Archive for April 17, 2009

నేను- నా ఎన్నికల డ్యూటీ భావాలు!

 మన బ్లాగుకి మనమే సుమన్, రజనీకాంత్, అరుంధతి, చార్మీ, ప్రభాకర్లమే అయినా, బ్లాగులు బహిరంగ డయిరీల్లాంటివే అయినా, సంపాదకుల కత్తెరలు తాకలేని రచయిత రాతలే అయినా, మన బ్లాగురాతల వల్ల ఇతరులకు బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బ్లాగరుపయినా వుంటుంది. తన బ్లాగులో రాసిన రాతలు ఇతరులకు మనస్తాపం కలిగిస్తాయనిపిస్తే, నా బ్లాగు నా ఇష్టం అనుకోకుండా కాస్త సమ్యమనం పాటించాల్సి వుంటుంది. హక్కును కోరేముందు, బాధ్యతలు నెరవేర్చాలంటారు పెద్దలు. అలాగే, స్వాతంత్ర్యం అనుభవించాలంటే, దానికి తగ్గ అర్హత అయిన విచక్షణ వుండాలంటారు కూడా. అందుకే, ఈ నా పోస్టుకు ఎన్నిక డ్యూటీ లో నా అనుభవాలు అని కాకుండా నా భావాలు అని  నామకరణం చేశాను. ఎందుకంటే, నా అనుభవాలు ఉన్నవి ఉన్నట్టు రాస్తే అవి ఇతరులకు బాధ కలిగించవచ్చు. అందుకే, అనుభవాలుకాక, ఈ అనుభవాలవల్ల కలిగిన భావాలు మీతో పంచుకుంటాను. వ్యక్తిగత ప్రవర్తనలను ప్రస్తావించను. వారిపైన వ్యాఖ్యానించను. ఎవరిపైనా, ఎలాంటి తీర్పులను ప్రకతించను.

ఎన్నికల డ్యూటీ విజయవంతం కావాలంటే టీం వర్క్ తప్పనిసరి. కానీ, ఒక్క రోజు ముందు కలసిన వ్యక్తులు తెల్లారేసరికి కలసికట్టుగా పనిచేయాటం లో ఎన్నో సాధకబాధకాలున్నాయి. అయితే, సుఖాలు మనుషుల అహాన్ని పెంచితే, కష్టాలు మనుషులను దగ్గరచేస్తాయి. బహుషా అందువల్లనే ఏమో, అంతవరకూ ఎలాంటి పరిచయం లేని వారు కూడా, ఎన్నికల డ్యూటీలో ఒకేరకమయిన కష్టాలు అనుభవిస్తూ దగ్గరవుతారు. కలసి పని చేస్తారు.

15వ తారీఖు ఉదయం ఎనిమిది గంటల కల్లా అంబర్ పేట నియోజకవర్గంలో పనిచేసేవారంతా రెడ్డి కాలేజీకి రావాలని మాకు ఆఙ్నాపనలందాయి.

మరీ అంత ప్రొద్దున్నే వెళ్ళాల్సిన అవసరం లేదు, 12 లోపల ంవెళ్తే చాలని గతంలో బోలెడన్ని సార్లు ఎన్నికల డ్యూటీ చేసిన మితృడు అశోక్ కుమార్ చెప్పాడు. దాంతో, తీరికగా, పవర్ పాలిటిక్స్ పూర్తిచేసుకుని బయలుదేరాను.

పవర్ పాలిటిక్స్ ఆంధ్రభూమి ఆఫీసులో ఇచ్చేసి, పద్మను తన ఆఫీసుదగ్గర దింపి, వాళ్ళ ఆఫీసులోనే నా బండి పెట్టి, బస్సులో రెడ్డి కాలేజీ చేరుకున్నాను. అప్పటికి 10-30 అయింది.

అక్కడ ఒక పెద్ద జాతరలాగా వుంది. రెడ్డి కాలేజీ పక్క సందును పూర్తిగా మూసేసారు. ఒక పెద్ద షామియానా వేశారు. సందంతా వాహనాలతో నిండి పోయింది. పోలీసులు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఆ సమూహంలో దూరి, రెడ్డి కాలేజీలోకి అడుగుపెట్టాను.

బోలెడన్ని రిసెప్షన్ కౌంటర్లున్నాయి. నా ఆర్డరు చూపగానే మీ పోలింగ్ స్టేషన్ నంబరు 101, కౌంటరు నంబరు 9 కి వెళ్ళండి, అని చెప్పింది అక్కడ ఉన్న అమ్మాయి.

ఇక కౌంటరు 9 ని వెతుకుతూ బయలు దేరాను.

లోపల పెద్ద మైదానం వుంది. రెడ్డి కాలేజీలోకి వెళ్ళటం ఇదే ప్రధమం.

అమాయిల కాలేజీల చుట్టూ తిరిగే వయసులో, లైబ్రరీల్లో గడిపాను. పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ, రొమాంటిక్ కథలల్లుతూ బ్రతికాను. కాబట్టి,అమ్మాయిల కాలేజీలు ఎలా వుంటాయో చూడాలన్న కుతూహలం ఎప్పటినుంచో వుంది. అది ఇప్పుడు తీరింది.

లోపల మైదానం నిండా పెద్ద షామియానా వేశారు. జంపఖానాలు పరిచారు. టేబిళ్ళు వేశారు. వాటి ముందు జనాలు గుంపులు గుంపులుగా నిలబడి వున్నారు. జంపఖానాలపిన కూడా టేబిళ్ళు కుర్చీలున్నాయి. వాటిలోనూ జట్లు జట్లుగా కూచుని వున్నారు. అందరిముందూ గోనెసంచులున్నాయి. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ల డబ్బాలున్నాయి.

మైదానం ఎదురుగా, ఒక హాలుంది. దాన్లోనూ మనుషులున్నారు. గోల గోలగా సందడి సందడిగా వుంది.

ఎటువెళ్ళాలో తెలియలేదు. సరే సందడిగా వుందికదా అని హాలులోకి వెళ్ళాను.

హాళ్ళో మళ్ళీ బోలెడన్ని కౌంటర్లున్నాయి. అన్నిటి ముందూ గుంపులున్నాయి. అన్నీ చూస్తూ తిరిగాను. ఆ కౌంటర్ల ముందు వ్రేలాడదీసిన అట్టముక్కలపైన  పోలింగ్ బూతుల నంబర్లు వ్రేలాడదీసి వున్నాయి. వాటిని చూస్తూ 101 నంబరు కౌంటరు దగ్గరకు వెళ్ళాను.

ఈవీఎం లను ఇస్తున్నారు అక్కడ.

హాలంతా కలయచూసి, హడావిడి పడుతున్న వారిని చూసి అక్కడ నేను చేసేదేమీ లేదని గ్రహించి బయటకు నడిచాను.

బయట గోల భయంకరంగా వుంది. వెయ్యి మంది మనుషులు ఒకేసారి ఉత్తేజితులయి సంభాషిస్తూంటే ఎలా వుంటుందో ఊహించండి. దీనికి తోడుగా, మైకుల్లో కర్ణకఠోరంగా అనౌన్సుమెంట్లు.

పీ ఎస్ నంబరు 100, ప్రిసైడింగ్ ఆఫీసరు ఎక్కడవున్నా రావాలి. మీరు ఇంకో పది నిముషాలలో వచ్చి మెటీరియల్ తీసుకోకపోతే, మీరు ఉద్యోగవిద్గులు నిర్హహించలేదని మీ పైన చట్టరీత్య చర్య తీసుకోబడుతుంది. మీ ఆఫీసుకి తెలుపుతాము. మిమ్మల్ని ఉద్యోగమ్నుంచి తీసేస్తాము. కోర్తు చుట్టూ తిరగాల్సివుంటుంది. త్వరగా రండి.

ఇలా నుముష నిముషానికీ రాని వారి గురించి ప్రకటనలు, బెదిరింపులూ మైకులోంచి వినిపిస్తున్నాయి. ఈగోల, ఆగోల కలసి మహా గోల తయారయింది.ఆ మహా గోలలో నా తొమ్మిదవ నంబరు కౌంటరును వెతుకుతూ బయలు దేరాను.

అలా వెతుకుతూ వెళ్తూ ఎందుకో తల ఎత్తి చూసేసరికి, కాంపౌంద్ హాలుకవతల వున్న అపార్ట్ మెంటులోంచి అమ్మాయిలు కుతూహలంగా ఈ వైపు చూస్తూ కనిపించారు.

వీళ్ళంతా హాస్టలులో వుండే అమ్మాయిలన్నమాట!

ఈ గోలలో, ఈ హోరులో, ఈ మతిలేని అలజడిలో ఒక శీతల పవనం వీచినట్టయింది. ఎడారి నడుమ పూలగుత్తులు కనిపిస్తే ఎలావుంటుందో, అలా అనిపించింది.

ఇది కాక మరో ప్రపంచం బయట వుందని గుర్తుకు వచ్చింది.

వెతుకుతూంటే, ఒక మూల, ఓ టేబిలు కనిపించింది. అదే 9 వ నంబరు కౌంటరు.

వెళ్ళి నా ఉత్తరం చూపి, మా వారెవరయినా వచ్చారా? అని అడిగా.

సంతకం తీసుకుని వచ్చారు. ఈ గుంపుల్లో వెతుక్కోండి, అన్నారు.

వాళ్ళెవరో నాకు తెలియదు. 101 అన్న నంబరు ముఖాల మీద రాసివుండదు. ఎలా పట్టుకోవటం?

మా కిచ్చిన లెటరులో ఫోను నంబర్లు లేవు.

అందుకే, వారినే అడిగా. ప్రిసైడింగ్ ఆఫీసరు ఫోను నంబరు చెప్పండి, అని. వారు చెప్పారు.

ఫోను చేశాను. ఆమె ఫోనెత్తింది. నన్ను నేను పరిచయం చేసుకుని, ఎక్కడున్నారు? అని అడిగా, చుట్టూ చూస్తూ.

అక్కడున్న వాళ్ళంతా, సెల్లులలో మాట్లాడుతున్నారు.ఆమెతో అదే చెప్పాను.

అయితే, లేచి నిలబడి చెయ్యిఊపుతాను చూడండి, అంది.

చుట్టూ చూశాను. ఒక మారు మూల కనిపించిందామె. ఆవైపు వెళ్ళాను.

చిన్న విరామం. మిగతాది రేపు.

April 17, 2009 ·  · No Comments
Posted in: Uncategorized