Archive for March 23, 2009

నాకు తెలిసిన కాంతారావు!

ఒక వ్యక్తికి మరో వ్యక్తి మూడు రకాలుగా తెలుస్తాడు. ప్రత్యక్ష పరిచయం. పరోక్ష పరిచయం.(వేరే వారి ద్వారా వినటం), తన కళ ద్వారా పరిచయం.

ఇతర పరిచయాలకూ, కళ ద్వారా పరిచయానికీ చాలా తేడా వుంతుంది.

కళ ద్వారా పరిచయమయిన వ్యక్తి అసలు వ్యక్తికి పూర్తిగా భిన్నంగా వుండేవీలుంది. రచయితలు రచనల ద్వారా, రచనలలో ప్రదర్శించిన అనేకానేక భావాల ద్వారా పాఠకుడి మదిలో ఒక విస్పష్టమయిన రీతిలో పరిచయమవుతాడు. అతడిని ప్రభావితం చేస్తాడు. నటుడయితే తాను ధరించిన పాత్రల ద్వారా వ్యక్తి మనసులో చెరగని ముద్ర వేస్తాడు. అత్యంత ప్రభావం చూపుతాడు.

రచయిత వ్యక్తిని ప్రభావితం చేయాలంటే, వ్యక్తి అక్షరాస్యుడయి వుండాలి. కాస్త భావావేషం, సంస్కారం వుండాలి.

నటుడికి అలాంటివేవీ అవసరం లేదు. ఊహ తెలిసీ తెలియక ముందునుంచీ, అర్ధమయీ అవని వయసునుంచీ నటుడు వ్యక్తిపైన ప్రభావం చూపుతాడు. వ్యక్తి ఊహలకు ఆలోచనలకూ దొశ నిస్తాడు.

నాకు కాంతారావు అలా పరిచయం.!

నేను కడుపులో వున్నప్పుడు మా అమ్మ కాంతారావు సినిమాలు చూసిందట.  అమ్మ నాగేశ్వరరావు అభిమాని. ఎంటీ రామారావు సినిమాలూ చూసేది. మా అమ్మ సినిమాలు బాగా చూసేది. కడుపుతో వుండి సినిమాకు వెళ్తూంటే, అప్పుడు మేము పల్లెటూరిలో వుండేవాళ్ళం, ఆ పల్లె వాళ్ళంతా నోళ్ళు నొక్కుకుని, కథలు చెప్పుకునేవారట. ఇప్పటికీ మా అమ్మ, అత్తయ్యలు కలిస్తే వాళ్ళు ఏయే సినిమాలు ఎన్నెన్ని సాహసాలు చేసి చూశారు, ఎవరెవరిని ఎంతెంతగా ఆశ్చర్యపరచారో చెప్పుకుని నవ్వుకుంటూంటారు. కాబట్టి నాకు ఈ ప్రపంచం సరిగా పరిచయం కాకమునుపే కాంతారావు కత్తి యుద్ధాలు, మాయలు మంత్రాల సాహస గాథల చిత్రాలతో పరిచయం ఏర్పడింది.

నాకు ఊహ తెలిసే వయసులో కాంతారావు అభిమాన నటుడు కావటం స్వాభావికంగా జరిగింది. ఎంటీరామారావు సినిమాలు పౌరాణికాలు. నాగేశ్వరరావు సినిమాలు సాంఘికాలు. దాంతో, పిల్లలకు కాంతారావు అభిమాన నటుడవటంలో ఆశ్చర్యం లేదు.

నేనూ కత్తియుద్ధాలు చేశాను. సాహసాలు ఊహించాను. భయంకర రాక్షసులతో భీకరమయిన పోరాటాలు చేశాను. నిప్పులు గ్రక్కే రాక్షస సర్పాలతో అలవోకగా కత్తి యుద్ధం చేసి వాటి తలలను నరికేశాను. కొండల అంచులనుంచి వ్రేలాడుతూ, రాజనాలను చంపి రాజ్యం దక్కించుకున్నాను. నాయికలతో రొమాన్స్ ఊహించే వయసుకాకున్నా, ఊహించి అర్ధంకాని ఆనందాన్ని అనుభవించాను.

ఊహ తెలిసిన తరువాత, నా ప్రథమ హీరో, అద్భుతం, ఆదర్శం కాంతారావు!

పెద్దన్నయ్యకు రామారావు ఇష్టం. రెండో అన్నయ్యకు నాగేశ్వరరావు ఇష్టం. దాంతో నాకు కాంతారావు ఇష్టం అవటం తప్ప మరో మార్గం లేదు.

అతడి బొమ్మలు సేకరించి ఆల్బంలొ దాచుకున్నాను. తడిలా కత్తి పట్టుకుని పోసులిచ్చాను. గాలిలో తేలే గుర్రాలపైన దూదిపింజల్లాంటి మబ్బులపై తేలియాడి దేవలోకాలలోని దేవ కన్యలను కష్టాల్లోంచి రక్షించేశాను.

నేను స్టేజీ ఎక్కి పాడిన మొదటి పాట కాంతారావుదే. చందన చర్చిత నీలకళేఅబర పీత వసన వనమాలీ అన్నది.

మైకు ముందు కూచుని నేను పాటపాడేశాను. ఆర్గనైజర్లు నన్ను పాడు పాడు అని ప్రోత్సహిస్తున్నారు. స్టేజి దిగినతరువాత నాకు అర్ధమయింది, నేను పాడిన పాట ఎవ్వరికీ వినిపించలేదని. ఎందుకంటే, నేను మైకులోకి పాడలేదు కాబట్టి. అలా, నా బాల్యంలోని అనేకానేక అనుభవాలు కాంతారావుతో ముడిపడివున్నాయి.  

కాస్త ఊహ తెలిసి యువతులవైపు దొంగ చూపులు చూస్తూ ప్రణయ భావన మానసిక స్వరూపాన్ని అర్ధం చేసుకునే ప్రాంగణ ప్రవేశ ద్వారంలాంటి భౌతిక భావనలు రూపు దిద్దుకునే సమయంలో కాంతారావే నా కలల ప్రేయసిని వర్ణించి ఊహలకు రెక్కలనిచ్చాడు.

ఏ పారిజాతమ్ములీయగలనో చెలీ, గిరిమల్లికలు తప్ప గరిక పూవులు తప్ప, ఏ కానుకలను అందించగలనో చెలీ, గుండెలోతుల దాచుకొన్న వలపులుతప్ప, అంటూ, ఎన్ని ఒంటరి ఘడియలలో అర్ధంకాని ఆవేదనానందాలనడుమ నలిగిపోయానో. సృజనాత్మక ఆవేశారంభ గడపపైన నుంచుని రగిలిపోయానో!

అయితే, కాంతారావు అంటే వెర్రి అభిమానం హద్దులుదాటేలోగా, కాంతారావు హీరో నుంచి విలన్ అయ్యాడు!

ఇది నా ఆలోచనలను అతిగా ప్రభావితం చేసింది.

దేవుడు చేసిన మనుషులు సినిమాలో కాంతారావును విలన్ గా చూస్తూ నేను అనుభవించిన క్షోభ ఇప్పటికీ మరచిపోలేను.

నటుడి ఇమేజీ గురించిన అవగాహన కలిగింది. అంతేకాదు, మామూలు మనుషులను ఆదర్శంగా తీసుకోకూడదన్న గ్రహింపు కలిగింది. బహుషా, అప్పుడే అనుకుంటాను, నేను మనుషులముందు మోకరిల్లటం మానేశాను.

మనిషన్నవాడిలో దోషాలుంటాయి. దోషాలున్నవాడెవడూ ఆదర్శం కాకూడదు.

ఇప్పటికీ వ్యక్తులపైన నా అభిమానం ఒక స్థాయిని దాటదు. నటులు, కళాకారులు, రచయితలు, నాయకులు, స్నేహితులు ఒకరేమిటి ఎవరితోనూ తీవ్రమయిన అనుబంధంకానీ, అభిమానంకానీ నాకులేదు.

ఒకరకంగా చెప్పాలంటే, కాంతారావు విలన్ వేషం వేసినతరువాత, నేను సినిమాలు చూసే విధానమే మారిపోయింది. నటులను ఆరాధించటం అంతమయిపోయింది.

ఇంతలో రాజ్ కపూర్, దేవానంద్, దిలీప్ కుమార్, షమ్మీ కపూర్ లు పరిచయమయ్యారు. కాంతారావును వదలి ముందుకు సాగిపోయాను.

ఆతరువాత నేను కాంతారావు సినిమాలు చూడలేదు. కొత్తవేకాదు పాతవీ మళ్ళీ చూడలేదు. ఆయన విలన్ వేషం వేయటంతోటే, రాజకుమారుడు అదృశ్యమయ్యాడు. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు, అది ఇప్పటికీ ఖాళీగానే వుంది. అసలు వీరుడు, సాహసి నాకు అప్పుడే అదృశ్యమయ్యాడు. ఇప్పుడు మరణించింది నా హీరో కాంతారావు కాదు.

చిత్రమేమిటంటే, ఆలోచిస్తే, నాకు ఇప్పటికీ, ఇతరుల జానపద చిత్రాలు నచ్చవు. ఎంటీరామారావన్నా, నాగేశ్వర రావన్నా, మామూలు అభిమానమే తప్ప గొప్ప భావనలేదు. దీనికంతటికీ, బహుషా, చిన్నప్పుడు అన్నయ్యలతో నా హీరో గొప్పతనాన్ని నిరూపించుకునేందుకు, ఇతర హీరోలను  విమర్శిస్తూ  చేసిన వాదనలు నా మనస్సులోతులలో నిలచి ప్రభావం చూపిస్తున్నాయేమో!

అయితే, ఇప్పటికీ నా మనసులో ప్రతిధ్వనిస్తూంటుంది, ఏపారిజాతమ్ములీయగలనో చెలీ పాట.

ఇప్పుడది, నటుడి వల్ల కాదు, సాహిత్యము, సున్నిత సృంగార భావనల వల్ల ప్రియం.

ముఖ్యంగా, నా రమణికీ బదులుగా, ఆకారం ధరించాలన్నదే ఇప్పటికీ ప్రకృతితో నా ప్రార్ధన!

ప్రకృతిలో కలసిపోయిన కాంతారావు నా ప్రార్ధన వుంటూ ఇకపై నవ్వుతూంటాడేమో!

March 23, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నీరాజనం