Archive for March 21, 2009

అక్షరాంజలి, రియల్ స్టోరీల రివ్యూలు!

ఇటీవలె ప్రచురితమయిన నా కొత్త పుస్తకాలు- అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన, ఈవారం పత్రికలో, స్వరలాసిక పేరుతో, శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ రచించిన సమీక్షలను ఈ క్రింద ఇచ్చిన బ్లాగులో చదవవచ్చు.

www.turupumukka.blogspot.com.

March 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

జాషువా ఖండకావ్యాలు-7

నా కవిత్వంబునందు రత్నములు కలవు
వాని బెకిలించి చూపెడువాడు లేడు
కాల మిట్లున్నదని మొనగాడువోలె
బలుకు కవిగాడ! యేటికీ స్వాతిశయము?

సూటి అయిన, వాడి అయిన ప్రశ్న ఇది. ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో ఈనాటికీ అనెక రచయితలను పట్టి పీడిస్తున్న ప్రశ్న ఇది. రచయితల స్వేచ్చా ప్రతిభ వర్తనకు ప్రతిబంధకాలు కలిగిస్తున్న ప్రశ్న ఇది.

ఇది విశ్వనాథ వంటి వారికి వర్తించే ప్రశ్న .

ఆధునిక సమాజంలో సాహిత్యం అందరికీ అర్ధం అయితేనే విలువయినది అన్న భావం ప్రచారంలోకి వచ్చింది. దానితో, భాష అందరూ వాడేదే, భావం అందరికీ అర్ధమయ్యేదే వుండాలన్న ఆలోచన బలపడింది.

అయితే, మనకు ప్రాచీన సాహిత్యం వుంది. సాహిత్యానికి లక్షణాలను ఏర్పాటుచేశారు. భావం, రసం వంటి గుణాలగురించి తీవ్రమయిన లోతయిన చర్చలు జరిగాయి. తీర్మానాలు జరిగాయి.

ప్రపంచంలో ఏ సాహిత్యాన్ని గమనించినా, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ తేడావుంటుంది. రాతలో వ్యావహారికం వున్నా, దానికీ ఓ రకమయిన గాంభీర్యం వుంటుంది. ఏక కాలంలో రచించిన షేక్స్ పియర్, మార్లో ల భాషలలోనే తేడాలుంటాయి. అలాగే, మాం, లారెన్స్ ల భాషలో భేదాలున్నాయి. అంతెందుకు, సిడ్నీ షెల్డన్, ఇర్వింగ్ వాలెస్ ల భాషల్లో కూడా స్పష్టమయిన తేడాలు కనిపిస్తాయి. వారికీ వ్యావహారిక, గ్రాంథికాల గోల లేదు.

మన దగ్గర మాత్రం ఈ గోల ఒక వుద్యమమయి, భాషాభివృద్ధినే దెబ్బతీసే రీతిలో యుద్ధంలా మారింది.

ముఖ్యంగా, సాంప్రదాయిక గ్రాంథిక భాషకు ఒక కులం భాషగా  గుర్తింపునివ్వటంతో, కులాల మధ్య వైరుధ్యాలు, భాషా ద్వేషంగా రూపాంతరం చెందాయి. దాంతో, ఒక కసితో భాషను దుడ్డుకర్రలతో చితకబాదటం జరిగింది.

జాషువా కవిత ఆ సంధికాలంలోనిది. విశ్వనాథ ఆవేదన ఆ సంధి కాలంలోనిది. అందుకే, జాషువా విమర్శ ఎంత సమంజసం అనిపిస్తుందో, విశ్వనాథ ఆవేదన అంతే సమర్ధనీయం అనిపిస్తుంది.

పూర్వీకులు ఏర్పరచిన ఒక సాహిత్య పరంపరను ఆధునిక సమాజనికి అన్వయిస్తూ, తన సృజనాత్మక ప్రతిభతో దానిని నూతన మార్గాల నడిపించేవాడు విశ్వనాథ.

ఆధునిక సామాజిక స్రవంతీ ధార గతిని అనుసరిస్తూ, నూతన భావాలను, సామాజిక అసమానతల దౌష్ట్యాలపై తన కవితను విల్లులా ఎక్కుపెట్టినవాడు జాషువా.

ఇద్దరూ దేశ సంస్కృతీ సాంప్రదాయాలపైన గౌరవం కలవారే. ఇద్దరూ సమాజంలో సమన్వయమూ, సామరస్యమూ సాధించాలనుకున్నవారే. ఇద్దరూ సామాజిక అభ్యున్నతి ఆకాక్షించిన వారే. కానీ వారి వారి దారులను వారి అనుభవాలు నిర్దేషించాయి. అందుకే, ఒకే గమ్యమయినా వారి దారులు భిన్నంగా తోస్తాయి. పరస్పర వ్యతిరేకమనిపిస్తాయి.

విశ్వనాథ సమాజంలో ఒక రకమయిన వివక్షతను అనుభవిస్తే, జాషువా ఇదే సమాజంలో మరో రకమయిన వివక్షతకు గురయ్యాడు. ఈ ఇద్దరి రచనలు ఇందుకు నిదర్శనాలు.

అయితే, ఈ వివక్షత ఇద్దరిలో సమాజంపట్ల అవగాన, ప్రేమలను పెంచిందే తప్ప వారిలో ద్వేష భావనలను రగిలించలేదు.

జాషువా బాష్పసందేశం ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఇదేకాక, అనేక మహనీయులపై, చారిత్రిక వీరులపై, గౌతమ బుద్ధుడి పై,  గూప గొప్ప పేరు సాధించిన వారిపై, ఇతిహాసాలలోని మహా పురుషులపై జాషువా రచించిన కవితలు ఇందుకు నిదర్శనాలు. అయితే, జాషువా కవితలలో కర్ణుడి పై రాసిన కవితలు అత్యంత భావస్ఫోరకై, కర్ణుడిలో కవి తనని చూసుకుంటున్నాడనిపిస్తాయి.

తన కవితలను, కేవలం తన కులం కారణంగా, తిరస్కరించటాన్ని కవి, కర్ణుడేమాయె గుల ప్రీక్షకుల నడుమ? అని నిలదీస్తాడు.

విశ్వనాథ సాంప్రదాయకవి. రాముడు, కృష్ణుడు అతని మనసుకు పట్టే దేవతలు. దాంతో అతని రచనలలో ఆ ప్రొఢ గాంభీర్యం చోటు చేసుకుంది. భాషలో ప్రచీన కవుల పరిమళానికి, విశ్వనాథ స్వెయ్య ప్రతిభా సౌరభం తోడయింది. కానీ, ఆ పరిమళ సౌరభాలను అనుభవించేవారు లేరు. వాటిలోని సౌందర్యాన్ని గ్రహించి మెచ్చేవారులేరు. దాంతో వీలు చిక్కినప్పుడల్లా విశ్వనాథ తన కవిత్వంలో రత్నాలున్నాయని, వాటిని పరిశీలించి, అనుభవించే నాథుడు లేడని వాపోతూండేవాడు. తన రచనలలోని లోతయిన భావాలు, తాను చేసిన ప్రయోగాలు, పొందుపరచిన చమత్కారాలను తానే వివరిస్తూ బాధపడేవాడు.

ఇది నిజంగా దయనీయమైన పరిస్థితి. కవికి తన రచనను అనుభవించి, ఆస్వాదించే శ్రోత లభించక పోవటాన్ని మించిన శిక్ష మరొకటి లేదు. దానిలోని సొంపులను, సౌందర్యాలను గ్రహించి, పాఠకులకు వివరించే విమర్షకుదు లేకపోవటం మరింత దౌర్భాగ్యం. ఈ రెండు దౌర్భాగ్యాలు విశ్వనాథవేకాదు, కాస్తయినా లోతయిన భావాలతో, ఉద్యమ, సిద్ధాంత, ఇజాల రాద్ధాంతలతో సంబంధంలేకుండా రచనలు చేసే ప్రతి రచయిత దౌర్భాగ్యమది.

నేను, విశ్వనాథ రచించిన రామాయణకల్పవృక్ష రహస్యాలు అన్న పుస్తకం చదివి నవ్వుకున్నాను. దాన్లో విశ్వనాథవారు, రామాయణ కల్పవృక్షంలో తాను చూపిన చమత్కారాలను, పొందుపరచిన భావాలను, పొదిగిన మణుల సౌందర్యాలను వివరించారు.

చాలాకాలం తరువాత నేను రాజతరంగిణి కథలు రాశాను. ఇప్పుడొస్తున్న కథలకు భిన్నంగా, వర్ణనలతో, ఆలోచనలతో, ఒకో కథలో, అనేక విభిన్న ఆలోచనల పొరలను పొందుపరుస్తూ రచించాను. రాసినవాటిని చూసి గర్వించాను. ఇవి రాసింది నేనేనా అని ఆశ్చర్యపోయాను.

