Archive for November 28, 2009

సూర్య దిన ఓత్రిక స్పందన

సూర్య పత్రిక ఇవాళ్ళ తన స్పందనను ప్రచురించింది. ఈ ప్రచురణ వెనుక జరిగిన కథ చెప్తాను.

నిజానికి ఇది బుధవారమే చెప్పాల్సింది. కానీ ఇతర పనులవల్ల సమయం చిక్కక ఇవాళ్ళ చెప్తున్నాను.

కథ క్రితం ఆదివారం ఆరంభమయింది.

నేను ఎలక్షన్ డ్యూటీలో వున్నాను. మా డిస్బర్సింగ్ సెంటర్ వద్ద బిజీగా వున్నాను. అప్పుడు కొల్లూరి సోమశంకర్ నుంచి ఫోను వచ్చింది.

సూర్యలో మీ బ్లాగులోని వ్యాసం ప్రచురించారు. మీపేరుకానీ, బ్లాగు పేరుకానీ రాయలేదు, అని చెప్పాడు.

నేను నమ్మలేదు. కానీ సోమ శంకర్ నాతో పరాచికాలాడడు.

అందుకే ఇంటికి ఫోనుచేసి సూర్య పత్రికకూడా కొనమని చెప్పాను.

సాధారణంగా ఆదివారం నేను అన్ని పత్రికలూ కొంటాను, ఒక్క సూర్య పత్రిక తప్ప.

ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని సోమవారం అర్ధరాత్రి ఇల్లు చేరుకుని పడి నిద్ర పోయాను. మంగళవారం లేచి తిని మళ్ళీ పడి నిద్రపోయాను.

సాయంత్రం లేచి అప్పుడు చదివాను.

కొందరు మితృలను సలహా అడిగాను.  ఆ వ్యాసంలో ప్రస్తావించిన బ్లాగర్లకీవిషయం తెలిపాను.

ఎందుకంటే, ఒకవేళ గొడవ చేస్తే మహిళా బ్లాగర్లు అనవసరంగా తమ పేరు పదిమందికీ తెలిసిందని బాధపడకూడదు కాబట్టి.

బ్లాగర్లను సలహా అడగటంలో ప్రధానంగా నా వుద్దేశ్యం బ్లాగర్లకీ విషయం తెలియటం. పాత సూర్య సంచికలన్నీ వెతికి తమ బ్లాగుల పోస్టు చౌర్యం వెలికి తీస్తారన్న ఆలోచన వల్ల అందరికీ తెలిపాను. పైగా ఇలా జరుగుతోందని అందరికీ తెలియాలి. బ్లాగులను పత్రికలవారూ చూస్తున్నారు. కాబట్టి మనం చెప్పకుండానే వరికే కాదు, అన్ని పత్రికలకూ మన బ్లాగరుల మనోభావాలు మనం చెప్పకనే చెప్పినట్టవుతుంది.

బుధవారం బ్లాగరుల స్పందన, మితృల సలహాలను విశ్లేషించి, ఒక నిర్ణయానికి వచ్చాను. సూర్య పత్రికలో సీనియర్ రిపోర్టర్ ఫోను నంబరు తెలుసుకుని అతని ద్వారా, ఆదివారం అనుబంధం, ఇన్ చార్జి చారి, ఫోను నంబర్ తెలుసుకుని, ఫోను చేసి అడిగాను.

మాకు ఈమెయిల్ వచ్చిందని చెప్పాడు.

ఈ వ్యాసం పంపిన ఈమెయిల్ చెప్పమని అడిగాను. పది నిముషాలలో చెప్తానన్నాడు. గంటయినా ఉలుకులేదు పలుకులేదు.

మళ్ళీ ఫోను చేసి అడిగాను. బిజీగా వున్నానన్నాడు.

నేను లాయర్ నోటీసు ఇచ్చి ప్రెస్ కాంఫరెన్స్ పిలవటానికి సిద్ధంగా వున్నాను. మీరు ఈమెయిల్ చెప్పటం కోసమే ఎదురుచూస్తున్నాను. ఇవ్వకపోతే ఇంకా ఆనందంగా లాయర్ నోటీసు పంపుతానన్నాను.

అయిదునిముషాల్లో ఫోను వచ్చింది. మరో సీనియర్ రిపోర్టర్ వార్తలో ఆయన పనిచేసేటప్పుడు నాకు పరిచయం వున్న ఆయన ఫోను చేశాడు. ఎడిటర్ ప్రతినిధిగా మాట్లాడుతున్నానన్నాడు. విషయం అడిగాడు.

చెప్పాను. పొరపాటయిందని ఒప్పుకున్నాడు. కొందరు గతవారం సూర్యలో మానేసి ఆంధ్రజ్యోతిలో చేరారట. వారిపనయివుంటుందన్నాడు.

పని ఎవరిదయినా ఫలితం అనుభవిస్తున్నదినేను కాబట్టి, పత్రిక ముఖంగా అపాలజీ కావాలన్నాను. ఆదివారం ఆ శీర్షిక క్రింద అది ప్రచురించాలన్నాను. ఒప్పుకున్నాడు.

మీరు మా పత్రికకూ అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాయవచ్చు, మీ పేరు మీదనే ప్రచురిస్తానన్నాడు.

నాకిప్పుడు కొత్త పత్రికకు రాసే సమయము లేదన్నాను. అదీగాక, నేను అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాయను. రాస్తే కాలంలే రాస్తానన్నాను. నాపేరుతో కాక వేరే పేరుతో కథలు, వ్యాసాలూ ప్రచురించే అవసరమూ. అలవాటూ లేదన్నాను. చివరగా, కులం ఆధారంగా వుద్యమాలు నడిపే పత్రికలకూ రాయనని చెప్పి పెట్టేశాను.

ఈరోజు, ఆ శీర్షిక క్రింద, గతవారం వ్యాసం ఎక్కడిదో ప్రచురించారు. ఈవారం వ్యాసం ఎవరిదో పేరు ఇస్తూ, ఈమెయిలూ ఇచ్చారు.

అది ఈక్రింద చూడండి.

surya4

November 28, 2009 · Kasturi Murali Krishna · 8 Comments
Posted in: వ్యక్తిగతం