Archive for March, 2010

ఏమిటో ఈ మాయా??

నిన్న నేను నా స్నేహితుడూ కలసి చాలా కాలం తరువాత సినిమా హాలులో ఒక సినిమా చూశాము. ఆ సినిమా పేరు ఏం మాయ చేసావే!

తలా తోకా అర్ధం పర్ధం లేని సినిమాల జాబితాలో ఈ సినిమాను నిస్సందేహంగా చేర్చవచ్చు.

తెలుగురాని పరభాషా నాయిక, తెలుగురాని తెలుగు హీరోలు ప్రతి చిన్న విషయానికీ మతిలేని గతితప్పిన వారిలా, పిచ్చిగా, ఆందోళనతో, అయోమయాంధకారాలలో కొట్టుమిట్టాడుతున్న గుడ్డివాళ్ళలా అద్భుతంగా నటించారు.

ఇద్దరూ తలలను అదేపనిగా వణికించటం నటన అన్న భ్రమలో వున్నట్టున్నారు. ప్రతి సన్నివేషంలో తలలను వణికిస్తూనేవున్నారు. ఎమోషనల్ సన్నివేషాలలో దిక్కులు చూడటం అతి చక్కని నటన అని హీరో కి ఎవరొ అన్రేర్పివుంటారు. అతి చక్కగా దిక్కులుచూసి ప్రేక్షకుల సహనానికి పరీక్స్షలు పెట్టాడు. ఈ నటనవల్ల హాస్యం కూడా కలిగిందనుకోండి.

నాయిక ఇంటికి అర్ధరాత్రి దొంగతనంగా వెళ్టాడు హీరో. ఆమె చలో పెళ్ళిచేసుకుందాం అంటుంది. అప్పటిదాకా అదేమాట అడుగుత్న్న హీరో కనీసం యాహూ అని ఎగరకున్నా ఎగిరిగంతేసి చలో అనకుండా, గోడకు ఆనుకుని ముఖం ఎటో తిప్పేసి ఇప్పుడేఅ వచ్చేస్తే ఇక సినిమా ఏముది అన్నట్టు చూస్తాడు.

మరో సందర్భంలో నాయిక నేనూ వచ్చేస్తా నీ దగ్గిరకు అంటుంది. అప్పుడు అర్ధంచేసుకో అని వద్దన్న హీరో, నన్నుమరచిపో అనగానే పరుగెత్తుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి, నానా అల్లరీ చేసి అదే హీఓఇజం, అదే అసలుప్రేమ అంటాడు. ఇదిచూసి పిల్లలంతా అదే అసలు పాషనేట్ ప్రేమ అనుకుంటారు.

ఈ సినిమాలో నాకు నచ్చిన దృష్యం ఒకటుంది.

అర్ధరాత్రి నాయిక ఇంటికి వస్తాడు హీరో. అల్లరి చేస్తాడు. ఆమె తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ వెధవ గేటును బాదుతాడు. అప్పుడు ఆమె సోదరుడు బయటకు వస్తాడు. ఒరే నీ చెల్లిని క్రిందకు పంపరా అంటాడు హీరో. వుండు నేను వస్తున్నా అంటాదా సోదరుడు. కడుపుబ్బ నవ్వి చచ్చాను.

సినిమాలో హఠాత్తుగా, విదేశీయులు వచ్చి నృత్యాలు చేస్తూంటారు. ఇదో యూరోపియన్ సినిమాలనుంచి నేర్చుకున్న తెక్నిక్కు. పాటలన్నీ పిచ్చికూతలే. ఒక్క పాటకీ సందర్భం లేదు. ముఖ్యంగా అమెరికాలో పార్కులో కలసిన తరువాత సినిమా అయిపోయిందిరా బాబూ అని నిట్టూర్చేలోగా ఒక పాట వస్తుంది. ఏమిటో ఒకప్పుడు పాటలకోసం సినిమాలు చూసేవారంటే నమ్మలేము.

ఆస్కార్ అవార్డు సంగీత రత్నం ఏ ఆర్ రెహెమాన్ నిద్రపోతూ సంగీతం ఇచ్చివుంటాడీసినిమాకు. లేక ఎలెక్ట్రానిక్ గిటార్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకుని వుంటాడు. తెరపైన కనబడే దృష్యానికీ సంగీతానికీ సంబంధమేలేదు. దేనిదారి దానిది.

దర్శకుడు ముందుగా స్క్రిప్టు చదవటం నేర్చుకోవాలి. సినిమా ఎక్కడికక్కడే కాళ్ళువిరిగిన ఒంటెలా చతికిలబడిపోతూంటుంది. ముందుకు తోయటం తెలియక అవేఅవే సంభాషణలను చెప్పించి చంపాడు. సంభాషణలూ అర్ధం పర్ధం లేకుండా అయోమయంలోనే వున్నాయి.

ఏదయినా చూస్తానన్న హీరో ఇంటిముందు గొడవ అవుతూంటే ఇంట్లో నక్కుతాడు. నాయిక ధైర్యంగా పెళ్ళి వద్దంటుంది. హీరో ఆమెకు కనబడాకుండా దాక్కుంటాడు. ఈ హీరోలేమిటో, వీళ్ళ ప్రేమలేమిటో, ఈ సినిమాలేమిటో??????

ఈ సినిమా చూసిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. సాంకేతికంగా మనవారు ఎవరికీ వెనుకబడిలేరు. మనవారిలోపమల్లా మంచి స్క్రిప్టులు, కాస్త screen presence వున్న నటుల దగ్గరే తెలుస్తుంది.

ఈ సినిమా చూస్తూంటే నేను ముసలివాడినయిపోయాననీ, ఇక సినిమాలు చూడటం తగ్గించాలనీ అర్ధమయింది. హాలులో వున్నవారి సగటు వయసు 20-25 లోపే..

మరో విషయం…. ఈ ప్రేమ సినిమాలలో ఎప్పుడూ కష్టపడేఅది నాయిక. కానీ, అందరూ హీరోపైన సానుభూతి చూపుతారు.

ముఘల్ ఎ ఆజం లో హీరో హాయిగా రాజ మందిరంలో వుంటే నాయిక జైలులో సంకెళ్ళమధ్య గడుపుతుంది. ఆమె నాట్యం చేయటానికి వస్తోందని తెలియగానే ఒక్క రాత్రి కష్టానికే ప్రేమ ఎగిరిపోయిందా అంటాడు హీరో. వాడిని ఒక్క రోజు జైల్ లో పెట్టివుంటే తెలిసేది.

ఈ సినిమాలోనూ అంతే. హీరో హాయిగా ఇంట్లో దాకుంటాడు. వెంటపడి డయలాగులు కొడతాడు. అందరినీ ఎదిరించింది, కష్టాలు అనుభవించిందీ నాయికనే. ఏమిటో, నాగేశ్వరరావు నాయికను సావిత్రితో పోలిస్తే కొత్త సావిత్రి ఎలా వుందోనని అనుకున్నాను. వయసయిపోయింది కదా, నాగేశ్వరరావు కళ్ళ శక్తి తగ్గివుంటుంది. నా కళ్ళ శక్తీ తగ్గింది.

నాయకుడు, నూరు రోజులు ఉపవాసం చేసిన తరువాత  లేచొచ్చిన వాడిలా వున్నాడు. నాయిక సగం తయారయిన తరువాత విసుగొచ్చి త్వరగా పూర్తిచేసిన అసంపూర్ణ చిత్రపటంలా వుంది.  అయినా ఈ సినిమా అందరూ మెచ్చటమూ, పడీ పడేచూడటమూ చూస్తూంటే, ఏమిటో ఈ మాయా…. అని పాడుకోవాల్సివస్తోంది.

March 14, 2010 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: sinemaa vishleashaNaa.

తెలంగాణా తేట గీతం-2

ధర్మపురి ప్రయాణం లో నేను రాసుకున్న రెండవ పాట ఇది. ఈపాటలో చమత్కారం నాకు బాగా నచ్చింది. పదాలు వాడిన విధానం అద్భుతం. పాట ఇది.

పున్నపు వెన్నెల వలలో పూసీ కాయంగ వలలో
అమాస చీకటిలో వలలో ఆగి కాయంగా వలలో
చుక్కల రాణి వల్లో చూడనిచ్చినాదీ వల్లో
చూసినంతయూ చూసీ వల్లో సుడికొంగులువట్టే వల్లో
మైకొంగులు వట్టే వల్లో మీరెవ్వారే వల్లో
మేనత్తకొడుకూనీ వల్లో నీబావనీ వల్లో
నీ అమ్మనాన్నలకూ వల్లో నేనే అల్లుడినీ వల్లో
వాళ్ళింటి ముంగట వల్లో కల్యాప చెట్టూ వల్లో
కోతలు కాసిందీ వల్లో పూతలు పూసిందీ వల్లో
కాయలు కోపిచ్చీ వల్లో కాటుకలిప్పిచ్చీ వల్లో
ఇదికాస్త మాఇంటికీ వల్లో ఇచ్చీవస్తావా వల్లో
ఇచ్చీవత్తురుగానీ వల్లో ఇల్లూ ఎరుకలేదూ వల్లో
పోయీవత్తునుగానీ వల్లో పోలికతెలియరాదూ వల్లో
పోంగా మా ఇల్లూ వల్లో పోకల దర్వాజా వల్లో
రాంగా మా ఇల్లూ వల్లో రంగుల తలుపూలూ వల్లో!!!!.

March 10, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

తెలంగాణా తేట గీతం-1

ఇటీవలె నేను ధర్మపురికి వెళ్ళాను.

ఆరోజు స్వామివారి కళ్యాణం జరుగుతోంది. ఇసకేస్తే రాలనంత జనం. అయినా, తెలిసిన వారుండటంతో దర్శనాలు సులభంగా అయ్యాయి.

ఆ హడావిడినుంచి బయటకు వచ్చి, గుడికి దూరంగా, ప్రశాంతంగా వున్న చోట విశ్రాంతి తీసుకుంటూంటే కొందరు ఆడపిల్లలు ఇల్లిల్లూ తిరుగుతూ పాటలు పాడటం వినిపించింది.

ఆ పాటలు వింటూ వారిని వెంబడించాము.

వారందరూ 10 నుండి 14 ఏళ్ళ లోపు వారు. జాతరలో ఏవయినా కొనుక్కునేందుకు ఇలా పాటలు పాడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ పాటలు వాళ్ళ అమ్మలు నేర్పారట.

వారిని అడిగి కొన్ని పాటలు రాసుకున్నాను. వాటిల్లో ఒకటి ఈ పాట.

పాటలో పదాలు చూడండి. సాహిత్యం చూడండి. చమత్కారం చూడండి. శృంగారం చూడండి. గడుసుదనం, అమాయకత్వాలు చూడండి.  అత్యద్భుతంగా వున్నాయీ పాటలు వారు పాడుతూంటే. అందులోని ఒక పాట ఇది. వీలువెంబడి మిగతా పాటలు అంద్చేస్తాను.

ఈ పాటలో ఓ రాణి అన్నచోట ఎవరిపేరయినా పెట్టుకోవచ్చట.

కందిపూసె కందిగాసె
కంది కోడలు నంది మేసె
నందీవేల నువ్వేరాగనే
ఒ రానీ, మందీ కండ్లు మంట మండెనే, నా రాణీ

దుంపు దుంపు నీ కురులు
దుయ్యరారు, ముడువరారు
దూసిమడసె కొప్పు వెట్టవే
ఓరానీ, కొప్పునిండా గుప్పెడు మల్లెలే…
కొప్పును చూసిరాపోతివే నా రానీ……

March 8, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

హైకు, నాట్ లైట్ వైటూ!

హైకు,

ఇ డోంట్ లైకూ,

అన్నాను హైకు అంటే ఏమిటో సరిగా తెలియనప్పుడు. మనవారు రాస్తున్న హైకులను చూసి, హైకు, కైకు? అని కూడా ప్ర్శ్నించాను. మన దగ్గర్ వున్న కవితారీతులను వదిలి లైట్ వైట్ హైకు వెంట కవులు పడటాన్ని హేళన చేసేవాడిని.

కానీ, ఇప్పుడు,

హైకూ,                                             haiku

కాదంత,

లైటు వైటూ

అని అర్ధమయింది.

హైకూ, హెవీ వైటు, మహమ్మదలీ ఫైటూ అని అంటున్నానిప్పుడు.

హైకూ పట్ల నా ద్రుక్పథంలో ఇంత మార్పు రావటానికి ప్రధాన కారణం, డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ రచించిన హైకు సారస్వతం పుస్తకం.

భావనా బలం లేనివారు, భాషపైన పట్టు సాధించాలన్న తపన లేక, నోటికొచ్చింది రాసేసి లేని వాటిని వూహించటమే తమ సృజనాత్మతకతకు నిదర్శనం గా చలామణీ చేసి పేరు సంపాదించాలనుకున్న చేతకాని ఆధునిక వచనకవుల కొత్త పాశుపతాస్త్రాల నమూనాలు హైకులు, నానీలు, నానోలు, నోనోలు, నీనీలు, నాకన్నాలూ లాంటి కవితవికృతాకృతులని అనుకున్నాను. నా ఆలోచనలో పొరపాటున నాకర్ధం చేసిన పుస్తకం ఇది.

ఈ పుస్తకంలో 10 అధ్యాయాలున్నాయి.

