Archive for April 11, 2009

రెండు పత్రికలు మూతపడుతున్నాయి!

రెండు తెలుగు పత్రికలు మూతపడుతున్నాయి. ఈ రెండు కూడా మంచి పత్రికలు. అంటే, నాణ్యత విషయంలో, ఆర్టికల్స్ ఎలా వుండాలన్న విషయంలో ఖచ్చితమయిన అభిప్రాయం కల పత్రికలివి.

ఈ రెండు పత్రికలలో ఒకటి వృధాప్యం వల్ల మూత పడితే, మరొకటి అర్ధాంతరంగా మూత పడుతోంది.

రసమయి పత్రిక గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ, తెలిసిన వారికి ఆ పత్రిక ఎంతో నచ్చుతుంది. కొని దాచుకోవాల్సిన పత్రిక అది. సంగీతం, సాహిత్యాల గురించి లోతయిన ఆలోచనలు, మమచి అవగాహన వున్న ఆర్టికల్సు ఆయా రంగాలలో నిష్ణాతులయినవారు రాస్తారు.

ఆ పత్రిక సంపాదకులు శ్రీ నండూరి పార్థ సారథి గారితో నా పరిచయం కాకతాళీయంగా జరిగింది.

ఆయన అప్పుడే జరిగిన బాలల చలన చిత్రోత్సవం సమీక్ష రాసేందుకు ఇద్దరు ముగ్గురిని అడిగారట. ఆయన ఇచ్చిన డెడ్ లైన్ లోపల వారు రాయలేమన్నారట. అంతటితో అయితే కథ వుండేదే కాదు, ఇంత తక్కువ వ్యవధిలో నాణ్యత చెడకుండా రాయగలిగే రచయితగా వారంతా నాపేరే సూచించారట. దాంతో, నేనెవరో తెలియకున్నా, వారి దగ్గరనుంచి నా నంబరు తీసుకొని, ఇంకొంతకాలం వేరేవారిని ప్రయత్నించి కుదరక తప్పని పరిస్థితులలో అయిష్టంగా నాకు ఫోను చేశారాయన.

నండూరి పార్థసారథిగారికి ఎవరు రాసినా ఒక పట్టాన నచ్చదు. ఎవరు రాసినా ఆయన మళ్ళీ తిరిగి రాసుకుంటారు. నిక్కచ్చి మనిషి. ఆయనను మెప్పించటం కష్టం. ఆయనకు రాయటం నుంచి  మిగతావారు తప్పించుకోవటంలో ఇదీ ఒక అంశమే.

ఆయన నాకు ఫోను చేసినప్పుడు నేను డ్రయివింగ్ లో వున్నాను. ఆయన పేరు విన్నాను. అంతకు ముందే కొన్ని రోజుల క్రితం మా బంధువులు నాగపూర్ నుంచి హైదెరాబాదు వచ్చేస్తూ వారివద్ద వున్న పాత రసమయి సంచికలన్నీ నాకిచ్చేశారు. ఈ పత్రికకు రాయవచ్చుకదా బాగుంది అని అన్నారు. నాకీపత్రికగురించే తెలియదు. ఆ సంచికలు చూసి మంచి శీర్షికలున్నాయని అనుకున్నాను. అందుకే నండూరి వారు ఫోను చేయగానే వారిచ్చిన డెడ్ లైన్ లోగా రాస్తానని అన్నాను. అయితే, ఆర్టికల్ మీరొచ్చి కలెక్ట్ చేసుకోవాలి అన్నాను. ఆయన సరే అన్నారు.

మరుసటి రోజు మా ఆఫీసుకు వచ్చారు. అంత వయోవృద్ధుడిని ఆర్టికల్ కోసం అంత దూరమ్నుంచి రప్పించిన నా అహంకారానికి సిగ్గనిపించింది. కానీ, ఆయనను కలిసినందుకు ఆనందం కలిగింది. అంత పెద్ద మనిషి నా అర్టికల్ కోసం ఇంత దూరం వచ్చినందుకు ఒకింత గర్వం కూడా కలిగింది.

ఆర్టికల్ ఆయన చేతికివ్వగానే, చెప్పిన సమయానికి ఆర్టికల్ ఇచ్చే రచయితలను ఇంతవరకూ చూడలేదని అన్నారు. ఇద్దరమూ కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాము. మాటలు సంగీతం వైపు మళ్ళాయి. హిందీ సినిమా పాటలు దొర్లాయి.

హిందీ సినిమా పాటలనగానే నేను పాటలు, రాగాలు, పాటల పదాలు, గేయ కర్తలు, సంగీత దర్శకులు. గాయనీ గాయకుల గురించి మాట్లాడటం మొదలు పెట్టాను. ఆయనకు నా మాటలు నచ్చినట్టున్నాయి. పాటలనీ కోణంలో ఎప్పుడూ వినలేదు. ఒక శ్ర్ర్షిక రాయవచ్చుకదా అని అడిగారు.

ఫలితంగా, రసమయిలో నా శ్ర్ర్షిక ఆరంభమయింది. సినిమా పాటలలో గేయ రచయితలు చేసిన చమత్కారాలు, సినీ సందర్భ పరిథిలో ంవొదుగుతూ పాట్లలో సార్వజనీన భావాలు పొదిగి వాటిని సకల మానవుల సంవేదనల ప్రతిబింబాలుగా మార్చిన విధానాలను వివరిస్తూ శీర్షికను ఆరంభించాను.

ముందుగా ప్రతి నెలకొక గేయ రచయిత పరిచయం అనుకున్నాము. శైలేంద్ర తో ఆరంభించాను. ఒక సంచికలో శైలేంద్రను కుదించలేక అవస్థపడ్డాను. ఎలాగో ముగించి పంపాను. ఆయనకు నచ్చింది. నాకు సంతృప్తి అనిపించ;లేదు.

ఇదే ఆయనతో చెప్పాను. నా మనసుని గ్రహించారు. అన్ని నిబంధనలనూ ఎత్తివేశారు. నీ ఇష్టమొచ్చినట్టు రాయి అన్నారు. అంతేకాదు, వ్యాసం అందగానే, దాన్లో ఉదాహరించిన పాటలను ఫోనుచేసి అచ్చుతప్పులులేకుండా చెప్పి తెలుసుకునేవారు. గంటల తరబడి ఇద్దరమూ పాటలు, సాహిత్యమూ, సంగీతమూ, పాటల చిత్రీకరణల గురించి చర్చించుకునేవారము. ఎంతో ఆనందంగా సరదాగా గడచిపోయేది కాలం.

ఈ వ్యాసాలు రాస్తోఅ నేను ఎంతగా ఆనందించేవాడినో పద్మకు మాత్రమే తెలుసు. రాయగానే తనకు వినిపించటమేకాదు, రాసిన వారం పదిరోజులవరకూ ఆ పాటలు పాడుతూండేవాడిని. వాటిగురించి పద్మకు చెప్తూండేవాడిని. వీడియోలు చూపుతూ చిత్రీకరణ, నటుల హావ భావాలు, గాయనీ గాయకుల చమత్కారాలు వివరిస్తూండేవాడిని. అదో ప్రత్యేక ప్రపంచం.

అందుకే, ఎప్ప్పుడయినా నేను కాస్త చిరాకుగావుంటే పద్మ, రసమయి ఆర్టికల్ రాయండి అని కోరేది.

అలా, సాహిర్, మజ్రూహ్, షకీల్, హస్రత్ లను పరిచయం చేశాను. చూస్తూ చూస్తూ, నాలుగేళ్ళు తిరిగిపోఅయాయి. ఆతరువాత రెండు చలన చిత్రోత్సవాల గురించి రసమయికి రాశాను.

నండూరివారి గ్రాం ఫోను కలెక్షన్ విన్నాను. వారి పుస్తకాలు చదివాను. వారి ఇంటికి వెళ్ళి కూచుంటే సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. ఎన్నెన్నో విషయాలను గ్రహించాను. నేను చాల తక్కువగా నవ్వుతాను. అలాంటిది వారి సమక్షంలో నవ్వుతూ నవ్వుతూ నేను కుర్చీలోంచి పడ్డ సందరెభాలున్నాయి. ఒకసారి టీవీలో వ్యంగ్య రచనల గురించి చర్చ జరిగినప్పుడు ఆయనను ఆహ్వానించాను. శ్రీరమణగారినీ ఆహ్వానించానుకానీ ఆయన తీరికలేదన్నారు. దాంతో నండూరి పార్థసారథి గారు, శ్రీరమణ గార్లను ఒకేవేదిక మీద చూసే భాగ్యం పోయింది.

ఇలా, ఆడుతూ పాడుతూ రాస్తూ పోతున్న నాకు ఆయన ఫోను చేసి వృధాప్యంవల్ల ఏప్రెల్ నెల నుంచీ రసమయి ఆపేస్తున్నాము. హస్ర్త ని ఏప్రిల్ నెలలోగా ముగించండి అని చెప్పారు.

నా గొంతులోని పాటనెవరో నొక్కిపట్టినట్టు అనిపించింది. అయితే, ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు. ఇంతయినా రాయగలిగాను నేను అనుకున్నట్టు అని సంతృప్తి పడ్డాను. ఈయనతో ఇంత మాత్రమయినా పరిచయం కలిగింది అని సంతోషించాను.

all good things must come to an end .కాబట్టి end ఈ రకంగా వస్తున్నందుకు సంతోషించాను. చివరి ఆర్టికల్ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా నేను వారింటికి వెళ్ళాను. చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇంటికి తిరిగి వస్తూంటే, మళ్ళీ ఇంత స్వేచ్చనిచ్చి నాకు నచ్చినట్టు నన్ను రాసుకోనిచ్చే ఎడిటర్ లభించటం   దుర్లభం అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే, ఈ వ్యాసాలు రాస్తూ నేనెంత ఆనందించానో, వాటిని ప్రచురిస్తూ ఆయనా అంతగా ఆనందించారు. పాటల సంగీతంపైనే వుండే నా దృష్టిని సాహిత్యంవైపు మళ్ళించావోయ్ అన్నారు. రచయితను ఇలా మనస్ఫూర్తిగా అభినందించే సంపాదకులూ దొరకటం కష్టమే. నా అదృష్టమేమో, నాకు మాత్రం అలాంటి సహృదయులే తారసపడుతున్నారు. నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నారు.

అందుకే, రసమయిలో లాగా మళ్ళీ రాసే అవకాషం దొరకదని తెలిసినా ఇక్కడితే ఈ అధ్యాయం ముగింది. ఇది నూతన అధ్యాయానికి నాంది అనుకుంటూ ముందుకు సాగాను. దారిలో సాహిర్ పాట పాడుకున్నాను.

ఎక్ రాస్తాహై జిందగీ జొ థం గయేతొ కుచ్ నహీ
యె కదం కిసీ ముకాం పే జొ జం గయేతొ కుచ్ నహీ

జీవితం ఒక ప్రయాణంలాంటిది. ఎక్కడాయినా ఆగిపోతే ఇది వ్యర్ధం. మనిషి ఏదో స్థాయిలో ఆగిపోతే ఈ ప్రయాణం వ్యర్ధం.

మనిషి జీవిత ప్రయాణంలో అనేక మజిలీలు వస్తాయి. కానీ అవేవీ అసలు గమ్యం కావు. ఇది గ్రహించి మనిషి ముందుకు సాగిపోతూనేవుండాలి.ఎక్కడా ఆగిపోకూడదు.

ఇల్లు చేరేసరికి ఈ భూమి సంపాదకుడు పోనుగోటి కృష్ణా రెడ్డి గారి నుంచి ఫోను వచ్చింది. వారికేదయినా శీర్షిక రాయమన్నారు. రకరకాల ఆలోచనలు దొర్లాయి. రసమయి గురించి చెప్పాను. హిందీ పాటలు తెలియనివారు, అప్పటికప్పుడు కాసెట్లు విని నోటికొచ్చినట్టు రాసేసి అదే గొప్ప అనుకుంటున్నారు. నువ్విలా మౌనంగా మూల వుండటం కుదరదు. మాకు పాటల గురించి రాయి. సాహిర్ తో ఆరంభించు. అయితే రసమయిలా నీ ఇష్టం వచ్చినంత రాసేవీలు లేదు. రెండే పేజీలు అన్నారు. ఫలితంగా ఏప్రిల్ నెల సంచికతో పాడుతా తీయగా శీర్షిక ఆరంభమయింది.

వెంటనే నా మదిలో ఒకపాట మెదిలింది.

బదల్ జాయే అగర్ మాలీ చమన్ హోతా నహీ ఖాళీ
బహారే ఫిర్ భి ఆతీహై, బహారే, ఫిర్ భి ఆయేంగే.

ఈ నెల శంకర్ జైకిషన్ గురించి రాస్తున్నాను. అది రాస్తూంటే, ఎందుకో ఈ పంక్తులు మెదలుతున్నాయి.

ఏక్ రాహ రుక్ గయీ తొ ఔర్ జుడ్ గయీ

మై ముడాతొ సాథ్ సాథ్ సాహిల్ భి ముడ్ గయీ

హవాకే పరోంపర్ మేరా ఆషియానా…..

మూతబడిన ఇంకో పత్రిక ఙ్నాపకాలు మరో పోస్టులో.

April 11, 2009 ·  · 11 Comments
Posted in: నీరాజనం