Archive for March 27, 2009

ప్రేమ సినిమా చూశాడు, బ్రహ్మబుధ్!

భళ్ళున మెదడు తలుపు తన్ని, లోపలకు దూకాడు బ్రహ్మబుధ్!

ఈమధ్య కాలంలో బ్రహ్మబుధ్ ఎందుకో రావటంలేదు. ముఖ్యంగా మురికివాడల కుక్క సినిమా చూసినప్పటినుంచీ ఏవో ఆలోచనల్లోపడ్డాడు. వాడిని వదలి నేను అరుంధతిని చూసిన తరువాత పెద్ద గొడవ చేశాడు.

బ్రహ్మబుధ్ నోరు నేను నొక్కేస్తున్నానట. వాడి అభిప్రాయం ప్రజల వద్దకు చేరకుండా, పత్రికలలో ఇజాల సబ్ ఎడిటర్లలా సెన్సార్ చేస్తున్నానట. తన అభిప్రాయానికి వ్యతిరేక అభిప్రాయపు నోరు నొక్కటం మీ మానవుల లక్షణం అని దూషించి వెళ్ళిపోయాడు.

అపార్ధం చేసుకుంటే చేసుకున్నాడు, నన్ను వదలి పోయాడు అదే చాలు అని నవ గ్రహాలలో బుధ గ్రహానికి తిలలు, పెసలు, నూనెలు అర్పించి అర్చించి గ్రహ శాంతి చేశానని శాంతంగా వున్నాను. ఇప్పుడు హఠాతుగా వూడి పడి నన్ను ఉలిక్కిపడేట్టు చేశాడు.

ఇంతకాలానికి కనిపించినందుకు సంతోషించాలో, మళ్ళీ వచ్చినందుకు ఏడవాలో తెలియక ఓ వెర్రి నవ్వు నవ్వాను.

వాడది పట్టించుకోలేదు.

నాకు మరెవరి మెదడులోకీ ప్రవేశం కుదరటంలేదు. చచ్చినట్టు మనిద్దరం కలసి పని చేయాల్సిందే. నా అభిప్రాయాలను నువ్వు బ్లాగ్లోకానికి అందివ్వాల్సిందే. ఈ విషయంలో నీకు ఎలాంటి చాయిస్ లేదు, అని తిష్టవేసి కూచున్నాడు.

సరే చెప్పు నాయనా, ఈ సారి ఏ సినిమా చూశావు? నీరసంగా అడిగా.

అది నువ్వు చెప్పాలి. నేను కథ చెప్తా, అన్నాడు.

సరే, అన్నాను.

కాలేజీ పిల్లలు, అన్నాడు.

హ్యాపీ డేస్ అన్నాను

తల అడ్డగ్మా త్ ఇప్పాడు.

అన్నీ కాలేజీ పిల్లల ప్రేమ కథలే. ఈ క్లూ సరిపోదు, అన్నాను.

కాలేజీ పిల్లల ప్రేమ కథ. మంచి మితృలు.

కుచ్ కుచ్ హోతా హై.

కోపంగా చూశాడు.

వాళ్ళిదారూ ఫ్రెండ్స్. తమ మధ్య ప్రేమ వున్నాట్టు వాళ్ళ్కు తెలియదు.

కుచ్ కుచ్ హోతా హై. మైనే ప్యార్ కియా లో ఫ్రెండ్స్ టోపీ పెట్టుకుని ప్రేమించేసినప్పటినుంచీ, సినిమా వాళ్ళు యువకులందరికీ అదే టోపీ పెడుతున్నారు, అంటూ ఏదో చెప్తూన్న నేను వాడు ఉరిమి చూసేసరికి, బెదిరి నోరు మూశాను.

ఇద్దరూ ఫ్రెండ్స్. కానీ ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు తెలియదు. ఇద్దరూ వేరే వాళ్ళ వెంట పడతారు. చివరికి తమ తప్పు గ్రహించి ఒకటయి పోతారు.

