Archive for March, 2009

ఈ వారం నా రచనలు-3

ఎప్పటి లాగే ఈవారం ఆదివారం వార్తలో నా శీర్షిక బ్లాగ్ స్పాట్ వుంటుంది. ఈవారం బ్లాగ్ స్పాట్ లో దీపక్ చోప్ర బ్లాగును పరిచయం చేశాను. 500 పైన పోస్టులతో, బోలెడన్ని వ్యాఖ్యలతో అతని బ్లాగు కళ కళ లాడుతూంటుంది.

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటు మనిషి తన స్వగతాన్ని ఈవారం కూడా చెప్పుతాడు. సగటు మనిషికి ఉన్న రకరకాల భయాలను ఈవారం పాఠకులతో పంచుకుంటాడు. ఎలాగ అతని భయాలను చుట్టూ వున్న ప్రపంచం మరింత పెంచుతోందో చెప్పుకుని బాధ పంచుకుంటాడు.

వార్తలోనే రచన పేజీలో పాశ్చాత్యులు కథానిక ఆవిర్భవించిన కొత్తలో దాన్ని నిర్వచించేందుకు జరిపిన చర్చలను వివ్వరిస్తూ ఒక వ్యాసం రాశాను.

ఆంధ్ర భూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో ఎప్పటిలాగే ఒక రాజకీయ అంశం విశ్లేషణ వుంటుంది.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

March 22, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

అక్షరాంజలి, రియల్ స్టోరీల రివ్యూలు!

ఇటీవలె ప్రచురితమయిన నా కొత్త పుస్తకాలు- అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన, ఈవారం పత్రికలో, స్వరలాసిక పేరుతో, శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ రచించిన సమీక్షలను ఈ క్రింద ఇచ్చిన బ్లాగులో చదవవచ్చు.

www.turupumukka.blogspot.com.

March 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

జాషువా ఖండకావ్యాలు-7

నా కవిత్వంబునందు రత్నములు కలవు
వాని బెకిలించి చూపెడువాడు లేడు
కాల మిట్లున్నదని మొనగాడువోలె
బలుకు కవిగాడ! యేటికీ స్వాతిశయము?

సూటి అయిన, వాడి అయిన ప్రశ్న ఇది. ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో ఈనాటికీ అనెక రచయితలను పట్టి పీడిస్తున్న ప్రశ్న ఇది. రచయితల స్వేచ్చా ప్రతిభ వర్తనకు ప్రతిబంధకాలు కలిగిస్తున్న ప్రశ్న ఇది.

ఇది విశ్వనాథ వంటి వారికి వర్తించే ప్రశ్న .

ఆధునిక సమాజంలో సాహిత్యం అందరికీ అర్ధం అయితేనే విలువయినది అన్న భావం ప్రచారంలోకి వచ్చింది. దానితో, భాష అందరూ వాడేదే, భావం అందరికీ అర్ధమయ్యేదే వుండాలన్న ఆలోచన బలపడింది.

అయితే, మనకు ప్రాచీన సాహిత్యం వుంది. సాహిత్యానికి లక్షణాలను ఏర్పాటుచేశారు. భావం, రసం వంటి గుణాలగురించి తీవ్రమయిన లోతయిన చర్చలు జరిగాయి. తీర్మానాలు జరిగాయి.

ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని గమనించినా, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ తేడావుంటుంది. రాతలో వ్యావహారికం వున్నా, దానికీ ఓ రకమయిన గాంభీర్యం వుంటుంది. ఏక కాలంలో రచించిన షేక్స్ పియర్, మార్లో ల భాషలలోనే తేడాలుంటాయి. అలాగే, మాం, లారెన్స్ ల భాషలో భేదాలున్నాయి. అంతెందుకు, సిడ్నీ షెల్డన్, ఇర్వింగ్ వాలెస్ ల భాషల్లో కూడా స్పష్టమయిన తేడాలు కనిపిస్తాయి. వారికీ వ్యావహారిక, గ్రాంథికాల గోల లేదు.

మన దగ్గర మాత్రం ఈ గోల ఒక వుద్యమమయి, భాషాభివృద్ధినే దెబ్బతీసే రీతిలో యుద్ధంలా మారింది.

ముఖ్యంగా, సాంప్రదాయిక గ్రాంథిక భాషకు ఒక కులం భాషగా  గుర్తింపునివ్వటంతో, కులాల మధ్య వైరుధ్యాలు, భాషా ద్వేషంగా రూపాంతరం చెందాయి. దాంతో, ఒక కసితో భాషను దుడ్డుకర్రలతో చితకబాదటం జరిగింది.

జాషువా కవిత ఆ సంధికాలంలోనిది. విశ్వనాథ ఆవేదన ఆ సంధి కాలంలోనిది. అందుకే, జాషువా విమర్శ ఎంత సమంజసం అనిపిస్తుందో, విశ్వనాథ ఆవేదన అంతే సమర్ధనీయం అనిపిస్తుంది.