హైకు సాహిత్యం పూర్వాపరాలు, మౌలిక అంశాలు, లక్షణాలు, స్వభావం, సౌష్టవం, లయ, సాంప్రదాయం, విస్తరణ, నిర్మాతలు వంటి అధ్యాయాలు హైకు జపాన్ వారి సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, ఎలా హైకు అభివ్రుద్ధి చెందిదో మనకు తెలుపుతాయి.

హైకు అంటే ఏవో అర్ధంలేని మూడు గజిబిజి వాక్యాల కూర్పు అని మన తెలుగు హైకులు చదవగా ఏర్పడిన తేలిక అభిప్రాయం తప్పని తెలుస్తుంది.

అయితే, వేదాలలో హైకు అన్న అధ్యాయంలో వాదన అంత ఆమోదయోగ్యంగా తార్కికంగా లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా మానవుడి ఆలోచనాసంవిధానంలోని ఏకసూత్రత గురించిన ఆలోచనలు కలిగిస్తుంది.

తెలుగు సాహిత్యంలో హైకు అన్న అధ్యాయం చదివినా తెలుగు హైకులపట్ల ఎలాంటి మైకం గౌరవం కలగవు.

ఈ పుస్తకం చదివిన తరువాత జపానీయులు సాంప్రదాయ కవితాప్రక్రియ అన్న భావంతో హైకు పై గౌరవం కలుగుతుంది. కానీ, మనవారు మన సాంప్రదాయ రక్రియలు వదిలి పరాయి ప్రక్రియల మోజులో పడటం కోకిల కాకి అవ్వాలన్న ప్రయత్నమే అన్న అభిప్రాయం మాత్రం బలపడుతుందీ పుస్తకం చదివినతరువాత.

హైకు గురించి ఇంతగా పరిశోధించి అనేక వివరాలను అందించిన రచయిత అభినందనీయుడు.

హైకు సారస్వతం

రూప్ కుమార్ డబ్బీకార్

150 పేజీలు,

70 రూపాయలు

పాలపిట్ట బుక్స్
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెన్సి
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
9848787284.

March 5, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: pustaka paricayamu

సప్తగిరి చానెల్ లో వేదిక కార్యక్రమం చూడండి!

ఆదివారం అంటే 8వ తారీఖున, రాత్రి ఎనిమిది గంటలకు వేదిక అనే చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈ వేదిక కార్యక్రమం లో మహిళల సమానహక్కులు, అవకాశాలు అనే అమ్షం పైన చర్చ జరుగుతుంది.

ఈ చర్చలో నేను, కొండవీటి సత్యవతి గారు, ఎం వీ లక్ష్మి గారు పాల్గొన్నాము.

ఈ కార్యక్రమం చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.

సప్తగిరి చానెల్ లో….

ఆదివారం, 8వ తారీఖు,

రాత్రి 8 గంటలకు,

వేదిక కార్యక్రమము చూడండి.

March 5, 2010 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , ,  · Posted in: Uncategorized

అహ, నాకు సన్మానమంట!!!!!

మా రైల్వేలో లలితకళాసమితి అని సాంస్కృతిక సంస్థ వుంది. వారు రైల్వే ఉద్యోగం చేస్తూ సాహిత్య రంగంలో చురుకుగా రచనలు చేస్తున్న వారిని సన్మానించాలని అనుకున్నారు. మొత్తం అయిదుగురికి చేయాలని అనుకున్నారు. మరి ఎలాగ తెలిసిందో ఆ అయిదుగురిలో నన్నూ ఒకరిగా ఎంచుకున్నారు.

నన్ను అడిగితే నేను మరో మంచి రచయిత పేరు సూచించాను. ఎందుకంటే నేను ఎన్నడూ లలిత కళా సమితి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. కాబట్టి, లలిత కళా సమితిలో చురుకుగా పాల్గొంటూ, రచనలు చేస్తున్న ఆ రచయితను సత్కరిస్తే ఔచిత్యంగా వుంటుందని అన్నాను.

మేము అయిదుగురికే సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు.

నాబదులు ఆయనకు చేయండి అన్నాను.

తీరాచూస్తే వారు అతికించిన పోస్టర్లలో నా పేరుంది.

సన్మానం చేయాలనుకున్నది వారిష్టం. మధ్యలో నీ బోడిసలహాలతో సన్మానం రా మోకాలొడ్డకు అన్నారు శ్రేయోభిలాషులు.

అదీ నిజమే అనిపించింది.

అందుకే అహ నాకు సన్మానంట అనుకుంటూ తయారయిపోతున్నాను. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదిగో ఆహ్వానపత్రిక…….

sanman

March 3, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized