Archive for April 14, 2009

మిలే సుర్ మేరా తుమ్హారా! తో సుర్ బనే, హమారా!

నేను చాలా బిజీగా వున్నాను. తెల్లారితే రెండు రోజులపాటూ ఎన్నికల అధికారి ఖైదులో వుండాలి. అంటే, ఈవారం ఇవ్వాల్సిన రాతలన్నీ రేపు తెల్లారేలోగా పూర్తిచేయాలి. లేకపోతే గ్యాప్ వస్తుంది. నాకది ఇష్టం లేదు. అందుకని, ఏయే రాతలు తెల్లారేలోగా రాయాలి, ఏవి వచ్చిన తరువాత రాయవచ్చు అని ప్రయారిటీలు నిర్ణయిస్తున్నాను. పవర్ పాలిటిక్స్ తప్పని సరిగా రేపు తెల్లారి ఇచ్చేయాలి. లేకపోతే ఒక వారం స్కిప్ చేయాల్సివుంటుంది. కాబట్టి ఇవాళ్ళ ఇంక కంప్యూటర్ దగ్గరికే వెళ్ళద్దని అనుకున్నాను. మళ్ళీ శుక్రవారమే పురర్దర్శనమని నిశ్చయించుకున్నాను.

సీరియస్ గా పవర్ పాలిటిక్స్ కి కావలసిన సమాచారం సేకరిస్తూంటే, నా కంప్యూటర్ లోంచి, మన్ డోలే మెర తన్ డోలే పాట వినిపించింది. దగ్గరకెళ్తే, ఆశ్చర్యం! నేను వింటున్నది హిందీ పాట కాదు. తెలుగూ పాట! తనువూగే, నా మనసూగే అంటోంది గాయని.

కళ్ళు నులుముకుని చూశా!

ధీరేసే ఆజారి అఖియన్ మే నిందియా ఆజారే ఆజా, ధీరే సే ఆజా, అని మ్రుదు మధురంగా ఆలాపిస్తోంది లత!

ఒకప్పుడేమిటి, ఇప్పుడుకూడా, ఏమాత్రం అవకాశం వున్నా లతా స్వరాన్ని వివాహమాడాలన్న తీవ్రమయిన ఆశనాకుంది. అందుకే, ఎప్పుడు, ఎలా ఆమె స్వరం విన్నా ఒళ్ళు పులకరిస్తుంది. అలౌకికానందాల అర్ణవాల అనంత పాథోరాశితో అణువణువూ మధుర రస ప్రవాహమవుతుంది.

అయినా, తమాయించుకుని, చూడు లతా, నేనేదో నా మనసుకు నచ్చిన పాటలు పాడుకుంటూంటే, తెలుగని, హిందీ అనీ….

నా మనసులో మాట శబ్ద రూపం దాల్చకముందే లత, పాట అందుకుంది.

నీలాల కన్నుల్లో మెలమెల్లగా, నిదురా రావమ్మా రావే, నెమ్మదిగా రావే,

స్థాణువయిపోయాను. అదే రాగం. అదే బాణీ. అదే స్వరం. అదే మాధుర్య! భాష మారింది. అంతే తప్ప ఇంకా ఏమీ మారలేదు!

ఇంతలో, హాయి హాయిగా ఆమని పాడే, అని వినిపించింది. నా దృష్టి అటు మళ్ళింది.

కానీ, అక్కడ వున్నది రఫి, లతాలు. వాళ్ళు పాడుతున్నది, కుహూ కుహూ బోలే కోయలియా!

ఇటు చూసేసరికి, పీబీ శ్రీనివాస్, సుషీల లు బృందావనమది అందరిదీ, గోవిందుడు అందరివాడేలే, అంటున్నారు.

అంతలో, లతా, రఫీలు, బృదావంకా కృష్ణ్ కణయ్యా, సబ్కీ ఆంఖోంకా తారా అన్నారు.

ఆవైపు చూస్తే, రఫి, బార్ బార్ దేఖో, అన్నాడు.

ఈవైపూ రఫీనే, ఎంతవారు కాని, వేదాంతులయిన కానీ వాలు చూపు సోకగానే తేలిపోదురో అని కొంటెగా నవ్వాడు. హిందీలో కన్నా తెలుగూలో వగలెక్కువ వొలక బోస్తున్నాడు.

ఇంతలో, శంకర్-జైకిషన్ లు రామయ్యా వస్తావయ్యా అని ఆడుతున్నారు. అంతలో, యేకాంతమూ సాయంత్రమూ మది నీకై వేచేనూ, అన్న, యే శ్యాంకీ తణాయియా, అన్న హిందీ మెలోడీ తెలుగులో వినిపించింది.

మరో వైపు నుంచి తలత్ మహ్మూద్ పరుగున వచ్చి, అందాల సీమా సుధా నిలయం, ఈ లోకమే దివ్య ప్రేమ మయం, అన్నాడు.

సీ రాం చంద్ర వచ్చి, ఓ బేతాజీ, కిస్మత్ కి హవా కభి నరం, కభి గరం అనటం పూర్తి చేయకముందే, అంట్లు తోముతూ నాగ భూషణం, ఓ బుచ్చిబాబు, అరెవో చిట్టిబాబు, తలరాతతనకే తికమక, మక తికా అని నవ్విస్తున్నాడు.

దేవానంద్ కారులో పోతూ రైల్లో వున్న ఆశా పరేఖ్ ను చూసి జియవొ జియ కుచ్ బోల్దో అని ఏడిపిస్తూంటే, రమణారెడ్డి తలమీద గుడ్డ వేసుకుని, అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అని నవ్విస్తున్నాడు.

రాజేంద్ర కుమార్, తెరి ప్యారీ ప్యారీ సూరత్ కో, అని నాయిక వెంటపడితే, ఇక్కడ సుషీల తియ తీయని తేనెల పాటలతో అలరిస్తోంది.

ఎక్కడో అమర్ స్వప్న అని బెంగాలీ పాట వినిపిస్తూంటే, అది ఘంటసాల గొంతులో, నా హృదయంలో నిదురించేచెలీ అయిపోయింది.

నా తల తిరిగ్పోసాగింది.

లక్ష్మి-ప్యారే పరుగున వచ్చి చాహూంగ మైతుఝే, అంటూనే వున్నారు, ఆంజనేయస్వామి, సాకేత సార్వభౌమా, అనేశాడు.

రాజేష్ ఖన్నా వచ్చి మేరే సప్నోంకి రాని కబ్, అంటూనే వున్నాడు, నాగార్జున దూకి, నిన్ను క్లాసులోన చూసినది లగాయత్తు, అని రమ్యకృష్ణ వెంటపడ్డాడు.

రాం కరే ఐసా హోజాయే, అని ముఖేష్ ఏదో అనాలనుకున్నాడు. ఘంటసాల అతనికా అవకాశం ఇవ్వలేదు. పాడుతా, తీయగా చల్లగా అని మాధుర్యాంబుధిలో పరవశింపచేశాడు.

అంతలో నేను ఉలిక్కి పడేట్టు యమ్మా అని అరచి షమ్మీకపూర్ ఒక సారిగా రంగంలోకి దూకాడు. వెంటనే, సుషీల, గుమ్మ గుమ్మ గుమ్మా గుమ్మెక్కించే ముద్దుల గుమ్మ అని నృత్యం ఆరంభించింది.

ఇదంతా ఏమిటి? అని అడిగాను.

లతా నవ్వి పందిట్లో పెళ్ళవుతున్నదీ అని పాడింది. జిక్కి వెంటనే, రాజాకీ ఆయేగీ బారాత్ అంది.

తప్పు, తప్పు, మీరు తారు మారు పాడారు, అన్నాను, గొప్పగా.

కళాకారుల ప్రపంచంలో, భావమూ, హృదయమూ మాత్రమే ప్రాధాన్యం. మామూలు మనుషులే, నా భాష, నా సంగీతం, నా ప్రాంతం అని గోల పెడతారు. మేమంతా ఒకటే. మమ్మల్ని ఒకటిగానే చూడండి అన్నారందరూ ముక్త కంఠంతో.

అంతలో, చిత్రంగా, అందరి స్వరాలూ, కలసి పోయాయి. అన్ని భాషలూ కలసి సరస్వతీదేవిలో మిళితమయిపోయాయి.

అప్పుడు వెలువడిందోక మిళిత స్వరం.

మిలే సుర్ మేరా తుమ్హారా, తో సుర్ బనే హమారా!

నా స్వరమూ నీ స్వరమూ సంగమమై, మన స్వరంగా అవతరించే!

April 14, 2009 ·  · 5 Comments
Posted in: నీరాజనం