తల పట్టుకున్నాను. సినిమా పేరు చెప్పటమంటే సులభమనుకున్నాను. కానీ వాడు చెప్పిన కథ ఎన్నెన్నో సినిమాల కథ. చివరికి బొమ్మరిల్లులో కూడా నాయిక కాలేజీ పిల్ల, ఇద్దరూ ఫ్రెండ్స్. వాడికి వేరే ఆమెతో పెళ్ళి స్థిరమవుతుంది. అప్పుడు ప్రేమను గ్రహిస్తారు.

బాబూ మా సినిమాలకు కథలన్నీ కొద్ది తేడాలతో ఒకటే. సినిమాను గుర్తుపట్టాలంటే, ఏదయిన హిట్ పాటనో, నాయికా నాయకుల పేర్లో చెప్పాలి. ఎందుకంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన పిట్టకథ అటు మైహూనాలో వుంది, ఇటు హాపీ డేయ్స్ లోనూ వుంది. ఫ్రెండులా కనబడిన అమ్మాయి డ్రెస్ మార్చుకోగానే అమ్మాయని గుర్తించటమూ వుంది. ఇలా నువ్వు కథ చెప్పి సినిమా గుర్తించంటే కష్టం, అన్నాను ఓటమినొప్పుకుంటూ.

పక పక నవ్వాడు. నేనూ కాలేజీలో చేరుతున్నాను. అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. ప్రేమిస్తాను, అని ఎగరసాగాడు.

ఒరేబాబూ, ఇతర దేశాల సినిమాలలో ఆ దేశాల జీవన విధానం కనిపిస్తుంది. మా సినిమాలను మా జీవన విధానం అనుసరిస్తుంది. అవి చూసి మోసపోకు. అమ్మాయిలు నువ్వు కాలేజీలో అడుగుపెట్టగానే ప్రేమించేయటానికి సిద్ధంగా వుంటారని పొరబడకు. భంగ పడకు, అని ఏవేవో నీతులు చెప్తూంటే, అడ్డుపడ్డాడు.

పర్ పప్పు కాంట్ దాన్స్ సాల అంటూ, గిర గిర తిరుగుతూ, నన్ను తిప్పుతూ, దిరకిట్ తానా దిరకిట్ తానా దిరదిరకిట్ తానా, నేనూ కాలేజీకి వెళ్తున్నా తానా, ఫ్రెండ్షిప్ ప్రేమా చేస్తున్న తానా, తానా తానా త్రికిట గిరికిట గిరికిట తానా, అని తిప్పుతూ పాడుతూన్నాడు.

నేను తిరిగి తిరిగి పడిపోయా!

March 27, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: sinemaa vishleashaNaa.

ఇతర కవులపై జాషువా విమర్శలు-2

బ్లాగరులందరికీ విరోధినామ యుగాది శుభాకాంక్షలు. ఊ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సర్వే జనా సుఖినోభవంతు.

జాషువా కవిత్వంలో సమకాలీన సామజిక పరిస్థితులు కనిపిస్తాయి. వాటికి ఆయన స్పందన కనిపిస్తుంది.

ఆకాలంలో సాహిత్యం సంధి దశలో వుంది. అనేకానేక సిద్ధాంతాలు, అభిప్రాయాలు సాహిత్యాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. పాత కొత్తల మేల్ కలయిక క్రొమ్మెరులుగులు చిమ్మాలని గురజాడ వాంచించినా, పాత కొత్తల కలయిక సంఘర్షణ రూపం ధరించింది. విచ్చలవిడి తనం, పాతను అవహేళన చేయటం అభ్యుదయం అభివృద్ధి అయింది. ప్రతిక్రియగా, పాతను పట్టుకుని వ్రేలాడటం సాంప్రదాయ పరిరక్షణ అయింది. ఇలాంటి నూతన విప్లవాత్మక మార్పులకూ, పాతను పట్టుకుని వ్రేలాడటాన్ని, ప్రయోగాల పేరిట పద్యాన్ని పాదాలతో తొక్కేయటానికి జాషువా తీవ్రంగా స్పందించాడు. అవకాశం దొరికినప్పుడల్లా, తన భిప్రాయాన్ని నిర్ద్వంగా ప్రకటిస్తూవచ్చాడు.

అయోమయం అనే కవిత ఇలాంటిదే. అలాంటిదే మరో కవిత, కవితాలక్షణము.

ఈ కవితలో జాషువా, ఆధునిక కవిత్వ వికృత పోకడలను వ్యంగ్యం చేస్తూ కవిత్వ తత్వాన్ని, లక్షణాలనూ వివరిస్తాడు.

సందిటకు రాని వృద్ధభూషణము లెన్నో!
తనువున దగిల్చి, కావ్య సుందరిని దిద్ది,
బరువు మోయించి, తత్వంబు మరచిపోవు
కవి, యెరిగడు వ్యంగ్యవాగ్గర్భమహిమ!

మొదటి పద్యంలోనే, వృద్ధభూషణాల బరువు కావ్యసుందరితో మోయిస్తారంటూ విసురు విసిరాడు.

రెండో పద్యంలో, విపులరసభావభరిత గంభీరగమన మమరి చూపెట్టవలయు నని సలహా ఇస్తున్నాడు.

తరువాత పద్యంలో, నవరస ప్రాధాన్య ధన్యోక్తులతో కావ్యాన్ని తీర్చి దిద్దాలని సూచిస్తున్నాడు.

అంటే, జాషువా పూర్తిగా ప్రాచీన కవిత్వ తత్వాన్ని పనికిరాదనటంలేదు. పాతలోని మంచిని గ్రహించమంటున్నాడు.

నేటికైత, అనే కవితలో, కవితావాహిని చీలి పాయలయి ఆగంబై యధేచ్చారతిన్/ బ్రవహింపం దొడగెన్/ బురాతనపు త్రోవల్పుంతలుం బాడు వ?డ్డవి; చ్చందో నియమాది కూలములు భ్రష్టంబయ్యె/ అంటూ సమకాలీన పరిస్థితిని వివరిస్తాడు.

అయితే, అనేక రకాల భావజాలాలు కవిత గొంతు పిసికి రసాన్ని పీల్చేయటాన్ని ఖండిస్తూ, భావితరాలు కవిత్వమంటే విసిగి శపిస్తారు కవులు జాగ్రత్త పడకపోతే, అని భవిష్య దర్శనం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది జాషువా ఊహించి చూపించిందే!

ముసిరిన భావజాలమును బూడిదలోపల వంపి, కుత్తుకల్/బిసికి, యగాధ శబ్ద వనవీధుల దాచి, కవిత్వమన్నచో/ విసిగి, శపించి పోయెదరు, వీనులు శూన్యములై సభాసదుల్/ రసమరికట్టు యీ గులకరాల బిగింపులకేమి హేతువో?

చివరి పద్యంలో తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు జాషువా.

మొత్తముమీద నాంధ్రకవి ముఖ్యులు పెట్టిన కట్టుబాట్లలో/ నుత్తమ మధ్యమాధమములున్నవి, వానిని కొద్దిగా మరా/మత్తొనరింపనౌ ననెడు మాటకు నేనును సమ్మతింతు; నీ/ బిత్తల తోకపీకుడు కవిత్వపు ఫక్కి ననాదరించెదన్.

బిత్తల తోకపీకుడు కవిత్వాన్ని ఆదరంచనని స్పష్టంగా చెప్తున్నాడు జాషువా. ఇప్పటి కవులను, వారి కవిత్వాల వెర్రిపోకడలను చూస్తే జాషువా ఏమనేవారో?

తన్నుడు చంపుడు, ద్వేషాలు, బూతులు, అర్ధం పర్ధంలేని మాటల్స్ కూర్పులే కవిత్వమని, అవే కొత్త ప్రయోగాలని తమని తామే పొగడుకునే కవులను వారి కవిత్వాన్ని చూస్తే జాషువా ఏమనేవారో సూచన ప్రాయంగా మనకు కవి అన్న కవితలో తెలుస్తుంది.

ఇది రేపు.

March 27, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized