Archive for March 15, 2010

జాయెతొ జాయె కహా????- ఒక విశ్లేషణ!!!!

నాయకుడు, నాయిక ప్రేమించుకుంటారు. వారి మధ్య ప్రేమ వుందని చాలా కాలం వరకూ వారికే తెలియదు. ఎందుకంటే, నాయకుడికి పరిచయమయ్యేసరికే నాయిక ఒక సంగీత దర్శకుడిని వెతుకుతూంటుంది. అతడిని కలసి పాటలు పాడి పేరు సంపాదించాలని కలలు కంటూంటుంది. అయితే, ఆ సంగీత దర్శకుడు ఇల్లు మారటం వల్ల ఆమె నగరంలో వొంటరిగా నిలువ నీడ లేకుండా మిగులుతుంది. ఆ సమయంలో నాయకుడు ఆమెని అత్యాచారానికి గురవకుండా కాపాడతాడు.

నాయకుడు మామూలు టాక్సీ డ్రయివర్. ఒక క్లబ్బులో డాన్సర్ తో అతనికి స్నేహం. తాగుతాడు. జూదం ఆడతాడు. తనమీద తనకే సదభిప్రాయం లేనివాడు హీరో. నాయికకు ఆశ్రయమిస్తాడు.

కలసి వుండటం వల్ల, కలసి తిరుగుతూండటం వల్ల సాన్నిహిత్యం పెరుగుతంది. కానీ మనసు విప్పి ఎవరూ మాట్లాడరు. ఇంతలో నాయకుడికి సంగీత దర్శకుడి చిరునామా తెలుస్తుంది. ఆమె అభివృద్ధికి తనపైన ఆమెకు, ఆమెపైన తనకూ పెరుగుత్న్న అభిమానాన్ని ప్రతిబంధకంలా కానివ్వడు నాయకుడు. ఆమెను తీసుకెళ్ళి సంగీత దర్శకుడి ఇంటి ముందు వదలుతాడు.

ఆమె పాడుతుంది. జాయెతొ జాయె కహా? అని. వెళ్ళినా ఎటు వెళ్ళాలి? అని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే,

సీనేమె షోలే, సాసోమె తూఫాన్, కాబట్టి.

అంతేకాదు

ఓజానెవాలే, దామన్ చుడాకే, ముష్కిల్ హై జీనా, తుం కో భులాకే

అంటుంది.

చేయి విదిలించుకుని వెళ్ళిపోతున్నా నిన్ను మరచి జీవించటం కష్టం అంటోంది.

ఆమెకూ వదలాలని లేదు. అతనికీ వదలాలని లేదు. కానీ తప్పదు.

ఈక్కడ ఇద్దరూ డయలాగులు కొట్టరు. ఏడ్పులు పెడబొబ్బలూ లేవు. ఇద్దరూ మౌనంగా వుంటారు.

నాయిక తన వేదనను, బాధను పాటలో ప్రకటిస్తుంది.

కానీ, హీరో తల తిప్పుకుంటాడు.

సంగీత దర్శకుడు ఆమెని గుర్తుపట్టే వరకూ ఆగుతాడు. ఆతరువాత మౌనంగా టాక్సీలో వెళ్ళిపోతాడు.

అప్పుడు నాగరికత ఇంతగా ప్రబలలేదు. తమ మనోభావాలు, సున్నితమయిన భావనలను మనసులో దాచుకుని ఒకరి అభివృద్ధికి మరొకరు త్యాగానికి సిద్ధపడేవారు. దాన్ని త్యాగంగా కూడా భావించేవారు కారు.

అది ప్రేమ. ఒకరిపై మరొకరికి వున్న అనురాగం. ఆ అనురాగం లో స్వార్ధం లేదు.తనది తన దగ్గరే వుండాలన్న భావన లేదు. అదొక పరిణతి పొందిన ఉన్నతమయిన మానసిక భావన.  అది ప్రేమ.  ఆ ప్రేమలో పిచ్చి లేదు. వెర్రి లేదు. పాశవికత లేదు. వున్నది అనురాగం, అభిమానం, ఆరాధన, ఆత్మీయత, ఒకరిపైన మరొకరికి గౌరవం. అంతే.

అందుకే, ఆమెపైన తన ప్రేమను, ఆమెకు దూరంగా వుండలేని తన  బలహీనతను నాయకుడు కనబరచడు. ముఖం తిప్పుకుని దూరంగా వెళ్ళిపోతాడు.

కానీ, మనిషి ఒక స్థాయి వరకే తనని మభ్యపెట్టుకోగలడు. పైకి బాధలేనట్టు, ఏమీ పట్టనట్టు ఎంతగా ప్రవరతించినా హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలవుతూంటాయి.  ఆవేదన అనంతమయిన తూఫానులా అల్లకల్లోలం చేస్తూంటుంది. అంతరంగంలో అలవికాని బాధ అలలు అలలుగా ఎగసిపడుతూంటుంది.

ఒంటరిగా వున్నప్పుడు తన వేదనను తనకు మాత్రమే తెలిసేలా వ్యక్తపరచుకుంటాడు. తన వేదనలోనే అదోరకమయిన ఆనందాన్ని అనుభవిస్తూ తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు. ఇప్పతిలా, ఇళ్ళముందుకు వెళ్ళి తాగి గోల చేయటం, తిట్టటం, తాగి జీవితాన్ని వ్యర్ధం చేసుకోవటం అదే అమరప్రేమ అనటం అప్పతి వారికి తెలియదు. వారంతగా అభివృద్ధి చెందలేదు.

అందుకే, హీరో వొంటరిగా, సముద్రం వొడ్డున కూచుని, ఒకదాని వెంట ఒకతిగా వచ్చే అలలను చూస్తూ, తనలోన అలల్లాగా చెలరేగే బాధను ఆ ఆలలో దర్శిస్తూ, మనసులోని వేదన భావనకు పదాలరూపాన్నిచ్చి శబ్దాలుగా పలుకుతాడు. పాట పాడతాడు.

జాయెతొ జాయె కహా
సంఝేగా, కౌన్ యహా,
దర్ద్ భరే దిల్ కి జుబాన్
జాయెతొ జాయె కహా??

నిజమే, ఈ ప్రపంచంలో ఒకరి బాధ మరొకరికి అర్ధం కాదు. ఎవరికి వారికి తమ బాధ అసలు బాధ. ఎదుటివాడి బాధ హేళన, చులకన, పనికిరానిది అందుకే, వేదనామయమయిన హృదయపు భావనను ఎవరూ అర్ధం చేసుకోలేరు అంతున్నాడు కవి సాహిర్.

ఇదే భావనను, మరో సందర్భంలో, ఫంటూష్ అనే సినిమాలో దుఖిమన్ మెరే అనే పాటలో,

దర్ద్ హమారా కోయినజానే,
అప్ని గరజ్ కే సబ్ హై దీవానే
కిస్ కే ఆగే రోనా రోయే….

అంటాడు సాహిర్.

మన వేదన ఎవరూ అర్ధం చేసుకోలేరు. ఏముదిరా ఆ అమ్మాయిలో? అని అడుగుతారు. ఎందుకూ పనికిరాదా అమ్మాయి అని తేల్చిపారేస్తారు. కానీ, కోల్పోయినవాడికే తెలుస్తుంది తాను పోగొట్తుకున్న దాని విలువ.

మాయూసియోంకా మజ్మాహై జీనే
క్యా రహెగయాహై ఇస్ జిందగీమె,
రూహ్ మె గం, దిల్ మె ధువాన్
జాయెతొ జాయె కహాన్???

ఈ పాట చిత్రీకరణ అద్భుతంగా వుంటుంది. సముద్రం వొడ్డున నాయకుడు ఒంటరిగా తలవంచుకుని సర్వం కోల్పోయినవాడిలా కూచుంటాడు. తనలో తాను గొణుక్కుంటూ తనకి తాను చెప్పుకుంటున్నట్టు పాట ఆరంభిస్తాడు.

మజ్మా అంటే గుంపు అని అర్ధం. సరిగ్గా చెప్పాలంటే procession అన్నమాట. ఈ జీవితం నిరాశల సమూహంలాంటిది అంటాడు. ఈ పాదం పాడేముందు, లయ బద్ధంగా వస్తున్న సంగీతాన్ని అనుసరిస్తూ కెమేరా ఒకదాని తరువాత మరొకటిగా వస్తూన్న అలలను చూపుతాయి.  ఈ ప్రపంచం నిరాశల అలల మయం అన్న భావననిఉ కలిగిస్తాడన్నమాట. పాట భావాన్ని అర్ధం చేసుకుని, అక్షరాలలోని భావానికి దృష్య రూపాన్నివ్వటానికి ఇది చక్కని ఉదాహరణ..

ప్రపంచం నిరాశామయం. ఇంకా ఏముంది ప్రపంచంలో? ఆత్మలో వేదన, ఎదలో శూన్యం. ఇక ఇలాంటి ప్రపంచంలో ఎటుపోతే ఏమిటి?

ఈ నిరాశ నాయకుడికి నాయిక పైన వున్న గాఢ మయిన ప్రేమకు ప్రతిబింబం. అలాగని నాయకుడు చస్తాను, చంపుతాను అనటంలేదు. బ్రతుకుతాను అనే అంటున్నాడు.

ఉంకాభి గం హై, అప్నాభి గం హై
అబ్ దిల్ కి బచ్ నేకీ ఉమ్మీద్ కం హై
ఎక్ కష్తీ, సౌ తూఫాన్
జాయెతొ జాయె కహాన్??

ప్రపంచమంతా బాధే. ఇదెలాగంటే, వున్నదొక పడవ. అది వందలపైగా తూఫానులను ఎదుర్కోక తప్పదు. ఇక ఎటుపోతే ఏమిటట?

ఇదేఅ నాయకుడి విఫల ప్రేమ ఫలితంగా కలిగిన వైరాగ్య వేదన భావనలను ప్రదర్శించే అద్భుతమయిన పాట.

ఈ పాటకు భైరవీ రాగంలో సచ్చిన్ దేవ్ బర్మన్ కూర్చిన బాణీకి తలత్ మహమూద్ స్వరం జీవం పోస్తుంది. దేవానంద్ చాలా గొప్పగా ఆ భావనలను వ్యక్తీకరిస్తాడు. దానికి పాట చిత్రీకరణ తోడ్పడుతుంది. సున్నితమయిన కళాకారులంతా ఒకచోట చేరి సృష్టించిన కళాఖండమీ పాట.

ఈ సినిమా చూస్తే, విజయానంద్ ఎంతగా చేతన్ ఆనంద్ వల్ల ప్రభావితుడయ్యాడో తెలుస్తుంది.

మరొక్కమాట….

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపమ్ము వోవునే మదనములకు, అన్నారు పెద్దలు.

ఇలాంటి ఉత్తమ కళా ప్రదర్శన తో పరిచయం లేనివారు, వారికి తెలిసిన చిన్న నీటి గుంటనే సముద్రం అనుకుంటే అది వారి తప్పు కాదు. ఉత్తమ కళలను, ఉన్నతమయిన భావనలను వారసత్వంగా అందించలేని పెద్దలదే తప్పు. వారసత్వ సంపదకు తరువాత తరాన్ని దూరం చేస్తున్న వారిదే తప్పు. అది కళ కావచ్చు. సాహిత్యం కావచ్చు. ధర్మం కూడా కావచ్చు.

ఈ పాట టాక్సీ డ్రైవర్ అనే సినిమాలోనిది. దేవ్ ఆనంద్ హీరో. కల్పనా కార్తిక్ నాయిక. సాహిర్ గేయ రచయిత, సచిన్ దేవ్ బర్మన్ సంగీత దర్శకుడు. చేతన్ ఆనంద్ సినిమా దర్శకుడు.

March 15, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Tags: , , , , ,  · Posted in: sinemaa vishleashaNaa.