Archive for March 13, 2009

జాషువా ఖండకావ్యాలు-3

మాతలకు మాత, సకల సంపత్సమేత, అంటూ మొదటి ఖండకావ్యంలో మొదటి పద్యం పూర్తవుతుంది.

జాషువా పద్యాలు చదువుతూంటే ఒక ఆలోచన కలుగుతుంది.

చందస్సు భావ వ్యక్తీకరణకు ప్రతిబంధకమనీ, కవి స్వేచ్చకు అడ్డవుతుందని భావించి, చందస్సును సర్పంలా భావించి, దుడ్డు కర్రలతో, ఈటెలతో, బల్లేలతో కుళ్ళపొడిచి, కుళ్ళపొడిచి సాహిత్యాన్ని ఉద్ధరించారు.

కానీ, అతి క్లిష్టమయిన భావాలను కూడా అలవోకగా, చందస్సు పరిమితిలో వొదిగించి , మనసులోమాట అందరికీ తెలిసేలా భావాన్ని ప్రకటించటం చూస్తే, భావ వ్యక్తీకరణకు కవికి ప్రతిబంధకమయ్యేది చ్చందస్సు కాదు, భావనా రాహిత్యమూ, భాషపైన పట్టులేకపోవటమూనూ అని స్పష్టంగా తెలుస్తుంది.

ఒక శిల్పి, కఠిన శిలను, ఎంతగా తను చెప్పినట్టు వినేట్టు చేసుకుంటే శిల్పిని అంతగా పొగడుతాము. ప్రతిభావంతుడంటాము.

ఒక సంగీత విద్వాంసుడు, వాయిద్యాన్ని ఎన్ని కఠిన రాగాలాపనలు చేయిస్తే, అతడిని అంత గొప్ప విద్వాంసుడంటాం.

ఒక కంసాలి బంగారాన్ని ఎన్ని క్లిష్టమయిన మెలికలు తిప్పితే, అంత నిపుణుడంటాం.

కానీ, సాహిత్యం దగ్గరకొచ్చేసరికి నియమాలు వద్దు. నిబంధనలు వద్దు. పరిమితులు వద్దు. అరిస్తే వాద్యం, స్మరిస్తే పద్యం. నేనన్నదే వేదం. కాదంటే ఘోరం, అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

ఇలాంటి వారి వాదనలన్నీ తమ చేతకాని తనానికి, సాహిత్యోద్ధరణ అన్న ముసుగు వేయటమేనని నిరూపిస్తాయి, చ్చందస్సులో, గ్లాసులో వొదిగిన నీటిలాంటి జాషువా పదాలు, భావాలు.

సాలీడు అన్న కవితలో పద్యాలభావాలు చూడండి. ఎక్కడా కవి భావ వ్యక్తీకరణకు నియమాలు అడ్డొస్తున్నట్టు అనిపించదు. అసలలాంటి ఆలోచననే రాదు.

నీలో నూలు తయారుజేయు మర గానీ, ప్రత్తి రాట్నంబు గా
నీ, లేదీశ్వరశక్తి నీ కడుపులోనే లీనమై యుండునో
యేలీలన్ రచియింతువీజిలుగునూ! లీ పట్టు పుట్టంబు! లో
సాలీడా, నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?

పై పద్యంలో ఎక్కడా భావం చెడలేదు. అర్ధంకానిదేదీ లేదు. పైగా, అద్భుతమనిపించే భావన.

ఇదీ కవిత్వమంటే.

పురువుంగుంపును మోసపుచ్చుటకు గాబోల్దొంగమగ్గాలపై
మురిపెంపుంబని యుల్లి పట్టువలిపంబుల్ నేసి, నీ మందిరాం
తర దేశంబున నారగట్టి యొకపొంతం బొంచినా వోరి ట
క్కరి! సాలీడవుకాదు, దొంగవని వఖ్ఖాణింపవే లోకముల్

అద్భుతం. వ్యాఖ్య అనవసరం. కాస్త భాష తెలిసిస్తే చాలు. చదివిన కొద్దీ ఆనందము అధికమవుతుంది.

తుమ్మెద పెండ్లికొడుకనే కవితలో ఈ వ్యంగ్యాన్ని చూడండి. దానిద్వారా కవి చెప్పదలచుకొన్న విషయాన్ని గమనించండి.

మొన్న వివాహమాడితివి; ముద్దుపడంతుల బెండ్లియైన యం
త, న్నవ మల్లికామధు నదంబులజొచ్చితి; వెంతకాల మీ
క్రొన్నన తీవెజొంపముల గూతలు వెట్టెద? వింకైన రా
కున్న జగంబు మెచ్చదనియుం దలపోయ విదేల షట్పదా!

భాషకు, కవిత్వానికి, సాహిత్యానికి ఆధునికం పేరిట నవయుగ విమర్శకులు చేస్తున్న అన్యాన్ని జాషువా అర్ధంచేసుకున్నారు. దాని దుష్పరిణామాలనూ ఆయన గ్రహించారు. ఈ విషయాలను ఎంతో నర్మ గర్భితంగా చూపిస్తారు దీర్ఘనిశ్వాసము అనే కవితలో.

తెలుగుం బాసకు వన్నె దెచ్చిన జగద్వీరుండు మా కృష్ణరా
యలు గట్టించిన వజ్రదుర్గముల, శుద్ధాంత ప్రదేశంబులన్
దలక్రిందై తప మాచెరించెడిని సంతానార్ధమై గబ్బి గ
బ్బిలపుం గుబ్బెత, లక్కటా మొయిలుగప్పెం బూర్వ మర్యాదకున్!

ఇక్కడ కవి పైకి శిథిలమయిన కృష్ణరాయల కట్టడాలగురించి బాధపడుతున్నాడు. కానీ జాగ్రత్తగా గమనిస్తే, కవి హృదయాన్ని గ్రహిస్తే, తెలుగు బాసకుం వన్నె తెచ్చిన, మొయిలుంగప్పె పూర్వ మర్యాదకున్ లాంటి భావాలను అర్ధంచేసుకుంటే, కవి బాధ దేనికో, దీర్ఘ నిశ్వాసం ఎందుకో అర్ధమవుతుంది.

ఈ కవితలోని మిగతా పద్యాలన్నీ ఇలా పైకి పోయిన వైభవానికి, లోపల, గతిస్తున్న సాహితీ వైభవానికి కవి దీర్ఘనిశ్వాసాలీ పద్యాలనిపిస్తాయి.

శల్య సారథ్యము, భారతవీరుడు, బుద్ధమహిమ, భీష్ముడు, రాజరాజు వంటి కవితలలో భాష, భావాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ, భాషాపటిమ, భావనాబలం కవికి ఉంటే సాలీడు సుందర పద్యమవుతుంది. శ్మశానవాటిక మనసును మురిపించి ఆలోచింపచేసే వేదాంత భావనలకాలవాలమై సాంత్వననిస్తుంది అని స్పష్టమవుతుంది.

శిశువు కవిత జాషువా తాత్వికతకు మచ్చుతునక. భారతీయ తత్వచింతనపై ఆయనకున్న లోతైన అవగాహనకు తిరుగులేని నిదర్శనం.

ఇది రేపు.

March 13, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము