Archive for April 20, 2009

ఐపీఎల్-నాలుగాటల సమీక్ష!

ఐపీఎల్ క్రికెట్ పోటీలో ఇప్పటికి నాలుగాటలయ్యాయి. ఈ నాలుగులో మొదటి రెండు ఆటలు ఎంత ఆసక్తి కలిగించాయో, మిగతా రెండు ఆటలు అంత చప్పగా వున్నాయి. మన దేశంలో పోటీలు జరగపోవటం వల్ల టికెట్ కలెక్షన్లలో తేడాలు వుండొచ్చుగానీ, టీవీలో చూసేవారిలో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

మొదటి ఆటలో సచిన్ ఆట ఎంతో ఆనందాన్ని కలిగించింది. 20-20 ఆటలో కళ్ళుమూసుకుని బాటు వూపటానికి ప్రాధాన్యం వున్నా సాంప్రదాయిక ఆట తీరు, మెళకువలు, నైపుణ్యాల ఆవశ్యకతను స్పష్టం చేసింది సచిన్ ఆట తీరు. ఈ పోటీలలో రాణించటానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు సచిన్.

ముంబాయి గెలుపు సులభంగానే సాధ్యమయింది. ఆ ఆటలో సచిన్ తప్ప చెప్పుకోతగ్గ అంశం మరొకటి లేదు. ఆట చప్పగానే సాగినా సచిన్ ఆట ఆటస్థాయిని పెంచింది.

రెండవ ఆటలో షేన్ వార్న్ బౌలింగ్ చూస్తూంటే అద్భుతం అనిపించింది. ఇతను ఆటగాడా మాయల మాంత్రికుడా అనిపించింది. కొత్త ఆటగాళ్ళయితే, ఆయన వేస్తున్న బంతులేమిటో, ఎటు తిరుగుతాయో కూడా అర్ధం కానివారిలా కనిపించారు. ముఖ్యంగా, కుది వైపునుంచి వంకరగా ఎడమవైపు పడి, హఠాతుగా వికెట్ పైకి దూసుకువెళ్ళిన బంతి అయితే అమోఘం.

వార్న్ బంతులను చక్కగా ఎదుర్కోగలిగాడు డ్రావిడ్. అంతేకాదు, ఇంకా గోడలో శక్తి సన్నగిల్లలేదని నిరూపించాడు. ద్రావిడ్ ఆట తీరు పరమాద్భుతం. సాంప్రదాయిక ఆట పద్ధతిలోనే ఆడుతూ 48 బంతులలో 66 పరుగులు చేయగలగటం నిజంగా నైపుణ్యం వున్న ఆటగాడు సందర్భాన్ని పట్టి ఆటను మార్చుకోగలడని మరోసారి స్పష్టం చేసింది. అయితే, ద్రావిడ్ రక్షణగా ఆడుతూ, షాట్లు కొడుతూంటే ఒక మంచి ప్రకృతి దృష్యాన్ని చూసినట్టుంటుంది. అదే అతడు పళ్ళు బిగబట్టి, కళ్ళు మూసి బాతును ఊపుతూంటే, బుద్ధిమంతుడు అల్లరి చేయాలని ప్రయత్నించి భంగ పడ్డట్టుంటుంది.

ద్రావిడ్ ఆట చక్కటి ఫీలింగ్ కలిగిస్తే, కుంబ్లే బంతులు ఆశ్చర్యం కలిగిస్తాయి. వయసును బట్టి ఆటగాళ్ళు ఆటనుంచి విరమించుకోవాలని కోరటం సబబు కాదేమో అనిపిస్తుంది.

ఈ ఆట కూడా చప్పగానే సాగినా, వార్న్, ద్రావిడ్, కుంబ్లేల వ్యక్తిగత ఆట తీరు ఆట స్థాయిని పెంచి ఆనందం కలిగిస్తుంది.

ఈ విషయం మిగతా రెండు ఆటల గురించి అనలేము. పంజాబ్ జట్టు వర్షంలో కొట్టుకుపోతే, ఆ వర్షంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కురిపించటం సెహవాగ్ వంతయింది. కానీ, 12 ఓవర్లు, 6 ఓవర్లాటలు  ఆనందం అంతగా కలిగించవు. ఏమో, కొన్ని రోజుల్లో రెండోవర్లు, మూడోవర్లూ ఆడినా ఆశ్చర్యంలేదేమో!

డక్కన్ చార్జర్ల ఆట కూడా ఇంతే! రెండు ఓవర్లలోనే కలకత్తా వారి పని ఖతం అని తేలిపోయింది. నలుగురు కాదుకదా, 11 మంది కెప్టెన్లున్నా ఇలాంటి ఆట తీరువల్ల ఎలాంటి లాభంవుండదు. కాబట్టి, జట్టు సభ్యులలో పోరాట పటిమను పెంచే ప్రయత్నాలు చేయాలికానీ, ఎంత మంది కెప్టెన్లన్న మీమాంసలవల్ల మొదటికే మోసం వస్తుంది.

ఇంతవరకూ జరిగిన ఆటలు చూస్తే, క్రితంసారి దెబ్బ తిన్న జట్లన్నీ ఈసారి గతం తప్పులనుంచి పాఠాలు గ్రహించి తప్పులు దిద్దుకున్నాయనిపిస్తుంది. గెలవాలన్న పట్టుదలతో వున్నాయనిపిస్తుంది. కనీసం, ఓడినా, గౌరవంగా ఓడాలన్న ఆలోచన కనిపిస్తోంది. గత సంవత్సరం కోల్పోయిన పరువును నిలబెట్టుకోవాలన్న తపన కనిపిస్తోంది.

గతంలో  గెలిచి ఇప్పుడు దెబ్బ తిన్నవ్వారు, పట్టుదలకు వస్తే, గతంలో దెబ్బతిన్నవారు ఇప్పుడు గెలవాలన్న పట్టుదల కనబరిస్తే, ఇక రాబోయే ఆటలన్నీ దీపావళి సంబరాలే అనిపిస్తుంది. ఇది, ఎంతవరకూ నిజమవుతుందన్నది, ఇంకొన్ని ఆటలు చూస్తే తెలిసిపోతుంది.

కానీ, మన దేశంలో జరిగితే ప్రేక్షకులు చూపే ఉత్సాహం మాత్రం ఈ ఆటలలో కొరవడింది. టీవీల్లో చూసేవారి ఆనందాన్ని ఈ అమ్షంకూడా తగ్గిస్తుఓంది.

April 20, 2009 ·  · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్