పూర్వీకులు ఏర్పరచిన ఒక సాహిత్య పరంపరను ఆధునిక సమాజనికి అన్వయిస్తూ, తన సృజనాత్మక ప్రతిభతో దానిని నూతన మార్గాల నడిపించేవాడు విశ్వనాథ.

ఆధునిక సామాజిక స్రవంతీ ధార గతిని అనుసరిస్తూ, నూతన భావాలను, సామాజిక అసమానతల దౌష్ట్యాలపై తన కవితను విల్లులా ఎక్కుపెట్టినవాడు జాషువా.

ఇద్దరూ దేశ సంస్కృతీ సాంప్రదాయాలపైన గౌరవం కలవారే. ఇద్దరూ సమాజంలో సమన్వయమూ, సామరస్యమూ సాధించాలనుకున్నవారే. ఇద్దరూ సామాజిక అభ్యున్నతి ఆకాక్షించిన వారే. కానీ వారి వారి దారులను వారి అనుభవాలు నిర్దేషించాయి. అందుకే, ఒకే గమ్యమయినా వారి దారులు భిన్నంగా తోస్తాయి. పరస్పర వ్యతిరేకమనిపిస్తాయి.

విశ్వనాథ సమాజంలో ఒక రకమయిన వివక్షతను అనుభవిస్తే, జాషువా ఇదే సమాజంలో మరో రకమయిన వివక్షతకు గురయ్యాడు. ఈ ఇద్దరి రచనలు ఇందుకు నిదర్శనాలు.

అయితే, ఈ వివక్షత ఇద్దరిలో సమాజంపట్ల అవగాన, ప్రేమలను పెంచిందే తప్ప వారిలో ద్వేష భావనలను రగిలించలేదు.

జాషువా బాష్పసందేశం ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఇదేకాక, అనేక మహనీయులపై, చారిత్రిక వీరులపై, గౌతమ బుద్ధుడి పై,  గూప గొప్ప పేరు సాధించిన వారిపై, ఇతిహాసాలలోని మహా పురుషులపై జాషువా రచించిన కవితలు ఇందుకు నిదర్శనాలు. అయితే, జాషువా కవితలలో కర్ణుడి పై రాసిన కవితలు అత్యంత భావస్ఫోరకై, కర్ణుడిలో కవి తనని చూసుకుంటున్నాడనిపిస్తాయి.

తన కవితలను, కేవలం తన కులం కారణంగా, తిరస్కరించటాన్ని కవి, కర్ణుడేమాయె గుల ప్రీక్షకుల నడుమ? అని నిలదీస్తాడు.

విశ్వనాథ సాంప్రదాయకవి. రాముడు, కృష్ణుడు అతని మనసుకు పట్టే దేవతలు. దాంతో అతని రచనలలో ఆ ప్రొఢ గాంభీర్యం చోటు చేసుకుంది. భాషలో ప్రచీన కవుల పరిమళానికి, విశ్వనాథ స్వెయ్య ప్రతిభా సౌరభం తోడయింది. కానీ, ఆ పరిమళ సౌరభాలను అనుభవించేవారు లేరు. వాటిలోని సౌందర్యాన్ని గ్రహించి మెచ్చేవారులేరు. దాంతో వీలు చిక్కినప్పుడల్లా విశ్వనాథ తన కవిత్వంలో రత్నాలున్నాయని, వాటిని పరిశీలించి, అనుభవించే నాథుడు లేడని వాపోతూండేవాడు. తన రచనలలోని లోతయిన భావాలు, తాను చేసిన ప్రయోగాలు, పొందుపరచిన చమత్కారాలను తానే వివరిస్తూ బాధపడేవాడు.

ఇది నిజంగా దయనీయమైన పరిస్థితి. కవికి తన రచనను అనుభవించి, ఆస్వాదించే శ్రోత లభించక పోవటాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. దానిలోని సొంపులను, సౌందర్యాలను గ్రహించి, పాఠకులకు వివరించే విమర్షకుదు లేకపోవటం మరింత దౌర్భాగ్యం. ఈ రెండు దౌర్భాగ్యాలు విశ్వనాథవేకాదు, కాస్తయినా లోతయిన భావాలతో, ఉద్యమ, సిద్ధాంత, ఇజాల రాద్ధాంతలతో సంబంధంలేకుండా రచనలు చేసే ప్రతి రచయిత దౌర్భాగ్యమది.

నేను, విశ్వనాథ రచించిన రామాయణకల్పవృక్ష రహస్యాలు అన్న పుస్తకం చదివి నవ్వుకున్నాను. దాన్లో విశ్వనాథవారు, రామాయణ కల్పవృక్షంలో తాను చూపిన చమత్కారాలను, పొందుపరచిన భావాలను, పొదిగిన మణుల సౌందర్యాలను వివరించారు.

