Archive for March 14, 2010

ఏమిటో ఈ మాయా??

నిన్న నేను నా స్నేహితుడూ కలసి చాలా కాలం తరువాత సినిమా హాలులో ఒక సినిమా చూశాము. ఆ సినిమా పేరు ఏం మాయ చేసావే!

తలా తోకా అర్ధం పర్ధం లేని సినిమాల జాబితాలో ఈ సినిమాను నిస్సందేహంగా చేర్చవచ్చు.

తెలుగురాని పరభాషా నాయిక, తెలుగురాని తెలుగు హీరోలు ప్రతి చిన్న విషయానికీ మతిలేని గతితప్పిన వారిలా, పిచ్చిగా, ఆందోళనతో, అయోమయాంధకారాలలో కొట్టుమిట్టాడుతున్న గుడ్డివాళ్ళలా అద్భుతంగా నటించారు.

ఇద్దరూ తలలను అదేపనిగా వణికించటం నటన అన్న భ్రమలో వున్నట్టున్నారు. ప్రతి సన్నివేషంలో తలలను వణికిస్తూనేవున్నారు. ఎమోషనల్ సన్నివేషాలలో దిక్కులు చూడటం అతి చక్కని నటన అని హీరో కి ఎవరొ అన్రేర్పివుంటారు. అతి చక్కగా దిక్కులుచూసి ప్రేక్షకుల సహనానికి పరీక్స్షలు పెట్టాడు. ఈ నటనవల్ల హాస్యం కూడా కలిగిందనుకోండి.

నాయిక ఇంటికి అర్ధరాత్రి దొంగతనంగా వెళ్టాడు హీరో. ఆమె చలో పెళ్ళిచేసుకుందాం అంటుంది. అప్పటిదాకా అదేమాట అడుగుత్న్న హీరో కనీసం యాహూ అని ఎగరకున్నా ఎగిరిగంతేసి చలో అనకుండా, గోడకు ఆనుకుని ముఖం ఎటో తిప్పేసి ఇప్పుడేఅ వచ్చేస్తే ఇక సినిమా ఏముది అన్నట్టు చూస్తాడు.

మరో సందర్భంలో నాయిక నేనూ వచ్చేస్తా నీ దగ్గిరకు అంటుంది. అప్పుడు అర్ధంచేసుకో అని వద్దన్న హీరో, నన్నుమరచిపో అనగానే పరుగెత్తుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి, నానా అల్లరీ చేసి అదే హీఓఇజం, అదే అసలుప్రేమ అంటాడు. ఇదిచూసి పిల్లలంతా అదే అసలు పాషనేట్ ప్రేమ అనుకుంటారు.

ఈ సినిమాలో నాకు నచ్చిన దృష్యం ఒకటుంది.

అర్ధరాత్రి నాయిక ఇంటికి వస్తాడు హీరో. అల్లరి చేస్తాడు. ఆమె తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ వెధవ గేటును బాదుతాడు. అప్పుడు ఆమె సోదరుడు బయటకు వస్తాడు. ఒరే నీ చెల్లిని క్రిందకు పంపరా అంటాడు హీరో. వుండు నేను వస్తున్నా అంటాదా సోదరుడు. కడుపుబ్బ నవ్వి చచ్చాను.

సినిమాలో హఠాత్తుగా, విదేశీయులు వచ్చి నృత్యాలు చేస్తూంటారు. ఇదో యూరోపియన్ సినిమాలనుంచి నేర్చుకున్న తెక్నిక్కు. పాటలన్నీ పిచ్చికూతలే. ఒక్క పాటకీ సందర్భం లేదు. ముఖ్యంగా అమెరికాలో పార్కులో కలసిన తరువాత సినిమా అయిపోయిందిరా బాబూ అని నిట్టూర్చేలోగా ఒక పాట వస్తుంది. ఏమిటో ఒకప్పుడు పాటలకోసం సినిమాలు చూసేవారంటే నమ్మలేము.

