Archive for June 8, 2009

బ్రహ్మబుధ్ చూపిన అప్పటి అరుంధతి!

ఏదయినా కొత్త సబ్జెక్ట్ తీయాలి. ప్రేక్షకులదిరి పోవాలి, అన్నా/డు ఆగదిలో కూచున్న ఒకాయన. ఆయనే నిర్మాత అని గ్రహించాను.

దయ్యం సినిమా తీద్దాం, అన్నాడింకొకాయన. ఆయన సలహాదారని అర్ధంచేసుకున్నాను.

దయ్యం సినిమాలు రొటీనయిపోయాయి. దయ్యంలోనే కొత్త దయ్యాన్ని చూపాలి, అన్నాడింకొకాయన. ఈయన రచయిత అని తెలిసింది.

నిజమే. దయ్యం అనగానే తెల్లచీర కట్టుకోవాలి. జుట్టు విరబోసుకోవాలి.  లతా మంగేష్కర్ గొంతులో పాటలు పాడాలి.

అక్కడే వున్న సంగీత దర్శకుడు, కహి దీప్ జలే కహి దిల్ అని పాడాడు. గుమ్నాం హై కొయీ, నైనా బర్సే రింఝిం రింఝిం…..

ఇకాపుబాబూ, అవన్నీ రొటీన్ పాటలు. మనం కొత్త దయ్యాన్ని తేవాలి, అన్నాడు నిర్మాత.

అప్పటి వరకూ మౌనంగా వున్న ఇంకో సలహాదారు నోరిప్పాడు. మనమంతా మామూలు మూసలో ఆలోచిస్తున్నాము. దయ్యం పాటలు పాడుతుంది. తీరా చూస్తే ఎవరో అమ్మాయి దయ్యం వేషం వేఉకుందని తెలుస్తుంది. అసలు దయ్యం తెల్ల చీర కట్టుకుందని ఎవరయినా చూశారా? దయ్యానికి చీరలుంటాయా? శరీరమే లేని దయ్యానికి చీరలెలా అవసరమవుతాయి? పైగా అది  చక్కని భావంతో, మంచి తీయని గొంతుతో పాటలు పాడతాయా? అది గొంతిప్పితే అందరూ హడలి చావాలి. మైమరచి ప్రేమించేయకూడదు.

విమర్శకుడా, నీ విమర్శ బాగుంది. కానీ మనమేం చేద్దాం? కొత్తగా ఏం చేద్దామో చెప్పు, అనడిగాడు, అంతా వింటున్న దర్శకుడు.

బుర్రగోక్కుంటూ విమర్శకుడు, ఆడదయ్యాలు అలవాటయ్యాయి. సరదాగా మగ దయ్యంతో సినిమా తీస్తే?

అందరూ గొల్లుమని నవ్వారు. మగ దయ్యమా? మగ దయ్యానికి తెల్లబట్టలేయలేము. జుట్టు విరబోయలేము. లతా తో పాడించలేము. ప్రేక్షకులు మెచ్చరు. తేల్చి చెప్పాడు సలహాదారు.

మగ దయ్యం సినిమాలున్నాయా? నిర్మాత రచయితనడిగాడు.

వున్నాయి. డ్రాకులా సినిమాలున్నాయి. వాంపై సినిమాలున్నాయి.

త్చ్ త్చ్. మన ప్రేక్షకులు వాటిని మెచ్చరు.

మగ దయ్యం వుంటే అది ఆడ హీరోయిన్ వెంట పడాలి. మగ దయ్యం హీరోయిన్ వెంట పడితే హీరో చూస్తూవూరుకుంటే బాగుండదు. దీన్ని కథలాగా రాసి సినిమాగా తీయటం కష్టం. మగ దయ్యం హీరోయిన్ వెంటపడటానికి కారణం బలమయినది వుండాలి.

ఇంతలో విమర్శకుడు, ఏదో పుస్తకం తిరగేస్తూ, ఒకచోట ఆగి అరిచాడు. ఇదిగో భవిష్యత్తులో ఓ మగ దయ్యం సినిమా సూపర్ హిట్ అవుతుందట. దాన్నే మనం కాస్త ఈపటి పరిస్థితులకు తగ్గట్టు మారిస్తే ఎలావుంటుంది?

మగదయ్యం సినిమా సూపర్ హిట్టా? ఏమిటా సినిమా చూద్దాం అన్నారందరూ ఆత్రంగా.

వాళ్ళ ముందుకోతెర వచ్చింది. వెంటనే తెరపైన అరుంధతి ప్రత్యక్షమయింది.

హఠాత్తుగా నా కళ్ళముందునుంచి దృశ్యాలన్ని అదృశ్యమయి బ్రహ్మబుధ్ మిగిలాడు.

ఏమయింది? అడిగా.

వాళ్ళంతా ఇప్పుడు అరుంధతి సినిమా చూస్తారు. ఆతరువాత కూచుని దాన్ని తమకాలానికి తగ్గట్టు మార్చాలని ప్రయత్నిస్తారు. అప్పుడు తయారయ్యేదే అప్పటి అరుంధతి.

అప్పటి అరుంధతి ఎలావుంటుంది? అడిగా.

ఆగు ముందు వాళ్ళా సినిమాని చూడని. ఆతరువాత వాళ్ళ చర్చలు నీకు చూపిస్తాగా, అన్నాడు బ్రహ్మబుధ్.

వాళ్ళ మార్పుల చర్చలే సినిమానా? అడిగాను.

అవును. మీ సినిమాలన్నీ ఇలాగేగా తయారయ్యేది. పది సినిమాల సీనులను కలిపి కుడితే ఒక సినిమా తయారవుతుంది కదా. టర్మినల్ ను తిరగేస్తే ప్రయాణం అవుతుంది. పడి దయ్యాల సినిమాలు కలిపితేనే కదా అరుంధతి తయారయ్యింది, అన్నాడు బ్రహ్మబుధ్.

ఒరే ఇంతలో ఇంత ఙ్నానం ఎలా సంపాదించావురా? అడిగా.

సినిమాలు చూసి అన్నాడు వాడు.

సరే ఇప్పుడు వాళ్ళు సినిమా చూడటం ఎప్పుడు పూర్తవుతుంది? అడిగా.

సినిమా అయ్యేంతవరకు. అప్పటి దాకా వేరే పని చూసుకో. వాళ్ళు చూడటం కాగానే నేనేవస్తాగా. అన్నాడు.

బ్రహ్మబుధ్ అవ్చ్చి అప్పటి అరుంధతి చూస్పేవరకూ మనకు విరామమే.

June 8, 2009 ·  · One Comment
Posted in: నా రచనలు.