Archive for March 19, 2009

జాషువా ఖండకావ్యాలు-5

మేఘ సందేశము అందరికీ తెలుసు. జాషువా బాష్ప సందేశము మన అందరి మనసులలొ మెదలుతున్న బాధ. ఇది మన అందరి సందేశం. ఈ సందేశం మన అందరికోసం.

ఈ బాష్ప సందేశంలో ఆగ్రహముంది. ఆలోచన వుంది. హెచ్చరికవుంది. బోధనవుంది. ఇది ఒక వ్యక్తికేకాదు సమస్త భారత సమాజానికి సందేశం. సమస్త మానవాళికిది సందేశం.

మహోన్నత సుధాసౌధంబు క్రీనీడలం దాలుం బిడ్డలు బిచ్చమెత్త నిరంతరం అల్లాడు వారినిచూపి మానవత్వాన్ని, మనస్సాక్షిని తట్టిలేపాలని కవి ప్రయత్నిస్తున్నాడు.

నీసోదర్యులు వారు కారనుచు సందేహింతువో? వీర స్వే
చ్చా సామగ్రి గతించి వత్సర సహస్రంబుల్ సనెన్; దీని కీ
వే సాక్ష్యంబును, గారణంబు; నిపుడేమీ మించిపోలేదు; ఆ
శ్వాసింపం గదవయ్య భారతతనూజా! ప్రాతచుట్టంబులన్.

అగ్రవర్ణాలవారి మహోన్నత సుధాసౌధక్రీనీడల, మగ్గియున్న వారి సోదరులను గుర్తింపమని కవి సందేశాన్నిస్తున్నాడు.

సోదరులను గుర్తించమంటున్నాడు. కొన్ని వేల సంవత్సరాలక్రితమే వారి స్వేచ్చ గతించిందని గుర్తించమంటున్నాడు. దీనికి కారణమూ, సాక్ష్యమూ ఒకరే. ఇంకా మించిపోలేదు పాత చుట్టాలను గుర్తించమంటున్నాడు.

ఎంత సరళంగా, స్పష్టంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పేది చెప్తున్నాడు. హెచ్చరికనెంత సౌమ్యంగా చెప్తున్నాడో కవి.

నీ సోదరులు ఈ స్థాయిలో వుండటానికి కారణమూ నువ్వే. గుర్తించు. పరిస్థితిబాగు పరచు. లేకపోతే, పరిస్థితి ఇంకా గుర్తించకపోతే, అణచివేత ఎంతో కాలం సహించనివారు హక్కులకోసం తిరగబడి వాటిని సాధిస్తారు. అప్పుడు నీ గౌరవము నిలవదు. స్నేహ భావమూ మిగలదు. కాబట్టి నిజానిజాలు గ్రహించి మర్యాదగా సమానత్వాన్ని స్వచ్చందంగా ఇచ్చి నీ గౌరవము, బంధుత్వమూ నిలుపుకో. అనవసర విద్వేషాలకు తావివ్వకు. అందుకు ఇంకా సమయం వుంది అన్న హితవు, హెచ్చరికలూ వున్నాయి కవితలో. గ్రహిస్తే సంతోశం. లేకపోతే అనుభవించండి, అన్న నిర్లిప్తత కూడా వుంది.

ఇంతకీ ఈ అణగారిన సోదరులు సమానత్వం కూడా కోరటం లేదు.
ఇంటనుండు పెం
పుడు పసరంబులట్టులు మముం గణియించిన జాలునందు నీ
యడుగుల నంటి దీనముగ నంజలి బట్టిరి ధర్మభిక్షకై.

హృదయం ద్రవిస్తుందిది చదువుతూంటే. బహుషా, ఇది రాబోయే తుఫానుకు సూచన లాంటిదనిపిస్తుంది. అయిదూళ్ళిచ్చిన చాలని బ్రతిమాలితే సూదిమొన కూడా ఇవ్వనంటే, ధర్మ యుద్ధం తప్పదు. సర్వనాశనం తప్పదు. అది జరుగకూడదంటే ఇప్పటికయినా మేలుకో భారతతనూజా, అంటున్నాడు కవి.

అనుంగు సోదరులు పట్టణాలకావలవుంటే, నువ్వు సువర్ణమందిరాలలో ఎలావుండగలవని ప్రశ్నించి, యింకన్మేలుకొమ్మీ ధరా/ జనయితీమణి తమ్ముగుర్రలకు స్వేచ్చా భిక్షలర్ధించెడిన్, అంటాడు.

ఇంతవరకూ మనస్సాక్షిని తట్టిలేపి, నిజానిజాలు చెప్పాలని ప్రయత్నించాడు కవి. ఇప్పుడు కవి ధ్వని మారుతుంది.

ఆనందంబున నీ సహోదరులు విద్యాస్వీకృతిం జెందినా
రీనాడల్లదె శుభ్రవస్త్రములతో నేతెంచుచున్నారు నీ
తో నిత్యోచిత దైవపూజకని: సంతోషంబునన్ జేర నీ
వేని న్నీవొక రాక్షసాకృతివి సుమ్మీ భారతీనందనా!

మారిన పరిస్థితిని గమనించి సహృదయంతో వ్యవహరించమంటున్నాడు. లేకపోతే నువ్వు రాక్షసుడివి పొమ్మంటున్నాడు.

రాక్షసుడనటంలో ధిక్కారము, దూషణలతోపాటూ హెచ్చరిక వుంది.

