Archive for December 12, 2009

హేతువాదులు, ఫాసిస్టులూ!

ఇటీవలె అనుకోకుండా ఒక హేతువాద ప్రతినిధితో చర్చ జరిపే అవకాశం నాకు కలిగింది. ఆయన పేరు గోగినేని బాబు. శాంభవి కేసు విషయంలో చర్చకు స్టూడియో ఎన్ వారు పిలవటంతో నకీ అమూల్యావకాశం లభించింది. హేతువాదమంటే హేతువులేని వాదమని, ఫాసిజానికి మరో రూపన్న భావన ఈ చర్చ ఫలితంగా నాకు కలిగింది.

శాంభవి స్కూలుకెళ్ళాలనీ, స్కూలుకెళ్ళటం ప్రతి శిశువు ప్రాథమిక హక్కనీ చాలా గొప్పవచనాలు పలికారాయన చర్చను ఆరంభిస్తూ.

నేను ఆయనతో ఏకీభవించాను. కానీ, స్కూలుకెళ్ళేహక్కు శాంభవికేకాదు, ప్రతి పిల్లవాడికీ వుంటుందన్నాను. వీధుల్లో అడుక్కునే పిల్లలదగ్గరనుంచి, మేస్త్రీల దగ్గర కూలీలు చేసే పిల్లలవరకూ, ఇంకా అనేక ఘోరమయిన పనులు బలవంతంగా చేసే పిల్లలకూ చదివే హక్కు వుంటుందన్నాను. మరి అలాంటి పిల్లల హక్కులు వదలి ఒక్క శాంభవి వెంటే పడటంలో ఔచిత్యమేమిటని అడిగాను.

అదీగాక, నిజానికి జనులకు విఙ్నానమే ఇవ్వాలన్న ఆలోచన వుంటే, సమాజంలో బోలెడంత అఙ్నానముంది. చదువుకున్న వారికే తమ హక్కులు తెలియవు. ప్రజలను, ప్రతివారూ మభ్యపెట్టి, భయపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. వారందరికీ అసలు నిజాలు చెప్పడి. ఇంకా, ట్రయివ్బల్స్ కోసం బోలెడన్ని చట్టాలూ, హక్కులూ వున్నా, వారు అనేక అణచివేతలకు గురవుతున్నారు, వారిని విఙ్నానవంతులను చేయండి. ఎందుకూ పనికిరాని శాంభవి కేసుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని సంస్థలు పోరాడేబదులు, ఇంకా అవసరమున్న వారికోసం ఇదే శక్తి, సమయమూ ఖర్చుచేయండి కాస్త అర్ధముంటుంది అన్నాను.

దానికాయనకు కోపం వచ్చేసింది.

ఏదో చేస్తున్నవారిని ఇదిచేయరు, అదిచేయరు అంటారు. మీరేం చేస్తున్నారు? అని నన్నడిగారాయన.

మీకు తెలుగు చదవటం రాదు కాబట్టి నేనేం చేస్తున్నానో మీకు తెలిసేవీలులేదు. నేను చెప్పినా మీకు అర్ధం కాదు. నా రచనల ద్వారా నేను నమ్మిన నిజాలను వివరిస్తున్నాను. శాంతి సమన్వయాలకోసం ప్రయత్నిస్తున్నాను. అంతేకానీ మీలా ప్రజల విశ్వాసాలతో చెలగాటాలాడటంలేదు, అన్నాను.

దానికాయన, మేము అన్ని కేసులూ చేపట్టలేము, కేవలం మతపరమయిన exploitation వున్నకేసులే చేపడతామూ అన్నాడు.

అయితే, మీకు ఇతర యే మతాలలోనూ మూఢనమ్మకాలు కనబడలేదా, అనడిగాను. నువ్వు చచ్చి పదిమందిని చంపితే స్వర్గానికెళ్తావని నమ్మించే మతాలు అమాయకులను ఎక్ష్ప్లాయిట్ చేయటం కనబడటంలేదా? వారికి తెలివినివ్వండి, మన దేశానికే కాదు, ప్రపంచానికి మంచి చేసినవారవుతారు అన్నాను.

దానికాయనకు మరింత కోపం వచ్చింది. దేశంలో ఒక పర్వెర్టెడ్ ఆలోచన మొదలయింది. ఈ మతాన్నే ఎందుకు తిడతారు, ఆమతాన్నెందుకు అనరు అంటారని పరుషంగా మాట్లాడాడు. శాంభవిని తల్లితండృలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారన్నాడు.

శాంభవి కనీసం వేదాంతం పలుకుతోంది. ఆరేళ్ళ పసిపిల్లలు అర్ధనగ్నంగా, బూతు పాటలు పాడుతూ టీవీ చానెళ్ళలో గెంతుతున్నారు. ఇది తల్లి తండృలూ, చానెళ్ళూ కలసి చేస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ కాదా? అనడిగాను. ఇంకా సినిమాల గురించి పట్టిలేదా? అనడిగాను. కనీసం శాంభవికి నీడ, కూడూ, గూడూ వున్నాయి. అవీలేక ఎంతో మంది అల్లల్లాడుతున్నారు. శాంభవి దలై లామా అవతారమయినా, జార్జ్ బుష్ అవతారమయినా నష్టంలేదు. కానీ, ఇలాంటి అనాథ పిల్లలు అసాంఘిక శక్తుల ప్రభావంలోకి వస్తే, వారికి వ్యక్తిగతంగా, సమాజానికి సామూహికంగా నష్టం, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని పట్టించుకోండి, అన్నాను. అదీగాక విశ్వాసాన్ని దెబ్బ తీసేముందు ప్రత్యామ్నాయం చూపాలి. ఫ్రీగా దొరికే మందు పనికిరాదని ప్రత్యామ్నాయం చూపక పోవటం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు బాగుపడుతున్నాయి. సాయిబాబా మీదా వుండుండి ఆరోపణలు చేస్తూ ఏమి సాధించారు? ఆయన భక్తులలో ప్రేరేపిస్తున్న నిస్స్వార్ధ సేవా భావనలో వెయ్యవవంతుకూడా మీరు ప్రేరేపించగలరా? ఏదో పబ్లిసిటీకోసం కాకపోతే ఎందుకీ పనికిరాని వ్యర్ధ ప్రయాసలు, ఒకవేళ శాంభవి స్కూలుకి వెళ్ళటం వల్ల ప్రపంచంలో పిల్లలందరి చదివే హక్కు నిలబడుతుందంటే పదండి నేనూ మీతో వస్తాను. అందరం కలసి శాంభవిని స్కూలుకు పంపుదాం. లేకపోతే ఎలాంటి పబ్లిసిటీ దొరకని అనాథ పిల్లల పరిస్థితి మెరుగుకోసం ప్రయత్నిద్దాం, అన్నాను.

నాకు టైం లేదని వెళ్ళిపోయాడాయన. కార్యక్రమానికి వచ్చేముందే కార్యక్రమమెంత సేపో తెలుస్తుంది. అది గంట సేపుండే ఫోన్ ఇన్ కార్యక్రమం. కానీ, ఆరంభంలో అరగంట కన్నా ఎక్కువుండనని, వాదన సగంలో వుండగానే లేచి పోవటమనేది చూస్తూంటే, వ్యతిరేక వాదనను వినే ఓపిక, తీరిక ఈ హేతువాదులకు లేదనిపిస్తుంది. పైగా, శాంభవి స్కూలు హక్కే సర్వస్వం అన్నట్టు మాట్లాడుతూంటే, వీరు పట్టిన కుందేలుకు కాళ్ళేఅకాదు, చెవులు, కళ్ళు కూడా లేవని, తాము అనుకున్నదే కరెక్టనే అహేతుక మూర్ఖత్వం వీరి సొత్తనీ అనిపించింది.

అంతేకాదు, వాదనలో ఆయన నాకు మానవత్వం లేదనీ, శాంభవి దుస్థితి అర్ధం చేసుకోలేని నేను మనిషిని కాదనీ అన్నాడు.

మీరు నా మాట వింటే తెలివయినవారు, లేకపోతే మూర్ఖులు అనటంలో ఎంత హేతువాదము, విఙ్నానమూ వుందో నాకు అప్పుడే అర్ధమయింది. అలాంటి మానవత్వమూ హేతువాదమూ నాకు అక్కరలేదని అనిపించింది.

అప్పుడనిపించింది, ఈ హేతువాద్లంతా, ఏసీగదులలో కూచుని సమాజానికి విఙ్నానాన్ని పంచాలని కంకణం కట్టుకున్నారుకాబట్టి సరిపోయింది, లేకపోతే, వీరికి అనుచరులుండివుంటే ఫాసిస్టులకేమీ తీసిపోయేవారుకారు. తమను వ్యతిరేకించినవారిపై దాడులు చేసేవారు. మీరు, హేతువాదులపై ద్వేషంతో మాట్లాడుతున్నారని, ఆయన నన్నన్నప్పుడే నాకు వీరి ఫాసిస్టు లక్షణాలు తెలిసిపోయాయి.

అయితే, ఒక హేతువాదిని చూసి అందరూ ఇలాగే మూర్ఖంగా వుంటారని తీర్మానించటం, రేషనల్ ఆలోచన కాదంటారా. ఈయన హేతువాద, విఙ్నాన వేదికల అధ్యక్షుడు. తలను చూసేకదా మనం మొత్తం శరీరాన్ని గౌరవించేది. తలే ఇలావుంటే, ఇక మిగతావి ఊహించాలంటే ఎలాగో వుంటుంది.

ఈ కార్యక్రం స్టూడియో ఎన్ లో 22.11.2009 సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమయింది.

December 12, 2009 · Kasturi Murali Krishna · 24 Comments
Posted in: Uncategorized