Archive for April 24, 2009

నా సమస్యకు పరిష్కారాన్ని సూచించండి!

సాధారణంగా ఏ పత్రికకయినా శీర్షిక ఒప్పుకునేముందు నేను డెడ్ లైన్ అడుగుతాను. వారు చెప్పిన డెడ్ లైన్ కు ఒక అయిదు రోజులు ముందు నా వ్యక్తిగత డెడ్ లైన్ ను నిర్ణయించుకుంటాను. పద్మకు ఈ విషయం చెప్తాను. దాంతో, నా డెడ్ లైన్ కు ఒక వారం ముందునుంచే పద్మ నా వెంటపడుతుంది. అందువల్ల ఎడిటర్ లకు నన్ను మా శీర్షిక సంగతి ఏమిటి అని అడిగే వీలుండదు. అందుకే, ఇంతవరకూ ఒకేసారి ఎన్ని పత్రికలలో ఎన్ని విభిన్న శీర్షికలు నిర్వహిస్తూన్నా ఎప్పుడూ రాయటానికి నేను ఇబ్బంది పడలేదు. సరయిన సమయానికి ఆర్టికల్ అందించటంలోనూ ఇబ్బంది పడలేదు. నన్ను రాయమని అడగటానికే, వీడికి తీరుతుందో, లేదో అని మొహమాటపడతారు కానీ, నాకు 24 గంటలున్నాయనీ, ఇన్ని రాస్తూ చదువుతూన్నా, బోలెడంత సమయాన్ని నేను వ్యర్ధం చేస్తున్నాననీ అంటే ఎవ్వరూ నమ్మరు.
పైగా, ఏదిబడితే అది, ఎవరికి పడితే వారికి రాస్తాడు, అని ఈసడించేవారు, చులకనగా వ్యాఖ్యానించేవారూ వున్నారు.
ఫ్రీలాన్సర్ గా వీలయినన్ని ప్రక్రియలలో వీలయినంతమంది పాఠకులను చేరాలని అనుకోవటంలో తప్పేమిటో నాకు ఇప్పటికీ అర్ధం కావటంలేదు. కానీ, నేను ఏదో ఒక రకమయిన రాతకు పరిమితం కాకపోవటాన్ని ఒక లోపంగా భావించేవారే ఎక్కువ. వారందరికీ, నాదోకటే సమాధానం.

మనిషి మేధ అపరిమితమయినది. దానికి ఆకాశమే హద్దు. కానీ, తరచిచూస్తే, ఈ హద్దుకూడా మనపైన మనము స్వచ్చందంగా విధించుకున్న పరిమితేతప్ప భగవంతుడు విధించిందికాదు. ఎందుకంటే, నిజానికి అక్కడ ఆకాశం వుందనుకుంటున్నాం కానీ, ఆకాశం అన్నది లేదు. కాబట్టి రాస్తే ఒక్క కథలో, నవలలో, వ్యాసాలో, విమర్శలో మాత్రమే రాయాలన్న అభిప్రాయాన్ని నేను మన్నిస్తూనే వ్యతిరేకిస్తాను. అవి మాత్రమే రాయగలిగినవారు అవే రాస్తారు. ఎన్నెన్ని రకాలుగా రాయగలిగితే అన్నన్ని రకాలుగా రాయాలి. సూర్యకిరణాలను ఒకేచోటా ప్రసరించమై ఆౙ్నాపించటం తప్పు. అలా చేయగలిగితే శక్తివంతమయిన లేజర్ బీం తయారవుతుంది. దాని వాడకంలో విచక్షణ లేకపోతే అనర్ధం.

అయితే, మౌలికంగా, నేను సృజనాత్మక రచయితను. నాకు కథలు, నవలలు రాస్తే వున్న సంతృప్తి ఇతరాలలో వుండదు. కానీ, రాయటం నాకు వూపిరి వంటిది. ఏది రాసినా ఆనందం కలుగుతుంది. అందుకే, ఎవరయినా నన్ను ముందు శీర్షిక రాయమనగానే నేను నవల, కథల ప్రసక్తి తెస్తాను.

దివ్యధాత్రి పత్రిక ఎడిటర్ శివప్రసాద్ ఫోను చేసి వారి పత్రికకు ఏదయినా శీర్షిక రాయమని అడిగినప్పుడూ నవల రాస్తానన్నాను. నాకు, వ్యాస రచయితగా మాత్రమే గుర్తింపు పొందటం ఇష్టం లేదు. కానీ, అనేక కారణాలవల్ల నా సృజనాత్మక రచనలను పట్టించుకోవటంలేదెవ్వరూ. దాంతో, కాల్పనికేతర రచయితగానే అందరికీ అవసరమవుతున్నాను.

దివ్యధాత్రి పత్రిక, సామవేదం షణ్ముఖ శర్మ  గారి రిషిపీఠం పత్రికకు చెల్లి వంటి పత్రిక. రిషిపీఠం ఆధ్యాత్మిక పత్రిక. దివ్యధాత్రి దేశభక్తి పత్రిక. ఇందులో, దేశంలోని వివిధ మందిరాల పర్యటన గురించి రాయమని అడిగారు శివప్రసాద్.

ట్రావెలాగ్ ఇంతకు ముందు ఆంధ్రప్రభ లో రాశాను. నా ట్రావెలాగ్ ఇతరుల రాతలకు భిన్నంగా వుంటుంది. నేను, మామూలు వివిరాలకు ప్రాధాన్యం ఇవ్వను. ఆయా ప్రదేశాల పర్యటనలో కలిగిన మానసికానుభూతులకే పెద్దపీట వేస్తాను. ఈ రకంగా ఆంధ్రప్రభలో రాసి మంచి మెప్పు పొందాను. అప్పుడు ప్రభ ఆగిపోవటంతో ఆ శీర్షిక కూడా ఆగిపోయింది.

అందుకే, శివప్రసాద్ అలాంటి శీర్షిక అడగగానే నా నియమాలు, నిబంధనలూ అన్నీ చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. ఐతే, నాకు కాల్పనికేతర రచనలు చేయాలని లేదు. అందుకని ఏవేవో అభ్యంతరాలను సృష్టిస్తూ వచ్చాను.

నా అభ్యంతరాలన్నిటినీ పద్మ పక్కకు నెట్టింది. సామవేదం గారికి మీరు రాయాల్సిందే. కావాలంటే, ఇతర శీర్షికలేవన్నా మానండి. అని ఆఙ్నాపించింది. పద్మ ఆఙ్నను శిరసావహించాను.

దివ్యధాత్రిలో శీర్షికకు మంచి స్పందన వస్తోంది. ఈ శీర్షికతో పాటుగా, నా కాల్పనిక రచన కుతిని తీర్చుకోవటానికి నేనే మరో శీర్షికను సూచించాను. అప్పటికి వార్తలో రియల్ స్టోరీలు రాస్తున్నాను. అవన్నీ విదేశీయుల జీవితానుభవాల ఆధారంగా రచిస్తున్నవి. దివ్యధాత్రికి భారతీయుల దివ్య వ్యక్తిత్వాలను పరిచయం చేస్తానన్నాను. భారతీయ వ్యక్తిత్వం అనగానే, రాముడు, కృష్ణుడు, సీత , సావిత్రి లాంటి వ్యక్తిత్వాలే గుర్తుకు వస్తాయి. ఇందుకు భిన్నంగా, మన పురాణాలలో, చరిత్రలో మరుగున పడివున్న అత్యద్భుతమయిన వ్యక్తుల అత్యంత అనుసరణీయమయిన వ్యక్తిత్వాలను ఆధునిక సమాజానికి అనువుగా అన్వయించి ప్రకటిస్తానని అన్నాను. ఆయన ఒప్పుకున్నారు.

నా అదృష్టం ఎలాంటిదో కానీ, నేను ఈ శీర్షిక రాస్తాను అంటే ఎవ్వరూ కాదనరు. నాకు పూర్తి స్వేచ్చనిస్తారు. నన్ను క్రిందకు తోయాలని ప్రయత్నించే పదిమంది ప్రయత్నాలనూ ఇలా ప్రోత్సాహం ఇచ్చే ఒక్కరివల్ల తిప్పికొట్టగలుగుతాను.

ఆంధ్రభూమి, వార్త, జాగృతి, రసమయి ఇలా నేను ఏ పత్రికకు సన్నిహితుడినయితే, ఆయా పత్రికలలో నాకు పూర్తి స్వేచ్చ లభిస్తోంది. దివ్యధాత్రిలోనూ అలాగే స్వేచ్చ లభించింది.

అయితే, నేను రాస్తున్న ట్రావెలాగ్ శీర్షికలో ఒక నెల వేరే ఎవరిదో వ్యాసం ప్రచురించారు.

నాదొక నియమం వుంది. నేను రాసే శీర్షిక సంపూర్ణంగా నేనే రాస్తాను. మధ్యలో ఎవరయిన దూరితే నేను ఆ శీర్షిక ఆపేస్తాను. నాకంతగా గుర్తింపులేని కాలంలోనే, నాలుగేళ్ళుగా రాస్తున్న సినీ సమీక్షల శీర్షికను, మధ్యలో వేరే వారి సమీక్ష వేశారని మానేశాను. ఇప్పటివరకూ మళ్ళీ సమీక్షలు రెగ్యులర్ గా రాయటంలేదు.

సాధారణంగా ఏ శీర్షిక ఎవరితో రాయించాలన్న నిర్ణయం ఎడిటర్ దే. కానీ, ఏ శీర్షిక రాయాలో వొద్దో నిర్ణయించుకునే హక్కు రచయితది. నా హక్కును నేను వదలుకోను.
వదలుకున్నా, స్వచ్చందంగా వదలుకుంటాను తప్ప ఒత్తిళ్ళకు లొంగి వదలుకోను.

ఆ శీర్షిక ఇక నేను రాయనని శివప్రసాద్ తో చెప్పేశాను. ఇంకా ఏదయినా రాయమని అడిగినప్పుడు చారిత్రాత్మక నవలను ప్రస్తావించాను.

ఈ నవల ఆలోచన కొన్నేళ్ళుగా రగులుతోంది.

దక్షిణ భారత దేశంలో అడుగుపెట్టిన మొదటి ఇస్లాం వీరుడు మాలిక్ కాఫుర్. అతని దండయాత్ర వల్ల భారతీయ సామాజిక మనస్తత్వంలో కలిగిన మార్పులు, అతడి దండ యాత్రను, భౌతికంగానే కాదు, మానసికంగా భారతీయ సమాజం ఎదుర్కొన్న విధానాలను నవల రూపంలో రాయాలన్న ఆలోచన ఎప్పటినుంచో వుంది.

ఇప్పుడు చారిత్రిక నవలలెవరికి కావాలి, అని కొందరు నిరాకరించారు. ముస్లీం దండయాత్రల గురించా, ఒద్దు, అనవసరమయిన గొడవలు, అని మరికొందరు తిరస్కరించారు. మీరు హిందువుల తిట్టండి, ఇస్లామీయులను విమర్శిస్తే మిమ్మల్ని ఏమనరు. పత్రికలపై దాడులు చేస్తారు అని భయపడ్డారు ఇంకొందరు.

చరిత్రలో జరిగినది జరిగినట్టు, కాస్త కల్పనను జోడించి రాస్తానంటే ఇంతగా భయాలెందుకో అనిపించింది.

జాగృతి ఎడిటర్ రామ మోహన రావు గారికి నచ్చింది కానీ, అప్పటికే, జాగృతిలో భారతీయ వ్యక్తిత్వ వికాసం, కథా సాగర మథనాలు రాస్తున్నాను. ఒకరకంగా, నా కాల్పనికేతర శీర్షికలు నా కాల్పనిక రచనలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. అవి మానలేను. ఇవి వదలలేను.
ఈ పరిస్థితుల్లో, దివ్యధాత్రిలో నవల అనగానే ఈ ఆలోచన చెప్పాను. సామవేదంగారితో చర్చలు జరిగాయి. ఎలాంటి సంకుచితత్వం, ద్వేషమూ లేకుండా రాస్తానని నా ప్రణాళికను చెప్పాను. నవలకు ద్రష్ట, అని పేరు పెట్టింది ఆయనే.

అలా ఆరంభమయింది దివ్య ధాత్రిలో నా నవల ద్రష్ట.

ఈ నవల రచనకోసం బోలేడంత సమాచారం సేకరించాను. ఆనాటి సామాజిక పరిస్థితులను, మనస్తత్వాలను తెలుసుకునేందుకు, మన సాహిత్యంతోపాటూ, ఫరిష్తా, బరోని లతో సహా, యూరోపియన్ల రచనలూ చదివాను. ముఖ్యంగా, విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించి, గూఢచార రిపోర్టులిచ్చిన యూరోపియన్ల రచనలు ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపాయి. మన సమాజంలోని మార్పులకు అద్దం పట్టేఅ అమ్షాలను గ్రహించాను.

నవలకు అవసరమయిన తాత్వికాంశాల కోసం విశిష్టాద్వైత గ్రంథాలు, చర్చలు అద్వైత వాదనలు, ఆకాలంలోని తత్వవేత్తల జీవితాలు తెలుసుకున్నాను. ఎందుకంటే, నా నవలలో ద్వైత, విశిష్టాద్వతుల మధ్య చర్చలుంటాయి. నవలలో ప్రధాన ఘట్టం, శ్రీరంగం మందిరంలో 50 మంది వేదపండితుల ఊచకోత. వారిలో సుదర్శనసూరి వుంటాడు. ఈయనతో చర్చించేందుకే హీరో వారణాసినుంచి బయలుదేరతాడు. మాలిక్ కాఫర్ దండయాత్రను కళ్ళతో చూస్తాడు.అంటే, నా నవల factual account of historical facts shown through the eyes of a fictitious character అన్నమాట.

నవల రచన ఆరంభించాను.  నవలకు మంచి స్పందన లభిస్తోంది. శివప్రసాద్ సంతోషించాడు. నాకూ, ఎంతో ఆనందంగా, సంతృప్తిగా వుంది.

ఒక రచన సంపాదకుడికి నచ్చక పోవచ్చు. పాఠకులు మెచ్చక పోవచ్చు. కానీ, రాస్తున్న రచయిత మనసుకు తన రచన రచన విలువ తెలుస్తుంది. అలాంటప్పుడు ఎవరి మాటనూ రచయిత లెక్కచేయడు. అనేక సందర్భాలలో నేను రచనల విషయంలో రాజీ పడాక పోవటానికి ఈ విశ్వాసమే కారణం. అనేక సందర్భాలలో నా పట్టుదల సరయినదే అని రుజువయింది కూడా.

ద్రష్ట విషయంలోనూ అదే జరుగుతోంది. దివ్యధాత్రి తక్కువమంది పాఠకులకు చేరుతూన్నా, చదివిన వారందరి మెప్పు పొందుతోంది.

ఇంతలో, శివప్రసాద్ ఫోను చేసి, నష్టాలొస్తున్నాయని దివ్యధాత్రిని మూసేస్తున్నాం అని చెప్పాడు.

నాకేమనాలో తోచలేదు. నా తొలి ఆలోచన ద్రష్ట గురించి.

వ్యక్తిగతంగా, రచయితగా నాకు సంతృప్తినిస్తున్న రచన ఇది. ఇది మొదలుపెట్టినప్పటినుంచీ ఇన్ని అడ్డంకులేమిటి?

ఇప్పుడీ నవలను వేరే పత్రికకు ఇవ్వలేను. ఆపేయలేను. వ్యర్ధంగా వదిలేయలేను.

నవలను నేనే డైరెక్టుగా పుస్తకరూపంలోకి తేవాలి. లేకపోతే వదిలేయాలి. పుస్తకరూపంలో తేవాలంటే బోలేడన్ని సాధక బాధకాలున్నాయి. పైగా చారిత్రిక నవల కాబట్టి బోలెడన్ని అపోహలూ వుంటాయి. ఇదీ నా ఆలోచన.

నవలను పుస్తకంలా అన్నా తేవాలి. లేకపోతే, నా బ్లాగులో సీరియల్గా ప్రచురించాలి. తరువాత సంగతి తరువాత ఆలోచించవచ్చు. కనీసం, నవల పదిమందిని చేరిందన్న సంతృప్తి వుంటుంది. బ్లాగరుల ప్రతిస్పందనను బట్టి తరువాత ఏమిచేయాలో ఆలోచించవచ్చు.

దివ్యధాత్రి మూతపడటంవల్ల నాకు కలిగిన కష్టం ఇది. ఇంకా ద్రష్ట విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను.

ఇంతా చదివారుకదా! మీరేమటారు?

April 24, 2009 ·  · 9 Comments
Posted in: Uncategorized, నా రచనలు.