రాక్షసులు దుష్టులేకాదు, నిజానిజాలు గ్రహించలేనివారు. అందరికీ అన్యాయం చేసేవారు. చివరికి ఘోరంగా పరాజయం పొంది మరణించేవారు. వారేకాదు వారిని నమ్మినవారి నాశనానికీ కారకులయ్యేవారు. ఇంకా వేరే చెప్పనవసరంలేదు, కవి భావం గురించి. భవిష్యత్తుకు సంబంధించి జరిగేదాన్ని సూచించటం గురించి.

తరువాత పద్యంలో, నీకొరకై వైరికి వెన్నుజూపని యనుంగు జుట్టముల్ వీరు, అంటాడు కవి. ఈ పాదం వెనుక చరిత్రకు సంబంధించిన గ్రహింపు వుంది.

భారత దేశంలో ధర్మ రక్షణకోసం జరిగిన అనేక యుద్ధాలలో, అల్ప వర్ణాలవారు అత్యద్భుతమయిన సాహసాన్ని ప్రదర్శించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధర్మాన్ని రక్షించారు. ఆ సమయంలో వారికి అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అన్న ఆలోచన లేదు. వారికున్నదొకే ఆలోచన, ధర్మరక్షణ.

భారతీయ సమాజం తురకల తాకిడికి అల్లకల్లోలమవుతున్న సమయంలో అల్పవర్ణాలవారు కత్తి చేపట్టి తురకలను తరిమి రాజ్యంపై అధికారం సాధించారు. అధికారానికి రాగానే వారు బ్రాహ్మణులకు దానాలిచ్చారు. ధర్మాన్ని నిలిపారు. మతవరకూ అల్పవర్ణాలవారయిన వారు ఇప్పుడు అగ్రవర్ణాల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం అగ్రవర్ణాలవారయిన రెడ్లు ఒకప్పుడు అల్పవర్ణం వారు.

ఒకవేళ ఇప్పుడు మనం ఊహిస్తున్నట్టే అణచివేత అనంత కాలమ్నుండీ సాగుతూవుంటే, అధికారానికి వచ్చినవారు ముందుగా ఇన్నాళ్ళూ తమని అణచివేస్తున్న వారిని ఊచకోత కోయాలి. అందుకు భిన్నంగా వారిని గౌరవించటం చూస్తే, ఇప్పుడున్న పరిస్థితికి భిన్నమయిన పరిస్థితులుండేవని, ఇప్పుడూన్నంతగా ఉద్వుఙ్నతలు, అణచివేతలూ ఆకాలంలో లేవని, సామాజిక సమన్వయం, సామరస్యం వుండేవనీ అనిపిస్తుంది. ఈ నిజాన్నే విశ్వనాథ వీరవల్లడు లో చూపిస్తే, దానికి కులం రంగుపూసి దుర్వ్యాఖ్యానాలిచ్చి, ద్వేషాలను పెంచే రీతిలో ప్రవర్తించారు తప్ప, చరిత్రను పరికించి, సమన్వయ సాధన దిశలో అడుగువేయలేదు.

ఈకడ జాషువా, మన మేధావులూ, విమర్షకులూ తప్పుదారి పట్టించిన నిజాన్ని నిక్కచ్చిగా చూపుతున్నాడు. మీకోసం ప్రాణాలొడ్డారు వీరు. నిజం గ్రహించు, లేకపోతే అనుభవించు. ఎందుకంటే అప్పటి కాలం కాదిది. ఆగౌరవాలూ, ఆప్యాయతలు, కులం ఒక సామాజిక సౌలభ్యమే తప్ప వ్యక్తుల స్వార్ధానికి వేదిక కాని కాలం కాదిది. కాబట్టి ఆనాడు ప్రాణాలు కాపాడినవాడే ఈనాడు తీయగలడని హెచ్చరిస్తున్నాడు కవి, నర్మ గర్భంగా!

కారుణ్యంబున నంటరాని తనమున్ ఖండింపవా? అని నిలదీసి, స్వాతంత్ర్యం కోరుతున్నావు, ముందు నిన్ను నువ్వు దిద్దుకో, అని హితవు చెప్తున్నాడు, నిర్మొహమాటంగా.

విదేశాలు నీ తాత్వికతకు మోకరిల్లినా, నీ సోదర విద్వేషమెరిగి మూతి ముడుస్తాయని, పదునయిన కత్తిలాంటి మాటలతో నిజాలు చెప్పాడు.

బ్రతిమిలాటలవల్ల ఫలితంలేదని గ్రహించినప్పుడు, ఇక దండోపాయమే మిగులుతుంది. ఇది, వ్యక్తిగత స్థాయిలో, కుటుంబస్థాయిలో, సామాజిక స్థాయిలో, దేశాల స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా వర్తిస్తుంది.

ఈ నిజాన్నే సాహిర్,

జహ సచ్ న చలే వహ ఝూట్ సహీ,
జహ హక్ న మిలే వహ లూట్ సహీ

అంటాడు.

బాష్పసందేశంలో జాషువా చివరి పద్యం ఈ నిజాన్నే సౌమ్యంగా చెప్తుంది.

మా ముత్తాతల నాటినుండి నను సన్మానించి నీకోసమై
మా మేనంగల రక్త బిందువుల సంపత్తి న్సమర్పించినా
మేమో, నీ హృదయంబులో నెనరులేదీషత్తు, నింకెన్నడ
న్నా! మా కష్టము గట్టునెక్కు ననుచున్నారేమి వాక్రుత్తువో!

గమనిస్తే, జాషువా కవితలో చేదు నిజాలున్నాయి. ఆవేదనవుంది. ఆక్రోషముంది. హితవుంది. హెచ్చరికవుంది. ఆందోళన వుంది.అవగాహనవుంది, నిరాశవుంది. ఆశాభావం వుంది. లేనిదల్లా ద్వేషం!

March 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized