Archive for April, 2009

భలే మాంచి చౌక బేరమూ!

భలే మంచి చౌక బేరమూ, ఇది సమయమున్ మించినన్ దొరుకదు, త్వరన్ గొనుడు సుజనులార భలే మాంచి చౌక బేరమూ!!1

నిజంగానే ఇది భలే మంచి చౌక బేరమే!

నేను రచించిన పుస్తకం తీవ్రవాదం ప్రింటుకు వెళ్ళిపోయింది. పాలపిట్ట ప్రచురణలీ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.

నేను ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో, సెప్టెంబర్ 2001 కన్నా ముందునుంచీ తీవ్ర వాదం వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చ రిస్తూ రాసిన వ్యాసాలున్నాయి.

తీవ్రవాదం నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి.

అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా మన దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి.

మొత్తం 36 వ్యాసాలున్నాయీ సంకలనంలో. 2000 నుంచి 2008,31 డిసెంబరు  వరకు తీవ్రవాదానికి సమబంధించిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో కాశ్మీర్ తీవ్రవాదానికి సమబంధించిన రెండే వ్యాసాలున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ కు సంబంధించిన వ్యాసాలే 90 పేజీలు దాటాయి. ఇవన్నీ, భారతీయ సమస్యలకు సమబంధించిన వ్యాసాల సంకలనంలో జోడించటంతో పునరుక్తిని తప్పించుకొనేందుకు ఈ సమకలనంలో చేర్చలేదు.అదీకాక, ఇప్పటికే 264 పేజీలయింది పుస్తకం. వెల 100/- మాత్రమే. ఇంకా పేజీలు పెరిగితే వెల పెంచాల్సివస్తుంది. అందుకనే కాశ్మీర్ వ్యాసాలని ఈ పుస్తకంలో చేర్చలేదు.

అయితే, పాలపిట్ట ప్రచురణలవారు ఈ పుస్తకాన్ని ప్రె- పబ్లికేషన్ ఆఫర్ గా 75/- కే ఇవాలని సంకల్పించారు. పుస్తకం కావాల్సినవారు సంప్రతించవలసిన చిరునామా;-

పాలపిట్ట ప్రచురణలు
16-11-20/6/1/1
403, విజయ సై రెసిదెంచ్య్
సలీం నగర్, మలక్పేట్
హైదరాబాద్-500036.
సెల్ నంబర్;- 9848787284.

ఈ భలే మంచి చౌక బేరావకశాన్ని వినియోగించుకుంటారనే ఆశిస్తున్నాను.

పుస్తకం చదివిన తరువాత మీ సలహాలు, సూచనలు, నిర్మొహమాటమయిన అభిప్రాయాలను తెలియపరచాలని ప్రార్ధన.     Power- Plolitics Title.pmd

April 29, 2009 ·  · 3 Comments
Posted in: నా రచనలు.

మన టీవీ విశ్లేషకులకు క్రికెట్ ఆట తెలుసా?

టీవీ చానెళ్ళలో ఐపీఎల్ క్రికెట్ పోటీల ఆటల విశ్లేషణలు వింటూంటే ఈ సందేహం పదే పదే కలుగుతోంది. తెలుగు చనెళ్ళలోనే కాదు, ఇంగ్లీషు చానెళ్ళలో కూడా, గతంలో క్రికెట్ ఆట ఆడినవారు కూడా చేసే వ్యాఖ్యలు వింటూంటే, వీరు క్రికెట్ ఆట కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తుంది.

నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ ఆట అత్యద్భుతం. బంతిని ఎంత కసిగా కొట్టాడంటే, ఇంకాస్త  బలము ఉపయోగించి కొడితే బంతి బోఉండరీనేకాదు, సముద్రాలు దాటి మన దేశంలో వచ్చి పడుతుందేమో అనిపించింది. ఒక ఆటగాడు అలా ఆడుతూంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి సమయంలోనే కెప్టేన్ చాతుర్యం తెలిసేది.

కెప్టేన్ తన బవులర్లతో మాట్లాడాలి. వారికి ధైర్యాన్నివ్వాలి. బంతులను యార్కర్లుగా వేయాలని చెప్పాలి. అవసరమయితే, ఓవరుకు ఆరుబంతులూ యార్కర్లే వేయమనాలి. స్పిన్నర్లకు, కూడా, బంతులను దాదాపుగా బాటు క్రిందకు వేయమనాలి. దాంతో ఆటగాడు ఆత్మ రక్షణలో పడతాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టలేదు. పైగా, ఆసమయానికి రాజస్థాన్ వారు అయిదు వికెట్లు కోల్పోయి వుండటంతో, ఆటగాడు తప్పనిసరిగా వికెట్ కాపాడుకోవటం పైన దృష్టి పెట్టాల్సివుంటుంది.

