Archive for March 10, 2009

జాషువ ఖండకావ్యాలు-సమీక్ష!

తెలుగు సాహిత్యంలో రచయితల అదృష్టమో, దురదృష్టమో చెప్పలేముకానీ, ఒక రచయిత ఎన్నో అద్భుతమయిన రచనలు చేసినా దాన్లో కొన్ని మాత్రమే విమర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఒక విమర్శకుడు ఒక రచనను పగడుతాడు. దాంతో ఆతరువాత వచ్చిన విమర్శకులంతా ఆ రచననే పట్టించుకుంటారు. దాన్నే పొగడుతారు. ఒక గొర్రె ఏదారిన పోతే మిగతా గొర్రెలన్నీ తలలూపుకుంటూ ఆదారినే పోయే
ట్టు, ఇక అందరూ ఆ కొద్ది రచనలనే విమర్శిస్తారు. ఇలా కొన్నాళ్ళు పోయేసరికి, ఆ రచయిత ఇతర రచనలన్నీ మరుగున పడతాయి. విమర్శకులు మాటి మాటికీ పొగడే ఆ కొద్దిరచనలే సజీవంగా మిగులుతాయి. ఇందువల్ల భావి తరాలకు ఆ రచయిత సంపూర్ణ సాహిత్యాన్ని చదివి, ఒక సమగ్ర మయిన ద్రుక్పథం ఏర్పరచుకునే వీలు లేకుండా పోతోంది. పాలగుమ్మి పద్మరాజు అనగానే, పడవ ప్రయాణం, గాలివాన అన్న పేర్లే విమబడతాయి. ఆయన మిగతా కథలన్నీ ఈ రెండు కథల నీడలో మిగిలిపోవాల్సి వచ్చింది. కానీ తరచి చూస్తే, ఈ రెండు కథలకన్నా గొప్ప కథలు మనకు పాలగుమ్మి కథల సంకలనంలో కనిపిస్తాయి. అలాగే శ్రీపాద అనగానే వడ్లగింజలు,  విశ్వనాథ అనగానే జీవుడివేదన, జాషువా అనగానే గబ్బిలం, పిరదౌసి, శ్రీ శ్రీ అనగానే మహా ప్రస్థానం, చలం అనగానే మైదానం, ఇలా, రచయితల అనంతమయిన ఆలోచనల సాగరాలు మనకు కనబడకుండా, విమర్శకులకు కనబడే ఈ కొద్ది రచనలు అడ్డుపడుతూంటాయి. ఇలాంటి ప్రాచుర్యం పొందిన రచనలు చదివేస్తే ఆ రచయిత అన్ని రచనలు చదివేసినట్టే అన్న దురభిప్రాయం అమలులో వుంది. ఇటీవల విశాలాంధ్ర వారు పాత రచయితల సంపూర్ణ రచనల సంకలనాలను వెలువరిస్తూ పాఠకులకు రచయితల ఇతర రచనలను చదివే వీలు కల్పిస్తున్నారు. సాహిత్యానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఎందుకంటే, అన్ని సమకలనాలలోనూ, పేరు పొందే రచనలే దొరుకుతాయి. ఇతర రచనలు చదవాలంటే ఎంతో కష్టపడాల్సి వుంటుంది. అంత కష్టపడలేని పాఠకుడు వాటికి దూరమవుతాడు.

ఇటీవలె విశాలాంధ్ర వారు ప్రచురించిన జాషువా రచనల నాలుగో సంపుటిలోని ఖండకావ్యాలు ఈ విషయాన్ని, రచయితల ఇతర రచనల సంకలనాల ఆవశ్యకతను స్పష్టం చేస్తాయి.

జాషువా గొప్ప తనం, కవిగా ఆయన భావనా బలం, రచనా చాతుర్యం, సామాజిక స్పృహ, సామాజిక పరిస్థితులకు ఆయన స్పందన వంటి విషయాలన్నీ ఈ ఖండ కావ్యాల సంకలనంలో ఇబ్బడి ముబ్బడిగా లభిస్తాయి. ఇందులోని అనేక కవితలు మనకు తెలియనివి. పాత భారతులు పనికట్టుకు చదివితే కొన్ని తెలుస్తాయి. లేకపోతే పాత పుస్తకాలను వెతికి పట్టుకుంటే మరి కొన్ని తెలుస్తాయి. కానీ, ఇలా, సంకలనంలో దొరికినట్టు, ఏడు ఖండికలలోని కవితలు, జాస్గువా ముందుమాటలతో సహా మనకు ఒకేచోట దొరకటం కుదరదు.అందుకే ఇలాంటి సంకలనాలు మనకు రచయిత రచనలన్నీ చదివే వీలును కల్పిస్తాయి. కొన్ని రచనలనే ప్రామాణికాలుగా విమర్శకులు నిర్ణయించటం వల్ల రచయితకు, సాహిత్యానికి ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది.

గమనిస్తే, ఇలాంటి పరిస్థితి ఆంగ్ల సాహిత్యంలో కనబడదు. వార్డ్స్ వర్థ్, షెల్లీ, కేట్స్, బైరన్, షేక్స్ పియరులేకాదు అనేక నాటక రచయితలు, కవులు, నవల రచయితలు, కథా రచయితల సాహిత్యం మొత్తం కంప్లీట్ వర్క్స్ లా దొరుకుతాయి. వారి రచనలన్నిటి గురించి చర్చలు జరుగుతాయి. అన్ని రచనలూ పాఠకుల మదిలో సజీవంగా వుంటాయి.

డికెన్స్ అనగానే, డేవిడ్ కాపర్ ఫీల్డ్ పేరు చెప్పినా, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, టేల్ ఆఫ్ టూ సిటీస్, ఓలివర్ ట్విస్ట్, పిక్విక్ పేపర్సు ఇలా బోలెడన్ని నవలలు గుర్తుకువస్తాయి. అన్నీ ప్రచారం పొందినవే. ఇలాంటి పరిస్థితి తెలుగు సాహిత్యలోకంలో అరుదు. తమ రచనలను సజీవంగా వుంచుకునేందుకు అక్కడక్కడా రచయితలు తమ రచనను ఇంటి పేరులా వాడుతూ, ఆ రచనను సజీవంగా వుంచుతున్నారు.

జాషువా రచనల నాలుగవ సంపుటం లోని ఖండ కావ్యాలను విపులంగా విశ్లేషించటం వల్ల మనకు కవిగా విమర్శకుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా జాషువాను అంచనా వేసే వీలు కలుగుతుంది.

ఈ వ్యాస పరంపరలో, ఈ ఖండకావ్యంలోని జాషువా కవితలను(పద్యాలను) విశ్లేషించి, అర్ధం చేసుకుని, there is more to jashuva than piradausi and gabbilam అని పాఠకులకు నిరూపించటం జరుగుతుంది. ఈ వ్యాసాలు చదివిన తరువాత పాఠకులు జాషువా ఇతర రచనలను చదివి తమదైన అంచనా వేసుకోవాలన్న ఆలోచన కలిగితే నా లక్ష్యం నెరవేరినట్టే భావిస్తాను.

March 10, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: పుస్తక పరిచయము