Archive for April 18, 2009

ఈవారం నా రచనలు-7

ఎన్నికల హడావిడి అయిపోయింది.

ఎన్నికల డ్యూటీ చేసిన తరువాత రోజును పూర్తిగా నిద్రకు కోల్పోయాను. ఆ నిద్ర లేమినుంచి ఇంకా తేరుకోలేదు. అయితే, ఎన్నికల గొడవ లేదు కాబట్టి మళ్ళీ రొటీన్ లో పడుతున్నాను.

ఈవారం వార్తలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మైకెల్ మూర్ బ్లాగు పరిచయం వుంటుంది. నిజంగా, ఈయన ఎన్ని రకాలుగా వీలయితే అన్ని రకాలుగా సామాజిక మనస్సక్షిని తట్టి లేపాలని కృషి చేస్తున్నాడు. ఈయన బ్లాగును అమెరికా అధ్యక్షుడు సైతం చదువుతాడు.

ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషికి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. మనము ఒక పనిమనిషిని పనిలో పెట్టుకోవటానికి కూడా ఆమెని రకరకాల ప్రశ్నలు వేస్తాం. ఎన్నో జాగ్రతాలు తీసుకుంటాం. అలాంటిది, మన తలరాతను నిర్ణయించే రాజకీయనాయకుడిని మాత్రం వాడిగురించి ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎన్నుకుంటాం. ఎందుకు? ఇదీ సగటు మనిషి అస్వగతం ఈ వారం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన దేశ రాజకీయ చిత్రపట విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురుర్వారం చిత్రప్రభలో ఇంకా హాస్య సినిమాల విశ్లేషణ కొనసాగుతోంది. సినిమాల్లో స్క్రిప్తు రచయితలు సృజనాత్మకంగా హాస్యాన్ని ఎలా సృష్టించవచ్చు, వెకిలి చేష్టలు తాత్కాలికంగా నవ్వించినా ఎలా అది అపహాస్యమో వివరణవుంటుంది.

టూకీగా ఇవీ ఈవారం నా రచనలు. తీవ్రవాదం పుస్తకం ఈవారం ఎన్నికల దెబ్బ తిన్నది. ఆలస్యమయింది. ఈవారాంతానికయినా దాన్ని పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నాను.

ఈవారం నా రచనలు చదివి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ప్రార్ధన.

April 18, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

నేను- నా ఎన్నికల డ్యూటీ-2

నేను మా గ్రూపు దగ్గరకు వెళ్ళి, పరిచయాలు చేసుకున్నాను. మా గ్రూపుకు ప్రెసైడింగ్ ఆఫీసరయిన ఆనెకు గతంలో నాలుగయిదు ఎన్నికల అనుభవం వుంది. దాంతో ఆమె అన్నీ కలెక్ట్ చేసుకుని, సరి చూసుకుని కూచుంది. ఇక నాకు అక్కడ చేయాల్సిందేమీ లేదు. మధ్యాహ్న భోజనం చేసి బస్సుకోసం ఎదురుచూడటమే. బస్సు మమ్మల్ని మా పోలింగ్ స్టేషన్ కు చేరుస్తుంది. అయితే, మా 101 పోలింగ్ స్టేషన్ యే ఏరియాలోకి వస్తుందో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా వుంది.

నేను పద్మకు ఫోను చేసి నెట్ లో 101 చూసి అడ్డ్రెసు చెప్పమని అడిగాను. అయిదు నిముషాలలో తెలిసింది, మాకు కేటాయించిన, రాహుల్ కాన్వెంట్ స్కూలు, చెన్నా రెడ్డి నగర్, అంబర్ పేటలో వుందని. ఎప్పుడూ వినలేదాపేరు.

మా జట్టులో వాళ్ళందరి ఇళ్ళు, అక్కడికి దగ్గరలోనే అని చెప్పారు. వారికీ ఈ స్కూలు తెలియక పోయినా ఆ ఏరియా తెలుసట.

వాళ్ళు ముచ్చట్లు ఆడుతూంటే, నేను వాళ్ళను వదలి అందరినీ కలయ చూస్తూ నడిచాను. అందరూ జట్లుగా కూచున్నారు. మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఈ డ్యూటీ విసుగ్గానే వుంది. అందరూ ఎన్నికల కమీషన్ ను తిడుతూనేవున్నారు.

నాకింటిలో చిన్న పిల్లాడున్నాడు, ఒక్కడినీ ఎలా వదలి రావాలి? ఒకామె చెప్తోంది. ఆయనకు బైపాస్ అయింది, దగ్గరుండాల్సిన సమయమిది, అత్తయ్యగారి వొంట్లో బాగాలేదు, మా పాప నన్నొదిలి వుండలేదు, ఇలా ఎవరికివారు తమ కష్టాలు వెళ్ళబోసుకుంటూ సానుభూతి కోసం తహతహ లాడుతున్నారు.బాధలు చెప్పుకుంటూ అదోరకమయిన ఆనందాన్ని పొందుతున్నారు.

ఇదంతా చూస్తూంటే ఇంత మందిని ఇన్ని రకాలుగా బాధలు పెట్టటం కన్నా మరో రకమయిన పద్ధతి లేదా? అన్న ఆలోచన వచ్చింది. కానీ, ప్రస్తుతానికి ఇది తప్ప మరో పద్ధతీ లేదు. ఏమో, భవిష్యత్తులో, సాంకేతిక పరిఙ్నానం బాగా అభివృద్ధి చెందినప్పుదు, ఇలాంతి పద్ధతి పోయి, ఇంట్లోంచే వోట్లు వేసే పద్ధతి వస్తుందేమో. ఆరోజు త్వరగా వస్తే ఎంత బాగుంటుందో!

అంతలో మరో ఆలోచన వచ్చింది. ఈరకంగా ఎన్నికలను నిర్వహించటమూ అంత సులభం కాదు. ఆషామాషీ వ్యవహారం కాదు.

ముందుగా మనుషులు ఇల్లిల్లూ తిరిగి వోటర్ల జాబితా తయారు చేయాలి. ఫోటోలు తీయాలి. డాటా కంప్యూటర్లోకి ఎక్కించాలి. ఆతరువాత, నియోజక వర్గాలవారీగా పోలింగ్ స్టేషన్ లను నిర్నయించాలి. వాటికి తగ్గట్టు మనుషులను ఎన్నుకోవాలి. శిక్షణనివ్వాలి. యంత్రాలను తయారుచేయాలి. వలసిన కాగితాలు సిద్ధం చేసుకోవాలి. వోట్లను వేయించాలి. పోలింగ్ స్టేషన్లలో వసతులు సమకూర్చుకోవాలి. రక్షణగా పోలీసులను పిలవాలి.

ఇప్పుడు మేము రెడ్డి కాలేజీలో వున్నామంటే, మా కవసరమయిన వస్తువులివ్వటం, మా జాబితా తయారు చేసుకోవటం, నెళ్ళందించటం, భోజనం పెట్టటం, అందరి రూట్లను నిర్ణాయించి బస్సులను సమకూర్చటం. ఒకటేమిటి ఇదొక మహత్తరమయిన ప్రక్రియ. పూర్వకాలంలో రాజులు అశ్వమేధయాగాలు చేసేవారు. ఆధునిక కాలంలో ఎన్నికలు జరుపుతున్నారు.

అక్కడ నిల్చుని ఆ సందడి చూస్తూంటే, ఈ ప్రక్రియను నిరసించి, లోపాలెన్ని, తప్పులు చూపి హేళన చేయటం, వెక్కిరించటం, మనవాళ్ళింతే అని పెదవి విరిచేయటం అంత సమంజసం కాదేమో ననిపించింది. అదిలేదు, ఇదిలేదు, అది కుదరదు, ఇదికిదరదు, ఇది అలా చేసుండాల్సింది అంటూ ఎన్నెన్ని వంకలు పెట్టినా, ఎన్నెన్ని సన్నాయి నొక్కులు నొక్కినా, నిజంగా ఎన్నికలు నిర్వహించటం, అదీ సమర్ధవంతంగా, మన వ్యవస్థ గొప్పతనానికి, సామాజిక ఔన్నత్యానికీ నిదర్శనం అనిపించింది. లోపాలుండవచ్చు. ఎన్ని వున్నా ఈ స్థాయిలో అందరినీ సంతృప్తి పరుస్తూ ఎన్నికలు జరపటం సామాన్యవిషయం కాదు.

అక్కడ మనుషులను, ఆ గోలనూ, హడావిడినీ చూస్తూంటే, ఇది కేవలం అంబర్పేట నియోజక వర్గం గోల మాత్రమే. ఇలాంటివి దేశ వ్యాప్తంగా ఇంకా అనేకం వున్నాయి, అన్న ఆలోచన రాగానే ఎలక్షన్ కమీషన్ బాధ్యత గ్రహింపుకు వచ్చింది. అది తలచుకుంటూంటేనే నీరసం వచ్చింది.

అప్పుడప్పుడు, రాత్రిళ్ళు, వొంటరిగా, బాల్కనీలో పడుకుని ఆకాశంకేసి చూస్తూ, ఈ నక్షత్రాలు కొన్ని మిలియన్ మిలియన్ మైళ్ళ దూరంలో వున్నాయి, ఈ చిక్కటి చీకటి అంతా శూన్యం అన్న భావన కలిగినప్పుడు కలిగే నీరస భావన అది. ఎదురుగా అంతులేని సముద్రాన్ని చూస్తూన్నప్పుడు కలిగే భావన అది.

నీరసంతో కూలబడ్డాను. ఎలాగో అనిపిస్తోంది. మా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి లంచ్ కి చలో అన్నారు. వాళ్ళతో వెళ్ళాఅను.

రెడ్డికాలేజీ సందునంతా డైనిగ్ స్థలం లా మార్చేశారు. పది దాకా టేబిళ్ళు వేశారు. ప్రతి టేబిల్ ఎదురుగా నీళ్ళున్నాయి. చెత్తబుట్ట వుంది. జనాలు చీమల గుంపుల్లా టేబిళ్ళ చుట్టూ మూగారు. అది చూస్తూంటే ఎలాగో అనిపించింది.

నాకు గుంపుల్లో తినటం రాదు. నుంచుని, పళ్ళెం చేతిలో పట్టుకుని తినటం నచ్చదు. ఏదో తిన్నాననిపించాను. బస్సు సిద్ధంగా వుంది వెళ్ళండి అన్న ప్రకటన వినిపించింది.

అందరమూ, యంత్రాలూ మూటలూ తీసుకుని బయలు దేరాము. అలా అందరితోపాటూ అవి పట్టుకుని నడుస్తూంటే, నేను, నా ప్రత్యేకత కోల్పోయి, ఇసుక రేణువుల్లో రేనువునయిపోయానన్న భావన కలిగింది. అవును నేను ఇసుకరణువునే. కాదనుకోవటం నా అహంకారమేకదా!

ఇలా, ఈ సమయానికి పలుచోట్లనుండి పలువురు బయలుదేరుతూంటారు. కొత్త కొత్త స్థలాలకు వెళ్తారు. వోట్లు వేయిస్తారు. తిరిగి తమ తమ రొటీన్ జీవితాల్లో పడటారు.

ఏమిటిదంతా? ఎందుకిదంటా? నేనిక్కడేఅమిచేస్తున్నాను?

ఇలా రకరకాల ఆలోచనలు చుట్టుముటాయి.

బస్సుకదలింది.

దారిలోని మనుషులను చూస్తూంటే, నేను వేరే ప్రపంచంలో వున్నానన్న భావన కలిగింది. మళ్ళీ నా మామూలు జీవితానికి ఎప్పుడు వెళ్తానా, అన్న భావన కలిగింది. ఏదో నిరాషగా అనిపిస్తోంది. ఎందుకో విషాదంగా వుంది.

ఇంతలో, 94,95, 100, 101  పీ ఎస్ ల వారు దిగండి, అరిచారెవరో.

మావాళ్ళు గబగబా దిగుతున్నారు. నేనూ వారిని అనుసరించాను.

మిగతాది, కాస్త విరామంతరువాత.

April 18, 2009 ·  · No Comments
Posted in: Uncategorized