Archive for June 1, 2009

ఒక జర్నలిస్టు ఆత్మ విమర్శ- పరిచయం!

BOOK COVERజర్నలిస్టు అనే పదానికి అర్ధం మారుతోంది. జర్నలిస్టు గురించి ప్రజలలో అభిప్రాయం మారుతోంది.

ఒకప్పుడు జర్నలిస్టు మేధావి. ఉత్తమ నడవడితో, ఉన్నత మయిన ఆలోచనలతో సమాజాభ్యున్నతి కోరి అందుకు నడుము కట్టినవాడు జర్నలిస్టు. అవినీతికి వ్యతిరేకి. అన్యాయాన్ని అడ్డుకునే వివేకి. ఉత్తమ ఆలోచనలు, ఉన్నత లక్ష్యమూ, భాషపైన పట్టు, రచనలో ప్రావీణ్యమూ, సామాజిక మనస్తత్వం పైన అవగాహన, చరిత్రగురించి ఆలోచన, భూత వర్తమానకాలాల సమన్వయం తో భవిష్యత్తుపైన దృష్టి కలిగి సమాజ హితం కోసం కలాన్ని ఆయుధం లా, సత్యాన్ని శస్త్రంలా వాడేవాడు జర్నలిస్టన్న అభిప్రాయంవుండేది. జర్నలిస్టంటే సమాజంలో గౌరవమన్ననలుండేవి.

కానీ ఇప్పుడు, టంకశాల అశోక్ గారి మాటలలోనే చెప్పాలంటే, ‘ ప్రపంచాన్ని ప్రజలకు చూపవలసిన జర్నలిజపు చూపుడువేలు వంకరలు తిరుగుతున్నది.’

వమకరలు తిరిగిన చూపుడువేలు మళ్ళీ తిన్నగా అవ్వాల్సిన అవసరంవుంది. ఇందుకు ప్రతి జర్నలిస్టు ఆత్మవిమర్శ చేసుకోవాల్సివుంటుంది. ఆ దిశలో ఒక సీనియర్ జర్నలిస్టు, వార్త పత్రిక సంపాదకుడు, శ్రీ టంకశాల అశోక్ , ఇతర జర్నలిస్టులకు మార్గదర్శకత్వంగా వేసిన అడుగు ఈ పుస్తకం.

పిల్లి మెడలో గంట ఎవరో ఒకరు కట్టాలి. ప్రతివారూ పక్కవారు గంట కట్టాలనుకుంటారు. జర్నలిజం రంగంలో వున్న అవకతవకలను, అస్తవ్యస్తాన్ని, అవినీతినీ, అవలక్షణాలనూ ఎత్తి చూపించే పిల్లిమెడలో గంట కట్టటంలాంటి పనిని చేస్తుందీ పుస్తకం.

ఈ పుస్తకంలో మొత్తం 30 వ్యాసాలున్నాయి. డయానా మరణానికి కారకులెవరు అన్నది తొలి వ్యాసం. నాగసూరి వేణు గోపాల్ గారి పుస్తకానికి రాసిన ముందుమాట, అశోక్ గారి నిక్కచ్చితనం, నిర్మొహమాట తత్వాన్ని స్పష్టం చేస్తాయి.

ఒక సమస్య వుంటే దాన్ని దాచి అదిలేదన్నట్టు ప్రవర్తించటం వల్ల సమస్య పరిష్కారం కాదు. సమస్యను సూటిగా ఎదుర్కోవాలి. నిక్కచ్చిగా కారణాలు వెదకాలి. నిర్మొహమాటంగా పరిష్కారాలు ఆలోచించాలి. నిర్భయంగా పరిష్కారాలను అమలుపరచాలి. అప్పుడు సమస్య పరిష్కారమవుతుంది. ఇది జరగనంత కాలం, అసలు రోగాన్ని కప్పిపెట్టి, పై పై లక్షణాలకు మందు వేస్తే అసలు రోగం పెరగటమే కాక, కొత్త రోగాలొస్తాయి. ఈ నిజాలను అంతే నిక్కచ్చిగా ప్రదర్శిస్తాయి ఈ సంకలనంలోని వ్యాసాలు.

సూటిగా సమస్యను వివరించటం, లోతుగా విశ్లేషించటం, అన్ని కోణాలలోంచి సమస్యను పరిషీలించటం, ఆపైనే పరిష్కారాలు సూచించటం మనకు కనిపిస్తుంది.

ఈ వ్యాసాలలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది, అశోక్ గారి సమన్వయ దృక్కోణం. సంకుచితత్వ రాహిత్యం.

తెలుగు జర్నలిస్టుల ఇంగ్లీషు వాడకం, జర్నలిజం పరిణామక్రమంలో నడమంత్రపు మీడియా, తెలుగు భాషకు జర్నలిస్టుల హాని, జర్నలిజం అంతిమ పతనం ఏది, జర్నలిజం అంతటా అవే సమస్యలు ఇలా ఈ సంకలనంలోని వ్యాసాలు, వాటి అమ్షాలూ ఆసక్తి కలిగించటమే కాదు, అవగాహననూ, ఆలోచనలనూ కలిగిస్తాయి. రచయిత సూటి ప్రశ్నలు, నిక్కచ్చి వివరణలు, నిర్మొహమాట పరిష్కారాలూ ఆనందింప చేస్తాయి. నిజమంటేనే ఆమడ దూరం పారిపోయే మన సమాజంలో ఒకరయినా నిర్భయంగా వున్నదున్నట్టు చెప్తున్నందుకు సంతోషం కలుగుతుంది.

గమనిస్తే, ఒకప్పుడు జర్నలిస్టు అంటే మేధావితో పాటుగా మంచి రచయిత కూడా. అనేక రాజకీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, వైఙ్నానిక, మానసిక, తాత్విక అంశాలపైన రచనలు చేసేవారు జర్నలిస్టులు.

నండూరి రాం మోహన్ రావు, నండూరి పార్థ సారథి, ముట్నూరి కృష్ణా రావు, పిరాట్ల వెంకటేష్వర్ రావు, గోరా శాస్త్రి, నార్ల వెంకటేశ్వర రావు, ఇలా ఒకప్పుడు జర్నలిస్టంటే ఎంతో గౌరవం వుండేది. వారు స్వయంగా వివిధామ్షాలపైన పుస్తకాలు రచించినవారయివుండేవారు. విదేషీ జర్నలిజంలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. మార్ టుల్లీ తో సహా అనేక జర్నలిస్టులు పుస్తకాలను ప్రచురించారు.

మన దగ్గర ఎంవీయార్ శాస్త్రి, రామ చంద్ర మూర్తి, టంకశాల అశోక్ వంటి కొందరు జర్నలిస్టులు మాత్రమే ఇంకా ఆ పాత జర్నలిజం పద్ధతి ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు.
అందుకే ఈ పుస్తకం జర్నలిస్టు ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

జర్నలిస్టులేకాదు, రచయితలూ, పాఠకులూ, సామాన్యులూ కూడా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం వల్ల మనకు కనిపించే విషయాలలో నిజాన్ని సులభంగా గ్రహించగలుగుతాం. ఈ పుస్తక ప్రభావంతో సమాజానికి మార్గదర్శనం చేయగల వృత్తిలో ఉన్న జర్నలిస్టులలో ఆత్మ విమర్శకు నాంది పలికితే అంతకన్నా మరొకటి అవసరం లేదు.

ఒకసారి ఓ ప్రఖ్యాత జర్నలిస్టు ఒక శీర్షిక ఆరంభించాడట. ఆ శీర్షిక పాఠకులు మెచ్చరు అది ఆపై అన్నారట పత్రికలవాళ్ళు. దానికి అతడు సమాధానంగా, ప్రజల అభిరుచులను ఏర్పరచాల్సింది మనము. ప్రజల అభిరుచికనుగుణంగా మనం మారితే మన ప్రతిభ పనికిరానిది, అన్నాడతడు.

ఇది, జర్నలిస్టులకే కాదు, కళాకారులకూ వర్తిస్తుంది.

ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ.
రచన- టంకశాల అశోక్
ప్రతులకు; అన్ని పుస్తక కేంద్రాలు
ప్రొగ్రెస్సివ్ కమ్యూనికేషన్స్
1-3-176/18
కవాడిగూడా, హైదెరాబాదు-80.
ఫోను;- 9849639350.
వెల; 60/-

June 1, 2009 ·  · 2 Comments
Tags: , , ,  · Posted in: పుస్తక పరిచయము