మన విశ్లేషకులెవ్వరూ ఈ విషయం ప్రస్తావించటంలేదు. గతంలో అనేక మార్లు స్టీవ్ వా ఇలాంటి పద్ధతులద్వారా అపజయాలనుంచి విజయాలు సాధించాడు. ఈ విషయాలు చర్చించేబదులు, మన వారు మెక్ గ్రాత్ ని కూచోబెట్టారు, కాలిగ్ వుడ్ ని ఆడనీయటం లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా డిల్లీ జట్టులో భవిష్యత్తులో ఉపయోగపడే surprise ఆటగాళ్ళు. ఈ ప్రణాళికను అర్ధం చేసుకోకుండా, అక్కడికి ఆడుతున్నవారికి చేతగానట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చేతకాని జట్టుతోటే ఇంతవరకూ డిల్లీ జట్టు గెలుస్తూవస్తోంది. ఒక ఆటలో దెబ్బ తినగానే పనికిరానివారన్నట్టు వ్యాఖ్యానించటం అర్ధం లేనిది. రాబోయే రెండవ భాగం ఆటలలో మెక్ గ్రాత్ ఆడతాడు. అప్పటికి అతను ఫ్రెష్ గా వుంటాడు. ప్రభావం చూపుతాడు.

ఇదే ఆటలో గ్రేం స్మిత్ గురించి మన మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆట గురించి తెలియని వారు చేయాల్సిన వ్యాఖ్యలవి. గ్రేం స్మిత్ సరిగా ఆడలేకపోతున్నాడు. దాని ప్రభావం రాజస్థన్ జట్తు అనుభవిస్తోంది. కాబట్టి ఈసారయినా సరిగ్గా ఆడాలని నిశ్చయించుకునివుంటారు. కనీసం త్వరగా అవుటవద్దని నిర్ణయించుకుని వుంటారు. 20-20 ఆటలోనేకాదు, ఏ ఆటలోనయినా ఆరంభ ఆటగాళ్ళపైన బాధ్యత ఎక్కువ. వారిచ్చే ఆరంభంపైనే జట్టు పరుగులు సాధించటం వుంటుంది. కాబట్టి ఒక ఆరంభ ఆటగాడు త్వరగా అవుటయిపోతే, ఇంకో ఆటగాడు ఆత్మ రక్షణతో ఆడాల్సి వుంటుంది. పరుగులు వేగంగా తీయకున్నా ఒక వైపు వికెట్ పోకుండా ఆపాల్సివుంటుంది. ఇది తరువాత వచ్చే ఆటగాళ్ళలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వారు షాట్లు కొట్టి రిస్కు తీసుకుంటారు. తగిలితే గెలుపు, లేకపోతే ఓటమి. కానీ, ఒక వైపు ఒకరు అవుట్ కాకుండా నిలబడటం తప్పనిసరి. ఇద్దరు ఓపెనర్లు అవుటయితే అప్పుడు వన్ డౌన్ ఆటగాడు ఈ బాధ్యతను నిర్వహిస్తాడు.

అందుకే, నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ చెలరేగి విజయాన్ని సంభవం చేయటం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, మరో వైపు గ్రేం స్మిత్ నింపాదిగా ఆడటమూ అంతే ప్రాధాన్యం వహిస్తుంది. ఇందుకు భిన్నంగా అతడు అవుటయిపోయుంటే, పఠాన్ కు పార్ట్నెర్లు మిగిలేవారుకారు. ఇంతకు ముందు అనేక ఆటల్లో ఇది జరిగింది. అందుకు ఈ సారి స్మిత్ ఆట ఎంతో ప్రణాళికానుసారంగా ఆడింది.

కానీ, మన విశ్లేషకులు స్మిత్ ను దుయ్యబడుతున్నారు. స్మిత్ వేగంగా పరుగులు తీయాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. గమనిస్తే, రెండు సార్లు పఠాన్ కాచవుటబోయి తప్పించుకున్నాదు. అతడు అవుటయినా, తరువాత వచ్చే ఆటగాడికి స్మిత్ ను చూసి ధైర్యం వచ్చేది, వెగంగా పరుగులు తీసే ప్రయత్నాలు చేసేవాడు. కనీసం ఒకవైపు వికెట్ భద్రంగా వుందికదా అన్న ధైర్య అది. ఇక్కడ ఓటమి కన్నా, విశ్వాసం ప్రాధాన్యం వహిస్తుంది. విశ్వాసం అపజయాన్ని విజయంగా మారుస్తుంది. నిన్నటి ఆటలో జరిగింది అదే. మెరుపులు కురిపించిన పఠాన్ విజయానికి ఎంత కారకుడో, నింపాదిగా ఆడిన స్మిత్ కూడా అంతే కారకుడు.

ఇది అర్ధం చేసుకోకుండా మన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించటం చూస్తూంటే, వీరికి క్రికెట్ అసలు తెలుసా? అన్న సందేహం వస్తోంది. ఇది మన ప్రేక్షకుల అభిప్రాయాలను ఏర్పరుస్తుందని గమనిస్తే, క్రికెట్ ఆట అంటే సిక్సులు-ఫోర్లే అన్న అభిప్రాయం ఎందుకు స్థిరపడుతోందో అర్ధమవుతుంది.

April 29, 2009 ·  · 3 Comments
Posted in: క్రికెట్-క్రికెట్

బ్లాగరులందరికీ ధన్యవాదాలు!

నా సమస్యకు సానుభూతితో స్పందించి, సాదరంగా పరిష్కారాలను సూచించిన బ్లాగరులందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలపటం పాశ్చాత్య పద్ధతి అని ఈసడించేవారికి నమస్కారాలు. మీ అందరూ సూచించిన విధంగా నేను కిరణ్ ప్రభ గారిని సంప్రతించాను. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో ఇంతవరకూ ప్రచురితమయిన భాగాలను వారికి స్కాన్ చేసి పంపుతాను. వాటిని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయమేదయినా సమస్య తెలుపగానే స్పందించిన బ్లాగరులందరికీ మరో సారి మనహ్పూర్వక కృతఙ్నతలు తెలుపుకుంటున్నాను.

చావా కిరణ్ గారు సూచించినట్టు ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన బలంగా వుంది.

అలాగే, నాగన్న గారు అభిమానంతో చేసిన సూచనా బాగుంది.  కానీ, ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోగల సామర్ధ్యం, చాతుర్యాలు నాకుంటే, ఇన్ని రకాల రచనలు చేస్తూ కూడా, అనామకుడిలా వుండాల్సిన పరిస్థిత్ నాకు వుండేది కాదు. నాకు రాయటమే చేతనవుతుంది. అది కాక మిగతావన్నీ చేతనయితేనే గుర్తింపులు, పొగడ్తలూ, సన్మానాలూ వగైరాలు ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో. అయితే, వాటితో సంబంధం లేకుండా నన్ను ఆదరించే పత్రికలున్నాయి. పాఠకులున్నారు. అది చాలు నాకు.

సభలు, సన్మానాలు, పొగడ్తలూ ఇష్టం లేవని అనను కానీ, దేని వెంటా పరుగిడటం నాకు అలవాటులేదు. నాకు రావాల్సింది తనంతట తానే నాదగ్గరకు వస్తుంది. రానిదాని వెంట ఎంతపడ్డా, సమయం వ్యర్ధమూ, మనసు పాడవటమూ తప్ప మరొకటి లేదు. అందుకే, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నాకు రావాల్సిన పేరు, గుర్తింపులు, పొగడ్తలూ, సన్మానాలూ వాటంతట అవే వస్తాయి.

జో మిల్గయా ఉసీకో ముఖద్దర్ సమఝ్ లియా
జో ఖోగయా మై ఉస్కొ భులాతా చలాగయా
హర్ ఫిక్ర్ కో ధువేమె ఉడాతా చలాగయా.

ఇదీ నా జీవిత తత్వం. తూ చ తప్పకుండా పాటిస్తున్నాను. ఆనందంగా వున్నాను. మీ అందరి ఆదరణను సంపాదించుకున్నాను.

అందుకే అందరికీ మరోసారి ధన్యవాదాలు.

ఎహెసాన్ మెరే దిల్ కె తుమ్హారాహై దోస్తో
యే దిల్ తుమ్హార ప్యార్ క మారాహై దోస్తో.

April 27, 2009 ·  · 2 Comments
Posted in: నా రచనలు.

ఈవారం నా రచనలు-8

బ్లాగ్ స్పాట్ శీర్షికకు అనూహ్యమయిన స్పందన లభిస్తోంది. అన్నిరకాల పాఠకులూ ఆ శీర్షికను ఆదరిస్తున్నారు. దాంతో ప్రతివారం బ్లాగ్ స్పాట్ శీర్షికన పరిచయం చేయాల్సిన సెలెబ్రిటీ  బ్లాగరును జాగ్రత్తగా ఎన్నుకోవాల్సివస్తోంది.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో రాజ్ దీప్ సర్దేశాయ్ బ్లాగును పరిచయం చేశాను. అతని బ్లాగు అత్యంత ఆసక్తికరంగా వుంటుంది. అనేక విషయాలపైన ఆయన రాతలు బాగుంటాయి. ఆ బ్లాగు చదివిన తరువాత అతని చానెల్ పైన గౌరవం, ఆసక్తి కలుగుతాయి,

ఈవారం, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి తెలుగు భాష ఉద్ధరణపైన తన అమూల్యమయిన అభిప్రాయాలను వ్యక్త పరుస్తాడు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతీయ భాషనే వాడాలని పట్టుబడితే ఎలావుంటుందో తన అనుభవాలను తన స్వగతంలో చెప్పుకుంటాడు.

ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన అఫ్గనిస్తాన్ విషయంలో అమెరికా రాజకీయాలు ఎలా పాకిస్తాన్ లో దుష్ప్రభావాలు చూపుతున్నాయో, అవి భారత్ కెలా ప్రమాదమో, అంతర్జాతీయ పవర్పాలిత్క్శ్ చర్చ వుంటుంది.

గురువారం ఆంధ్రప్రభ అనుబంధం చిత్రప్రభలో బాలల సినిమా స్క్రిప్టుల గురించి విశ్లేషణ వుంటుంది.

ఈనెల ప్రాణహిత వెబ్ పత్రికలో నా కథ ఏంటీ హీరోయిన్ వస్తుంది. మామూలు హీరోయిన్లకు భిన్నమయిన హీరోయిన్ కథ ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

కౌముది వెబ్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికలో మార్చ్ నెలలో వివిధ పత్రికలలో ప్రచురితమయిన 92 కథలనుంచి పాఠకుల పరిచయానికి అర్హమయిన కొన్ని కథల పరిచయం వుంటుంది. ఈ పరిచయంతో పాటు ఒక కథను ఆనెల కథగా ఎన్నుకుని ఆ కథను మొత్తం ప్రచురించటం జరుగుతుంది. ఇందువల్ల పాఠకులు నా విశ్లేషణతో పాటు కథను చదివి తమ స్వంత అభిప్రాయాన్ని వ్యక్తపరచేవీలు కలుగుతుంది. కాబట్టి, కథాసాగరమథనం శీర్షిక చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలుప ప్రార్ధన.

తీవ్రవాదం పుస్తకం ప్రచురణకు ముద్రణాలయానికి చేరుకుంది. త్వరలో ప్రి పబ్లికేషన్ ఆఫర్ గురించి నా బ్లాగులో ప్రకటిస్తాను.

ఇవీ ఈవారం నా రచనలు. వీటిపైన మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

April 26, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

నా సమస్యకు పరిష్కారాన్ని సూచించండి!

సాధారణంగా ఏ పత్రికకయినా శీర్షిక ఒప్పుకునేముందు నేను డెడ్ లైన్ అడుగుతాను. వారు చెప్పిన డెడ్ లైన్ కు ఒక అయిదు రోజులు ముందు నా వ్యక్తిగత డెడ్ లైన్ ను నిర్ణయించుకుంటాను. పద్మకు ఈ విషయం చెప్తాను. దాంతో, నా డెడ్ లైన్ కు ఒక వారం ముందునుంచే పద్మ నా వెంటపడుతుంది. అందువల్ల ఎడిటర్ లకు నన్ను మా శీర్షిక సంగతి ఏమిటి అని అడిగే వీలుండదు. అందుకే, ఇంతవరకూ ఒకేసారి ఎన్ని పత్రికలలో ఎన్ని విభిన్న శీర్షికలు నిర్వహిస్తూన్నా ఎప్పుడూ రాయటానికి నేను ఇబ్బంది పడలేదు. సరయిన సమయానికి ఆర్టికల్ అందించటంలోనూ ఇబ్బంది పడలేదు. నన్ను రాయమని అడగటానికే, వీడికి తీరుతుందో, లేదో అని మొహమాటపడతారు కానీ, నాకు 24 గంటలున్నాయనీ, ఇన్ని రాస్తూ చదువుతూన్నా, బోలెడంత సమయాన్ని నేను వ్యర్ధం చేస్తున్నాననీ అంటే ఎవ్వరూ నమ్మరు.
పైగా, ఏదిబడితే అది, ఎవరికి పడితే వారికి రాస్తాడు, అని ఈసడించేవారు, చులకనగా వ్యాఖ్యానించేవారూ వున్నారు.
ఫ్రీలాన్సర్ గా వీలయినన్ని ప్రక్రియలలో వీలయినంతమంది పాఠకులను చేరాలని అనుకోవటంలో తప్పేమిటో నాకు ఇప్పటికీ అర్ధం కావటంలేదు. కానీ, నేను ఏదో ఒక రకమయిన రాతకు పరిమితం కాకపోవటాన్ని ఒక లోపంగా భావించేవారే ఎక్కువ. వారందరికీ, నాదోకటే సమాధానం.

మనిషి మేధ అపరిమితమయినది. దానికి ఆకాశమే హద్దు. కానీ, తరచిచూస్తే, ఈ హద్దుకూడా మనపైన మనము స్వచ్చందంగా విధించుకున్న పరిమితేతప్ప భగవంతుడు విధించిందికాదు. ఎందుకంటే, నిజానికి అక్కడ ఆకాశం వుందనుకుంటున్నాం కానీ, ఆకాశం అన్నది లేదు. కాబట్టి రాస్తే ఒక్క కథలో, నవలలో, వ్యాసాలో, విమర్శలో మాత్రమే రాయాలన్న అభిప్రాయాన్ని నేను మన్నిస్తూనే వ్యతిరేకిస్తాను. అవి మాత్రమే రాయగలిగినవారు అవే రాస్తారు. ఎన్నెన్ని రకాలుగా రాయగలిగితే అన్నన్ని రకాలుగా రాయాలి. సూర్యకిరణాలను ఒకేచోటా ప్రసరించమై ఆౙ్నాపించటం తప్పు. అలా చేయగలిగితే శక్తివంతమయిన లేజర్ బీం తయారవుతుంది. దాని వాడకంలో విచక్షణ లేకపోతే అనర్ధం.

అయితే, మౌలికంగా, నేను సృజనాత్మక రచయితను. నాకు కథలు, నవలలు రాస్తే వున్న సంతృప్తి ఇతరాలలో వుండదు. కానీ, రాయటం నాకు వూపిరి వంటిది. ఏది రాసినా ఆనందం కలుగుతుంది. అందుకే, ఎవరయినా నన్ను ముందు శీర్షిక రాయమనగానే నేను నవల, కథల ప్రసక్తి తెస్తాను.

దివ్యధాత్రి పత్రిక ఎడిటర్ శివప్రసాద్ ఫోను చేసి వారి పత్రికకు ఏదయినా శీర్షిక రాయమని అడిగినప్పుడూ నవల రాస్తానన్నాను. నాకు, వ్యాస రచయితగా మాత్రమే గుర్తింపు పొందటం ఇష్టం లేదు. కానీ, అనేక కారణాలవల్ల నా సృజనాత్మక రచనలను పట్టించుకోవటంలేదెవ్వరూ. దాంతో, కాల్పనికేతర రచయితగానే అందరికీ అవసరమవుతున్నాను.

దివ్యధాత్రి పత్రిక, సామవేదం షణ్ముఖ శర్మ  గారి రిషిపీఠం పత్రికకు చెల్లి వంటి పత్రిక. రిషిపీఠం ఆధ్యాత్మిక పత్రిక. దివ్యధాత్రి దేశభక్తి పత్రిక. ఇందులో, దేశంలోని వివిధ మందిరాల పర్యటన గురించి రాయమని అడిగారు శివప్రసాద్.

ట్రావెలాగ్ ఇంతకు ముందు ఆంధ్రప్రభ లో రాశాను. నా ట్రావెలాగ్ ఇతరుల రాతలకు భిన్నంగా వుంటుంది. నేను, మామూలు వివిరాలకు ప్రాధాన్యం ఇవ్వను. ఆయా ప్రదేశాల పర్యటనలో కలిగిన మానసికానుభూతులకే పెద్దపీట వేస్తాను. ఈ రకంగా ఆంధ్రప్రభలో రాసి మంచి మెప్పు పొందాను. అప్పుడు ప్రభ ఆగిపోవటంతో ఆ శీర్షిక కూడా ఆగిపోయింది.

అందుకే, శివప్రసాద్ అలాంటి శీర్షిక అడగగానే నా నియమాలు, నిబంధనలూ అన్నీ చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. ఐతే, నాకు కాల్పనికేతర రచనలు చేయాలని లేదు. అందుకని ఏవేవో అభ్యంతరాలను సృష్టిస్తూ వచ్చాను.

నా అభ్యంతరాలన్నిటినీ పద్మ పక్కకు నెట్టింది. సామవేదం గారికి మీరు రాయాల్సిందే. కావాలంటే, ఇతర శీర్షికలేవన్నా మానండి. అని ఆఙ్నాపించింది. పద్మ ఆఙ్నను శిరసావహించాను.

దివ్యధాత్రిలో శీర్షికకు మంచి స్పందన వస్తోంది. ఈ శీర్షికతో పాటుగా, నా కాల్పనిక రచన కుతిని తీర్చుకోవటానికి నేనే మరో శీర్షికను సూచించాను. అప్పటికి వార్తలో రియల్ స్టోరీలు రాస్తున్నాను. అవన్నీ విదేశీయుల జీవితానుభవాల ఆధారంగా రచిస్తున్నవి. దివ్యధాత్రికి భారతీయుల దివ్య వ్యక్తిత్వాలను పరిచయం చేస్తానన్నాను. భారతీయ వ్యక్తిత్వం అనగానే, రాముడు, కృష్ణుడు, సీత , సావిత్రి లాంటి వ్యక్తిత్వాలే గుర్తుకు వస్తాయి. ఇందుకు భిన్నంగా, మన పురాణాలలో, చరిత్రలో మరుగున పడివున్న అత్యద్భుతమయిన వ్యక్తుల అత్యంత అనుసరణీయమయిన వ్యక్తిత్వాలను ఆధునిక సమాజానికి అనువుగా అన్వయించి ప్రకటిస్తానని అన్నాను. ఆయన ఒప్పుకున్నారు.

నా అదృష్టం ఎలాంటిదో కానీ, నేను ఈ శీర్షిక రాస్తాను అంటే ఎవ్వరూ కాదనరు. నాకు పూర్తి స్వేచ్చనిస్తారు. నన్ను క్రిందకు తోయాలని ప్రయత్నించే పదిమంది ప్రయత్నాలనూ ఇలా ప్రోత్సాహం ఇచ్చే ఒక్కరివల్ల తిప్పికొట్టగలుగుతాను.

ఆంధ్రభూమి, వార్త, జాగృతి, రసమయి ఇలా నేను ఏ పత్రికకు సన్నిహితుడినయితే, ఆయా పత్రికలలో నాకు పూర్తి స్వేచ్చ లభిస్తోంది. దివ్యధాత్రిలోనూ అలాగే స్వేచ్చ లభించింది.

అయితే, నేను రాస్తున్న ట్రావెలాగ్ శీర్షికలో ఒక నెల వేరే ఎవరిదో వ్యాసం ప్రచురించారు.

నాదొక నియమం వుంది. నేను రాసే శీర్షిక సంపూర్ణంగా నేనే రాస్తాను. మధ్యలో ఎవరయిన దూరితే నేను ఆ శీర్షిక ఆపేస్తాను. నాకంతగా గుర్తింపులేని కాలంలోనే, నాలుగేళ్ళుగా రాస్తున్న సినీ సమీక్షల శీర్షికను, మధ్యలో వేరే వారి సమీక్ష వేశారని మానేశాను. ఇప్పటివరకూ మళ్ళీ సమీక్షలు రెగ్యులర్ గా రాయటంలేదు.

సాధారణంగా ఏ శీర్షిక ఎవరితో రాయించాలన్న నిర్ణయం ఎడిటర్ దే. కానీ, ఏ శీర్షిక రాయాలో వొద్దో నిర్ణయించుకునే హక్కు రచయితది. నా హక్కును నేను వదలుకోను.
వదలుకున్నా, స్వచ్చందంగా వదలుకుంటాను తప్ప ఒత్తిళ్ళకు లొంగి వదలుకోను.

ఆ శీర్షిక ఇక నేను రాయనని శివప్రసాద్ తో చెప్పేశాను. ఇంకా ఏదయినా రాయమని అడిగినప్పుడు చారిత్రాత్మక నవలను ప్రస్తావించాను.

ఈ నవల ఆలోచన కొన్నేళ్ళుగా రగులుతోంది.

దక్షిణ భారత దేశంలో అడుగుపెట్టిన మొదటి ఇస్లాం వీరుడు మాలిక్ కాఫుర్. అతని దండయాత్ర వల్ల భారతీయ సామాజిక మనస్తత్వంలో కలిగిన మార్పులు, అతడి దండ యాత్రను, భౌతికంగానే కాదు, మానసికంగా భారతీయ సమాజం ఎదుర్కొన్న విధానాలను నవల రూపంలో రాయాలన్న ఆలోచన ఎప్పటినుంచో వుంది.

ఇప్పుడు చారిత్రిక నవలలెవరికి కావాలి, అని కొందరు నిరాకరించారు. ముస్లీం దండయాత్రల గురించా, ఒద్దు, అనవసరమయిన గొడవలు, అని మరికొందరు తిరస్కరించారు. మీరు హిందువుల తిట్టండి, ఇస్లామీయులను విమర్శిస్తే మిమ్మల్ని ఏమనరు. పత్రికలపై దాడులు చేస్తారు అని భయపడ్డారు ఇంకొందరు.

చరిత్రలో జరిగినది జరిగినట్టు, కాస్త కల్పనను జోడించి రాస్తానంటే ఇంతగా భయాలెందుకో అనిపించింది.

జాగృతి ఎడిటర్ రామ మోహన రావు గారికి నచ్చింది కానీ, అప్పటికే, జాగృతిలో భారతీయ వ్యక్తిత్వ వికాసం, కథా సాగర మథనాలు రాస్తున్నాను. ఒకరకంగా, నా కాల్పనికేతర శీర్షికలు నా కాల్పనిక రచనలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. అవి మానలేను. ఇవి వదలలేను.
ఈ పరిస్థితుల్లో, దివ్యధాత్రిలో నవల అనగానే ఈ ఆలోచన చెప్పాను. సామవేదంగారితో చర్చలు జరిగాయి. ఎలాంటి సంకుచితత్వం, ద్వేషమూ లేకుండా రాస్తానని నా ప్రణాళికను చెప్పాను. నవలకు ద్రష్ట, అని పేరు పెట్టింది ఆయనే.

అలా ఆరంభమయింది దివ్య ధాత్రిలో నా నవల ద్రష్ట.

ఈ నవల రచనకోసం బోలేడంత సమాచారం సేకరించాను. ఆనాటి సామాజిక పరిస్థితులను, మనస్తత్వాలను తెలుసుకునేందుకు, మన సాహిత్యంతోపాటూ, ఫరిష్తా, బరోని లతో సహా, యూరోపియన్ల రచనలూ చదివాను. ముఖ్యంగా, విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించి, గూఢచార రిపోర్టులిచ్చిన యూరోపియన్ల రచనలు ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపాయి. మన సమాజంలోని మార్పులకు అద్దం పట్టేఅ అమ్షాలను గ్రహించాను.

నవలకు అవసరమయిన తాత్వికాంశాల కోసం విశిష్టాద్వైత గ్రంథాలు, చర్చలు అద్వైత వాదనలు, ఆకాలంలోని తత్వవేత్తల జీవితాలు తెలుసుకున్నాను. ఎందుకంటే, నా నవలలో ద్వైత, విశిష్టాద్వతుల మధ్య చర్చలుంటాయి. నవలలో ప్రధాన ఘట్టం, శ్రీరంగం మందిరంలో 50 మంది వేదపండితుల ఊచకోత. వారిలో సుదర్శనసూరి వుంటాడు. ఈయనతో చర్చించేందుకే హీరో వారణాసినుంచి బయలుదేరతాడు. మాలిక్ కాఫర్ దండయాత్రను కళ్ళతో చూస్తాడు.అంటే, నా నవల factual account of historical facts shown through the eyes of a fictitious character అన్నమాట.

నవల రచన ఆరంభించాను.  నవలకు మంచి స్పందన లభిస్తోంది. శివప్రసాద్ సంతోషించాడు. నాకూ, ఎంతో ఆనందంగా, సంతృప్తిగా వుంది.

ఒక రచన సంపాదకుడికి నచ్చక పోవచ్చు. పాఠకులు మెచ్చక పోవచ్చు. కానీ, రాస్తున్న రచయిత మనసుకు తన రచన రచన విలువ తెలుస్తుంది. అలాంటప్పుడు ఎవరి మాటనూ రచయిత లెక్కచేయడు. అనేక సందర్భాలలో నేను రచనల విషయంలో రాజీ పడాక పోవటానికి ఈ విశ్వాసమే కారణం. అనేక సందర్భాలలో నా పట్టుదల సరయినదే అని రుజువయింది కూడా.

ద్రష్ట విషయంలోనూ అదే జరుగుతోంది. దివ్యధాత్రి తక్కువమంది పాఠకులకు చేరుతూన్నా, చదివిన వారందరి మెప్పు పొందుతోంది.

ఇంతలో, శివప్రసాద్ ఫోను చేసి, నష్టాలొస్తున్నాయని దివ్యధాత్రిని మూసేస్తున్నాం అని చెప్పాడు.

నాకేమనాలో తోచలేదు. నా తొలి ఆలోచన ద్రష్ట గురించి.

వ్యక్తిగతంగా, రచయితగా నాకు సంతృప్తినిస్తున్న రచన ఇది. ఇది మొదలుపెట్టినప్పటినుంచీ ఇన్ని అడ్డంకులేమిటి?

ఇప్పుడీ నవలను వేరే పత్రికకు ఇవ్వలేను. ఆపేయలేను. వ్యర్ధంగా వదిలేయలేను.

నవలను నేనే డైరెక్టుగా పుస్తకరూపంలోకి తేవాలి. లేకపోతే వదిలేయాలి. పుస్తకరూపంలో తేవాలంటే బోలేడన్ని సాధక బాధకాలున్నాయి. పైగా చారిత్రిక నవల కాబట్టి బోలెడన్ని అపోహలూ వుంటాయి. ఇదీ నా ఆలోచన.

నవలను పుస్తకంలా అన్నా తేవాలి. లేకపోతే, నా బ్లాగులో సీరియల్గా ప్రచురించాలి. తరువాత సంగతి తరువాత ఆలోచించవచ్చు. కనీసం, నవల పదిమందిని చేరిందన్న సంతృప్తి వుంటుంది. బ్లాగరుల ప్రతిస్పందనను బట్టి తరువాత ఏమిచేయాలో ఆలోచించవచ్చు.

దివ్యధాత్రి మూతపడటంవల్ల నాకు కలిగిన కష్టం ఇది. ఇంకా ద్రష్ట విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను.

ఇంతా చదివారుకదా! మీరేమటారు?

April 24, 2009 ·  · 9 Comments
Posted in: Uncategorized, నా రచనలు.

ఐపీఎల్-నాలుగాటల సమీక్ష!

ఐపీఎల్ క్రికెట్ పోటీలో ఇప్పటికి నాలుగాటలయ్యాయి. ఈ నాలుగులో మొదటి రెండు ఆటలు ఎంత ఆసక్తి కలిగించాయో, మిగతా రెండు ఆటలు అంత చప్పగా వున్నాయి. మన దేశంలో పోటీలు జరగపోవటం వల్ల టికెట్ కలెక్షన్లలో తేడాలు వుండొచ్చుగానీ, టీవీలో చూసేవారిలో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

మొదటి ఆటలో సచిన్ ఆట ఎంతో ఆనందాన్ని కలిగించింది. 20-20 ఆటలో కళ్ళుమూసుకుని బాటు వూపటానికి ప్రాధాన్యం వున్నా సాంప్రదాయిక ఆట తీరు, మెళకువలు, నైపుణ్యాల ఆవశ్యకతను స్పష్టం చేసింది సచిన్ ఆట తీరు. ఈ పోటీలలో రాణించటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు సచిన్.

ముంబాయి గెలుపు సులభంగానే సాధ్యమయింది. ఆ ఆటలో సచిన్ తప్ప చెప్పుకోతగ్గ అంశం మరొకటి లేదు. ఆట చప్పగానే సాగినా సచిన్ ఆట ఆటస్థాయిని పెంచింది.

రెండవ ఆటలో షేన్ వార్న్ బౌలింగ్ చూస్తూంటే అద్భుతం అనిపించింది. ఇతను ఆటగాడా మాయల మాంత్రికుడా అనిపించింది. కొత్త ఆటగాళ్ళయితే, ఆయన వేస్తున్న బంతులేమిటో, ఎటు తిరుగుతాయో కూడా అర్ధం కానివారిలా కనిపించారు. ముఖ్యంగా, కుది వైపునుంచి వంకరగా ఎడమవైపు పడి, హఠాతుగా వికెట్ పైకి దూసుకువెళ్ళిన బంతి అయితే అమోఘం.

వార్న్ బంతులను చక్కగా ఎదుర్కోగలిగాడు డ్రావిడ్. అంతేకాదు, ఇంకా గోడలో శక్తి సన్నగిల్లలేదని నిరూపించాడు. ద్రావిడ్ ఆట తీరు పరమాద్భుతం. సాంప్రదాయిక ఆట పద్ధతిలోనే ఆడుతూ 48 బంతులలో 66 పరుగులు చేయగలగటం నిజంగా నైపుణ్యం వున్న ఆటగాడు సందర్భాన్ని పట్టి ఆటను మార్చుకోగలడని మరోసారి స్పష్టం చేసింది. అయితే, ద్రావిడ్ రక్షణగా ఆడుతూ, షాట్లు కొడుతూంటే ఒక మంచి ప్రకృతి దృష్యాన్ని చూసినట్టుంటుంది. అదే అతడు పళ్ళు బిగబట్టి, కళ్ళు మూసి బాతును ఊపుతూంటే, బుద్ధిమంతుడు అల్లరి చేయాలని ప్రయత్నించి భంగ పడ్డట్టుంటుంది.

ద్రావిడ్ ఆట చక్కటి ఫీలింగ్ కలిగిస్తే, కుంబ్లే బంతులు ఆశ్చర్యం కలిగిస్తాయి. వయసును బట్టి ఆటగాళ్ళు ఆటనుంచి విరమించుకోవాలని కోరటం సబబు కాదేమో అనిపిస్తుంది.

ఈ ఆట కూడా చప్పగానే సాగినా, వార్న్, ద్రావిడ్, కుంబ్లేల వ్యక్తిగత ఆట తీరు ఆట స్థాయిని పెంచి ఆనందం కలిగిస్తుంది.

ఈ విషయం మిగతా రెండు ఆటల గురించి అనలేము. పంజాబ్ జట్టు వర్షంలో కొట్టుకుపోతే, ఆ వర్షంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కురిపించటం సెహవాగ్ వంతయింది. కానీ, 12 ఓవర్లు, 6 ఓవర్లాటలు  ఆనందం అంతగా కలిగించవు. ఏమో, కొన్ని రోజుల్లో రెండోవర్లు, మూడోవర్లూ ఆడినా ఆశ్చర్యంలేదేమో!

డక్కన్ చార్జర్ల ఆట కూడా ఇంతే! రెండు ఓవర్లలోనే కలకత్తా వారి పని ఖతం అని తేలిపోయింది. నలుగురు కాదుకదా, 11 మంది కెప్టెన్లున్నా ఇలాంటి ఆట తీరువల్ల ఎలాంటి లాభంవుండదు. కాబట్టి, జట్టు సభ్యులలో పోరాట పటిమను పెంచే ప్రయత్నాలు చేయాలికానీ, ఎంత మంది కెప్టెన్లన్న మీమాంసలవల్ల మొదటికే మోసం వస్తుంది.

ఇంతవరకూ జరిగిన ఆటలు చూస్తే, క్రితంసారి దెబ్బ తిన్న జట్లన్నీ ఈసారి గతం తప్పులనుంచి పాఠాలు గ్రహించి తప్పులు దిద్దుకున్నాయనిపిస్తుంది. గెలవాలన్న పట్టుదలతో వున్నాయనిపిస్తుంది. కనీసం, ఓడినా, గౌరవంగా ఓడాలన్న ఆలోచన కనిపిస్తోంది. గత సంవత్సరం కోల్పోయిన పరువును నిలబెట్టుకోవాలన్న తపన కనిపిస్తోంది.

గతంలో  గెలిచి ఇప్పుడు దెబ్బ తిన్నవ్వారు, పట్టుదలకు వస్తే, గతంలో దెబ్బతిన్నవారు ఇప్పుడు గెలవాలన్న పట్టుదల కనబరిస్తే, ఇక రాబోయే ఆటలన్నీ దీపావళి సంబరాలే అనిపిస్తుంది. ఇది, ఎంతవరకూ నిజమవుతుందన్నది, ఇంకొన్ని ఆటలు చూస్తే తెలిసిపోతుంది.

కానీ, మన దేశంలో జరిగితే ప్రేక్షకులు చూపే ఉత్సాహం మాత్రం ఈ ఆటలలో కొరవడింది. టీవీల్లో చూసేవారి ఆనందాన్ని ఈ అమ్షంకూడా తగ్గిస్తుఓంది.

April 20, 2009 ·  · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్