చాలాకాలం తరువాత నేను రాజతరంగిణి కథలు రాశాను. ఇప్పుడొస్తున్న కథలకు భిన్నంగా, వర్ణనలతో, ఆలోచనలతో, ఒకో కథలో, అనేక విభిన్న ఆలోచనల పొరలను పొందుపరుస్తూ రచించాను. రాసినవాటిని చూసి గర్వించాను. ఇవి రాసింది నేనేనా అని ఆశ్చర్యపోయాను.

రాజతరంగిణి పుస్తకరూపంలో వచ్చింది. వివిధ పత్రికలకు సమీక్షకు ఇచ్చాను. మన పత్రికల సమీక్షకులను సమీక్షకులనేకన్నా  విహంగ వీక్షకులనవచ్చు. మెర్సీలేని మెర్సెనరీలనవచ్చు. కళ్ళకు గంతలు కట్టుకుని లోకానికి దారిచూపించాలని ఆత్రపడే విదూషకులనవచ్చు. 

వీరు పుస్తకాన్ని పూర్తిగా చదవరు. రచయిత పేరు చూసి రాయాల్సిన సమీక్షను నిర్ణయించుకుంటారు. పొగడటం, తెగడటాలుకు రచన నాణ్యతతో సంబంధం వుండదు. ఎడిటర్, ఈ పుస్తకాన్ని తిట్టు అంటే చీల్చిచెండాడతారు. ఒకోసారి సంపాదకుడేమీ అనకున్నా, మనసులోని మాటను ఊహించి రాసిపారేస్తారు. ఇంకొందరయితే ముందుమాటలు, అట్టచివర్లోని మాటలు కలిపి సమీక్షలు రాసేస్తారు. ఇంకొందరు, ఎవరినిపొగడితే లాభమో వారికి భట్రాజులవుతారు, మిగతావారికి ఆరివీరభయంకరులవుతారు. లేనితప్పులువెతికి రచనని తూట్లుపొడుస్తారు.

ఉదాహరణకు, నేను 1857మీద ఒక పుస్తకం రాశాను. కొందరు దాన్ని అంతకుముందు ఒక సంపాదకుడు రాసిన పుస్తకానికి విమర్శగా భావించారు. నిజానికి రెంటికీ సంబంధంలేదు. కానీ, విమర్శకుడు, ఆ ఎడిటర్ ని సంతృప్తి పరచాలనేమో, నా పుస్తక విమర్శ మొదటి వాక్యంలోనే ఈ పుస్తకం కన్నా ఆ పుస్తకమే బాగుందని, అదే ప్రామాణికంగా నిలుస్తుందని నొక్కివక్కాణించాడు. దాంతో గుమ్మడికాయల దొంగ అనకముందే భుజాలు తడుముకున్నట్టయింది. విమర్శకుడి హృదయం అందరికీ తెలిసింది.

మరో సందర్భంలో నేను రాసిన కొన్ని వ్యాసాల సంకలనాన్ని విమర్శిస్తూ ఒక విమర్శకుడు, వ్యాసాలు అకాడెమిక్ గా వున్నాయని, తెలుగుపాఠకులకు ఇంత విపులమయిన వివరణ అవసరంలేదనీ రాశాడు. చిత్రమేమిటంటే, నన్ను తక్కువచేయాలన్న ఆత్రంలో ఆ విమర్శకుడు తాను అభాసుపాలవటమేకాదు, అంతటి పనికిరాని వ్యాసాలను 80వారాలపాటూ ప్రచురించి పాఠకులపై రుద్దిన సంపాదకుల నిర్ణయాన్ని ఎద్దేవాచేస్తున్నానని మరచిపోయాడు. ఇలాంటి సమీక్షకుల చిత్ర విచిత్ర గాథలు బోలెడున్నాయి.

అందుకే, నేను రాజతరంగిణి పైన గొప్ప సమీక్షలు రాకున్నా కనీసం కథలలో సౌందర్యాన్ని ఏవొక్క విమర్శకుడయినా గుర్తిస్తాడేమోనని ఆశపడ్డాను. మూలాన్ని అనుసరిస్తూ నేను చేసిన కల్పనలను ఎవరయిన గుర్తించి పాఠకులకు వివరిస్తారనుకున్నాను. నా సృజనాత్మక ప్రతిభను పొగడకున్నా, కనీసం గ్రహిస్తారనుకున్నాను.

కానీ, అది దురాశేనని తేలిపోయింది.

విమర్శకులెవరికీ రాజతరంగిణి తెలియదు. తెలిసినా పనికట్టుకుని రాజతరంగిణి మూలాన్ని చదివి కథలలోని చమత్కారాలను పాఠకులకు తెలిపే చిత్తశుద్ధి, ఓపిక, తీరికలులేవు.  కథలు చదివే ఆసక్తిలేదు. దాంతో, ఈ కథలను అనువాద కథలని అన్నారు. వీటిని ప్రచురించిన ప్రచురణ సంస్థకు ధన్యవాదాలు చెప్పారు. సాంప్రదాయమే సకల కష్టాల నివారిణిగా రచయిత భావిస్తున్నాడని కొందరు ఎద్దేవా చేశారు. అంతే.

ఇలాంటి సమీక్షలను చూసి బాధకలిగింది. అడవిలో నర్తించే నెమలిలా, అడవిగాచిన వెన్నెలలా అయింది నా ప్రయోగం. అప్పుడు నేను రాసిన కథలపైన నేనే వ్యాఖ్యలు రాయాలనుకున్నాను. పాఠకులకు నా కథలను చేరువచేయాలనుకున్నాను. అప్పుడర్ధమయింది నాకు విశ్వనాథవారి వేదన. ఆయన కల్పవృక్ష రహస్యాలను ఎందుకు రాయాల్సివచ్చిందో!

ఎందుకాయన, మాటి మాటికీ తన రచనలల్లో మణులుదాగున్నాయనీ, గుర్తించేవారులేరనీ బాధను ప్రకటిస్తూ వచ్చారో బోధపడింది.

అలాగని రచయిత, తన ప్రాకృతిక భావావేషాన్ని నియంత్రించుకుని పాఠకులేది అర్ధంచేసుకుంటే అలానే రాయాలా? అందరిలా ప్రవాహంలో కొట్టుకుపోతూ, తన మౌలిక జీవలక్షణానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలా? అందరూ పోతున్న దిశలో పోయేకన్నా, తనదయిన మార్గంలో ప్రయాణించటమే రచయితకు జీవంకదా? అదే అతని సృజనాత్మకతను సజీవంగా వుంచుతుందికదా!

కోకిల లక్షణం కోకిలదే. సిమ్హం లక్షణం సిమ్హానిదే. గుర్రం వేగం గుర్రానిదే. హంస నడక హంసదే. వెన్నెల వెలుగువెన్నెలదే. సూర్యుడి వేడి సూర్యుడిదే.రచయిత ఎవరి ఇష్టాయిష్టాలను పట్టించుకోవాల్సిన పనిలేదు. తనకు నచ్చిన రీతిలో రచనలు చేస్తూ పోవాల్సిందే.

అలాగని, ఎవరు మెచ్చినా మెచ్చకున్నా ఫరవాలేదని నిర్భావంగా వుండలేడు రచయిత. రచయితకు గుర్తింపుకావాలి. తన రచనలను పాఠకులు అనుభవించి ఆనందించటంకావాలి. ఇది జరగనప్పుడు బాధపడతాడు. తన రచనలోని గొప్పతనాన్ని వివరించాలని ఆత్రపడతాడు.

చూసేవారికి విచిత్రమనిపిస్తుంది.

రాస్తే అందరూ మెచ్చేది, అందరికీ అర్ధమయ్యేది రాయాలి. లేకపోతే నోరుమూసుకుని ఇంట్లోకూచోవాలి అంటారు.

కానీ అలా చేస్తే వాడు రచయిత ఎందుకవుతాడు?  సృజనాత్మక రచయిత నిరంకుశుడు. కానీ, సామాజిక వ్యవస్థకు బద్ధుడు. ఇదొక అయోమయమయిన పరిస్థితి.

అందుకే తన రచనలలో సౌందర్యాలను వివరించాలని ఆత్రపడే రచయిత హేళనకు గురవుతాడు.

కవిత్వంలో రత్నాలున్నాయని, అవి గుర్తించేవాడులేడని వాపోవటం అర్ధరహితం అనిపిస్తుంది. అందుకే, మొదటి పద్యంలో జాషువా, ఏటికీ స్వాతిశయము? అని నిలదీయటం సమంజసమే అనిపిస్తుంది.

ఏవీ? యా రతనంబులు
నీవే పెకిలించి చూపి, నీ యింటికి గొం
పోవోయ్! యట్లొనర్పగ
నీవలనన్ గాదొ! యింక నీల్గెదవేలా?

అనటం అర్ధమవుతుంది. హేళనలోని ఆలోచన, లాజిక్ తిరుగులేనివి.

దీని తరువాత పద్యాలలో తన అభిప్రాయాన్ని  విమర్శను మరింతగా విస్పష్టంచేస్తాడు జాషువా.

ఇది సోమవారం.

March 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , ,  · Posted in: Uncategorized

జాషువా ఖండకావ్యాలు-6

జాషువా రచించిన పద్యాలు చదువుతూంటే ప్రతి పద్యాన్నీ పాఠకులకు పరిచయం చేయాలనిపిస్తుంది. బ్లాగ్మిత్రులతో ఆ రసానందాన్ని పంచుకోవాలనిపిస్తుంది.ఆ దురాశను అదుపులోకి తెచ్చుకుంటూ సూక్ష్మంలో బ్రహ్మాండాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను.

రాజదర్శనము అన్న కవితలో, ప్రాచీన కవులకు లభించిన ఆదరణ పొందిన గౌరవాలను వర్ణించి,తన కవితలు వినగానే  రాజు ప్రవర్తనలో వచ్చిన మార్పును వివరిస్తాడు కవి. ఇది చదువుతూంటే మనసు బాధామయమవుతుంది.

గ్రంథ రూపంబు దాల్చు భాగ్యంబు లేక
కంట దడివెట్టుచుండు నా కవనపటిమ

అన్నపాదాలు ఆనాడే కాదు, ఈనాడూ అనేక సాహిత్యకారుల వేదనను ప్రతింబింబిస్తుంది. అయితే, జాషువా ఆవేదనకు మరో కారణముంది.

నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే
ఖాకమనీయ వైఖరుల్ గాంచి, భళి భళీ యన్నవాడె మీ
దేకుల మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్.

ఈ పద్యం జాషువా కవిత్వంలో వెలిబుచ్చిన భావాలతో, కవిత్వ నైపుణ్యంతో, ప్రతిభా పాటవాలతో సంబంధం లేకుండా అనుభవించిన అత్యంత హేయమైన అపోహను మనకు స్పష్టం చేస్తుంది. జాషువాకు బాకుతో కుమ్మినట్టుంటే, ఇప్పుడు చదువుతున్న వారికి శతఘ్నుల విస్ఫోటనాఘాతంలా తాకుతుంది. ఆయన సిగ్గగున్ అన్నారు. మనము సిగ్గుతో కుచించుకుపోతాము.

ఇక, స్వేచ్చలేదని పోరాడేవారినిచూసి, స్వేచ్చలేకేమి సోదర ద్వేషమునకు? అని దెప్పిపొడుస్తాడు, సమదృష్టి కవితలో.

ఆంధ్రభోజుడనే కవితలోని , అపుడుపుట్టిన కవుల భాగ్యము దలంచి/ యౌడుగరతురు నిర్భాగ్యులాధునికులు, అంటాడు కవి. కవితో ఏకీభవించకుండా వుండలేము.

జాషువా పద్య కవితనే రచించినా ఆయన మార్గం ఆధునికం. వినూత్నం. అందుకే, పద్యాలనెవరికీ అర్ధం కానట్టు రచించేవారినీ ఆయన విమర్షించారు. కవిత్వమంటే ప్రణయ భావప్రకటనమే అనే భావ కవులనూ వెక్కిరించారు. అయోమయము, అనే కవిత, అటు సాంప్రదాయాన్ని గుడ్డిగా పట్టుకు వేలాడే వారినీ, ఎవరికీ అర్ధంకాని, అవసరంలేని ప్రణయకావ్యాలు రచిస్తూ అదే భావకవిత్వమూ అసలు కవిత్వమూ అనేవారినీ ఉద్దేశించి రాసిన వ్యంగ్య కవిత. జాగ్రత్తగా చదువుతూంటే, పరోక్షంగా ఇది అటు విశ్వనాథ, ఇటు కృష్ణ శాస్త్రిలపైన విసురేమో అనిపిస్తుంది.

ఇది రేపు.

March 20, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

జాషువా ఖండకావ్యాలు-5

మేఘ సందేశము అందరికీ తెలుసు. జాషువా బాష్ప సందేశము మన అందరి మనసులలొ మెదలుతున్న బాధ. ఇది మన అందరి సందేశం. ఈ సందేశం మన అందరికోసం.

ఈ బాష్ప సందేశంలో ఆగ్రహముంది. ఆలోచన వుంది. హెచ్చరికవుంది. బోధనవుంది. ఇది ఒక వ్యక్తికేకాదు సమస్త భారత సమాజానికి సందేశం. సమస్త మానవాళికిది సందేశం.

మహోన్నత సుధాసౌధంబు క్రీనీడలం దాలుం బిడ్డలు బిచ్చమెత్త నిరంతరం అల్లాడు వారినిచూపి మానవత్వాన్ని, మనస్సాక్షిని తట్టిలేపాలని కవి ప్రయత్నిస్తున్నాడు.

నీసోదర్యులు వారు కారనుచు సందేహింతువో? వీర స్వే
చ్చా సామగ్రి గతించి వత్సర సహస్రంబుల్ సనెన్; దీని కీ
వే సాక్ష్యంబును, గారణంబు; నిపుడేమీ మించిపోలేదు; ఆ
శ్వాసింపం గదవయ్య భారతతనూజా! ప్రాతచుట్టంబులన్.

అగ్రవర్ణాలవారి మహోన్నత సుధాసౌధక్రీనీడల, మగ్గియున్న వారి సోదరులను గుర్తింపమని కవి సందేశాన్నిస్తున్నాడు.

సోదరులను గుర్తించమంటున్నాడు. కొన్ని వేల సంవత్సరాలక్రితమే వారి స్వేచ్చ గతించిందని గుర్తించమంటున్నాడు. దీనికి కారణమూ, సాక్ష్యమూ ఒకరే. ఇంకా మించిపోలేదు పాత చుట్టాలను గుర్తించమంటున్నాడు.

ఎంత సరళంగా, స్పష్టంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పేది చెప్తున్నాడు. హెచ్చరికనెంత సౌమ్యంగా చెప్తున్నాడో కవి.

నీ సోదరులు ఈ స్థాయిలో వుండటానికి కారణమూ నువ్వే. గుర్తించు. పరిస్థితిబాగు పరచు. లేకపోతే, పరిస్థితి ఇంకా గుర్తించకపోతే, అణచివేత ఎంతో కాలం సహించనివారు హక్కులకోసం తిరగబడి వాటిని సాధిస్తారు. అప్పుడు నీ గౌరవము నిలవదు. స్నేహ భావమూ మిగలదు. కాబట్టి నిజానిజాలు గ్రహించి మర్యాదగా సమానత్వాన్ని స్వచ్చందంగా ఇచ్చి నీ గౌరవము, బంధుత్వమూ నిలుపుకో. అనవసర విద్వేషాలకు తావివ్వకు. అందుకు ఇంకా సమయం వుంది అన్న హితవు, హెచ్చరికలూ వున్నాయి కవితలో. గ్రహిస్తే సంతోశం. లేకపోతే అనుభవించండి, అన్న నిర్లిప్తత కూడా వుంది.

ఇంతకీ ఈ అణగారిన సోదరులు సమానత్వం కూడా కోరటం లేదు.
ఇంటనుండు పెం
పుడు పసరంబులట్టులు మముం గణియించిన జాలునందు నీ
యడుగుల నంటి దీనముగ నంజలి బట్టిరి ధర్మభిక్షకై.

హృదయం ద్రవిస్తుందిది చదువుతూంటే. బహుషా, ఇది రాబోయే తుఫానుకు సూచన లాంటిదనిపిస్తుంది. అయిదూళ్ళిచ్చిన చాలని బ్రతిమాలితే సూదిమొన కూడా ఇవ్వనంటే, ధర్మ యుద్ధం తప్పదు. సర్వనాశనం తప్పదు. అది జరుగకూడదంటే ఇప్పటికయినా మేలుకో భారతతనూజా, అంటున్నాడు కవి.

అనుంగు సోదరులు పట్టణాలకావలవుంటే, నువ్వు సువర్ణమందిరాలలో ఎలావుండగలవని ప్రశ్నించి, యింకన్మేలుకొమ్మీ ధరా/ జనయితీమణి తమ్ముగుర్రలకు స్వేచ్చా భిక్షలర్ధించెడిన్, అంటాడు.

ఇంతవరకూ మనస్సాక్షిని తట్టిలేపి, నిజానిజాలు చెప్పాలని ప్రయత్నించాడు కవి. ఇప్పుడు కవి ధ్వని మారుతుంది.

ఆనందంబున నీ సహోదరులు విద్యాస్వీకృతిం జెందినా
రీనాడల్లదె శుభ్రవస్త్రములతో నేతెంచుచున్నారు నీ
తో నిత్యోచిత దైవపూజకని: సంతోషంబునన్ జేర నీ
వేని న్నీవొక రాక్షసాకృతివి సుమ్మీ భారతీనందనా!

మారిన పరిస్థితిని గమనించి సహృదయంతో వ్యవహరించమంటున్నాడు. లేకపోతే నువ్వు రాక్షసుడివి పొమ్మంటున్నాడు.

రాక్షసుడనటంలో ధిక్కారము, దూషణలతోపాటూ హెచ్చరిక వుంది.

రాక్షసులు దుష్టులేకాదు, నిజానిజాలు గ్రహించలేనివారు. అందరికీ అన్యాయం చేసేవారు. చివరికి ఘోరంగా పరాజయం పొంది మరణించేవారు. వారేకాదు వారిని నమ్మినవారి నాశనానికీ కారకులయ్యేవారు. ఇంకా వేరే చెప్పనవసరంలేదు, కవి భావం గురించి. భవిష్యత్తుకు సంబంధించి జరిగేదాన్ని సూచించటం గురించి.

తరువాత పద్యంలో, నీకొరకై వైరికి వెన్నుజూపని యనుంగు జుట్టముల్ వీరు, అంటాడు కవి. ఈ పాదం వెనుక చరిత్రకు సంబంధించిన గ్రహింపు వుంది.

భారత దేశంలో ధర్మ రక్షణకోసం జరిగిన అనేక యుద్ధాలలో, అల్ప వర్ణాలవారు అత్యద్భుతమయిన సాహసాన్ని ప్రదర్శించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధర్మాన్ని రక్షించారు. ఆ సమయంలో వారికి అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అన్న ఆలోచన లేదు. వారికున్నదొకే ఆలోచన, ధర్మరక్షణ.

భారతీయ సమాజం తురకల తాకిడికి అల్లకల్లోలమవుతున్న సమయంలో అల్పవర్ణాలవారు కత్తి చేపట్టి తురకలను తరిమి రాజ్యంపై అధికారం సాధించారు. అధికారానికి రాగానే వారు బ్రాహ్మణులకు దానాలిచ్చారు. ధర్మాన్ని నిలిపారు. మతవరకూ అల్పవర్ణాలవారయిన వారు ఇప్పుడు అగ్రవర్ణాల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం అగ్రవర్ణాలవారయిన రెడ్లు ఒకప్పుడు అల్పవర్ణం వారు.

ఒకవేళ ఇప్పుడు మనం ఊహిస్తున్నట్టే అణచివేత అనంత కాలమ్నుండీ సాగుతూవుంటే, అధికారానికి వచ్చినవారు ముందుగా ఇన్నాళ్ళూ తమని అణచివేస్తున్న వారిని ఊచకోత కోయాలి. అందుకు భిన్నంగా వారిని గౌరవించటం చూస్తే, ఇప్పుడున్న పరిస్థితికి భిన్నమయిన పరిస్థితులుండేవని, ఇప్పుడూన్నంతగా ఉద్వుఙ్నతలు, అణచివేతలూ ఆకాలంలో లేవని, సామాజిక సమన్వయం, సామరస్యం వుండేవనీ అనిపిస్తుంది. ఈ నిజాన్నే విశ్వనాథ వీరవల్లడు లో చూపిస్తే, దానికి కులం రంగుపూసి దుర్వ్యాఖ్యానాలిచ్చి, ద్వేషాలను పెంచే రీతిలో ప్రవర్తించారు తప్ప, చరిత్రను పరికించి, సమన్వయ సాధన దిశలో అడుగువేయలేదు.

ఈకడ జాషువా, మన మేధావులూ, విమర్షకులూ తప్పుదారి పట్టించిన నిజాన్ని నిక్కచ్చిగా చూపుతున్నాడు. మీకోసం ప్రాణాలొడ్డారు వీరు. నిజం గ్రహించు, లేకపోతే అనుభవించు. ఎందుకంటే అప్పటి కాలం కాదిది. ఆగౌరవాలూ, ఆప్యాయతలు, కులం ఒక సామాజిక సౌలభ్యమే తప్ప వ్యక్తుల స్వార్ధానికి వేదిక కాని కాలం కాదిది. కాబట్టి ఆనాడు ప్రాణాలు కాపాడినవాడే ఈనాడు తీయగలడని హెచ్చరిస్తున్నాడు కవి, నర్మ గర్భంగా!

కారుణ్యంబున నంటరాని తనమున్ ఖండింపవా? అని నిలదీసి, స్వాతంత్ర్యం కోరుతున్నావు, ముందు నిన్ను నువ్వు దిద్దుకో, అని హితవు చెప్తున్నాడు, నిర్మొహమాటంగా.

విదేశాలు నీ తాత్వికతకు మోకరిల్లినా, నీ సోదర విద్వేషమెరిగి మూతి ముడుస్తాయని, పదునయిన కత్తిలాంటి మాటలతో నిజాలు చెప్పాడు.

బ్రతిమిలాటలవల్ల ఫలితంలేదని గ్రహించినప్పుడు, ఇక దండోపాయమే మిగులుతుంది. ఇది, వ్యక్తిగత స్థాయిలో, కుటుంబస్థాయిలో, సామాజిక స్థాయిలో, దేశాల స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా వర్తిస్తుంది.

ఈ నిజాన్నే సాహిర్,

జహ సచ్ న చలే వహ ఝూట్ సహీ,
జహ హక్ న మిలే వహ లూట్ సహీ

అంటాడు.

బాష్పసందేశంలో జాషువా చివరి పద్యం ఈ నిజాన్నే సౌమ్యంగా చెప్తుంది.

మా ముత్తాతల నాటినుండి నను సన్మానించి నీకోసమై
మా మేనంగల రక్త బిందువుల సంపత్తి న్సమర్పించినా
మేమో, నీ హృదయంబులో నెనరులేదీషత్తు, నింకెన్నడ
న్నా! మా కష్టము గట్టునెక్కు ననుచున్నారేమి వాక్రుత్తువో!

గమనిస్తే, జాషువా కవితలో చేదు నిజాలున్నాయి. ఆవేదనవుంది. ఆక్రోషముంది. హితవుంది. హెచ్చరికవుంది. ఆందోళన వుంది.అవగాహనవుంది, నిరాశవుంది. ఆశాభావం వుంది. లేనిదల్లా ద్వేషం!

March 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

జాషువా ఖండకావ్యాలు-4

ఈ విశ్వంలో అత్యంత అద్భుతమయినది శిశు జననం. భౌతికంగా శిశు జననానికి కారణాలు తెలుసు. ఎలా శిశువు ఆవిర్భావం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ, ఎవరికీ తెలియనిదేమిటంటే, శిశువుకు చైతన్యం ఎలా వస్తుంది? ఏశక్తి, స్పెర్మ్, అండాల కలయికను పిండంగా మారుస్తుంది? ఏ శక్తి ఆ మాంసపుముద్దను సజీవ మానవుడిగా మలుస్తుంది?

ఇంతకీ మనిషి ఎక్కడినుంచి వస్తాడు? ఏమైపోతాడు మరణంతో? మరణం నుంచి మళ్ళీ జన్మవరకూ ఈ మనిషి ఏ అనంత లోకాలలో ఏరూపంలో వుంటాడు? ఆటగాడు మైదానం అంచులలో కూచుని తనవంతు ఆటకు పిలుపు వచ్చేవరకూ ఎదురుచూసినట్టు ఎక్కడ ఎదురుచూస్తాడీ మనిషి?

ఇలాంటి ప్రశ్నలు బోసినవ్వుల శిశువును చూసినప్పుడల్లా మనసులో మెదులుతాయి. అతడి చేష్టలకు మురుస్తాము. ముద్దులొలికే చేతలకు మైమరచిపోతాము. కానీ, తరచిచూస్తే, శిశువు పరమాద్భుతానికి ప్రతీక.

శిశువు తన బోటనవేల ముల్లోకాలని చూసి ఆనందపడతాడేమో అన్న ఆలోచన కవికి అందుకే వస్తుంది. జమించకముందు ఈ శిశువు ఎన్నెన్ని లోకాలు తిరిగాడో! ఏమేమి వింతలను చూశాడో! ఇప్పుడు నోరు తెరచి మనకు చెప్పలేడు. చెప్పినా మనకు అర్ధంకాదు. అందుకే, జాషువా, తన కవిత ఆరంభంలో

బోటవ్రేల ముల్లోకములు చూచి లోలోన
నానందపడు నోరులేని యోగి

అనగానే ఒక ఆలోచనా వీచిక ఎగసిపడుతుంది. శిశువు నోరు లేని యోగి.

యోగి మౌనంగా వుంటాడు. ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు.

జన్మించేకన్నా ముందు శిశువు మాతృ గర్భంలో తొమ్మిదినెలలు, చీకటిలో, యోగ నిద్రలాంటి స్థితిలో, ఆహారము లేక మౌన ధ్యాన స్థితిలో వుంటాడు. అందుకే, కవి శిశువును మౌన యోగి అనగానే మనసు ఝల్లుమంటుంది.

తల్లిదండ్రుల తనూవల్లరీద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిదినెలలపంట.

శిశువు, తల్లితండ్రుల సమ్మిశ్రిత స్వరూపం. అందుకే నీరజ్ అనే హిందీ గేయ రచయిత ఒక పాటలో

థోడా హమారా, థోడా తుమ్హారా
ఆయేగా ఫిర్ సే బచ్పన్ హమారా

అనిపిస్తాడు నాయికా నాయకులతో సంతానం గురించి పాడే పాటలో.

జాషువా భావం ఇప్పుడు మరింత స్పష్టమవుతుంది.

ఇలా శిశువు లక్షణాలు వర్ణిస్తూ, చివరికి,

ఎవరెరుంగ, రితని దేదేశమోకాని
మొన్న మొన్న నిలకు మొలిచినాడు

అంటాడు.

శిశువు ఎక్కడ జన్మిస్తే అదే అతని దేశం. ఇంత మాత్రం కవికి తెలియదా? అనెవరయినా అనుకుంటే వారికి కవి హృదయం తెలియనట్టే. ఏదేశమో, అనటం వెనుక మనము ముందు చర్చిన ఆలోచన వుంది.

ఇంకా శిశువును,

సతిని ముట్టని సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి

అని వర్ణిస్తాడు కవి.

ఏమి పనిమీద భూమికి నేగినాడో

అని ఒక చోట ఆలోచిస్తే,

చిక్కుచీకటి జిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు

అంటాడింకో చోట.

జననీ జఠరే శయనాన్ని కవి ఎంత సుందరంగా, ఆలోచనాస్ఫోరకంగా వర్ణించాడో!

జననానికి ముందు శిశువు గురించి మనకు తెలియదు. జనం తరువాత కూడా మన స్థాయికి దిగేవరకు శిశువు మనసులోని వూహలు మనకందవు. అందుకే తనలో తాను నవ్వుకొనే శిశువును చూసి కవి,

పరమేశ్వరుండేమి సరసంబులాడునో? బిట్టుగా గేకిసల్గుట్టుకోనును

అంటాడు కవి.

అద్భుతమయిన ఊహ. పరమాద్భుతమయిన భావ వ్యక్తీకరణ.  పై పైన చూస్తే శిశువును ఆనందంగా వర్ణిస్తున్నాడు కవి. తరచి చూస్తే, పరమ తాత్వికమయిన ఆలోచనలను అతి సున్నితంగా  ప్రదర్శిస్తున్నాడు.

ఉత్తమ కవితా రచనకు అత్యుత్తమ తార్కాణమిది.

శిశువు కవిత మనల్ని ఇంతగా తాత్వికపుటాలోచనలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే తరువాత కవిత బాష్ప సందేశము, మన్ల్ని కొరడాతో చళ్ళున కొట్టి అత్యంత ప్రధానమయిన మానవతా సమస్యవైపు మళ్ళిస్తుంది.

ఇది రేపు.

March 17, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , ,  · Posted in: పుస్తక పరిచయము