Archive for April 29, 2009

భలే మాంచి చౌక బేరమూ!

భలే మంచి చౌక బేరమూ, ఇది సమయమున్ మించినన్ దొరుకదు, త్వరన్ గొనుడు సుజనులార భలే మాంచి చౌక బేరమూ!!1

నిజంగానే ఇది భలే మంచి చౌక బేరమే!

నేను రచించిన పుస్తకం తీవ్రవాదం ప్రింటుకు వెళ్ళిపోయింది. పాలపిట్ట ప్రచురణలీ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.

నేను ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో, సెప్టెంబర్ 2001 కన్నా ముందునుంచీ తీవ్ర వాదం వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చ రిస్తూ రాసిన వ్యాసాలున్నాయి.

తీవ్రవాదం నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి.

అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా మన దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి.

మొత్తం 36 వ్యాసాలున్నాయీ సంకలనంలో. 2000 నుంచి 2008,31 డిసెంబరు  వరకు తీవ్రవాదానికి సమబంధించిన వ్యాసాల సంకలనం ఇది. ఇందులో కాశ్మీర్ తీవ్రవాదానికి సమబంధించిన రెండే వ్యాసాలున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ కు సంబంధించిన వ్యాసాలే 90 పేజీలు దాటాయి. ఇవన్నీ, భారతీయ సమస్యలకు సమబంధించిన వ్యాసాల సంకలనంలో జోడించటంతో పునరుక్తిని తప్పించుకొనేందుకు ఈ సమకలనంలో చేర్చలేదు.అదీకాక, ఇప్పటికే 264 పేజీలయింది పుస్తకం. వెల 100/- మాత్రమే. ఇంకా పేజీలు పెరిగితే వెల పెంచాల్సివస్తుంది. అందుకనే కాశ్మీర్ వ్యాసాలని ఈ పుస్తకంలో చేర్చలేదు.

అయితే, పాలపిట్ట ప్రచురణలవారు ఈ పుస్తకాన్ని ప్రె- పబ్లికేషన్ ఆఫర్ గా 75/- కే ఇవాలని సంకల్పించారు. పుస్తకం కావాల్సినవారు సంప్రతించవలసిన చిరునామా;-

పాలపిట్ట ప్రచురణలు
16-11-20/6/1/1
403, విజయ సై రెసిదెంచ్య్
సలీం నగర్, మలక్పేట్
హైదరాబాద్-500036.
సెల్ నంబర్;- 9848787284.

ఈ భలే మంచి చౌక బేరావకశాన్ని వినియోగించుకుంటారనే ఆశిస్తున్నాను.

పుస్తకం చదివిన తరువాత మీ సలహాలు, సూచనలు, నిర్మొహమాటమయిన అభిప్రాయాలను తెలియపరచాలని ప్రార్ధన.     Power- Plolitics Title.pmd

April 29, 2009 ·  · 3 Comments
Posted in: నా రచనలు.

మన టీవీ విశ్లేషకులకు క్రికెట్ ఆట తెలుసా?

టీవీ చానెళ్ళలో ఐపీఎల్ క్రికెట్ పోటీల ఆటల విశ్లేషణలు వింటూంటే ఈ సందేహం పదే పదే కలుగుతోంది. తెలుగు చనెళ్ళలోనే కాదు, ఇంగ్లీషు చానెళ్ళలో కూడా, గతంలో క్రికెట్ ఆట ఆడినవారు కూడా చేసే వ్యాఖ్యలు వింటూంటే, వీరు క్రికెట్ ఆట కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తుంది.

నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ ఆట అత్యద్భుతం. బంతిని ఎంత కసిగా కొట్టాడంటే, ఇంకాస్త  బలము ఉపయోగించి కొడితే బంతి బోఉండరీనేకాదు, సముద్రాలు దాటి మన దేశంలో వచ్చి పడుతుందేమో అనిపించింది. ఒక ఆటగాడు అలా ఆడుతూంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలాంటి సమయంలోనే కెప్టేన్ చాతుర్యం తెలిసేది.

కెప్టేన్ తన బవులర్లతో మాట్లాడాలి. వారికి ధైర్యాన్నివ్వాలి. బంతులను యార్కర్లుగా వేయాలని చెప్పాలి. అవసరమయితే, ఓవరుకు ఆరుబంతులూ యార్కర్లే వేయమనాలి. స్పిన్నర్లకు, కూడా, బంతులను దాదాపుగా బాటు క్రిందకు వేయమనాలి. దాంతో ఆటగాడు ఆత్మ రక్షణలో పడతాడు. ఇష్టమొచ్చినట్టు కొట్టలేదు. పైగా, ఆసమయానికి రాజస్థాన్ వారు అయిదు వికెట్లు కోల్పోయి వుండటంతో, ఆటగాడు తప్పనిసరిగా వికెట్ కాపాడుకోవటం పైన దృష్టి పెట్టాల్సివుంటుంది.

మన విశ్లేషకులెవ్వరూ ఈ విషయం ప్రస్తావించటంలేదు. గతంలో అనేక మార్లు స్టీవ్ వా ఇలాంటి పద్ధతులద్వారా అపజయాలనుంచి విజయాలు సాధించాడు. ఈ విషయాలు చర్చించేబదులు, మన వారు మెక్ గ్రాత్ ని కూచోబెట్టారు, కాలిగ్ వుడ్ ని ఆడనీయటం లేదు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా డిల్లీ జట్టులో భవిష్యత్తులో ఉపయోగపడే surprise ఆటగాళ్ళు. ఈ ప్రణాళికను అర్ధం చేసుకోకుండా, అక్కడికి ఆడుతున్నవారికి చేతగానట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చేతకాని జట్టుతోటే ఇంతవరకూ డిల్లీ జట్టు గెలుస్తూవస్తోంది. ఒక ఆటలో దెబ్బ తినగానే పనికిరానివారన్నట్టు వ్యాఖ్యానించటం అర్ధం లేనిది. రాబోయే రెండవ భాగం ఆటలలో మెక్ గ్రాత్ ఆడతాడు. అప్పటికి అతను ఫ్రెష్ గా వుంటాడు. ప్రభావం చూపుతాడు.

ఇదే ఆటలో గ్రేం స్మిత్ గురించి మన మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆట గురించి తెలియని వారు చేయాల్సిన వ్యాఖ్యలవి. గ్రేం స్మిత్ సరిగా ఆడలేకపోతున్నాడు. దాని ప్రభావం రాజస్థన్ జట్తు అనుభవిస్తోంది. కాబట్టి ఈసారయినా సరిగ్గా ఆడాలని నిశ్చయించుకునివుంటారు. కనీసం త్వరగా అవుటవద్దని నిర్ణయించుకుని వుంటారు. 20-20 ఆటలోనేకాదు, ఏ ఆటలోనయినా ఆరంభ ఆటగాళ్ళపైన బాధ్యత ఎక్కువ. వారిచ్చే ఆరంభంపైనే జట్టు పరుగులు సాధించటం వుంటుంది. కాబట్టి ఒక ఆరంభ ఆటగాడు త్వరగా అవుటయిపోతే, ఇంకో ఆటగాడు ఆత్మ రక్షణతో ఆడాల్సి వుంటుంది. పరుగులు వేగంగా తీయకున్నా ఒక వైపు వికెట్ పోకుండా ఆపాల్సివుంటుంది. ఇది తరువాత వచ్చే ఆటగాళ్ళలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వారు షాట్లు కొట్టి రిస్కు తీసుకుంటారు. తగిలితే గెలుపు, లేకపోతే ఓటమి. కానీ, ఒక వైపు ఒకరు అవుట్ కాకుండా నిలబడటం తప్పనిసరి. ఇద్దరు ఓపెనర్లు అవుటయితే అప్పుడు వన్ డౌన్ ఆటగాడు ఈ బాధ్యతను నిర్వహిస్తాడు.

అందుకే, నిన్నటి ఆటలో యూసుఫ్ పఠాన్ చెలరేగి విజయాన్ని సంభవం చేయటం ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, మరో వైపు గ్రేం స్మిత్ నింపాదిగా ఆడటమూ అంతే ప్రాధాన్యం వహిస్తుంది. ఇందుకు భిన్నంగా అతడు అవుటయిపోయుంటే, పఠాన్ కు పార్ట్నెర్లు మిగిలేవారుకారు. ఇంతకు ముందు అనేక ఆటల్లో ఇది జరిగింది. అందుకు ఈ సారి స్మిత్ ఆట ఎంతో ప్రణాళికానుసారంగా ఆడింది.

కానీ, మన విశ్లేషకులు స్మిత్ ను దుయ్యబడుతున్నారు. స్మిత్ వేగంగా పరుగులు తీయాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. గమనిస్తే, రెండు సార్లు పఠాన్ కాచవుటబోయి తప్పించుకున్నాదు. అతడు అవుటయినా, తరువాత వచ్చే ఆటగాడికి స్మిత్ ను చూసి ధైర్యం వచ్చేది, వెగంగా పరుగులు తీసే ప్రయత్నాలు చేసేవాడు. కనీసం ఒకవైపు వికెట్ భద్రంగా వుందికదా అన్న ధైర్య అది. ఇక్కడ ఓటమి కన్నా, విశ్వాసం ప్రాధాన్యం వహిస్తుంది. విశ్వాసం అపజయాన్ని విజయంగా మారుస్తుంది. నిన్నటి ఆటలో జరిగింది అదే. మెరుపులు కురిపించిన పఠాన్ విజయానికి ఎంత కారకుడో, నింపాదిగా ఆడిన స్మిత్ కూడా అంతే కారకుడు.

ఇది అర్ధం చేసుకోకుండా మన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించటం చూస్తూంటే, వీరికి క్రికెట్ అసలు తెలుసా? అన్న సందేహం వస్తోంది. ఇది మన ప్రేక్షకుల అభిప్రాయాలను ఏర్పరుస్తుందని గమనిస్తే, క్రికెట్ ఆట అంటే సిక్సులు-ఫోర్లే అన్న అభిప్రాయం ఎందుకు స్థిరపడుతోందో అర్ధమవుతుంది.

April 29, 2009 ·  · 3 Comments
Posted in: క్రికెట్-క్రికెట్