ఆస్కార్ అవార్డు సంగీత రత్నం ఏ ఆర్ రెహెమాన్ నిద్రపోతూ సంగీతం ఇచ్చివుంటాడీసినిమాకు. లేక ఎలెక్ట్రానిక్ గిటార్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకుని వుంటాడు. తెరపైన కనబడే దృష్యానికీ సంగీతానికీ సంబంధమేలేదు. దేనిదారి దానిది.

దర్శకుడు ముందుగా స్క్రిప్టు చదవటం నేర్చుకోవాలి. సినిమా ఎక్కడికక్కడే కాళ్ళువిరిగిన ఒంటెలా చతికిలబడిపోతూంటుంది. ముందుకు తోయటం తెలియక అవేఅవే సంభాషణలను చెప్పించి చంపాడు. సంభాషణలూ అర్ధం పర్ధం లేకుండా అయోమయంలోనే వున్నాయి.

ఏదయినా చూస్తానన్న హీరో ఇంటిముందు గొడవ అవుతూంటే ఇంట్లో నక్కుతాడు. నాయిక ధైర్యంగా పెళ్ళి వద్దంటుంది. హీరో ఆమెకు కనబడాకుండా దాక్కుంటాడు. ఈ హీరోలేమిటో, వీళ్ళ ప్రేమలేమిటో, ఈ సినిమాలేమిటో??????

ఈ సినిమా చూసిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. సాంకేతికంగా మనవారు ఎవరికీ వెనుకబడిలేరు. మనవారిలోపమల్లా మంచి స్క్రిప్టులు, కాస్త screen presence వున్న నటుల దగ్గరే తెలుస్తుంది.

ఈ సినిమా చూస్తూంటే నేను ముసలివాడినయిపోయాననీ, ఇక సినిమాలు చూడటం తగ్గించాలనీ అర్ధమయింది. హాలులో వున్నవారి సగటు వయసు 20-25 లోపే..

మరో విషయం…. ఈ ప్రేమ సినిమాలలో ఎప్పుడూ కష్టపడేఅది నాయిక. కానీ, అందరూ హీరోపైన సానుభూతి చూపుతారు.

ముఘల్ ఎ ఆజం లో హీరో హాయిగా రాజ మందిరంలో వుంటే నాయిక జైలులో సంకెళ్ళమధ్య గడుపుతుంది. ఆమె నాట్యం చేయటానికి వస్తోందని తెలియగానే ఒక్క రాత్రి కష్టానికే ప్రేమ ఎగిరిపోయిందా అంటాడు హీరో. వాడిని ఒక్క రోజు జైల్ లో పెట్టివుంటే తెలిసేది.

ఈ సినిమాలోనూ అంతే. హీరో హాయిగా ఇంట్లో దాకుంటాడు. వెంటపడి డయలాగులు కొడతాడు. అందరినీ ఎదిరించింది, కష్టాలు అనుభవించిందీ నాయికనే. ఏమిటో, నాగేశ్వరరావు నాయికను సావిత్రితో పోలిస్తే కొత్త సావిత్రి ఎలా వుందోనని అనుకున్నాను. వయసయిపోయింది కదా, నాగేశ్వరరావు కళ్ళ శక్తి తగ్గివుంటుంది. నా కళ్ళ శక్తీ తగ్గింది.

నాయకుడు, నూరు రోజులు ఉపవాసం చేసిన తరువాత  లేచొచ్చిన వాడిలా వున్నాడు. నాయిక సగం తయారయిన తరువాత విసుగొచ్చి త్వరగా పూర్తిచేసిన అసంపూర్ణ చిత్రపటంలా వుంది.  అయినా ఈ సినిమా అందరూ మెచ్చటమూ, పడీ పడేచూడటమూ చూస్తూంటే, ఏమిటో ఈ మాయా…. అని పాడుకోవాల్సివస్తోంది.

March 14, 2010 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: sinemaa vishleashaNaa.