రాజతరంగిణి పుస్తకరూపంలో వచ్చింది. వివిధ పత్రికలకు సమీక్షకు ఇచ్చాను. మన పత్రికల సమీక్షకులను సమీక్షకులనేకన్నా  విహంగ వీక్షకులనవచ్చు. మెర్సీలేని మెర్సెనరీలనవచ్చు. కళ్ళకు గంతలు కట్టుకుని లోకానికి దారిచూపించాలని ఆత్రపడే విదూషకులనవచ్చు. 

వీరు పుస్తకాన్ని పూర్తిగా చదవరు. రచయిత పేరు చూసి రాయాల్సిన సమీక్షను నిర్ణయించుకుంటారు. పొగడటం, తెగడటాలుకు రచన నాణ్యతతో సంబంధం వుండదు. ఎడిటర్, ఈ పుస్తకాన్ని తిట్టు అంటే చీల్చిచెండాడతారు. ఒకోసారి సంపాదకుడేమీ అనకున్నా, మనసులోని మాటను ఊహించి రాసిపారేస్తారు. ఇంకొందరయితే ముందుమాటలు, అట్టచివర్లోని మాటలు కలిపి సమీక్షలు రాసేస్తారు. ఇంకొందరు, ఎవరినిపొగడితే లాభమో వారికి భట్రాజులవుతారు, మిగతావారికి ఆరివీరభయంకరులవుతారు. లేనితప్పులువెతికి రచనని తూట్లుపొడుస్తారు.

ఉదాహరణకు, నేను 1857మీద ఒక పుస్తకం రాశాను. కొందరు దాన్ని అంతకుముందు ఒక సంపాదకుడు రాసిన పుస్తకానికి విమర్శగా భావించారు. నిజానికి రెంటికీ సంబంధంలేదు. కానీ, విమర్శకుడు, ఆ ఎడిటర్ ని సంతృప్తి పరచాలనేమో, నా పుస్తక విమర్శ మొదటి వాక్యంలోనే ఈ పుస్తకం కన్నా ఆ పుస్తకమే బాగుందని, అదే ప్రామాణికంగా నిలుస్తుందని నొక్కివక్కాణించాడు. దాంతో గుమ్మడికాయల దొంగ అనకముందే భుజాలు తడుముకున్నట్టయింది. విమర్శకుడి హృదయం అందరికీ తెలిసింది.

మరో సందర్భంలో నేను రాసిన కొన్ని వ్యాసాల సంకలనాన్ని విమర్శిస్తూ ఒక విమర్శకుడు, వ్యాసాలు అకాడెమిక్ గా వున్నాయని, తెలుగుపాఠకులకు ఇంత విపులమయిన వివరణ అవసరంలేదనీ రాశాడు. చిత్రమేమిటంటే, నన్ను తక్కువచేయాలన్న ఆత్రంలో ఆ విమర్శకుడు తాను అభాసుపాలవటమేకాదు, అంతటి పనికిరాని వ్యాసాలను 80వారాలపాటూ ప్రచురించి పాఠకులపై రుద్దిన సంపాదకుల నిర్ణయాన్ని ఎద్దేవాచేస్తున్నానని మరచిపోయాడు. ఇలాంటి సమీక్షకుల చిత్ర విచిత్ర గాథలు బోలెడున్నాయి.

అందుకే, నేను రాజతరంగిణి పైన గొప్ప సమీక్షలు రాకున్నా కనీసం కథలలో సౌందర్యాన్ని ఏవొక్క విమర్శకుడయినా గుర్తిస్తాడేమోనని ఆశపడ్డాను. మూలాన్ని అనుసరిస్తూ నేను చేసిన కల్పనలను ఎవరయిన గుర్తించి పాఠకులకు వివరిస్తారనుకున్నాను. నా సృజనాత్మక ప్రతిభను పొగడకున్నా, కనీసం గ్రహిస్తారనుకున్నాను.

కానీ, అది దురాశేనని తేలిపోయింది.

విమర్శకులెవరికీ రాజతరంగిణి తెలియదు. తెలిసినా పనికట్టుకుని రాజతరంగిణి మూలాన్ని చదివి కథలలోని చమత్కారాలను పాఠకులకు తెలిపే చిత్తశుద్ధి, ఓపిక, తీరికలులేవు.  కథలు చదివే ఆసక్తిలేదు. దాంతో, ఈ కథలను అనువాద కథలని అన్నారు. వీటిని ప్రచురించిన ప్రచురణ సంస్థకు ధన్యవాదాలు చెప్పారు. సాంప్రదాయమే సకల కష్టాల నివారిణిగా రచయిత భావిస్తున్నాడని కొందరు ఎద్దేవా చేశారు. అంతే.

