Archive for June 3, 2009

తీవ్రవాదం-పుస్తకావిష్కరణ గురించి….

ఒక పుస్తకాన్ని రాయటంతో పనయిపోదు. దాన్ని అచ్చువేయాలి. అచ్చువేస్తే సరిపోదు. అలాంటి పుస్తకం వున్నట్టు పదిమందికి తెలియాలి. అలా తెలియచేసే ప్రయత్నంలో భాగమే పుస్తకావిష్కరణ సభ.

తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ ఒక సమస్యగా తయారయింది.

సాధారణంగా ఇలాంటి ఆవిష్కరణ సభలకు కవులు, కథకులే ఎక్కువగా వస్తారు. కానీ, తీవ్రవాదం పుస్తకం ఆకోవకు చెందినది కాదు. మన తెలుగులో రాజకీయ సంబంధిత పుస్తకాలు తక్కువే. అవి చదివే పాఠకులూ తక్కువే.

రాజకీయాలపట్ల ఆసక్తి వుమ్న్న చదువుకున్నవారు, రాజకీయ విశ్లేషణలకోసం ఇంగ్లీషు పత్రికలపైనా, ఇంగ్లీషు రచయితల పుస్తకాలపైనా ఆధారపడతారు. ఇతరులు దినపత్రికల పరిఙ్నానమే చాలనుకుంటారు. లోతయిన చర్చలు, వివరణలు వారికి అవసరంలేదు. దాంతో, మన తెలుగులో ఇలాంటి పుస్తకాలూ లేవు. కాబట్టి, తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ చేస్తే ఎవారూ రారన్న అభిప్రాయం వినబడుతోంది.

ఇంకొక సమస్య ఏమిటంటే పుస్తకం గురించి మాట్లాడేవారికి తీవ్రవాదం గురించి అవగాహన వుండాలి. అలాంటి వారు సాధారణంగా సంపాదకులయివుంటారు. అంత పెద్దవారిని పిలిచినప్పుడు, వారి స్థాయికి తగ్గ సంఖ్యలో శ్రోతలుండాలి. లేకపోతే అభాసుపాలవుతుంది సభ.

కాబట్టి ఏదయినా సంస్థ తరఫున ఆవిష్కరణ సభ జరిపితే ఎవరు రాకున్నా కనీసం ఆ సంస్థ కార్యకర్తలతో హాలు నిండుతుందని సలహా ఇచ్చారు.

కానీ, నాకు ఏ సంస్థతో సంబంధంలేదు. ఏ ఉద్యమంలో లేను. నాకంటూ అభిమానులూ లేరు. శిషులూ, వందిమాగధులూ, అనుచర గణాలూ లేరు. కాబట్టి నేను సభ చేస్తే బహుషా నేను పిలిచిన వక్తలు వేదికపైన, మా ఇంటి సభ్యులు వేదిక క్రింద వుంటారు.  ఈ ఆలోచనతో సభ చేయటమే మానేయాలని అనుకున్నాను. పత్రికలలో వచ్చే రివ్యూలపై ఆధారపడి, ఆపై భారం ఆపైవాడిపైనే వేసి నా పని చేసుకుంటూ పోవాలని నిశ్చయించాను.

ఇంతలో, ఏఎస్ రావు నగర్ వారి సాంస్కృతిక సంస్థ కోకిలం వారు నెల నెలా జరిపే సాహిత్య సమావేశంలో పుస్తకావిష్కరణ చేసుకోవచ్చన్నారు. ఒకవేళ అది సఫలమయితే, జూన్ 14న కానీ, 15న కానీ, ఏఏ రావు నగర్ లో పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. నిర్ణయించిన తరువాత వివరాలు తెలుపుతాను.

అలాగే, ప్రతినెలా, చివరి శనివారం నాడు, హాసం సభ్యులు సమావేశమయి, హాయిగా నవ్వుకుంటారు. వారి నవ్వులు ఆరంభమయ్యేకన్నా ఒక అరగంటముందు, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవచ్చన్నారు. ఈ ఆఫర్ ను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఇది జూన్ 27 న వుంటుంది. స్థలం త్యాగరాయ గాన సభ మినీ హాలు.

ఇంకా ఎవరెవరు మాట్లాడాలన్న విషయం ఆలోచించలేదు. అయితే, నేను నిర్వహించే సభలలో ఉపన్యాసాలు బోరు కొట్టకుండా త్వరగానే అయిపోతాయి. వేదికను వక్తలతో నింపటమూ నాకు ఇష్టం వుండదు. గంగిగోవు పాలు గరిటెడయినను చాలు అన్నట్టు, ఒక వక్త, రచయిత, అంతే మాట్లాడేవారిగా వుంచాలని పథకం. ప్రచురణ కర్త కూడా వేదికపైన వుంటాడు. ఇందువల్ల మాట్లాడేవారు విపులంగా సంతృప్తిగా మాట్లాడేవీలుంటుంది. రచయితకు తన మాట వినిపించేవీలుంతుంది. సాధారణంగా మన సభలలో రచయిత చివరకు మాట్లాడతాడు. అందరు మాట్లాడటం అయిపోయేసరికి హాలు ఖాళీ అవుతుంది. ఉన్నవారి ఓపికలు నషిస్తాయి. కాబట్టి, ఇద్దరే వక్తలతో 45 నిముషాలలో సభలు ముగించాలని ఆలోచన.

విషయం నిర్ధారణ కాగానే మరిన్ని వివరాలు తెలుపుతాను. ఇప్పుడు ఇది చెప్పటం ఎందుకంటే బ్లాగ్మితృలంతా సభలకు రావటానికి వారి వారి వీలునుబట్టి సిద్ధంగా వుంటారని.

June 3, 2009 ·  · 2 Comments
Tags: , , ,  · Posted in: నా రచనలు.