. మహిళా బ్లాగర్లు నిర్భయంగా, మనసులో మాటలు వ్యక్త పరచే స్నేహ, సౌభ్రాత్రుత్వ వేదికలుగా బ్లాగులను మలుద్దాం.

ఒక అమ్మాయి మీద ఆసిడ్ దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించే మనము, ఒక అమాయకురాలికి అవమానం జరిగితే నిరసన వ్యక్త పరచే మనము, మన తోటి బ్లాగర్లతోటే సంస్కారయుతంగా వ్యవహరించలేకపోతే, బయట పాశవికత్వం ప్రదర్శించేవారికీ, మనకూ తేడా ఏముంది? వాడు కత్తితో గొంతుకోస్తే, మనము రాతల కత్తులతో, వ్యాఖ్యల ఆసిడ్లతో మహిళలపైన దాడిచేస్తున్నాం. బయట ప్రపంచంలోని ఏ అన్యాయాలనయితే మనము నిరసిస్తున్నామో, అవే అన్యాయాలను మనమూ జరుపుతున్నాము. కాబట్టి, ఎంతటి ఆవేశం వచ్చినా, ఎవరికెంత మనసు నొచ్చుకున్నా, మహిళల విషయంలో మాత్రం బ్లాగర్లంతా గౌరవం చూపాలి. ఇలా కోరాల్సిరావటం కూడా సిగ్గుపడాల్సిన విషయమే!

మహిళా బ్లాగర్లు సైతం, బ్లాగులు మూసేసి పారిపోవటం మానేయాఇ. ఒక్కసారి తస్లిమాను గుర్తు తెచ్చుకోండి. ఆమెపైన ఎన్ని విమర్శలు వస్తున్నాయి. ఎన్ని దాడులు జరుగుతున్నాయి. నిలువనీడ లేకుండా తిరుగుతోంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక మహిళకు రక్షణ కల్పించలేక పోతున్నాము. అయినా, ఆమె పోరాడుతోంది. మొత్తం ప్రపంచాన్ని ఎదిరించి నిలబడుతోంది. అటువంటిది, కొందరి దాడులకో, వ్యాఖ్యలకో బెదిరి, మనసులు పాడుచేసుకుని, బ్లాగులు మూసి పారిపోవటం పిరికితనం తప్ప మరొకటి కాదు. ఇలాంటి భీరుత్వాన్ని వదలండి.  men may come and men may go, but we write on forever అనండి. ఆచరించి చూపండి.

ఒక పత్రికలో నేనొక కాలమ్న్ రాస్తూంటే, కొందరు పాథకులు పనికట్టుకుని, వారం వారం నన్ను దూషిస్తూ వుత్తరాలు రాసేవారు. మొండిగా రాశాను కొన్నాళ్ళు. చివరికి విసుగొచ్చి ఆ కాలం ను ఆపేశాను. ఇది జరిగిన కొన్నాళ్ళకు నేను రైల్లో వెళ్తూంటే అనుకోకుండా ఎదురుగా కూచున్నాయనతో పరిచయం అయింది. మాటల్లో ఆ కాలం రాసింది నేనని చెప్పాను. ఎందుకు ఆపేశానో చెప్పాను. దానికి ఆ వ్యక్తి, నన్ను తిట్టాడు. నేనేకాదు, నా స్నేహితులందరమూ ఆసక్తిగా చదువుతున్నాము. మీరు ఆపేస్తే ఎందుకో తెలియలేదు. ఎవరో ఇద్దరు తిట్టారని మీరు చదివే పది మంది పాఠకులకు అన్యాయం చేశారు. ఇందులో వాళ్ళకి ఏమి లాభం కలిగిందో తెలియదుకానీ మాకు నష్టం కలిగింది. అదీ మీ మూర్ఖత్వం వల్ల అన్నాడు.

అది నిజం. రాయటం మానటం వల్ల నాకునేనేకాదు, ఆ శీర్షిక మెచ్చిన పాఠకులకూ అన్యాయం చేశాను నేను. అప్పటినుంచీ నా అంతట నేను శీర్షిక మానలేదు.

కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, బ్లాగులు మూయటం అర్ధం లేని పని.

మరో విషయం. ఆ మధ్య ఒక బ్లాగులో ప్రత్యేకంగా లైంగిక పరమయిన రాతలు రాస్తూంటే అందరూ అభ్యంతరం పెట్టారు. అది పొరపాటు.

ఎవరి ఇష్టం వారిది. ఆయన సంస్కారాన్ని బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి ఆయన బ్లాగులో రాసుకుంటున్నాడు. నచ్చని వారు ఆ బ్లాగు చూడకపోతే సరి. మెచ్చేవారు చూసుకుంటారు.

ఎండలేకపోతే నీడ విలువ తెలియదు. చీకటి లేకపోతే వెలుతురు విలువ తెలియదు. అలాగే బూతు లేకపోతే నీతి విలువ తెలియదు అంటారు పెద్దలు.దాన్లో ఆనందం పొందేవారిని వదిలేసి, మన ఆనందాన్ని మనము చూసుకుంటే సరి.

వద్దన్న కొద్దీ పట్టుదలలు పెరుగుతాయి. పట్టుదల విచక్షణను హరిస్తుంది. వదిలేస్తే కొన్నాళ్ళకి వారికే విసుగువస్తుంది.

క్రీస్తును రోమన్లు శిలువ వేయకపోతే క్రీస్తుకంత ప్రాముఖ్యం వచ్చేదా? రోమన్లు పూర్తిగా మరుగున పడేవారా?

బుద్ధుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు, హైందవం దాన్ని వ్యతిరేకించలేదు. దాని ఎదుగుదలను చూస్తూవుంది. కొత్త వింత. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ వైపు మళ్ళారు. కానీ, కొన్నాళ్ళకు మొహం మొత్తింది. అప్పుడు హైందవం బుద్ధుదిని వ్యతిరేకించలేదు. అతడిని ఒక అవతారం చేసింది. తనలో కలుపుకుంది. దేశంలో బౌద్ధం అంతరించింది.

ఇది మన పద్ధతి. నాగరీకమూ, సంస్కారయుతమూ అయిన పద్ధతి.

కాబట్టి, మనము కూడా, నచ్చని బ్లాగులను వదిలి, నచ్చని వ్యాఖ్యలని విస్మరిస్తూ, మనకు నచ్చిన రీతిలో బ్లాగు ప్రపంచాన్ని ముందుకు తీసుకుంటూ పోదాం.

ప్రవహించటమే నది పని. దారిలో కలసినవన్నీ మనవే. అందరినీ కలపుకుని ముందుకు సాగుదాం!

February 6, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized