Archive for May, 2009

ఈవారం నా రచనలు-13

సమయం గడచిపోతోంది. కాలం గిర్రు గిర్రున తిరుగుతోంది. పనులు చేస్తూనే వున్నా చేయాల్సిన పనులు బోలెడన్ని మిగిలిపోతున్నాయి. అయినా, అర్ధరాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూంటే, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ప్రపంచమెంత అందమయినది కదా అనిపిస్తుంది. కొత్త ఉత్సాహంతో మరిన్ని పనులు చేయటానికి ఉపక్రమిస్తాను.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో హర్ భజన్ సింగ్ బ్లాగు పరిచయం వుంటుంది బ్లాగ్ స్పాట్ శీర్షికలో.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ఈవారం ఆలోచన పుస్తకాల గురించి. ఈమధ్య కొందరు అచ్చు పుస్తకాల పనయిపోయిందని, ఇక పైన ఈబుక్స్ దే ప్రాధాన్యమనీ అంటున్నారు. అచ్చు పుస్తకాలు అదృష్యమయిపోతాయన్న భావన సగటు మనిషి మనస్సులో కలిగించిన సంచలనాలాలోచనలను ప్రతిబింబిస్తుంది సగటు మనిషి స్వగతం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో ఈవారం ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం అనుబంధం చిత్రప్రభలో బాల సినిమాల స్క్రిప్టు రచన వొశ్లేషణ కొనసాగుతుంది.

ఈనెల విడుదలయ్యే ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన ప్రఖ్యాత గాయకుడు, తగిన గుర్తింపు పొందని మహా గాయకుడయిన మన్నాడే పరిచయం వుంటుంది. నిజానికి ఇప్పుడు మన్నాడేని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మన్నాడే పాడే పద్ధతిని వివరిస్తూ, అతనెందుకు అంతగా విజయం సాధించలేకపోయాడో వివరించానీ వ్యాసంలో.

కౌముడు పత్రికలోని కథాసాగర మథనం శీర్షిక గురించి నాకు మంచి స్పందన లభిస్తోంది. ఏప్రిల్ నెల లోని 90 పైగా కథలను చదివి వాటిలోంచి బాగున్న కొన్ని కథలను, ఒక ఈనెల కథనూ ఎన్నుకున్నాను. ఈ శీర్షిక కథారచయితలకే కాక, కొత్త కథల విశ్లేషణ కావటంతో విమర్శకులకూ, సంకలన కర్తలకూ ఉపయోగకరంగా వుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తీవ్రవాదం పుస్తకం, అచ్చయి, బైండయి, ముస్తాబయి వచ్చేసింది. ఇక పాథకుల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు తక్కువే. ఇందియా టుడే తెలుగులో వస్తున్నాప్పుడు, తెలుగులో రాజకీయ పత్రిక నిలబడలేదని కూదా పలువురు అభిప్రాయపడారు. అయినా, తెలివయినవారు వెళ్ళేందుకు జంకే బాటలో మూర్ఖుడు పరుగిడతాడన్నట్టు, నా వంతు ప్రయత్నంగా పుస్తకాన్ని వెలువరించాను.

ఇవీ, ఈవారం నా రచనలు. చదివి, మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆసిస్తున్నాను.

May 31, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

పుస్తకాలు- సమీక్షలూ!

ఒక పుస్తకం ప్రచురితమయిందని పాఠకులకు తెలిసేందుకు పత్రికలలో సమీక్షలే ప్రాధాన సాధనమని తెలుసుకున్నాం.

పత్రికలలో సమీక్షలలో వున్న మతలబులగురించి చర్చించేబదులు, సమీక్షల ప్రభావం గురించి చర్చిద్దాం.

పుస్తకాల సమీక్షలు చూసి పుస్తకాలెంతమంది కొంటారన్న విషయాన్ని పక్కనపెట్టి  పుస్తకాలకు ఆర్డర్లు ఎన్ని వస్తాయో అనేదానికన్నా, కొన్ని ఫ్రీగా తమ లైబ్రరీలకు పుస్తకాలు పంపమన్న ఉత్తరాలు మాత్రం ఠంచనుగా వస్తాయి. ఒకోసారి మన పుస్తక సమీక్ష పడిందని మనకు ఇలా వచ్చే ఫ్రీ పుస్తకాల వుత్తరాలవల్లనే తెలుస్తాయి.

సర్దార్ పటేల్ రోడ్డులోని ఆర్య వైష్య మహిళా సంఘం నుండి తప్పకుండా వుత్తరం వస్తుంది. వీరికి కవర్ పైన అడ్రసు రాసే తీర్క కూడా వుండదు. పేపర్లోని అడ్రసును కత్తిరించి కవరు అట్టపైన అతికించి పంపుతారు. ఆ అడ్రసు కాగితం చూసి ఏపత్రికలో రివ్యూ అచ్చయిందో తెలుసుకునే వీలుంటుంది. ఇది తప్ప వీరి వల్ల మనకు ఇంకో లాభం లేదు.

వీరినుంచి ఇలా వుత్తరాలొస్తూంటే ఒకసారి నేనో ఉత్తరం రాశాను. నేను వచ్చి మీ లైబ్రరీ చూస్తాను. ఒకరోజు అపాయింట్ మెంట్ ఇవ్వండి. లైబ్రరీబాగుంటే వేరే పుస్తకాలూ ఇస్తాను, అని రాశాను. సమాధానం రాలేదుకానీ, రివ్యూలు ఆచయినప్పుడల్లా వుత్తరాలు వస్తూనే వున్నాయి.

ఇంకా అనంతపూర్ నుంచి ఓ లైబ్రరీకి ఉచితంగా పుస్తకాలు పంపమని వుత్తరం వస్తుంది. మనమే డబ్బులు పెట్టి అచ్చువేసుకోవటమేకాదు, కొరియర్ డబ్బులు పెట్టుకునిమరీ ఉచితంగా పుస్తకాన్ని పంపుకోవాలన్నమాట.

ఇంకా మహబూబ్ నగర్ నుంచి ఓ ముస్లీం పేరుతో కార్డు వస్తుంది. సన్మానం చేస్తామని, అయిదు కాపీలు పంపమని.

కర్నూల్ నుంచి వచ్చేవుత్తరంలో, తాను చాలా పేదవాడిననీ, మీ పుస్తకం చదవాలని వుంది, కాబట్టి పంపండీ అన్న ఆర్డరుంటుందా వుత్తరంలో.

ఇలాంటి వుత్తరాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి.

వీటి మధ్య డబ్బులు పంపేవారూ వున్నారు. ఒకో రివ్యూకీ కనీసం అయిదునుంచి పది ఆర్డర్లు వస్తాయి. తరువాత కూడా ఆ పత్రికలో రివ్యూ చూశాము, కాపీ పంపండి అంటూ డబ్బులు పంపుతారు. అన్ని పత్రికలలో వెంట వెంటనే రివ్యూలు వచ్చేకన్నా, కాస్త విరామముండి వస్తూంటే బోలెడన్ని ఆర్డర్లు వచ్చిన భావన కలుగుతంది.

అయితే, రివ్యూలయిపోయిన తరువాత మాత్రం పుస్తకాలు అమ్ముడు పోవాలంటే ఆ పుస్తకం గురించి పత్రికలలో చర్చలు జరగాలి. లేదా దాని గురించి పదిమంది మంచి మాటలు ఏదో ఒక సభలో చెప్తూండాలి. లేకపోతే పుస్తకం నెమ్మదిగా మరుగున పడుతుంది.

అందుకే, కొందరు రచయితలు తమ పేరు ముందు తమ పుస్తకం పేరును ఇంటి పేరుగా పెట్టుకుని, ఆ పుస్తకాన్ని సజీవంగా వుంచే ప్రయత్నాలు చేస్తారు. అయితే, వారు  విస్మరించినదేమిటంటే, తమ పేరు చెప్పగానే ఒకే రచన గుర్తుకువస్తోంది, అదీ తొలి రచననే అంటే వారి ఎదుగుదల అంతటితో ఆగిపోయిందని అర్ధం. ఆతరువాత వారు చెప్పుకోదగ్గ గుర్తుంచుకోదగ్గ రచన చేయలేదని అర్ధం.

మనం కృష్ణ శాస్త్రిని ఊర్వశి కృష్ణ శాస్త్రి అనో, పల్లకి కృష్ణ శాస్త్రి అనో అనము. అలాగే, యండమూరిని తులసీదళం యండమూరి అనీ, విజయానికి అయిదుమెట్ల యండమూరి అనీ అనం. చలాన్ని మైదానం చలమనో, స్త్రీ చలమనో అనం. అలా అన్నామంటే ఎదుగుదల ఆ రచనతో ఆగిఓయిందని అర్ధం.

కానీ, ఇలా ఒక రచనను ఇంటి పేరు చేసుకోవటం వల్ల ఆ పుస్తకం పేరు రచయిత పేరు చూసినప్పుడల్లా గుర్తుకువస్తుంది. పేరు బాగా నలుగుతుంది. ఆరకంగానైనా ఆ పుస్తకం చిరకాలం సజీవంగా వుంటుంది. అయితే, ఇదికూడా అందరికీ సాధ్యం కాదు. కాబట్టి పుస్తకాన్ని ప్రచురించి దైవం పైన భారం వేయటం తప్ప మరేమీ చేయలేము. రచయితగా రచన చేయటమే కాక, దాన్ని ప్రచురించి మరీ సమాజానికి అందించిన తరువాత దాన్ని స్వీకరించటమో, తిరస్కరించటమో, సజీవంగా నిలుపుకోవటమో అది సమాజం బాధ్యత. విమర్శకులు, సమీక్షకుల బాధ్యత. ఆ బాహ్యత నుంచి తెలుగు సాహితీకారులెలా తప్పించుకుంటున్నారో, సమీక్షల, విమర్శల మతలబులు చూస్తే అర్ధమవుతుంది.

ఇది మరోసారి.

May 29, 2009 ·  · 4 Comments
Posted in: నా రచనలు.

ఒబామా- పుస్తక పరిచయం!

తెలుగులో సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ. ఇది సాహిత్యానికేకాదు, సినిమాలకూ ఇతర కళలకూ వర్తిస్తుంది.

ఏదయినా సంఘటన జరగగానే ఆ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను వివరిస్తూ విశ్లేషిస్తూ వచ్చే పుస్తకాలు చాలా అరుదు. అందుకే, గుడిపాటి రచించిన ఒబామా- స్ఫూర్తిదాయక విజయగాథ, ఆనందం కలిగిస్తుంది.

నిజానికి, మన ప్రచురణకర్తలకూ, రచయితలకూ పాఠకులపైన నమ్మకమూ, గౌరవమూ తక్కువే. పాఠకులు ఇవే చదువుతారని నిర్ణయించి అలాంటివే ఇస్తూ పాఠకుల చదివే అలవాట్లపైన పరిమితులు విధించారు. వారి పఠనాసక్తులను చట్రంలో బిగించారు.

ఇందుకు నిదర్శనాలనేకం. మన తెలుగులో విశ్లేషణాత్మకమయిన రచనలు తక్కువ. జీవిత చరిత్రలు తక్కువ. సమకాలీన రాజకీయ పరిస్థితులను వివరించే పుస్తకాలు ( జెనెరల్ నాలెడ్జ్ వదిలేస్తే) లేవు. దేశాన్నేకాదు, ప్రపంచాన్ని కుదిపేస్తున్న తీవ్రవాదం పైన తెలుగులో వచ్చిన పుస్తకం నాదే. మన ప్రధానమంతృలు, ముఖ్యమంతృలందరి గురించి వున్న ఏకైక పుస్తకం నేను రచించిందే. అంటేనే అర్ధం చేసుకోవచ్చు మన తెలుగులో పాఠకుల పఠనాసక్తిపైన ఎన్ని పరిమితులున్నాయో.

అందుకే, ఒబామా రాజకీయ విజయ గాథను గుడిపాటి రాసి, ప్రచురించటం ఒక రకంగా సాహస గాథ అనవచ్చు.

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికవటం ఒక చారిత్రాత్మక సంఘటన. అణచివేతకుగురయిన నల్లవారు అమెరికాలో తమ శక్తిని గుర్తిస్తున్నారనటానికి నిదర్శనం. ప్రపంచంలో పలురకాలుగా అణచివేతకు గురవుతున్న వారందరికీ ఆశాకిరణం.

అందుకే ఒబామా, జీవితం, అతని ఎదుగుదా, అతని మానసిక స్థితి, వ్యక్తిత్వం, ఆయన ఎల్లా రాజకీయాలలోకి వచ్చారు, ఏయే అమ్షాలు ఆయనను విజేతను చేశాయి అన్న విషయాలను వివరించి విశ్లేషించి పాఠకులకు అందించటం అత్యంత ఆవశ్యకమయినది. ఇంతవ్రకూ అలాంటి పుస్తకం తెలుగులో లేదు. గుడిపాటి రచించిన ఈ పుస్తకం ఆలోటును తీరుస్తుంది.

ఒబామా విజయ గాథను 23 అధ్యాయాలలో వివరిస్తుందీ పుస్తకం. మొదటి అధ్యాయం ముందుమాట లాంటిది. పుస్తకరచనకు ప్రేరణను వివరిస్తుంది.

రెండవ అధ్యాయ్సంలో పూర్వరంగం వుంటుంది. దీన్లో అమెరికాలో నల్లవారి స్థితిగతుల పరిచయం జరుగుతుంది.

మూడవ అధ్యాయంలో ఒప్బామా తల్లి తండ్రి వారి నేపధ్యాలు తెలుస్తాయి.

నాలుగవ అధ్యాయం నుంచి, ఎనిమిదవ అధ్యాయం వరకు, ఒబామా బాల్యం, అతనిపై ప్రభావాలు, చదువు, మిషెల్ తో పరిచయం , వివాహం వంటి సంఘటనలు, ఒబామా వ్యక్తిత్వ ఎదుగుదలను చూపుతూ సాగుతాయి.

తొమ్మిదవ అధ్యాయం నుంచి, 13వ అధ్యాయం వరకూ ఒబామా రాజకీయాల ప్రవేశం, సెనేటర్ గా ఓటమి, ఎన్నికవంటి విషయాలు వుంటాయి.

15వ అధ్యాయం ఒబామా రచనలను వివరిస్తుంది.

16లో అధ్యక్షపదవి పోటీ, 17లో గెలుపు ప్రాధాన్యం వుంటాయి.  అయితే, అధ్యక్షపదవిపోటీ మరింత వివరంగా వుండాల్సింది. ఎందుకంటే, ఎలాంటి రిజెర్వేషన్లూ లేకుండా, తెల్లవారిని వారి ప్రామాణికాలతోనే తన పార్టీలోనూ, ప్రత్యర్ధిపార్టీలోనూ ఓడించి, నల్లవారికి ఎలాంటి క్రచ్చులూ, ప్రత్యేకతలూ అవసరంలేదనీ, నలుపూ, తెలుపూ అన్నవి శరీరానికేతప్ప మనసుకుకావనీ ఒబామా నిరూపించటం ఎంత ప్రాధాన్యం వహించే విషయం. అయితే, పుస్తకమంతా రచయిత రిపోర్టింగ్ పద్ధతిలో రచించటంవల్ల ఈ అధ్యాయంకూడా అలాగే సాగింది.

చివరి అధ్యాయాలు ఒబామా ఆరోగ్యపుటలవాట్లు, ఆయన మెచ్చిన పుస్తకాల వివరాలు, ఒబామా గెలుపును ఎలా అర్ధం చేసుకోవాలి అన్న విశ్లేషణలుంటాయి. 22వ అధ్యాయంలో ఒబామా జీవన క్రమం, 23లో ఉపయుక్త గ్రంథావళి వున్నాయి.

ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారు, ఒబామా గురించి తెలుగు పుస్తకాన్ని చులకనగా చూడవచ్చు. కానీ, తెలుగులో పుస్తకాల ప్రచురణలో సాధక బాధకాలు తెలుసుకుంటున్న మనం ఇలాంటి ప్రయోగాలకు ప్రోత్సాహాన్నివ్వాలి. ఇలాంటి పుస్తకాలను ఆదరించాలి.

ఇలాంటి పుస్తకాలకు ఆదరణ వున్నదని నిరూపిస్తే, తెలుగు రచయితలు, ప్రచురణకర్తలు కూడా మరింత రీసెర్చ్ జరిపించి, మరింతగా ఇలాంటి పుస్తకాల ప్రచురణపై దృష్టి పెడతారు. అదీగాక, విద్యావంతులకు, పట్టణాలలో వున్నవారికీ ఆంగ్ల పుస్తకాలు దొరకటం కష్టం కాదు. కానీ, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తెలుగు పుస్తకాలు లభ్యమవటమే గగనం. అలాంటి వారికి ఒబామా గురించి సమగ్రమయిన సమాచారాన్నందించి, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచటంలో ఈ పుస్తకం దోహదపడుతుంది. కాబట్టి, ఈ పుస్తకాన్ని తాము కొనటమేకాక పదిమందికీ చెప్పి కొనిపించాలి. అప్పుడే వైవిధ్యభరితమయిన పుస్తకాలింకా వచ్చేవీలుంటుంది. ఈపుస్తకం వెల కూడా తక్కువే. కేవలం 50 రూపాయలే.

ఒబామా
స్ఫూర్తిదాయక విజయ గాథ.
రచన- గుడిపాటి.
ప్రతులకు- పాలపిట్ట
16-11-20/6/1/1
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
ఈ మెయిలు- palapittabooks@gmail.com
వెల- 50 రూపాయలు.
పేజీలు-152.

May 29, 2009 ·  · No Comments
Tags: , , , ,  · Posted in: పుస్తక పరిచయము

పుస్తకాలు-సమీక్షలు, విమర్షలు1

తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక పుస్తకం ప్రచురితమయినట్టు, అది మార్కెత్ లో వున్నట్టు పాఠకులకు తెలిసేందుకు సరయిన వ్యవస్థలేదన్నది జగద్విదితం.

ఏదయినా పత్రికలో సీరియల్ గా వస్తూ ప్రాచుర్యం పొందినదయినా, పేరు పొందిన రచయిత రచన అయినా ఆ పుస్తకం గురించి పాథకులకు సులభంగా తెలిసిపోతుంది.

ముళ్ళపూడి రమణ  జీవిత కథ కోతి కొమ్మొచ్చి స్వాతిలో సీరియల్ గా వస్తోంది. అది పూర్తయ్యేలోగా పుస్తకం లా వస్తుంది. బహు ప్రాచుర్యం పొందిన రచన, పేరున్న రచయితా కావటంతో పుస్తకానికి ప్రచారం ఆవశ్యకత అంతగా అవసరం లేదు.

అలాగే యండమూరి, మల్లాది, పట్టాభిరాం వంటి వారి పుస్తకాలకూ ప్రచారం అవసరం పెద్దగా లేదు.

పాత రచయితలు, కవుల పుస్తకాలకూ ప్రచారం అవసరం లేదు.

మిగతా వారందరికీ ప్రచారం అవసరం వుంది. లేకపోతే వారి పుస్తకాలు అనామకంగా అఙ్నాతంలో మిగిలిపోతాయి.

అయితే, ఇలాంటి పుస్తకాలకు ప్రచారం పత్రికలలో పుస్తక సమీక్షలవల్లనే లభిస్తుంది. లేకపోతే ఎవరయినా ఆ పుస్తకం గురించి పని గట్టుకుని విమర్శ చేయాలి. దాని గురించి చర్చ జరగాలి. అప్పుడు పదిమందికీ ఆ రచన గురించి ఆసక్తి కలిగేవీలుంది.

ఇలాంటివి లేనంత కాలం కేవలం సమీక్షలే ప్రచారానికి ఆధారం.

తెలుగులో సమీక్షకూ, విమర్శకూ తేడా లేదు. సమీక్షలూ, విమర్షలూ, పరామర్షలూ అన్నీ ఒకటే.

పత్రికలు పుస్తక సమీక్షలను సీరియస్ గా భావించవు. వాటిని ప్రధానమైన అంశాంగా పరిగణించరు.

ఈనాడులో సాహిత్యానికి ప్రత్యేకమయిన పేజీ లేదు. పుస్తక పరిచయాలు, ఆదివారం అనుబంధంలో ఒక పేజీలో వుంటాయి. వున్న పేజీ ఒకటి. దాన్లో సమీక్షకు వచ్చే పుస్తకాలు వెయ్యి. అందుకే, నాలుగయిదు, లైన్లు పుస్తకం గురించి క్లుప్తంగా రాస్తారు. అవీ ప్రధానంగా ప్రముఖము, అవసరమూ అనిపించిన పుస్తకాలకే. మిగతావన్నీ స్వీకారంలో వేసేస్తారు. అవి చూసే పాఠకుడికి పుస్తకం పేరు, రచయితపేరు, వెల దొరికేచోటు వంటి విషయాలు తెలుస్తాయి. పుస్తకం గురించి ఏమీ తెలియదు.

ఆంధ్ర జ్యోతిలో ఒక పేజీ పుస్తక సమీక్షలకోసం. దాన్లోనూ ఇదే సమస్య. ఆయా పత్రికల పాలసీలను బట్టి, రచయితలకూ, ప్రచురణ కర్తలకూ పత్రికలతో వున్న అనుబంధాన్నిబట్టి వారికి కేటాయించే స్థలం వుంటుంది. మిగతావన్నీ స్వీకారస్వాహా!

వార్తలో ఆదివారం అనుబంధంలో సమీక్షలకు రెండు పేజీలుంటాయి. కానీ, ఇక్కడా ఈనాడు, జ్యోతిల పరిస్థితే.ఆంధ్రభూమిదీ ఇదే పరిస్థితి. ఒకపేజీలో ఒకటి, రెండు పుస్తకాల పరిచయాలుంటాయి.

ఆంధ్రప్రభలో పుస్తకాల పరిచయాలకు ప్రత్యేకమయిన పేజీలేదు. అప్పుడప్పుడు ఒకపేజీ వేస్తూంటారు.

సాక్షి పత్రికలో ఆదివారం అర పేజీ పుస్తక పరిచయానిది. ఒక పుస్తకం గురించి పది లైన్లురాసే వీలుంటుంది. స్వీకారమో అయిదు పుస్తకాలుంటాయి. సినిమా వారితో ఇంటర్వ్యూలంటూ, సినిమా వార్తలకు ఒకటి రెండు పేజీలయినా కేటాయించే పత్రికలకు పుస్తకాల పరిచయాలకు స్థలం ఇవ్వటం కష్టమవుతుంది.

ఈనాడు తప్ప మిగతా దినపత్రికలలో ఒకరోజు సాహిత్యానికి పూర్తి పేజీ కేటాయిస్తారు. కానీ, ఈపేజీ పాత తరం రచయితల గురించి, సిద్ధాంత చర్చలకూ వాడతారు, కొత్త పుస్తకాల కోసం ఒక పూర్తిపేజీ కేటాయించే పరిస్థితిలేదు.

వారపత్రికలలో పుస్తకాల పరిచయాలకు ఒక పేజీ వుంటుంది. ఆంధ్రభూమి వార పత్రికలో అప్పుడప్పుడూ మూడు పేజీలుకూడా పుస్తకాల పరిచయాలకు కేటాయిస్తారు. అందినవిలో వేసే పుస్తకం చిత్రం కూడా వేస్తారు. అంటే కనీసం పాఠకుడు పుస్తకాన్ని చూడగలుగుతాడన్నమాట.

నవ్యలో ఒక పేజీలో వీలయినన్ని పుస్తక పరిచయాలు చేయాలనుకోవటంవల్ల కొన్ని లైన్లే రాసేవీలుంటుంది. స్వాతిలో పుస్తకాల పరిచయాలకు తావులేదు.ఈవారం పత్రికలో పుస్తకాల పరిచయాలు రెండు మూడు పేజీలు వేస్తారు. కానీ, ఈవారం పత్రిక అంత సులభంగా దొరకదు. ఇండియా టుడే లో సమీక్షలుంటాయి. కానీ వారి ప్రామాణికాలు వేరే.

మాస పత్రికలలో స్వాతి అందినవిలా అవసరమయితే రెండు పేజీల నిండుగా పుస్తకాల వివరాలను ప్రచురిస్తుంది. ఆంధ్రభూమి మాస పత్రిక పుస్తకాల జోలికి పోదు. రచనలో పుస్తక పరిచయాలకు పేజీ పరిమితిలేదనిపిస్తుంది. మూడు నాలుగు పేజీలయినా ఒకోసారి ఒకే పుస్తకం గురించి రాస్తారు. అయితే, రచన పత్రిక దృష్టిలో వున్న రచయితలే రచయితలు కాబట్టి ఇతర రచయితల పుస్తకాల పరిచయాలు ఆ పత్రికలో రావటం కష్టమే.ఈ భూమిలో కూడా సమీక్షలకు రెండు పేజీలిస్తారు. అప్పుడప్పుడూ రచయితలతో ఇంటర్వ్యూలూ వేస్తారు.

గమనిస్తే, పుస్తకావిష్కరణ సభల ఫోటోలు వేసేందుకు అవసరమయితే అయిదారు పేజీలు కూడా పత్రికలు కేటాయిస్తాయి. కానీ, పుస్తకాల సమీక్షలకోసం మాత్రం ఒక్క పేజీ కేటాయించటమూ కష్టమే.

ఇదీ పత్రికలలో పుస్తకాల సమీక్షల పరిస్థితి.  ఈ పరిస్థ్తిలో రచయిత పుస్తకాన్ని సమీక్షకు ఇచ్చి తన పుస్తక ప్రచారం చేసుకోవాలి.

ఇంగ్లీషు పుస్తకాలలో సమీక్షలకోసం పేజీలు కేటాయిస్తారు. సమీక్షలూ విమర్షల స్థాయిలో వుంటాయి. హిందూ పత్రిక అయితే మంగళ వారం వేసే పుస్తకాల సమీక్షలతో పాటూ, నెలకొక లిటెరరీ సప్లిమెంట్ తెస్తుంది. అవుట్ లుక్, వీక్, ఇండియా టుడే వంటి పత్రికలలో పుస్తక సమీక్షలకు మంచి స్థలం కేటాయిస్తారు. వారి విమర్శలు  చదివితే పుస్తకం గురించి ఒక ఆలోచన వస్తుంది.

కానీ, తెలుగు పత్రికల దృష్టిలో పుస్తక సమీక్షలు వ్యాపార పరంగా అంత లాభదాయకం కావు.

అయినాసరే, పుస్తకాలను ప్రచురించిన రచయితలందరూ ఈ పరిమిత స్థలం కోసం పోటీపడతారు. అదృష్టం బాగుండి తన పుస్తక సమీక్ష సక్రమంగా, కాస్త పెద్దగా వస్తుందని ఆశిస్తాడు.

ఇక్కడే సమీక్షలలో విమర్శలలో వున్న మతలబులు రంగ ప్రవేశం చేస్తాయి.

వీటిగురించి మరోసారి.

May 27, 2009 ·  · No Comments
Posted in: నా రచనలు.

పుస్తకాలు-పెట్టుబడులు!

పుస్తకాలు ప్రచురించటమంటే, రూపాయల కట్టలు పారేసుకుని, పైసలు ఏరుకోవటమే.

ఇది చేదు నిజం.

ఒక రచయిత కథ రాస్తాడు. పత్రికకు పంపుతాడు. ఇందుకోసం రచయిత పడ్డ శ్రమనూ, తపననూ, డబ్బు రూపంలో విలువకట్టలేము. దానికి వెల నిర్ణయించలేము.

కానీ, పెన్ను, తెల్ల కాగితాలు, పోస్టేజీ వంటి వాటి ఖర్చును లీకపెట్టొచ్చు.

కథ వెనక్కి తిరిగివస్తే, ఆ కథ వేరు. ప్రచురితమయితే జరిగే కథ వేరు.

ప్రచురిత మయిన కథకు, 100 నుండి 500 వరకూ డబ్బులిస్తారు, పత్రిక పాలసీని అనుసరించి. కొన్ని పత్రికలు డబ్బులివ్వవు. కథా రచయితలు తమ కథలను అచ్చులో చూసుకోవాలని డబ్బు ప్రమేయంలేకుండా కథలను ఇస్తారు.

అలా పడ్డ కథలను రచయిత పుస్తక రూపంలో తీసుకురావాలంటే కనీసం 20000 అవుతుంది. పుస్తకంలో పేజీలెక్కువ అయినా, కాస్త నాణ్యంగా పుస్తకాన్ని తీసుకురావాలన్నా ఖర్చు ఇంకా ఎక్కువవుతుంది.

ఉదాహరణకు, 20000 ఖర్చు చేసి ఒక రచయిత ఒక 20 కథల సంకలనాన్ని వేసాడనుకుందాం. వెల 60 రూపాయలనుకుందాం.

కథ రాసినందుకు రచయితకు, వందో, రెండొందల యాభయ్యో అందుతాయి. అదే కథను రచయిత అచ్చు వేసుకుంటే కథకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి. అదే కథల సంకలనాన్ని పాఠకుడు కథకు మూడు రూపాయల చొప్పున కొంటాడన్నమాట.

ఇప్పుడర్ధమయిందనుకుంటాను, కథల సంకలనాలు అచ్చు వేసుకోవటంలో రచయితలు పడే మానసిక వేదన.

ఇప్పుడాపుస్తకాన్ని అమ్మకాలకు పెడితే, కొనేవారుండరు.

ఆరుకోట్ల తెలుగు ప్రజలు 60 శాతం అక్షరాస్యత వున్న తెలుగు రాష్ట్రంలో కనీసం 100 పుస్తకాలు కూడా అమ్ముడుపోవటం గగనమే.

రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ సంస్థ సంవత్సరానికి ఒకసారి పుస్తకాలను కొంటుంది. అదృష్టం బావుంటే, 100-200 కాపీలు ఆ సంస్థ కొంటుంది. అంటే రచయితకో ఆరువేలో పదివేలో వస్తయనుకుందాం. కమీషన్లూ, ఇతర ఖర్చులను తాత్కాలికంగా మరచిపోదాం.

ఇది తప్ప రచయితకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే మరో ఆస్కారంలేదు.

పుస్తకాలు దుకాణాలలొ కొనుక్కోవటమూ, ఆ దుకాణాలవాళ్ళు మన డబ్బులు లెక్కలు కట్టి ఇవ్వటమూ అన్నది కలలో మాట.

విశాలాంధ్ర దుకాణం వారు నా పుస్తకాలను దుకాణంలో పెట్టేందుకు తీసుకున్నారు. మధ్యలో ఒక సారి వెళ్ళి అమ్మకాలెలా వున్నాయి, అని ఆతృత కొద్దీ అడిగాను.

అయిపోతే అడుగుతాము, అడగకపోతే అమ్మకాలు లేనట్టే అన్నారు. మార్చి తరువాత వస్తే లెక్కలు చూసి డబ్బులిస్తాము అనీ అన్నారు.

మార్చి వరకూ పిలుపు రాకపోయేసరికి, మార్చి తరువాత వెళ్ళాను. ఇంకా లెక్కలు చూడలేదు. చూసి ఫోను చేస్తాము. మాతిమాటికీ వచ్చి విసిగించొద్దు, అన్నారు.

2004 నుంచీ ఫోను కోసం ఎదురుచూస్తూనేవున్నాను.

ఇలా దుకాణాల చుట్టూ తిరిగి అమ్మకాలు చూస్తూ వుంటే రచయితకు రాతలకు సమయం వుండదు. రాస్తే ఇవన్నీ చూడలేము.

కాబట్టి కథ రాసిన పాపానికి, అది పదిమందికీ తెలియాలనుకున్న దోషానికీ, రచయిత డబ్బులు పారవేఉకున్నానకుని వూర్కుని, ఇంకొన్ని కథలు రాసుకుని, పుస్తకం వేసేందుకు సిద్ధపడటం తప్ప మరేమీ చేయలేడు.

ఇలా రూపాయలు పారేసి పైసలు ఏరుకొనే స్థితిలో వున్న రచయిత టీవీలలో, పేపర్లలో తన పుస్తకం గురించి ప్రకటనలిచ్చుకోలేడు. పాఠకులకు తన పుస్తకం వున్నట్టు తెలియటానికి పత్రిక సమీక్షలపైన ఆధారపడతాడు.

కొందరు రచయితలు పుస్తకాలలొ వ్యాపార  ప్రకటనలిస్తారు.  దానికీ వ్యాపారస్తులను సంప్రతించాలి. అలా స్పాన్సర్లు దొరికితే, పుస్తకాల అమ్మకాలతో సంబంధంలేకుండా, రచయిత ధన నష్టం నుంచి తప్పించుకుంటాడు. కానీ, జమిందారీలు, ఉదార హృదయాల కాలం కాక పోవటంతో, రాజాశ్రయమంటే, ప్రభుత్వ సంస్థల దయా దాక్షిణ్యాలుకావటంతో, రచయితలకు స్వయంగా నష్టపోవటం తప్ప మరో మార్గం లేదు.

ఇక్కడే పత్రికలలో సమీక్షలు అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి.

పుస్తకాల సమీక్షల గురించి మరోసారి.

May 26, 2009 ·  · 2 Comments
Posted in: నా రచనలు.

దక్కన్ చార్జర్లకు అభినందనలు-రాయల్ చాలెంజర్లకు, వొచ్చేసారి చూసుకుందాం!

అందరూ ఆశించినట్టే, అందరూ ఊహించినట్టే దక్కన్ చార్జర్లు ఐపీఎల్ కప్పును గెలుచుకున్నారు.  క్రితం సారి చొవరలో వున్నవారు, ఈసారి శిఖరాన్ని చేరటం నిజంగా గొప్ప విషయమే!

ఆట ఆరంభంలోనే గిల్లి అవుటయినా, మరో వైపు గిబ్స్ నిలబడి కుదురుగా ఆడుతూ పరిస్థితికనుగుణంగా ఆడి జట్టుకు మంచి స్కోరునిచ్చాడు.

రాయల్ చాలెంజర్లలో తొందరపాటు కనిపించింది. గెలిచిపోవాలన్న ఆత్రుత కనిపించింది. అదే వారిని దెబ్బ తీసింది.

అందరి దృష్టీ తనపైనే వుండటం ఇంకా అలవాటు కాని పాండే త్వరగా వెనుతిరిగాడు. ఇది ఆరంభంలోనే చాలెంజర్లపైన ఒత్తిడి పెంచింది. దీనికి తోడుగా, కాలిస్, ద్రావిడ్ లు త్వరగా అవుటయిపోవటం చాలెంజర్ల గెలుపును ప్రశ్నార్ధకం లో పడేసింది.

పరుగుల లక్ష్యాన్ని చేరటంలో ప్రధాన సూత్రం, ఆరంభంలోనే అధికంగా వికెట్లను కోల్పోకూడదు. చాలెంజర్లు త్వర త్వరగా వికెట్లు కోల్పోయారు. కుదురుగా నిలబడి, వికెట్ కాపాడుకుంటూ, పార్టర్షిప్పును అభివృద్ధి చేయటంలో ఎవరూ శ్రద్ధ చూపలేదు. ఇలా చేయగలిగిన ద్రావిడ్ అవుటవటం చాలెంజర్లు కోలుకోలేని దెబ్బ.

ఆతరువాత జరగాల్సిందే జరిగింది. ఉథప్పాను చివరకు పంపటం ప్రణాళికా పరంగా మంచిది. కానీ, మరో వైపు అందరూ అనవసరంగా అవుటవుతూండటం, ఉథప్పా నిర్లక్ష్యంగా ఆడటం, చివరి ఓవర్లో బాటుతో బంతిని కొట్టలేకపోవటం చాలెంజర్లకున్న ఆ వొక్క ఆశనూ అడుగంటించాయి.

చివరివరకూ ఉత్తమ ఆట చూపిన దక్కన్ చార్జర్లు గెలిచారు. ఐపీఎల్ విజేతలుగా నిలిచారు.

నిజానికి, కాస్త జాగ్రత్తగా ఆడివుంటే, చాలెంజర్లు సులభంగా గెలిచేవారు. గెలుపు సులభమన్న భావన చాలెంజర్లను దెబ్బ తీసింది. ఆటలో మౌలిక సూత్రాలను విస్మరించటం చాలెంజర్ల శాపమయింది. ఇందుకు సీనియర్ ఆటగాళ్ళయిన కాలిస్, ద్రావిడ్ లదే బాధ్యత. వారు కనక ఒక వైపు నిలబడివుంటే ఇతరులకు ధైర్యం వచ్చేది.

దక్కన్ చార్జర్లకూ, రాయల్ చాలెంజర్లకూ నడుమ తేడా, గిబ్స్!

అసలయిన ఆటలో అద్భుతంగా ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు గిబ్స్.

ఇదీ ఈసారి ఐపీఎల్!

దక్కన్ చార్జర్లను అభినందిస్తూ, ఇక, దృష్టిని టీ20 ప్రపంచ కప్ వైపుకు మళ్ళిద్దాం!

May 25, 2009 ·  · One Comment
Posted in: క్రికెట్-క్రికెట్