ఇలాంటి సమీక్షలను చూసి బాధకలిగింది. అడవిలో నర్తించే నెమలిలా, అడవిగాచిన వెన్నెలలా అయింది నా ప్రయోగం. అప్పుడు నేను రాసిన కథలపైన నేనే వ్యాఖ్యలు రాయాలనుకున్నాను. పాఠకులకు నా కథలను చేరువచేయాలనుకున్నాను. అప్పుడర్ధమయింది నాకు విశ్వనాథవారి వేదన. ఆయన కల్పవృక్ష రహస్యాలను ఎందుకు రాయాల్సివచ్చిందో!

ఎందుకాయన, మాటి మాటికీ తన రచనలల్లో మణులుదాగున్నాయనీ, గుర్తించేవారులేరనీ బాధను ప్రకటిస్తూ వచ్చారో బోధపడింది.

అలాగని రచయిత, తన ప్రాకృతిక భావావేషాన్ని నియంత్రించుకుని పాఠకులేది అర్ధంచేసుకుంటే అలానే రాయాలా? అందరిలా ప్రవాహంలో కొట్టుకుపోతూ, తన మౌలిక జీవలక్షణానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలా? అందరూ పోతున్న దిశలో పోయేకన్నా, తనదయిన మార్గంలో ప్రయాణించటమే రచయితకు జీవంకదా? అదే అతని సృజనాత్మకతను సజీవంగా వుంచుతుందికదా!

కోకిల లక్షణం కోకిలదే. సిమ్హం లక్షణం సిమ్హానిదే. గుర్రం వేగం గుర్రానిదే. హంస నడక హంసదే. వెన్నెల వెలుగువెన్నెలదే. సూర్యుడి వేడి సూర్యుడిదే.రచయిత ఎవరి ఇష్టాయిష్టాలను పట్టించుకోవాల్సిన పనిలేదు. తనకు నచ్చిన రీతిలో రచనలు చేస్తూ పోవాల్సిందే.

అలాగని, ఎవరు మెచ్చినా మెచ్చకున్నా ఫరవాలేదని నిర్భావంగా వుండలేడు రచయిత. రచయితకు గుర్తింపుకావాలి. తన రచనలను పాఠకులు అనుభవించి ఆనందించటంకావాలి. ఇది జరగనప్పుడు బాధపడతాడు. తన రచనలోని గొప్పతనాన్ని వివరించాలని ఆత్రపడతాడు.

చూసేవారికి విచిత్రమనిపిస్తుంది.

రాస్తే అందరూ మెచ్చేది, అందరికీ అర్ధమయ్యేది రాయాలి. లేకపోతే నోరుమూసుకుని ఇంట్లోకూచోవాలి అంటారు.

కానీ అలా చేస్తే వాడు రచయిత ఎందుకవుతాడు?  సృజనాత్మక రచయిత నిరంకుశుడు. కానీ, సామాజిక వ్యవస్థకు బద్ధుడు. ఇదొక అయోమయమయిన పరిస్థితి.

అందుకే తన రచనలలో సౌందర్యాలను వివరించాలని ఆత్రపడే రచయిత హేళనకు గురవుతాడు.

కవిత్వంలో రత్నాలున్నాయని, అవి గుర్తించేవాడులేడని వాపోవటం అర్ధరహితం అనిపిస్తుంది. అందుకే, మొదటి పద్యంలో జాషువా, ఏటికీ స్వాతిశయము? అని నిలదీయటం సమంజసమే అనిపిస్తుంది.

ఏవీ? యా రతనంబులు
నీవే పెకిలించి చూపి, నీ యింటికి గొం
పోవోయ్! యట్లొనర్పగ
నీవలనన్ గాదొ! యింక నీల్గెదవేలా?

అనటం అర్ధమవుతుంది. హేళనలోని ఆలోచన, లాజిక్ తిరుగులేనివి.

దీని తరువాత పద్యాలలో తన అభిప్రాయాన్ని  విమర్శను మరింతగా విస్పష్టంచేస్తాడు జాషువా.

ఇది సోమవారం.

March 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , ,  · Posted in: Uncategorized