Archive for June 30, 2009

కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణ సభ విశేషాలు.

పెద్దన్నకు గండపెండేరం ఎలా తొడిగారో నేను చూడలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడికి మహా మహా సన్మానాలెలా జరిగాయో నేను చూడలేదు. ఆకాలంలో మహా కవులకు జరిగే సత్కారాలగురించి చదివి, ఊహించుకుని ఈకాలం లో ఎవరికీ ఎలాంటి విలువలేకుండా పోయిందే అని బాధపడుతూండేవాడిని.

రవీంద్ర భారతి కళావేదికపై బాపు రమణలకు జరిగిన సన్మానం, పుస్తకావిష్కరణలు చూసినతరువాత  మనసు అవ్యక్తానందంతో నిండిపోయింది.

ఈకాలంలో, కళాకారులకింత గౌరవం దక్కటం చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను.

అంతకన్నా ఆనందం కలిగించిన విషయం, బయట ప్రజలు ఎగబడి పుస్తకాలు కొనటం. ఇలాంటి దృష్యం ఈ జన్మకు చూస్తాననుకోలేదు.

నాకు ఆనందంతో పాటూ కాస్త అసూయకూడ కలిగింది.

ఎందుకంటే, ఎగబడి పుస్తకాలు కొంటున్నవారంతా నడివయసు, ఆపైన వారే. అంటే, ఇక భవిష్యత్తులో, ఇలా కొనేవారూ, చదివి మెచ్చేవారూ అరుదయిపోతారన్నమాట. కాబట్టి ఇలాంటి అపూర్వమయిన, బహుషా, మళ్ళీ చూడలేని సంఘటనకు నేను సాక్షినయ్యానన్నమాట.

అయితే, ఈసభ మరో విషయాన్ని నేర్పింది.

సభకుముందు కొందరు కళాకారులు బాపు రమణల సినిమా పాటలు పాడారు. దాన్లో మగ గాయకుడు వినోద్ బాల సుబ్రహ్మణ్యంలా పాడీ పాడీ ఏపాట పాడినా అలాగే పాడటం అలవాటయిపోయింది. గొంతు బాగుంది. కానీ, పాటలోని పదాలలో జీవంలేదు.

గాయిని సురేఖ కూడా కళ్ళు పాట తప్ప మిగతా పాటలన్నీ, తేలికగా పాడేసింది.

అయితే, మేము ఎదురుచూసిన పాట నిదురించేతోటలోకి పాడిన అమ్మాయి పాట వింటే శేషేంద్రనేకాదు, మహదేవన్ కూడా మళ్ళీ జన్మలో పాటల జోలికిపోరు. అంత అద్భుతమయిన పాటను ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇంత ఘోరంగా భావ రహితంగా పాడవచ్చని నిరూపించిందా అమ్మాయి. అయితే, పాట మొదట్లోనే, కణ్ణుల్లో నీరు తుడిచి అనగానే నా కళ్ళు వొళ్ళు సర్వం జలదరించి జలదరించి( ఎవరయినా దీన్ని బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అంటే అనుకోవచ్చు. నాకేమీ బాధ, కష్టము, నష్టమూ లేవు)ఇంకా జలదరిస్తూనేవుంది. ఇలాంటి కార్యక్రమంలో ఏవో పాడాలి కాబట్టి పాడేరు తప్ప హృదయంతో పాడలేదు. కేబీకే మోహన్ రాజ్, గొంతుపోయినా, ఎవరికివారే ఈలోకం పాటను ఎంతో ఫీలింగ్ తో, అద్భుతంగా పాడాడు. అది చాలు ఆతరానికి, ఈతరానికి వున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటివారికి శరీరం చాలు. దానికే అలంకరణలు చేసి గొప్పవారయిపోతారు. అప్పటివారికి శరీరం కన్నా ఆత్మపైనే దృష్టి. అందుకే అంత ఆత్మానందం కలిగిస్తుంది వారికళ. ఈసభలో రావికొండలరావు, అక్షింతలు అధ్బుతం. మళ్ళీ ఇలాంటి సభ, ఇలాంటి కళాకారులు, ఇలాంటి సన్మానం ఈజీవితకాలంలో చూడలేననే అనుకుంటున్నాను.

సభ విశేషాలు బొమ్మల్లో చూడండి.

  Image020Image024Image025

 

 

 

Image023Image022

 

Image028Image027

Image029

 

Image030

June 30, 2009 ·  · 9 Comments
Posted in: పుస్తక పరిచయము